Sorghum
-
జొన్నలపై జగడం..
కల్హేర్ (నారాయణఖేడ్): జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కల్హేర్ మండలం బీ బీపేటలో అదనపు కలెక్టర్ మాధురి వాహనా న్ని రైతులు మంగళవారం అడ్డుకున్నారు. వా హనం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగా రు. బీబీపేట పీఏసీఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించి.. రైతులు తె చ్చిన జొన్నలు దెబ్బతిన్నాయని, శుభ్రంగా లే వని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం ఉంటేనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడా ది ఇలాంటి జొన్నలే కొనుగోలు చేశారని వాదించారు. లారీలు రాకపోవడంతో కొనుగోలు నెమ్మదిగా జరుగుతున్నాయని వాపోయారు. ఆమె అక్కడి నుంచి వెళ్తుండగా, తమ గోడు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారంటూ రైతులు మండిపడ్డారు. ఆమెను వెళ్లనీయకుండా వాహనాన్ని అడ్డుకొని బైఠాయించారు. ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్ డబ్బాతో రైతు ఆందోళన ఫత్తేపూర్‌కు చెందిన రైతు నరేందర్ పెట్రోల్ డబ్బా పట్టుకుని ఒంటిపై పోసుకునేందుకు యత్నించాడు. మార్క్‌ఫెడ్ డీఏం శ్రీదేవి, ఆర్డీఓ అశోక్‌చక్రవర్తి వెంటనే కలుగజేసుకుని నచ్చజెప్పారు. రైతులందరి జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. అనంతరం కల్హేర్, కృష్ణాపూర్, బోక్కస్గాంలో కొనుగోలు కేంద్రాలను కూడా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. -
జొన్న రైతులకు ప్రభుత్వం బాసట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హైబ్రీడ్ రకం జొన్నల మార్కెట్ ధర మద్దతు ధరకంటే తక్కువగా ఉండటంతో రైతులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద వెంటనే హైబ్రీడ్ రకం జొన్నలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. 27,722 టన్నుల హైబ్రీడ్ రకం జొన్నలు కనీస మద్దతు ధర క్వింటాలు రూ.3,180కు కొనుగోలుకు అనుమతినిచ్చింది. ఈమేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అహ్మద్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం నుంచి ఆర్బీకేల ద్వారా జొన్న రైతుల రిజిస్ట్రేన్‌కు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. రబీ సీజన్లో 2.38 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 4.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. హైబ్రీడ్ రకం క్వింటాలు రూ.3180గా, మల్దిండి రకం క్వింటాలు రూ.3,225గా ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రీడ్ రకం ఆహార అవసరాల కోసం, మల్దిండి రకం పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. హైబ్రీడ్ జొన్నల ధర మార్కెట్లో ప్రస్తుతం క్వింటాలు రూ.2,500 నుంచి రూ.2,600 వరకు పలుకుతోంది. మద్దతు ధరకంటే మార్కెట్ ధర తక్కువ ఉండటంతో జొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా (మోర్ ప్రిఫర్డ్ వెరైటీగా) గుర్తింపు పొందిన హైబ్రీడ్ రకం జొన్నలను 27,722 టన్నులు కొనడానికి అనుమతినిచ్చింది. బుధవారం నుంచి మే 31వ తేదీ వరకు రైతుల నుంచి ఈ రకం జొన్నలను సేకరిస్తారు. ఇప్పటికే కనీస మద్దతు ధరలకు రబీ సీజన్లో పండిన శనగ, మినుము, పెసర, వేరుశనగ పంటలను ఆర్బీకేల ద్వారా ఏపీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. తక్కువకు అమ్ముకోవద్దు కనీస మద్దతు ధరకంటే తక్కువకు ఏ రైతూ అమ్ముకోవద్దు. జొన్న రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 27,722 టన్నుల సేకరణకు అనుమతినిచ్చింది. మద్దతు ధర దక్కని రైతులు ఆర్బీకేల ద్వారా వివరాలు నమోదు చేసుకొని వారి వద్ద ఉన్న హైబ్రీడ్ రకం జొన్నలను అమ్ముకోవచ్చు. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీ మార్క్‌ఫెడ్ -
మిల్లెట్ మెరుపులు..చిరుధాన్యాలు, జొన్నలు దిగుబడిలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి, సిరి ధాన్యాలుగా, రైతులకు లాభసాటి పంటలుగా చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వ సహకారంతో చిరుధాన్యాలు సాగు చేస్తున్న రైతులు మరే రాష్ట్రంలో రానంత ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించిన వాస్తవమిది. ఆ నివేదిక ప్రకారం.. 2022లో చిరుధాన్యాలు, జొన్నల దిగుబడిలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఒక హెక్టారుకు చిరుధాన్యాలు 2,363 కిలోలు దిగుబడి వచ్చింది. హెక్టారుకు 2,310 కిలోలతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో జొన్నలు హెక్టారుకు 3,166 కిలోల దిగుబడి రాగా, ఆ తరువాతి స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో హెక్టార్‌కు కేవలం 1,941 కిలోలే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం.. వైఎస్ జగన్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించింది. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, రైతులకు లాభసాటి అయిన వీటి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. వీటి సాగు విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా మిల్లెట్ మిషన్‌ను ఏర్పాటు చేసింది. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,66,736 హెక్టార్లలో సాగు లక్ష్యంగా నిర్దేశించింది. ఇది గత సంవత్సరానికన్నా 39,365 హెక్టార్లు అదనం. ఈ పంటలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పౌరసరఫరాల సంస్థ కనీస మద్దతు ధరకు కొంటోంది. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలో 160 చిరుధాన్యాల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. వీటికి ప్రోత్సాహకాలు కూడా అందించనుంది. చిరుధాన్యాల మార్కెటింగ్‌కు జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. మహిళా సంఘాల మహిళా మార్ట్‌లలోనూ చిరుధాన్యాలు, వాటి ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. ప్రజలు వీటిని వినియోగించేలా మండల, జిల్లా స్థాయిలో పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కలి్పస్తోంది. బాలింతలు, గర్భిణులు, పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద రాగి పిండిని పంపిణీ చేస్తోంది. చదవండి: బ్యాంకులకు వెనక్కి వస్తున్న రూ.2 వేల నోట్లు.. బడా బాబులవే 60 ఏళ్లుగా తగ్గిపోయిన సాగు, వినియోగం హరిత విప్లవంతో పాటు ఎక్కువ ఆదాయం వచ్చే వరి, గోధుముల సాగుకు రైతులు మళ్లడం, ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోవడంతో 60 ఏళ్లుగా దేశంలో చిరుధాన్యాల సాగు తగ్గిందని తెలిపింది. 1960లో దేశంలో వీటి తలసరి వార్షిక వినియోగం 30.9 కిలోలుండగా 2022కి 3.9 కిలోలకు పడిపోయిందని పేర్కొంది. 1973లో గ్రామీణ ప్రాంతాల్లో సజ్జలు వార్షిక తలసరి వినియోగం 11.4 కేజీలుండగా 2005కి 4.7 కిలోలకు, పట్టణ ప్రాంతాల్లో 4.1 కిలోల నుంచి 1.4 కిలోలకు తగ్గిపోయిందని తెలిపింది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో జొన్నలు వార్షిక తలసరి వినియోగం 19.4 కిలోల నుంచి 5.2 కిలోలకు, పట్టణ ప్రాంతాల్లో 8.5 కిలోల నుంచి 2.7 కిలోలకు తగ్గిపోయినట్లు నివేదిక పేర్కొంది. ఇటీవల ఆరోగ్య కారణాలు, పశుగ్రాసం, పరిశ్రమలు, ఇథనాల్, డిస్టిలరీల్లో వాడకానికి చిరుధాన్యాలకు డిమాండ్ పెరుగుతోందని చెప్పింది. గిరిజన రైతులు, మహిళలను ప్రోత్సహించాలి ఇతర పంటలకంటే తక్కువ నీటితో చిరుధాన్యాలు సాగుచేయవచ్చని నాబార్డు తెలిపింది. దేశంలో లభించే నీటిలో 80 శాతం వరి, గోధుమ, చెరకు పంటలకు వినియోగం అవుతోందని, దీనివల్ల మంచి నీటి కొరత ఏర్పడుతోందని పేర్కొంది. అందువల్ల చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, ఇందుకోసం మెరుగైన ఉత్పత్తి, స్థిరమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది. తొలుత వర్షాభావ, గిరిజన ప్రాంతాల్లో చిన్న, గిరిజన రైతులు, మహిళా రైతుల ద్వారా వీటి సాగును ప్రోత్సహించాలని సూచించింది. ఆ ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెట్ కల్పించాలని సూచించింది. తద్వారా మంచి పోషకాహారం, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడమే కాకుండా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని నివేదిక సూచించింది. చదవండి: ఆ ‘కొండ’లపై ఎందుకు ప్రశ్నించడం లేదు పవన్? ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలు చిరుధాన్యాల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి కనిపిస్తోందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైనట్లు నివేదిక పేర్కొంది. ఆరోగ్య కారణాల దృష్ట్యా 28 శాతం మంది చిరుధాన్యాలకు మారారని తెలిపింది. బరువు తగ్గేందుకు 15 శాతం మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇవీ ఉపయోగాలు ►హృదయనాళాల వ్యాధుల నుంచి విముక్తి ► చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం ►చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి ►కాల్షియం పుష్కలంగా ఉండటంతో ఎముకల ఆరోగ్యం ►రక్తనాళాలు, కండరాల సంకోచాలకు మంచి మందు ►నరాల పనితీరు పెంచుతాయి ► మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి ►క్యాన్సర్‌ను నిరోధిస్తాయి -
మార్కెట్లోకి కొత్త విత్తనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, మినుములో 2, వేరుశనగ, పెసర, పొగాకులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 వంగడాలను బుధవారం వ్యవసాయ శాఖ స్పెషల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మార్కెట్లోకి విడుదల చేశారు. వీటిని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నెల్లూరు, బాపట్ల, తిరుపతి, మారుటేరు, నంద్యాల, గుంటూరు లాం పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటి ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రదర్శించడంతో పాటు వీటి వినియోగాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్.ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ ఎ.సుబ్బరావిురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగలో.. టీసీజీఎస్ 1522: ఈ వంగడం కదిరి–6కు ప్రత్యామ్నాయం. తిరుపతి 4 ఎక్స్, కదిరి 9 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం ఖరీఫ్‌లో 100 నుంచి 103 రోజులు, రబీలో 103 నుంచి 106 రోజులు. దిగుబడి హెక్టార్‌కు ఖరీఫ్‌లో 3.328 టన్నులు, రబీలో 4.031 టన్నులు. ఆకుమచ్చ, తుప్పు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 75–76 శాతం, నూనె 48.5 శాతం, 100 గింజల బరువు 45–47 గ్రాములు, గింజలు లేతగులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. పొగాకులో.. ఏబీడీ 132(నంద్యాల పొగాకు–2): ఈ వంగడం నంద్యాల పొగాకు–1కు ప్రత్యామ్నాయం. లైన్ 3–58–38, ఎక్స్ లైన్ (190–27–5–7–32), ఎక్స్ (303–3–38–13–11–40) రకాల నుంచి అభివృద్ధి చేశారు. ఇది తక్కువ హాని కారకాలను కలిగి ఉంటుంది. కిలో ఆకు ధర రూ.85 నుంచి రూ.90 పలుకుతుంది. ఒరోబాంకీని మధ్యస్థంగా తట్టుకోవడమేకాదు.. ఆకు కోత వరకు పచ్చగా ఉండి.. అధిక వర్షపాత పరిస్థితులను తట్టుకుంటుంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో బీడీ పొగాకు సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌లో సాగుకు అనుకూలం. పెసరలో.. ఎల్జీజీ 630: ఈ వంగడం ఎల్జీజీ 460, ఐపీఎం 2–14, టీఎం 96–2 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్జీజీ 460 ఎక్స్ పీ 109 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకం. ఒకేసారి కోత కోయటానికి అనువైనది. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. మినుములో.. టీబీజీ 129: ఈ వంగడం ఎల్బీజీ 752కు ప్రత్యామ్నాయం. దీనిని పీయూ 31 ఎక్స్ ఎల్బీజీ 752 నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. ఎల్బీజీ 904: ఈ వంగడం ఎల్బీజీ 752, 787, పీయూ 31, టీబీజీ 104, జీబీజీ 1 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్బీజీ 645 ఎక్స్ టీయూ 94–2 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 2.20 నుంచి 2.50 టన్నులు. పల్లాకు తెగులుతో పాటు కొంత మేర తలమాడుతట్టుకునే రకం. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. నూతన వంగడాలు.. వాటి ప్రత్యేకతలు బీపీటీ 2841: ఈ వంగడం బర్మా బ్లాక్, కాలాబట్టి సాంప్రదాయ బ్లాక్ రైస్‌కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–7029, ఐఆర్జీసీ 18195, ఎంటీయూ–1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 130 నుంచి 135 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 5.50 నుంచి 6 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపుతో పాటు దోమపోటును కొంతమేర తట్టుకుంటుంది. గింజలు పగిలిపోవడం తక్కువ. ముడి బియ్యానికి అనుకూలం. మధ్యస్థ సన్న గింజ రకం. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. బీపీటీ 2846: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1061, ఐఆర్ 78585–64–2–4–3–1 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 నుంచి 150 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపు, దోమపోటు, ఎండాకు తెగులును కొంతమేర తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. మధ్యస్థ సన్న గింజ రకం. నిండు గింజల శాతం ఎక్కువ. ఏపీలో కృష్ణా, సదరన్ జోన్లలో ఖరీఫ్ సాగుకు అనుకూలం. ఎన్‌ఎల్‌ఆర్ 3238: బయో ఫోర్టిఫైడ్ స్వల్పకాలిక వరి రకమిది. బీపీటీ–5204, ఎంటీయూ 1010 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 120 నుంచి 125 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. ఇది కూడా చేనుపై వాలిపోదు. పాలిష్ చేసిన బియ్యంలో జింక్ మోతాదు 27–72 పీపీఎంగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి నాణ్యతతో ఉంటాయి. అగ్గితెగులు, మెడవిరుపులను కొంత మేర తట్టుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుకు అనుకూలం. ఎంటీయూ 1271: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1075, 1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. దోమ, ఎండాకు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. ఇది కూడా చేనుపై వాలిపోదు. నిండు గింజల శాతం ఎక్కువ. సాగునీటి వసతులున్న లోతట్టు, అప్ల్యాండ్స్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. -
వచ్చేనెల నుంచి చిరుధాన్యాల పంపిణీ
సాక్షి, అమరావతి : బియ్యం కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాల పంపిణీకి రంగం సిద్ధంచేస్తోంది. తొలిదశలో వచ్చేనెల నుంచి పైలట్ ప్రాజెక్టు కింద రాయలసీమ జిల్లాల్లో అమలుచేయనుంది. లబ్ధిదారులకు ప్రతినెలా ఇచ్చే రేషన్‌లో రెండు కేజీల బియ్యం బదులు రాగులు, జొన్నలు సరఫరా చేస్తుంది. ఇందులో భాగంగా పౌరసరఫరాల సంస్థ తొలిసారిగా చిరుధాన్యాలైన రాగులు, జొన్నలను మద్దతు ధరకు (రాగులు–రూ.3,578.. జొన్నలు రూ.2,970 (హైబ్రిడ్), రూ.2,990 (మల్దండి))కొనుగోలు చేస్తోంది. రైతులను చిరుధాన్యాల సాగువైపు ప్రోత్సహించేందుకు ఉత్పత్తులను కొ నుగోలు చేసిన వెంటనే నగదు చెల్లింపులు చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చింది. కర్ణాటక నుంచి రాగుల సేకరణ రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ నుంచి రాగుల ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థ కర్ణాటక ప్రభుత్వం నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా 25 వేల టన్నుల రాగులను సేకరిస్తోంది. మరోవైపు.. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే జొన్నల కొనుగోలు నిమిత్తం పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలు తెరిచింది. అయితే, మద్దతు ధర కంటే మార్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జొన్నల పంపిణీకి వీలుగా, రైతులకు మరింత మేలు చేసేలా మద్దతు ధరను పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. లబ్దిదారుల ఆసక్తి మేరకు.. ఇక రాయలసీమ జిల్లాల్లోని బియ్యం కార్డుదారుల ఆసక్తి మేరకు ప్రతినెలా ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు రాగులను అందించనున్నారు. ఇప్పటికే జొన్నలు ప్రైవేటు మార్కెట్‌కు తరలిపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సేకరణ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటివరకు 500 టన్నులే సేకరించింది. దీంతో భవిష్యత్తులో రైతులకు మరింత మేలు చేసేందుకు వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా చిరుధాన్యాల సాగు ప్రోత్సాహాకానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలో డిమాండ్, సప్లైకు అనుగుణంగా సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించనుంది. పేదలకు బలవర్థకమైన ఆహారం రాష్ట్రంలో ప్రజలకు బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీఎం జగన్ సంకల్పానికి అనుగుణంగా వచ్చేనెల నుంచి పేదలకు చిరుధాన్యాలు పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో రాగుల నిల్వలు అందుబాటులో లేకపోవడంతో కర్ణాటక నుంచి సేకరించి ఇక్కడ పంపిణీ చేస్తాం. ఇప్పటికే జొన్నల సేకరణ చేపట్టాం. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ మంత్రి విస్తీర్ణం పెంచేలా చర్యలు రాష్ట్రంలో రేషన్ కింద రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నాం. బియ్యం కార్డుదారుల అవసరానికి అనుగుణంగా పంట ఉత్పత్తులు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి రేటు ఉంది. జొన్నలకు పౌల్ట్రీ రంగంలో డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ సేకరణ నెమ్మదిగా ఉంది. అందుకే మద్దతు ధర పెంచాలని కేంద్రానికి లేఖ రాశాం. – హెచ్.అరుణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
ఎర్రజొన్న సీడ్.. కేరాఫ్ అంకాపూర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లోని అంకాపూర్ అనగానే రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ దేశీ చికెన్ గుర్తొస్తుంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు సైతంఈ దేశీ చికెన్ పార్సిళ్ల రూపంలో వెళుతోంది. అయితే ఇదే అంకాపూర్ పశుగ్రాసం కోసం పెంచే ఎర్రజొన్న విత్తనాల ఎగుమతిలోనూ ప్రత్యేకత పొందింది. ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌తోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాకు సైతం ఎర్రజొన్న విత్తనాలు ఎగుమతి చేస్తున్నారు. ఉత్తరాదిలో పశుగ్రాసానికి ఆధారం ఇదే.. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు ఏటా ఎర్రజొన్న సాగు చేస్తున్నారు. పక్కనే ఉన్న నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోనూ రైతులు మరో 30 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఉత్తరాదిలో పశుగ్రాసం పెంచేందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ఎర్రజొన్నలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్లో 40 చోట్ల ఎర్రజొన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వాటిలో 10 యూనిట్లు చుట్టుపక్కల ఉండగా ఒక్క అంకాపూర్‌లోనే 30 ఎర్రజొన్న యూనిట్లు ఉన్నాయి. దీంతో ఎర్రజొన్న విత్తనాలకు కేరాఫ్‌గా అంకాపూర్ పేరుగాంచింది. ఏపీలో చూసొచ్చి.. 1983లో ఏపీలోని ఏలూరులో ఎర్రజొన్న విత్తనాల పంటలను పరిశీలించి వచ్చిన ఆర్మూర్ ప్రాంత రైతులు ఈ సాగు ప్రారంభించారు. రైతులు ఏటా అక్టోబర్, నవంబర్లలో ఒప్పందం ద్వారా విత్తన వ్యాపారుల నుంచి ఫౌండేషన్ సీడ్‌ను తీసుకుంటారు. ఫిబ్రవరిలో పంట చేతికి రాగానే ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చిన వ్యాపారులకే రైతులు అమ్ముతారు. రైతుల నుంచి సేకరించిన విత్తనాలను వ్యాపారులు ఆయా యూనిట్లలో శుద్ధిచేసి ప్యాక్ చేసి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నిజామాబాద్ భూములే సాగుకు అనుకూలం.. దేశం మొత్తంలో తెలంగాణలోని నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే భూములు ఎర్రజొన్న విత్తనాలు పండించేందుకు అనుకూలంగా ఉన్నాయి. కర్ణాటకలోని బళ్లారిలో 15 శాతం ఎర్రజొన్న విత్తనాలు పండిస్తుండగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో కలిపి 85 శాతం ఎర్రజొన్న విత్తనాలను పండిస్తున్నారు. రైతుల నుంచి కిలో రూ.45 చొప్పున ఎర్రజొన్నలను తీసుకుంటున్న వ్యాపారులు వాటిని శుద్ధిచేసి కిలో రూ.65 చొప్పున అమ్ముతున్నారు. ఏటా ఇక్కడి నుంచి 60 వేల మెట్రిక్ టన్నుల ఎర్రజొన్న విత్తనాలను శుద్ధిచేసి ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వం కొంటేనే మేలంటున్న రైతులు.. సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారుతుండడంతో ఏటా ధర విషయంలో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వమే విత్తన విధానాన్ని రూపొందించి రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకునే విధానాన్ని తయారుచేస్తే రైతులకు మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి ఎర్రగరప నేలలు అనుకూలం నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఎర్రగరప నేలలు ఎర్రజొన్న పంటకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే, పశువుల పెంట, చెరువు నల్లమట్టి ఈ భూముల్లో వేస్తారు. మరోవైపు ఈ మూడు జిల్లాల్లోని వాతావరణ పరిస్థితులు ఎర్రజొన్న సాగుకు కలిసివస్తున్నాయి. రైతులు పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న పంటల మార్పిడి వ్యవసాయం చేస్తుండడంతో మరింత మేలు చేస్తోంది. ప్రైవేటు వ్యాపారులు అంకాపూర్‌లో యూనిట్లు ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహిస్తుండడంతో ఎర్రజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. – హరికృష్ణ, వ్యవసాయాధికారి, ఆర్మూర్ -
ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సామలు.. కొర్రలు.. అరికెలు.. ఊదలు.. జొన్నలు.. ఇలా పలు పాత పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని వినియోగిస్తూ తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆ మహిళా రైతులు. అంతేకాదు వారి అవసరాలు పోను మిగతా ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జించడంతో పాటు ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ పాత పంటల సాగు దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో చాలామంది తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీటి సాగు మొదలైంది. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు మాత్రం ఏళ్ల తరబడి తృణ ధాన్యాల సాగును కొనసాగిస్తుండటం గమనార్హం. ఒక సంఘం..3 వేలమంది సభ్యులు జహీరాబాద్ ప్రాంతంలో సరైన సాగునీటి సౌకర్యం లేదు. వరుణుడు కరుణిస్తేనే పంటలు చేతికందుతాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ పంటలను పండిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రూపుల్లో సుమారు మూడు వేల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్క కరోనా మరణం లేదు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా రూ.లక్షల్లో లాభాలను గడించకపోయినప్పటికీ.. నిత్యం వాటినే వినియోగిస్తుండడంతో ఆ రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఈ చిరుధాన్యాలు వినియోగించిన రైతు కుటుంబంలో ఒక్క కరోనా మరణం కూడా జరగలేదని డీడీఎస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మూడు వేవ్‌ల్లో అసలు ఈ మహమ్మారి బారిన పడిన రైతులే చాలా తక్కువని చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా తక్కువేనని అంటున్నారు. కొనసాగుతున్న జాతర చిరుధాన్యాల ఆవశ్యకత.. పౌష్టికాహార భద్రత.. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా పాత పంటల జాతర జహీరాబాద్ ప్రాంతంలో కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి కనీసం రోజుకో గ్రామం చొప్పున నెల రోజుల పాటు సుమారు 40 గ్రామాల్లో ఈ జాతర సాగుతుంది. సుమారు 80 రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లపై ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వాటి సాగు ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తుంటారు. డీడీఎస్ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం.. రసాయనాలు లేకుండా విత్తనాలు భధ్ర పరుచుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. జహీరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ 35 గ్రామాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ తదితర మండలాల రైతులకు తృణధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తోంది. పండిన పంటలు రైతులు వినియోగించేలా వారిని చైతన్యం చేస్తోంది. మిగిలిన పంటలను మార్కెట్ ధర కంటే సుమారు పది శాతం ఎక్కువ ధరకు రైతుల వద్ద డీడీఎస్ కొనుగోలు చేస్తోంది. మేం పండించిన సాయి జొన్నలనే తింటున్నం.. నాకు ఏడు ఎకరాలు ఉంది. టమాటా, మిర్చి వంటి కూరగాయల పంటలకు భూమి అనుకూలంగా ఉన్నప్పటికీ.. చిరుధాన్యాలను సాగు చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల్లో సాయి జొన్న పండిస్తున్న. కూరగాయల పంటలతో పాటు శనగలు, కందులు కూడా సాగు చేస్తున్నా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో మేం పండించిన సాయి జొన్నలనే ఎక్కువగా తింటాం. ఇవి తింటేనే మాకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. – గార్లపాటి నర్సింహులు, బర్దిపూర్, సంగారెడ్డి జిల్లా ఐదు ఎకరాల్లో 20 రకాల పంటలు మాకు ఐదు ఎకరాలుంది. వర్షం పడితేనే పంట పండుతుంది. నీటి సౌకర్యం లేదు. తొగర్లు, జొన్నలు, సామలు, కొర్రలు.. ఇట్లా 20 రకాల పంటలు వేస్తున్నాం. విత్తనాలు మావే.. కొనే అవసరం లేదు. మేమే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. దీంతో పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. – పర్మన్గారి నర్సమ్మ, మెటల్‌కుంట, సంగారెడ్డి జిల్లా ఎంతో ఆరోగ్యంతో ఉంటున్నారు.. నెల రోజుల పాటు జరిగే పాతపంటల జాతరలో రైతులకు చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా.. మరో పంట చేతికందుతుంది. ఈ చిరుధాన్యాలను పండించడంతో పాటు వాటిని వినియోగిస్తే వచ్చే ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై మహిళా రైతులను చైతన్యం చేస్తున్నాం. చిరు ధాన్యాలను వినియోగిస్తున్న రైతులు, వారి కుటుంబాల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. – బూచనెల్లి చుక్కమ్మ, జాతర కోఆర్డినేటర్ -
Hyderabad: వహ్వా.. జావ!.. అంబలి కేంద్రాలకు క్యూ కడుతున్న జనం
సాక్షి, హైదరాబాద్: మన ఆరోగ్యం తనం తీసుకునే ఆహార అలవాట్లలో ముడిపడి ఉంటుందన్నది జగ మెరిగి న సత్యం. గతంలో మంచి ఆహారపు అలవాట్లకు దూరంగా ఉన్న నగర వాసులు కరోనా మహమ్మా రి పుణ్యమాని తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా ఏదైనా పార్కులో వాకింగ్, వ్యాయామం చేయడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇలా నగర వ్యాప్తంగా ఏ పార్కులు, కాలనీల్లోని రోడ్లపై ఉదయం వేళల్లో చూస్తే వేలాది మంది జాగింగ్, వాకింగ్, వ్యాయామాలు చేస్తూ కనిపిస్తుంటారు. వీటితో పాటు తినే ఆహారంపై సైతం ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నడక ముగిసిన తరువాత జావ(అంబలి)ని తీసుకుంటున్నారు. అంబలి తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తోందని వైద్యులు సైతం సలహాలు ఇవ్వడంతో ఆ దిశగా అలవాటు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరాశ, బడలిక నుంచి విముక్తి పొందేందుకు జావ తాగుతూ సేద తీరుతున్నారు. వీరి కోసం వాకింగ్ సెంటర్లు, పార్కుల వద్ద రాగి, జొన్నలతో తయారు చేస్తున్న జావ సెంటర్లు వెలుస్తున్నాయి. నిజాంపేట్ పరిధిలో పదుల సంఖ్యలో.. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని పలు పార్కు లు, చెరువుల వద్ద జావ విక్రమ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లోని ఉదయం, సాయంత్రం వేళల్లో జాగింగ్, ఓపెన్ జిమ్‌లలో వ్యాయామం చేసే వారు ఎక్కువగా జావను తీసుకుంటున్నారు. వీటితో పాటు జ్యూస్‌లు, గ్రీన్ టీలను సైతం నిర్వాహకులు అందుబాటులో ఉంచుతున్నారు. ఓపెన్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారం.. జొన్న జావ డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రాగి, జొన్న వంటివి తినడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు శక్తిని ఇస్తా యి. పిల్లల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఇందులో కాల్షియం తదితర పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారంగా పేర్కొనవచ్చు. పోషక విలువలుండే ఆహారం ఎంతో అవసరం జావ, జ్యూస్‌లు, గ్రీన్ టీ వంటివి వాకర్లకు ఎంతో అవసరం. పురాతన కాలంలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించిన ఆ హార పదార్థాలనే నేడు అందరూ ఉపయోగిస్తున్నారు. అత్యధిక పోషక విలువలుండే రాగులు, జొన్నలు మన శరీరానికి ఎంతో అవసరం. నేడు చాలా మంది మధుమేహం వ్యాధిన పడుతున్నారు. రోజు వాకింగ్ చేసిన తరువాత ఒక గ్లాస్ జావ తాగితే దాన్ని నివారించవచ్చు. – చంద్రయ్య, బాచుపల్లి జొన్న, రాగి జావలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి జావను ఒక రోజు తాగా, మంచి రుచిగా అనిపించడంతో ప్రతి రోజు అల్లం టీ తాగే అలవాటును మానుకుని జావ తాగుతున్నాను. వాకింగ్ తరువాత జావ తాగితే శరీరం అంతగా అలసట అనిపించడం లేదు. శరీరానికి శక్తిని ఇచ్చే జొన్న, రాగి జావలను ప్రతి ఒక్కరూ సేవించాలి. – సుధాకర్, ప్రగతినగర్ నిత్యం జావ తాగే వారు పెరుగుతున్నారు జొన్న, రాగులతో చేసిన జావను వాకింగ్ చేసిన తరువాత తాగాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసిన అనంతరం తాగితే మంచిది. తాను తయారు చేస్తున్న జావతో పాటు సజ్జ లడ్డూలను సైతం ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ప్రగతినగర్ ప్రాంతంలో గత ఐదేళుŠాల్గ జావ విక్రయాలు చేపడుతున్నాను. నిత్యం జావ తాగే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. – శ్రీరాములు, జొన్న, రాగి జావ విక్రయదారుడు -
30 ఏళ్లకే బీపీ, షుగర్.. ఒక్కపూట అన్నానికే పరిమితం.. కోటీశ్వరులు మెచ్చిన తిండి..
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలతో చేసిన పంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్లో పోటీపడతున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క విశాఖలో సుమారు రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 30 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 15 వేల కుటుంబాలు ఆర్గానిక్ రుచులను మాత్రమే ఆస్వాదిస్తున్నాయి. ఏటా ఆర్గానిక్ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండి పదార్థాలు ఉండే బియ్యం కంటే, పోషక విలువలు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. చదవండి: పసి మనసుకు ఎందుకింత కష్టం.. లోపం తల్లిదండ్రులదా? చిన్నారులదా? డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన ‘చిరు ధాన్యాలు’ ఇప్పుడు కోటీశ్వరుల నిత్య జీవితంలో ఆహారమయ్యాయి. ఫాస్ట్‌ఫుడ్ యుగంలో ఈ చిరుధాన్యాలేంటనుకుంటున్నారా..! నగరంలో చాలా మంది వీటినే ఆరాధిస్తున్నారు. ఆహారంగా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే.. అనేక రకాల జీవనశైలి వ్యాధుల నుంచి ఊరటనిస్తున్నాయి. ఆరోగ్య సిరులు కురిపిస్తున్నాయి. రెండు పూటలా వరి అన్నమే ప్రధాన ఆహారంగా తీసుకునే నగర వాసులు.. ఇప్పుడు ఒక్క పూట అన్నానికే పరిమితమవుతున్నారు. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి ఉదయం, సాయంత్రం కొర్రలు, రాగులు, అరికెలు, ఊచలు, జొన్నలు, వరిగెలు వంటి వాటితో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే భుజిస్తున్నారు. ముప్పై ఏళ్ల వయసులోనే ఉప్పెనలా వచ్చిపడుతున్న బీపీ, షుగర్, ఆర్థరైటీస్ వంటి వివిధ రకాల వ్యాధులు నగరవాసుల ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చేలా చేస్తున్నాయి. రోగాలు వచ్చినప్పుడు మందు బిళ్లలు మింగే బదులు..అవి రాకుండా చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. అందుకే చిరుధాన్యాల ఆహారమే ఉత్తమమంటున్నారు. నగరంలో పెరుగుతున్న మిల్లెట్స్ వినియోగంపై సాక్షి ప్రత్యేక కథనం.. సహజ ఆహారమే ఎందుకు ప్రస్తుత కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 36 ఏళ్ల కిందటే నిషేధించిన ఇతియాన్, డీడీటీ, బీహెచ్‌సీ వంటి ప్రమాదకరమైన పురుగు మందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడతున్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు నగరాల్లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయస్సులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్, మిల్లెట్స్ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై రకరాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటాయనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచుపదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడిబియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు. అన్ని ఆహార ఉత్పత్తులు రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలా మంది అటువైపే చూస్తున్నారు. పాతవైపు..కొత్త చూపు.. ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్స్, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియాని ఘుమఘుమలు, వెరైటీ వెజ్, నానవెజ్‌తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరం ఆహరమే ముద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యామైన డిమాండ్ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పించడంలో దోహదం చేసే రాగులకు స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటికి.. ఒంటికి కూడా.. సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు, సబ్బులు, షాంపులు, వంట నూనెలు, కాస్మోటిక్స్ కూడా చేరాయి. పలు వ్యాపార దిగ్గజాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్, గ్రామీణ్‌మాల్ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలతో మహా నగరానికి పల్లెకు, మధ్య బాటలు వేశాయి. సూపర్ మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్‌రైస్, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్లైన్ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. సాత్విక ఆహారంతో పాటు చిరుధాన్యాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తద్వారా బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకుంటున్నారు. వాటితో పాటు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యమిస్తున్నారు. –గట్రెడ్డి రమాదేవి, గృహిణి ఒత్తిడితో ఉన్నవారికి చిరుధాన్యాలు అవసరం నిత్యం పని ఒత్తిడిలో ఉన్న వారికి బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఉంది. దీంతో రాగి అంబలి, దంపుడు బియ్యం, కొర్రలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిరుధాన్యాల ప్రాధాన్యం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. –బి.అరుణ రాజేశ్వరి, ఆర్టీసీ ఉద్యోగి, మధురవాడ -
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో 17.4 ఫీట్ల జొన్న మొక్క
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): పెద్ద జొన్న మొక్కకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. ఎన్టీపీసీ రామగుండం జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన దొడ్డ రాంచెంద్రారెడ్డి–పార్వతి దంపతులు తమ ఇంటి ఆవరణలో జొన్న మొక్కను పెంచారు. అది కాస్తా 5.3 మీటర్ల ఎత్తు(17.4 ఫీట్ల ఎత్తు) పెరగడంతో 2018, ఆక్టోబర్ 16న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. పెద్దగా మొక్క పెరగడంతో పూర్తి వివరాలతో రాంచంద్రారెడ్డి దంపతులు లిమ్కా బుక్ రికార్డుకు పంపించారు. అవార్డు ఎంపిక పరిశీలన అనంతరం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఎత్తయిన జొన్న మొక్కగా గుర్తించి అవార్డుకు ఎంపిక చేసి వారికి ప్రశంసాపత్రాన్ని పంపించారు. తమ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్క లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: పిట్టల్లా రాలిన జనం: పిడుగులతో 6 మంది దుర్మరణం -
ప్రాణాలు తీసిన జొన్నరొట్టె
సాక్షి, సంగారెడ్డి: జోగిపేట/వట్పల్లి(అందోల్): తల్లి మృతితో అప్పటికే కడుపు నిండా బాధతో ఉన్నారు.. కాస్త కడుపు నింపుకొందామనుకుని తిన్న ఆహారం కాస్తా యమపాశంగా మారింది. తిన్న జొన్న రొట్టెలే ప్రాణాలు హరించాయి. తల్లి 10 రోజుల కింద జొన్న రొట్టె తిని అస్వస్థతకు గురై మరణించింది. ఆమె అంత్యక్రియలకు వచ్చిన ఇద్దరు కుమారులు, ఒక కోడలు సైతం జొన్న రొట్టెలు తిని విగతజీవులయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 10 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుం బంలో నలుగురు మృతి చెందడం తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్వట్లలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుం బసభ్యులు తెలిపిన ప్రకారం.. పల్వట్లకి చెందిన మఠం శంకరమ్మ (80) ఈనెల 13న విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురై మృతి చెందింది. ఆమె దశదినకర్మ ముగిసిన అనంతరం, సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న జొన్న పిండితో రొట్టె లు చేసుకుని శంకరమ్మ కుమారులు చంద్రమౌళి (55), శ్రీశైలం (48), కోడళ్లు సుశీల (60), అనసూజ, సరిత తిన్నారు. చదవండి: మొన్న తమ్ముడు.. నేడు అన్న మనవలు, మనవరాళ్లు శిరీష, సంధ్య, సాయి వరుణ్ రొట్టెలు వద్దనడంతో వారికి అన్నం వండి పెట్టారు. రొట్టెలను తిన్న వారికి కొద్ది సేపటికే మత్తు రావడంతో కొద్దిసేపు పడుకున్నా రు. గంట తర్వాత విరేచనాలు, వాంతులు కావడంతో మనవలు, మనవరాళ్లు ఇంటి పక్క వారి సాయంతో 108 వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపే చంద్రమౌళి, సుశీ ల మృతి చెందారు. శ్రీశైలం, సరితను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా కు, అనసూజను బాలానగర్‌లోని బీబీఆర్ ఆస్పత్రికి తరలిం చారు. ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం రాత్రి శ్రీశైలం కూడా మరణించాడు. సరిత, అనసూజ పరిస్థి తి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, తల్లి శంకరమ్మ దహన సంస్కారాలు నిర్వహించిన ఆమె చిన్న కుమారుడు సంతోష్ తన భార్యతో కలసి నారాయణఖేడ్ వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. విష పదార్థాలు కలిసుండొచ్చు జొన్నపిండిలో ఏమైనా విషపదార్థాలు ఉన్నాయా.. లేదా అన్నదానిపై మూడు రోజుల్లో నివేదిక వస్తుంది. పిండి, రొట్టెలను స్వాధీనం చేసుకొని నాచారం వద్ద పరీక్ష కేంద్రానికి పంపించాం. పిండిలో క్రిమి సంహారక మందులు కలిస్తే తప్ప ఇంత ప్రమాదం జరగదు. క్రిమిసంహారక మందు వంటిది ఉంటేనే గంటలోపు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. శిరీష అనే అమ్మాయి కొంత భాగమే తినడంతో ప్రమాదం నుంచి బయటపడింది. –మోజీ రాం రాథోడ్, డీఎంహెచ్‌వో, సంగారెడ్డి జొన్నలు విషపూరితం కావు.. జొన్నలను మరాడించాక 2 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అంతకుమించి నిల్వ ఉంటే పురుగు పడుతుంది. విషపూరితం మాత్రం కాదు. పురుగులు పట్టిన పిండిని రొట్టె చేసుకొని తింటే స్వల్ప ఆరోగ్య సమస్యలే వస్తాయి. జొన్నలను మర ఆడించేటప్పుడు (గిర్ని) లేదా ఇంట్లో రొట్టెలు చేసుకునే సమయంలో ఇతర పిండి కలిసినట్లయితే కొద్ది గా విషతుల్యం కావచ్చు. జొన్న పిండిని నానబెట్టి కొద్దిగా వాడినట్లయితే కూడా ఫంగస్ వచ్చి విషమమ్యే అవకాశం ఉంది. బల్లి, పాములు, ఇతర విషపూరిత క్రిమికీటకాలు పిండిలో ఎక్కువసేపు ఉన్నా విషపూరితం కావచ్చు – నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి, సంగారెడ్డి -
బాసుమతి జొన్న!
బాసుమతి బియ్యం సువాసనకు పెట్టింది పేరు. అదేవిధంగా మరికొన్ని రకాల దేశీ వరి వంగడాలు కూడా సువాసనను వెదజల్లుతుంటాయి. అయితే, సువాసనను వెదజల్లే జొన్న వంగడం కూడా ఒకటి ఉంది! హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) కృషితో ఇది వెలుగులోకి వచ్చింది. ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ ఎం. ఇలంగోవన్ సంప్రదాయ జొన్న వంగడాలపై వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్న క్రమంలో మధ్యప్రదేశ్‌లో ‘బాసుమతి జొన్న’ గురించి తెలిసింది. ఛత్తర్పూర్ జిల్లా బిజావర్ సమీపంలోని కర్రి, సర్వ గ్రామాల ప్రజలు సువాసన కలిగిన జొన్న గురించి చెప్పారని డాక్టర్ ఎం. ఇలంగోవన్ తెలిపారు. దీన్ని ‘బాసుమతి జొన్న’ అని వారు పిలుస్తూ ఉన్నారు. అయితే, అప్పటికే ఇది దాదాపు అంతరించిపోయింది. అతికష్టం మీద నాలుగైదు కంకులు దొరికాయి. ఆ తర్వాత కాలంలో అదే జిల్లాలోని కటియ, కెర్వన్ గ్రామాల్లో కూడా ఈ జొన్న కనిపించింది. ఎస్.బి.బి.ఎ.డి.హెచ్.2 అనే జన్యువు సువాసనకు కారణమని పరిశోధనలో తేలిందని డాక్టర్ ఇలంగోవన్ తెలిపారు. సువాసన కలిగి ఉండే తిండి గింజలకు దేశ విదేశీ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంటుందన్నారు. ఆ గ్రామాలలో కొందరు రైతులకు ఇచ్చి సాగు చేయించదలిచామని డా. ఇలంగోవన్ (elangovan @millets.res.in) ‘సాక్షి’కి చెప్పారు. ఈ వంగడం బాగా వ్యాప్తిలోకి వస్తే ఆయా గ్రామాలకు ఆదాయం కూడా సమకూరుతుంది. అంతరించిపోతున్న అరుదైన జొన్న వంగడాన్ని తిరిగి సాగులోకి తెస్తున్న ఐఐఎంఆర్‌కు జేజేలు! డా. ఇలంగోవన్ -
1 నుంచి జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: వచ్చే నెల (ఏప్రిల్) 1 నుంచి జొన్న, మొక్కజొన్నను కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఐదెకరాలలోపు మొక్కజొన్న పంట మొత్తాన్ని కొనుగోలు చేసి చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం మార్కెటింగ్ శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తర్వాత వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. కన్నబాబు ఏం చెప్పారంటే.. - ఈ సీజన్లో 15 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేశాం. ఇందులో సగం ఉత్పత్తిని అయినా కొనాలని సీఎం ఆదేశించారు. 5 ఎకరాలలోపు ఉన్న రైతుల పంట మొత్తం కొనుగోలు చేస్తాం. అత్యధికంగా ఒక్కో రైతు నుంచి 150 క్వింటాళ్ల వరకు మొక్క జొన్నని కనీస మద్దతు ధరలకు కొంటాం. - ఏప్రిల్ 1 నుంచి 150 మొక్క జొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయనున్నాం. - ఖరీఫ్, రబీలో వరి ఉత్పత్తి పెరగడంతో గోడౌన్ల ఏర్పాటుపై కూడా సీఎం సమీక్ష చేశారు. మన గోడౌన్లతోపాటు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోడౌన్లను కూడా తీసుకోవాలని ఆదేశించారు. - వచ్చే ఏడాది నుంచి ‘మిషన్ గోడౌన్స్ (గిడ్డంగుల నిర్మాణం)’ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఇప్పటికే రూ.321 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. వీటి కోసం స్థలాలు చూడాలని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశాం. - ఈ ఏడాది అన్ని రైతు భరోసా కేంద్రాల్లో వేరుశనగ విత్తనాల పంపిణీ చేస్తాం. - విత్తన సేకరణ ఎలా జరుగుతుందో పర్యవేక్షించాలని, నాణ్యమైన విత్తన సేకరణలో రాజీ పడొద్దని సీఎం సూచించారు. పుడ్ ప్రాసెసింగ్‌పై సీఎం సమీక్ష - అరటి, టమాట, నిమ్మ, చీనీ వంటి వాటిని శుద్ధి చేసి విక్రయించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని పుడ్ ప్రాసెసింగ్‌పై జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. - అరటికి గతంలోనే క్వింటాల్‌కి రూ.800 గిట్టుబాటు ధర ప్రకటించాం. - గోదావరి డెల్టాలో రబీకు సాగునీటి ఎద్దడి రాకుండా, చివరి ప్రాంతాలకు నీరందని పరిస్ధితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. - సీలేరు నుంచి ఇప్పటికే 8 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నాం. అవసరమైతే మరో వేయి క్యూసెక్కులు నీటిని విడుదల చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
మిన్న.. జొన్న
ఇటీవల రాత్రిపూట చాలామంది రోటీలు తింటుండటం చూస్తూనే ఉన్నాం. మరికొందరు గోధుమరొట్టెలకు బదులు కాస్తంత మార్పు అంటూ జొన్నరొట్టెలు తింటున్నారు. తక్కువ వర్షపాతంలో కూడా జొన్నలు తేలిగ్గా పండుతాయి. కాబట్టి వర్షపాతం అంతగా లేనిచోట కూడా జొన్నలను విస్తృతంగా సాగుచేస్తుంటారు. అందుకే చాలా సంస్కృతుల్లో జొన్నన్నం, జొన్నరొట్టెలూ నిత్య ఆహారంగా ఉన్నాయి. మనం రెండు మూడు తరాల కింద వరి ఆహారానికి మారకముందు జొన్న అన్నం, జొన్నరొట్టెలు తినడమే పరిపాటి. జొన్నల్లో ప్రోటీన్లు ఎక్కువే. అందుకే జొన్న రొట్టెల్ని బలవర్థక ఆహారంగా పరిగణిస్తుంటారు. వీటిల్లో ఐరన్, క్యాల్షియమ్, పొటాషియమ్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎక్కువ. థయామిన్, రైబోఫ్లేవిన్ వంటి బీకాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్లు ఎక్కువ. జొన్నల్లో ఉండే ఫీనాలిక్ యాసిడ్స్, ట్యానిన్స్, యాంథోసయనిన్ వంటి పోషకాలు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. అన్నిటికంటే ప్రధానమైన అంశం... జొన్నలు తినేవారికి స్థూలకాయం వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. అందువల్ల ఊబకాయం (ఒబేసిటీ) ద్వారా వచ్చే ఎన్నో అనర్థాలను నివారించినట్లు అవుతుంది. గుండె ఆరోగ్యానికీ జొన్న ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థకు వచ్చే ఎన్నోరకాల సమస్యలను నివారిస్తాయి. మలబద్ధకం సమస్యను స్వాభావికంగా అధిగమించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల చాలాకాలం పాటు యౌవనంగా కనిపించడం సాధ్యమవుతుంది. గ్లూటెన్ కారణంగా గోధుమ వల్ల అలర్జీ ఉన్నవారికి ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. -
జయ జయ ధ్వాన్యాలు
జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. ప్రజలందరూ భరతమాతకు జయ జయ ధ్వానాలు అర్పించే రోజు. మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని మనం సమర్పించుకున్నాం. మరి... మన ఆహార విధానాలకు కూడా ఒక రాజ్యాంగం ఉండాలి కదా! ఈ ఆహార రాజ్యాంగంలో మొదట తారసపడేది సిరి ధాన్యాలే. దేశం చేవగా ఉండాలన్నా, దేహం దారుఢ్యంగా ఉండాలన్నా సిరి ధాన్యాలను స్వీకరించాల్సిందే! వీటిని చేసుకొని భుజించండి. జయ జయ ధాన్యాలు కొట్టండి. జొన్న సంగటి కావలసినవి: జొన్న రవ్వ – ఒక కప్పు; జొన్న పిండి – ఒక కప్పు; ఉప్పు – తగినంత. తయారీ: ►ఒక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ►ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి ►జొన్న రవ్వను నిదానంగా వేస్తూ, ఆపకుండా కలుపుతుండాలి ►జొన్న పిండి కూడా వేసి కలియబెట్టి, మూత పెట్టి బాగా ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►బాగా ఉడికిన తరవాత దింపేయాలి ►కొద్దిగా చల్లారాక గుండ్రటి ముద్దలు చేయాలి ►ఉల్లితరుగు, పచ్చిమిర్చి, సాంబారుతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. జొన్న ఇడ్లీ కావలసినవి: జొన్న రవ్వ – 3 కప్పులు; మినప్పప్పు – ఒక కప్పు; నూనె – తగినంత; ఉప్పు – తగినంత. తయారీ: ►మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు మూడు గంటలసేపు నానబెట్టాలి ►జొన్నరవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి మూడు గంటలసేపు నానబెట్టాలి ►మినప్పప్పులో నీళ్లు వడగట్టేసి, పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►రవ్వలో నీటిని గట్టిగా పిండి తీసేసి, రుబ్బిన పిండిలో కలుపుకోవాలి ►తగినంత ఉప్పు జత చేసి ఆరేడు గంటలు నానబెట్టాలి ►ఇడ్లీ రేకులకు నూనె పూసి, ఒక్కో గుంటలో గరిటెడు పిండి వేసి, ఇడ్లీ రేకులను కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి, ఆవిరి మీద ఉడికించాలి ►వేడి వేడి ఇడ్లీలను చట్నీతో అందించాలి. జొన్న కిచిడీ కావలసినవి: పెసరపప్పు – అర కప్పు; జొన్న రవ్వ – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూను; తరిగిన ఉల్లిపాయ – 1; అల్లం తురుము – అర టీ స్పూను; వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను; తరిగిన టొమాటో – 1; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – కొద్దిగా; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; క్యారట్ తరుగు – పావు కప్పు; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ►జొన్న రవ్వను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ►ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, టొమాటో తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►కరివేపాకు, పసుపు వేసి కలియబెట్టాలి ►ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి, తగినంత ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి, నీళ్లను మరిగించాలి ►పెసర పప్పు, జొన్న రవ్వ వేసి కలియబెట్టాలి ►మంట బాగా తగ్గించి గిన్నె మీద మూత పెట్టి, మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి (అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►కొత్తిమీరతో అలంకరించి, అందించాలి. రాగి ఉల్లిపాయల చపాతీ కావలసినవి: రాగి పిండి – ఒక కప్పు; తరిగిన ఉల్లిపాయ – ఒకటి; ఉప్పు – తగినంత; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3; పెరుగు – 2 చెంచాలు; కొత్తిమీర – అర కప్పు; నూనె – తగినంత. తయారీ: ►వెడల్పాటి పాత్రలో రాగి పిండి, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, పెరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి ►చిన్న చిన్న ఉండలు చేసి, చపాతీలా ఒత్తాలి (రాగి చపాతీ తొందరగా విరిగిపోతుంది కనుక చేతికి నూనె పూసుకుని, చేతితోనే ఒత్తాలి) ►స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి ►ఒత్తి ఉంచుకున్న రాగి చపాతీ వేసి రెండు వైపులా జాగ్రత్తగా కాల్చి తీసేయాలి ►పెరుగు, టొమాటో సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది. రాగి సేమ్యా ఖీర్ కావలసినవి: రాగి సేమ్యా – అర కప్పు; పాలు – 2 కప్పులు, కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – చిటికెడు; జీడి పప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – తగినంత. తయారీ: ►ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ►స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగించాక, జీడిపప్పు పలుకులను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ►రాగి సేమ్యా వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాక, మరుగుతున్న పాలలో వేసి కలియబెట్టాలి ►సేమ్యా ఉడికిన తరవాత పంచదార, కొబ్బరి తురుము వేసి కలిపి, బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి, ఒకసారి కలిపి స్టౌ మీద నుంచి దింపేసి, వేడివేడిగా అందించాలి. సజ్జ పరాఠా కావలసినవి: సజ్జ పిండి – ఒకటిన్నర కప్పులు; గోధుమ పిండి – అర కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; మెంతి పొడి – చిటికెడు; పచ్చి మిర్చి + అల్లం + వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; కొత్తిమీర – 2 టీ స్పూన్లు; పంచదార పొడి – ఒక టీ స్పూను; పెరుగు – పిండి కలపడానికి తగినంత. తయారీ: ►ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, నీళ్లు మరుగుతుండగా ఉప్పు జత చేయాలి ►ఒక పాత్రలో గోధుమ పిండి, సజ్జ పిండి, మెంతి పొడి, పంచదార పొడి వేసి కలపాలి ►వేడి నీళ్లు జత చేస్తూ పిండిని కలపాలి ∙పెరుగు జత చేస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలపాలి ►పరాఠాలుగా ఒత్తాలి ►స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, పరాఠాను పెనం మీద వేసి, రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి. సజ్జ పెసరట్టు కావలసినవి: సజ్జలు – ఒక కప్పు; పెసలు – ఒక కప్పు; బియ్యం – గుప్పెడు; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పచ్చి మిర్చి – 4; అల్లం – చిన్న ముక్క; ఉప్పు – తగినంత; నూనె లేదా నెయ్యి – తగినంత తయారీ: ►ఒక పాత్రలో సజ్జలు, పెసలు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీరు ఒంపేయాలి ►అన్నిటినీ గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ►అల్లం, పచ్చి మిర్చి, ఇంగువ జత చేసి మరోమారు రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►ఉప్పు, జీలకర్ర జత చేసి, మూత పెట్టి, గంటసేపు నాననివ్వాలి ►స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి ►గరిటెడు పిండి తీసుకుని, పెనం మీద సమానంగా పరచాలి ►రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ►కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి. సజ్జ పకోడీ కావలసినవి: సజ్జ పిండి – అర కప్పు; సెనగ పిండి – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; క్యారట్ తురుము – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ఒక పాత్రలో సజ్జ పిండి, సెనగ పిండి, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలి లో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా వేయాలి ►బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి. నిర్వహణ: వైజయంతి పురాణపండ -
జొన్న కిచిడీ, రాగుల పట్టీ
సాక్షి, హైదరాబాద్: తృణధాన్యాలకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) అందిపుచ్చుకుంటోంది. తృణధాన్యాలతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసేందుకు జీసీసీ శ్రీకారం చుడుతోంది. అత్యాధునిక పరిజ్ఞానం, రుచి, పోషక విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తులను త్వరలో మార్కెట్లోకి తేనుంది. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌తో అవగాహన కుదుర్చుకుంది. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరులో 3 చోట్ల రూ.1.20 కోట్లు వెచ్చించి తృణధాన్యాల ఉత్పత్తుల తయారీ కేంద్రాలను జీసీసీ ఏర్పాటు చేస్తోంది. ఈ తయారీ కేంద్రాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. జీసీసీ ద్వారా ప్రస్తుతం గిరి ప్రొడక్ట్స్ పేరిట మార్కెట్లో వివిధ రకాల ఉత్పత్తులున్నాయి. జీసీసీ ద్వారా విక్రయిస్తున్న గిరి హనీ(తేనె)కి మార్కెట్లో అత్యంత ప్రజాదరణ ఉంది. ఏటా సగటున 1,200 క్వింటాళ్ల తేనెను విక్రయిస్తోంది. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు సబ్బులు, షాంపూలు, కారం, చింతపండు, పసుపు తదితరాలను ప్రాసెస్ చేసి సరఫరా చేస్తోంది. తాజాగా తృణధాన్యాల ఉత్పత్తులను కూడా పెద్దఎత్తున మార్కెట్లోకి తేనుంది. గిరిపోషణ్లో భాగంగా.. ఐటీడీఏలు, గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన గిరిపోషణ్ పథకం కింద ఈ ఉత్పత్తులను సరఫరా చేయాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు కూడా వీటిని పంపిణీ చేసేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో అవగాహన కుదుర్చుకోనుంది. ప్రస్తుతం ప్రారంభదశలోనే ఈ తయారీ కేంద్రాలున్నాయి. డిసెంబర్ నెలాఖరులోగా తృణధాన్యాల తయారీ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు జీసీసీ కసరత్తు చేస్తోంది. ఆదివాసీలకు ఉపాధి.. తయారీ కేంద్రాల్లో పని చేసేందుకు మహిళలకు మాత్రమే జీసీసీ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం ఈ యూనిట్లు ఐటీడీఏ కేంద్రాల్లో ఉండటంతో అక్కడున్న ఆదివాసీ కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వారికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే తయారీ యూనిట్లలో పనిచేసేందుకు దాదాపు 120 మంది మహిళలను జీసీసీ ఎంపిక చేసింది. వీరికి ఇక్రిశాట్లో గత నెలలో శిక్షణ తరగతులు సైతం నిర్వహించారు. ఉత్పత్తులకు తగిన విధంగా వారికి పారితోషికాన్ని ఇవ్వనుంది. జీసీసీ బ్రాండ్‌కు మరింత క్రేజ్ పెరగడం, జీసీసీ బిజినెస్‌ను మరింత విస్తృతం చేసేందుకు మిల్లట్ వ్యాపారం దోహదపడుతుందని, ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా 120 కుటుంబాలు, పరోక్షంగా 150 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. వంటల తయారీకి ఇక్రిశాట్ ఫార్ములా.. జొన్న రకంతో చేసిన కిచిడీ, రాగులు, నువ్వులు, కొర్రలతో చేసిన పట్టీలు(చిక్కీలు), రెండు అంతకంటే ఎక్కువ తృణధాన్యాల మిశ్రమంతో (మల్టీమిల్లట్) స్వీట్లు తయారు చేయనుంది. వీటి తయారీకి ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు రూపొందించిన ఫార్ములాను వినియోగించనుంది. ఏటా రూ.1.25 కోట్లు చెల్లించి ఇక్రిశాట్ సహకారం తీసుకుంటోంది. -
యూత్ మళ్లీ ‘జొన్న’పై మనసు పారేసుకుంటోంది..
జొన్న అన్నం.. అందులో కాసింత మజ్జిగ.. ఆపై ఘాటైన పచ్చిమిర్చితో నంజుకుంటే.. ఆ టేస్టే వేరు. దీని రుచి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చేమో గానీ.. నాటి తరానికి అదో మరచిపోలేని జ్ఞాపకమే. అది ఒక మధుర స్మృతే కాదు.. ఆరోగ్య రహస్యం కూడా. దాని గురించి పాత తరాన్ని అడిగితే.. అందులోని పరమార్థం గుట్టు విప్పుతారు. ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌ను ఆస్వాదించి బోర్ కొట్టేసిందేమో.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు యూత్ మళ్లీ ‘జొన్న’పై మనసు పారేసుకుంటోంది. ఆరోగ్యం కాపాడుకునే క్రమంలో జొన్నను రోజువారీ మెనూలో భాగం చేసేస్తోంది. దీంతో నగర గల్లీల్లో జొన్న రొట్టెల విక్రయ స్టాల్స్ పుట్టుకొస్తున్నాయి. నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా పేరొందిన పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుంచి వీధుల్లో చిన్న డబ్బా పెట్టుకుని ఉపాధి పొందుతున్న వారి వరకు జొన్నతో చేసిన ఆహార పదార్థాలకు ఇప్పుడు భలే గిరాకీ పెరిగింది. డాక్టర్లు కూడా సంప్రదాయజొన్నలతో పాటు రాగులు, అరికలు, సజ్జలు వంటి ధాన్యాలను సూచిస్తుండడంతో ఇప్పుడు ఆయా ఆహార పదార్ధాల ‘టేస్ట్’కు డిమాండ్ పెరిగింది. వీధివీధినా పుట్టుకొస్తున్న విక్రయ కేంద్రాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కల్లంలో నుంచి సిటీ గల్లీల్లోకి జొన్నలు చేరి ఆరోగ్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. జొన్న అన్నం, జొన్న ఇడ్లీ, జొన్న దోశెలు.. ఇలా రకరకాల వంటకాలకు ఇప్పుడు క్రేజీ వచ్చింది. ఉపాధికి నెలవు.. ఉదయం టిఫిన్‌గా.. రాత్రి డిన్నర్గా ఇప్పుడు ఈ సంప్రదాయ వంటకాలు మెనూలో వచ్చి చేరాయి. దీంతో తక్కువ పెట్టుబడితో పాటు ఎక్కువ రాబడి తెచ్చుకునేందుకు జొన్న రొట్టెల విక్రయ కేంద్రాలను నెలకొల్పి ఉపాధిగా మలచుకుంటున్న వారు ఎందరో. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ శాతం సిటీజనులు జొన్న రొట్టెలు, ఇతర సిరి (చిరు) ధాన్యాలను టిఫిన్‌గా తినడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ జొన్న రొట్టెల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు ఉపాధికి ఆసరాగా ఉంటే.. మరోవైపు నగరవాసుల ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. జొన్నలో ఏముంది.. ప్రయోజనమేంటి? ♦ జొన్నల్లో పిండి పదార్ధాలు, చక్కెరలు, పీచు పదార్థం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బీ1, బీ2, బీ3, బీ5 విటమన్లు ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ♦ జొన్నల్లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉండటంతోజీర్ణకోశానికి మేలు చేస్తాయి. శరీరంలోని చెడు కొవ్వును నియంత్రిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఎముకలదారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి. ♦ జొన్నల్లో ప్రొటీన్లు, పైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు జొన్నలను ఆహారంగా చేర్చడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. త్వరగా ఆకలి కాకుండా చూస్తాయి. ♦ వీటిలో నియాసిస్ అనే బీ6 విటమిన్ ఉంటుంది. ఇది తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణమై శక్తిలాగా మారడానికి దోహదంచేస్తుంది. కేలరీలు పేరుకుపోకుండా శరీర బరువునుతగ్గిస్తుంది. ♦ బాలింతలకు జొన్నలతో చేసిన ఆహార పదార్థాలు మేలు చేస్తాయి. వీటిల్లో ఉంటే ప్రొటీన్స్ పిల్లలఎదుగుదలకు ఉపయోగపడతాయి. ♦ ఇతర ధాన్యాల కంటే జొన్నల్లో ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెప్పేమాట. అన్నీ మిల్లెట్స్ టిఫిన్లే.. జనాల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ నుంచి ఇప్పుడిప్పుడే ‘సంప్రదాయ’ వంటకాల వైపు మళ్లుతున్నారు. మూడేళ్లుగా మోతీనగర్ ప్రాంతంలో జొన్నలతో పాటు కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు, రాగులు వంటి మిల్లెట్స్‌తో ఇడ్లీలు, దోశలు, ఉప్మా, కిచిడీ, పొంగలి వంటి ఆహార పదార్థాలను చేసి అందిస్తున్నాం. – రామ్‌నాథ్, హౌస్ ఆఫ్ మిల్లెట్స్, మోతీనగర్ శరీరానికి పోషకాలు.. ఒక్కో చిరుధాన్యంలో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడడంలో మిల్లెట్స్ ఎంతో ఉపకరిస్తాయి. ముఖ్యంగా రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ప్రకృతిపరంగా ఎలా లభిస్తాయో అలాగే వాటిని తీసుకోవడం ఉత్తమం. నూనెలో వేయించడం లాంటివి ఉత్తమం కాదు. – డాక్టర్ ఎంఆర్ఎస్ రాజు, ప్రగతినగర్ అప్పట్లో జొన్న పదార్థాలే ఎక్కువ.. మా చిన్నతనంలో బియ్యం కంటే ఎక్కువగా జొన్న పదార్థాలనే ఎక్కువగా తినేవాళ్లం. జొన్న అన్నం, ఇడ్లీ.. ఆవిరి కుడుం.. ఇలా రకరకాలుగా చేసుకుని తినేవాళ్లం. ఇప్పటికీ మా ఇంట్లో జొన్న అన్నం చేసుకుని తింటాం. ఇప్పుడు ఏ సెంటర్‌కు వెళ్లినా జొన్న రొట్టెల అమ్మకాలు చూస్తుంటే మళ్లీ పాత రోజులు వచ్చాయనిపిస్తోంది. – జేఎస్టీ శాయి, మోడల్ కాలనీ -
జొన్నత్
జొన్నలు రఫ్ అండ్ టఫ్‌గా ఉంటాయి. వండామా... సాఫ్ట్ అండ్ స్మూత్ అయిపోతాయి! తిన్నామా... ఒంటికి చేవగా చేరిపోతాయి! ఈ పొలం ఫుడ్... మహా స్ట్రాంగ్ ఫుడ్. జొన్న ఐటమ్ ఏదైనా జన్నత్ని తలపిస్తుంది. జన్నత్ అంటే స్వర్గం. ఇది మాత్రం జొన్నత్! జొన్న పోహా తయారీకి పట్టే సమయం: 20 నిమిషాలు. ఇద్దరికి సరిపోతుంది. కావలసినవి జొన్న అటుకులు - 1 కప్పు బంగాళదుంప, బఠాణీలు - అర కప్పు (ఉడకపెట్టుకున్నవి) పటిక బెల్లం పొడి - 1 చెంచా నూనె - 2 చెంచాలు నిమ్మరసం - 1 చెంచా ఉప్పు - తగినంత ఆవాలు - 1 చెంచా జీలకర్ర 1/2 చెంచా శనగపప్పు 2 చెంచాలు మినప్పప్పు 1 చెంచా పచ్చిమిర్చి తరుగు - 1 చెంచా ఇంగువ - పావు చెంచా ఎండుమిర్చి - 2 అల్లం ముక్కలు (చిన్నవి) - 1 చెంచా పసుపు - 1 చెంచా కరివేపాకు - 1 రెమ్మ పల్లీలు - పిడికెడు. తయారి జొన్న ఆకులు నీళ్లలో పోసుకుని శుభ్రంగా కడిగి, ఒకటి రెండు నిముషాలు నీళ్లలో ఉంచి, వడకట్టుకుని, వాటికి పప్పు చేర్చి, 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, అల్లం ముక్క, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా పోపు మగ్గనివ్వాలి. దీనికి పల్లీలు కూడా చేర్చి, అన్నీ దోరగా వేగిన తర్వాత ఇంగువ చేర్చి, ఉడక పెట్టుకున్న బంగాళదుంప, బఠాణీ చేర్చుకుని ఒక నిమిషం మగ్గనిచ్చి, పైన తయారుగా పెట్టుకున్న అటుకులు చేర్చి, తగినంత ఉప్పు చేర్చి, అన్నీ బాగా కలుపుకుని 3-4 నిముషాలు సన్నని సెగమీద ఉంచుకోవాలి. దించబోయే ముందు నిమ్మరసం, పటికబెల్లం పొడి చల్లుకుని కలుపుకుంటే, ఎంతో రుచికరమైన జొన్న పోహ తయారవుతుంది. ఈ మిశ్రమంపై కొత్తిమీర చల్లుకోవచ్చు. గమనిక: జొన్న ఆకు నీళ్లలో ఎక్కువ సేపు నానకూడదు. గట్టిగా పిండకూడదు, విరిగిపోతాయి. మార్పులు చేర్పులు: పోపులో ఆకుకూర, ఇష్టమైన కూరగాయ కూడా వేసుకోవచ్చు. నిమ్మరసంతో పాటు పుట్నాల పప్పు పొడి కూడా చల్లుకోవచ్చు. పటిక బెల్లం పొడి వద్దు అనుకుంటే చల్లకపోయినా ఫర్వాలేదు. సజ్జ, రాగి అటుకులతో కూడా ఈ పోహ తయారు చేసుకోవచ్చు. జొన్న ఉప్మా తయారీకి పట్టే సమయం: 30 నిమిషాలు. ముగ్గురు లేదా నలుగురికి సరిపోతుంది. కావలసినవి: జొన్న రవ్వ 1 కప్పు; కరివేపాకు - 1 రెమ్మ ఉడికించిన కూరగాయ ముక్కలు - 1 కప్పు (క్యారెట్, బీన్స్) ఉల్లి తరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి - 2 అల్లం తరుగు - 1 చెంచా; నూనె - 2 చెంచాలు కొత్తిమీర తరుగు - 2 చెంచాలు; ఆవాలు - 1 చెంచా జీలకర్ర - అర చెంచా; శనగపప్పు - 2 చెంచాలు మినప్పప్పు - 1 చెంచా; ఇంగువ - చిటికెడు ఎండుమిర్చి - 2 తయారి: జొన్న రవ్వ దోరగా వేపుకుని పెట్టుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతో పోపు పెట్టుకుని, దీనికి ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు చేర్చి, మూడు కప్పుల నీళ్లు పోసుకుని, తగినంత ఉప్పు చేర్చి, బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగేటప్పుడు, రవ్వ చేర్చి బాగా కలియపెట్టుకుని, మూత పెట్ట్టుకుని, సన్నని సెగమీద బాగా ఉడికేవరకు ఉడకపెట్టుకోవాలి. నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుంటే కమ్మదనం పెరుగుతుంది. ఉప్మా ఏదైనా చట్నీతో తినవచ్చు. గమనిక: మరిగే నీటికి రవ్వ చేర్చేటపుడు గరిటతో ఉండకట్టకుండా కలియ పెట్టుకోవాలి. మార్పుచేర్పులు: పోపులో ఆకుకూర కూడా వేసుకోవచ్చు. కావాలకునేవాళ్లు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. దించబోయేముందు ఒక చెంచా నెయ్యి కలుపుకుంటే ఉప్మా రుచి పెరుగుతుంది. అన్ని రకాల చిరుధాన్యాల రవ్వలతో ఈ ఉప్మా తయారు చేసుకోవచ్చు. జొన్న కార కుడుము తయారీకి పట్టే సమయం: 40 నిమిషాలు. మొత్తం 10-12 కుడుములు తయారవుతాయి. కావలసినవి: జొన్న రవ్వ - 1 కప్పు కరివేపాకు - 1 రెమ్మ; ఇంగువ - పావు చెంచా పెసరపప్పు - పావు కప్పు నూనె లేదా నెయ్యి - 2 చెంచాలు ఉప్పు - తగినంత; ఆవాలు - 1 చెంచా జీలకర్ర - అర చెంచా; ఎండుమిర్చి - 2 మినప్పప్పు - 1 చెంచా పచ్చిమిర్చి తరుగు - 1 చెంచా అల్లం తరుగు - 1 చెంచా తయారి: పెసరపప్పు ఒక గంట నీళ్లలో నానపెట్టుకుని మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గట్టిగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. రుబ్బుకునేటప్పుడు అందులో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి రుబ్బుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువలతో పోపు పెట్టుకుని ఇందులో రుబ్బుకుని పక్కన పెట్టుకున్న పెసరపప్పుని వేసుకుని, 3-4 నిముషాలు దోరగా వేపుకుని, జొన్న రవ్వ కూడా కలుపుకొని 4-5 నిమిషాలు వేపుకొని మూడు గ్లాసుల నీళ్లు పోసుకుని బాగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించి పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత, చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకుని కుడుములు చేసుకొని ఇడ్లీపాత్రలో 10-12 నిమిషాలు ఆవిరి పట్టుకుంటే కమ్మని జొన్న కార కుడుములు తయారవుతాయి. సాంబారు, కొబ్బరి చట్నీతో తినవచ్చు. గమనిక: రవ్వ ఉడికేటప్పుడు ఉండకట్టకుండా చూసుకోవాలి.మార్పులు చేర్పులు: పెసరపప్పు బదులు శనగపప్పు కూడా వాడుకోవచ్చు. లేదా రెండూ కలిపి కూడా వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు లేదా ఆకుకూర, కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు. అన్ని రకాల చిరుధాన్యాల రవ్వలతో ఈ కార కుడుములు చేసుకోవచ్చు. జొన్న పేలాల లడ్డు తయారీకి పట్టే సమయం: 30 నిమిషాలు. 12 లడ్డూలు తయారవుతాయి. కావలసినవి: జొన్నలు- 1 కప్పు బెల్లం పొడి - 1 కప్పు పాలు - లడ్డూలు చుట్టుకోవటానికి తగినంత యాలకుల పొడి - అర చెంచా నెయ్యి - 2 చెంచాలు జీడిపప్పు - 2; బాదం - 4; పిస్తా - 4; ఎండు ఖర్జూరం - 3 (అన్నీ కలిపి పొడిచేసుకుని పెట్టుకోవాలి) తయారి మందపాటి బాణలిలో కానీ, మట్టిపెంకలో కానీ, శుభ్రం చేసుకున్న జొన్నలు తీసుకుని, నూనె లేకుండా జొన్న పేలాలు తయారయ్యేదాకా వేపుకుని, పేలాలు చల్లారిన తర్వాత, బరకగా పిండిచేసి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో తయారు చేసుకున్న పేలాల పిండి, బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి, తయారు చేసుకున్న డ్రైఫ్రూట్స్ పొడిని కలుపుకుని తగినంత పాలు చేర్చి, లడ్డూలుగా తయారు చేసుకోవచ్చు. గమనిక: జొన్న పేలాలు తయారయ్యేటప్పుడు మంట తగ్గించి, పేలాలు మాడకుండా వేపు ఉండాలి. పేలాలు మాడకుండా బాణలిలో కొంచెం ఇసుక వేసి, ఇసుక వేడి అయిన తర్వాత జొన్నలు వేసి వేపుకుని, పేలాలు తయారైన తర్వాత, పేలాలు ఇసుక నుండి వేరు చేసుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. మార్పులు చేర్పులు: వేపిన నువ్వులు కూడా లడ్డు పిండిలో కలుపుకోవచ్చు. - బెల్లం బదులు పటిక బెల్లం పొడి కూడా కలుపుకోవచ్చు. - పాలు వద్దు అనుకుంటే, బెల్లం లేతపాకం పట్టుకుని, అందులో పేలాల పిండి, యాలకుల పొడి, నెయ్యి, డ్రైఫ్రూట్స్ పొడి వేసుకుని చపాతీ పిండిలాగా చేసుకుని కూడా లడ్డూలు చేసుకోవచ్చు. - జొన్న పేలాలు పిండి చేయకుండా పేలాలగానే బెల్లం పాకంలో కలుపుకుని కూడా లడ్డూ చేసుకోవచ్చు. కానీ బెల్లం తీగపాకం పట్టుకోవాలి. సజ్జ పేలాలతో కూడా ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు. జొన్న అటుకుల మిక్చర్ తయారీకి పట్టే సమయం: 10.15 నిమిషాలు. ముగ్గురు లేదా నలుగురికి సరిపోతుంది. కావలసినవి జొన్న అటుకులు - 1 కప్పు పచ్చిమిర్చి తరుగు - 1 చెంచా నూనె - 2 చెంచాలు ఉప్పు - తగినంత. ఆవాలు - 1 చెంచా జీలకర్ర - అర చెంచా శనగపప్పు - 2 చెంచాలు ఎండుమిర్చి - 2 పల్లీలు - పావు కప్పు పసుపు - అర చెంచా కరివేపాకు - 1 రెమ్మలు తయారి: ముందుగా జొన్న అటుకులు నూనె లేకుండా దోరగా వేపుకుని పెట్టుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, పల్లీ, పుట్నాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేపుకోవాలి. పోపుకు పసుపు, ఉప్పు చేర్చుకుని, తయారుగా పెట్టుకున్న జొన్న అటుకులు కలుపుకుని, ఒక పళ్లెంలోకి తీసుకుని 5 నిముషాలు చల్లారనిస్తే, ఎంతో రుచిగా ఉండే జొన్న అటుకులు తయారవుతాయి. మార్పులు చేర్పులు: జీడిపప్పు, కిస్మిస్ కూడా పోపులో చేర్చుకోవచ్చు. {Osెగ్లిజరైడ్స్తో బాధపడేవారు, పల్లీ, జీడిపప్పు వేసుకోకపోవటం చాలా మంచిది. పోపులో 1 చెంచా పటిక బెల్లం పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. షెఫ్ రాంబాబు కర్టెసీ క్రాంతి కుమార్ రెడ్డి హైదరాబాద్ -
జావ..చేవ
⇒ మారుతున్న నగర ప్రజల ఆహారపు అలవాట్లు ⇒ జావ, గటక, దలియా, మొలకలకు ప్రాధాన్యం ⇒మారుతున్న నగర ప్రజల ఆహారపు అలవాట్లు ⇒ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాల వైపు చూపు ⇒జావ, గటక, దలియా, మొలకలకు ప్రాధాన్యం ⇒‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ నినాదంతో ముందుకు ఖమ్మం హవేలి: సంప్రదాయ వంటకాలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు మళ్లీ వాటినే ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యం అలనాటి వంటల్లోనే ఉందనే విషయాన్ని ఇన్నాళ్లకు గ్రహించినట్టున్నారు. ‘బ్యాక్ టు నేచర్’ అనే నినాదంతో సంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, పెసలు, మినుములు, గోధుమలతో తయారు చేసిన గటక, జావ, దనియా (అన్ని చిరుధాన్యాలు కలిపిన పిండి), మొలకలు సత్ఫలితాలు ఇస్తుండటంతో ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఉదయం అల్పాహారానికి బదులు జొన్న, రాగి జావకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఆహారంతోనే రోజును ప్రారంభిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మార్నింగ్ వాకర్స్, క్రీడాకారులు, జిమ్‌కు వెళ్లేవారు, బాడీబిల్డర్స్, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు కాస్తంత ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ వీటిని స్వీకరిస్తున్నారు. నగరంలో ఉదయాన్నే జనసమర్థం ఎక్కువగా ఉండే చోట గటక, జావ విక్రయ స్టాల్స్ వెలుస్తున్నాయి. ఎనీ ఐటెమ్ టెన్ రూపీస్ ఓన్లీ.. ఈ స్టాల్స్‌లో జన్న, రాగి జావతో పాటు వామువాటర్, మొలకలు లభిస్తున్నాయి. ఏ ఐటమ్ అయినా రూ.10కే లభిస్తుండడంతో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. జావలో శొంఠి, మిరియాల పొడి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, మజ్జిగ, నిమ్మకాయ రసం, తేనె కలిపి ఇస్తుండటంతో ఆరోగ్యానికి ఆరోగ్యం..రుచికి రుచి ఉంటుండటంతో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వీటిలో కారం, మసాలాలు లేకపోవడంతో ఆరోగ్యానికి ఉపకరిస్తున్నాయి. ఇక ఇంటి వద్ద రొట్టెలు తయారు చేసుకునే దలియా (చిరుధాన్యల మిశ్రమాల పిండి)కి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. సర్దార్‌పటేల్ స్టేడియం, భక్తరామదాసు కళాక్షేత్రం, రైతుబజార్, డీఆర్డీఏ కూరగాయల మార్కెట్ వద్ద రెండుళ్లుగా ఈ ఆహారపదార్థాల స్టాల్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం 5:30 నుంచి 11:00 గంటల వరకు వీటి వద్దకు వందల సంఖ్యలో జనం వచ్చి జావ, గటక సేవిస్తున్నారు. కొందరు ఇళ్లకు పార్సిల్స్ తీసుకెళ్తున్నారు. డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉండటం కూడా కలిసొస్తోంది. తక్కువ పరిమాణం.. ఎక్కువ శక్తి చిరుధాన్యాల ఆహారం కావడంతో తక్కువ పరిమాణంలో తీసుకున్నా సరే ఎక్కవ శక్తి లభిస్తోందని వినియోగదారులు అంటున్నారు. షుగర్, మలబద్ధకం జీర్ణసంబంధ వ్యాధుల నియంత్రణ, లావు, బరువు తగ్గటం, రక్తశుద్ధి, రోగ నిరోధకశక్తి పెంపుదలకు ఈ ఆహారపదార్థాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయని పలువురి అభిప్రాయం. ఆయా ఆహారపదార్థాలతో ఉపయోగం.. జొన్నల్లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇనుము, కాల్షియం, జింక్, పొటాష్, పాస్ఫరస్ లాంటి పోషకాలు, థయామిన్, రైబోఫ్లోవిన్, లాంటి ‘బి’ విటమిన్లు లభిస్తాయి. టానిన్లూ, ఫెనోలిక్ ఆమ్లాలు యంథోసియానిన్స్ లాంటి ఫైటోకెమికల్స్ శరీర బరువును తగ్గించడమే కాకుండా శక్తినిస్తాయి. గర్భిణులకు ఇవి మరీ మంచిది. రాగుల్లో ఇనుము, కాల్షియం, మాంసకృత్తులు, ‘ఏ’, ‘బి’ విటమిన్స్ లభిస్తాయి. ఫాస్ఫరస్ లాంటి పోషకాలు, పీచు పదార్థాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. కాల్షియం ఎముకల్ని దృఢపరుస్తుంది. కీళ్లనొప్పులు, మహిళల్లో మోనోపాజ్ (40ఏళ్లు దాటిన) దశ దాటిన తరువాత ఆస్టియోపోరోసిస్ రాకుండా ఇవి నియంత్రిస్తాయి. రాగులు మైగ్రెయిన్ ను తగ్గిస్తాయి. బాలింతలకు పాలు పెరిగేందుకు దోహదపడుతాయి. మహిళల్లో రక్తహీనతను నివారించే ఇనుము పెరుగుతుంది. రాగుల్లో ఉన్న మెగ్నీషియం నెలసరిలో వచ్చే నొప్పులు, అసౌకర్యాన్ని దూరం చేస్తుంది. సజ్జలు, సామలు, బార్లీ, రాజ్గీరా ధాన్యాల్లో గ్లైసమిన్ ఇండెక్స్ తక్కువ. అవి జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఇన్సులిన్ నియంత్రించబడి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. నాడీవ్యవస్థ బాగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగేలా ఇందులో ఉన్న ‘బి’ విటమిన్ దోహదపడుతుంది. గుండెజబ్బులు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ వంటికి రాకుండా ఉంటాయి. బీపీ, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ ఉన్న మహిళలు వారానికి 6 సార్లు చిరుధాన్యాలు తీసుకోవాలని న్యూట్రిషన్స్సూచిస్తున్నారు. ప్రతిఒక్కరూ చిరుధాన్యాలను ఒకేసారి కాకుండా నెమ్మదిగా జీవనవిధానంలో చేరిస్తే బాగుంటుందని వైద్యుల సలహా. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
మాఘీ జొన్న సాగుకు ఇదే అదను * సెప్టెంబర్ మాసం రబీ (మాఘీ) తెల్లజొన్న, పచ్చజొన్న, జొన్న విత్తనోత్పత్తికి అనుకూలం. వరంగల్, మెదక్, రంగారెడ్డి, కర్నూలు, కడప జిల్లాల్లో జొన్న సాగుకు ఈ సమయం అనుకూలం. * మాఘీకి అనువైన తెల్లజొన్న రకాలు: ఎన్.టి.జె-1, ఎన్.టి.జె-2, ఎన్.టి.జె-3, ఎన్.టి.జె-4, కిన్నెర, సి.ఎస్.హెచ్-16. అనువైన పచ్చజొన్న రకాలు: ఎన్-13, ఎన్-14. ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని విత్తుకోవాలి. * శిలీంధ్ర నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల ధైరమ్ లేదా కాప్టాన్, మొవ్వు ఈగ నివారణకు 3 గ్రాముల థమోమిధాక్సాం కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. * కలుపు నివారణకు అట్రజన్ 50% పొడి మందును ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల లోపల నేలపై తడి ఆరకముందే పిచికారీ చేయాలి. * మాఘీ జొన్నలో సమస్యగా ఉన్న ఈ జొన్నమల్లె కలుపు నివారణకు 50 గ్రా. అమ్మోనియం సల్ఫేటు లేదా 200 గ్రాముల యూరియాను లీటరు నీటికి కలిపి మల్లెపై పిచికారీ చేసి నివారించవచ్చు. * విత్తిన 35-40 రోజులప్పుడు జొన్న పంటలో మల్లె కలుపు మొక్క మొలకెత్తుతుంది. ఇది జొన్న మొక్క వేళ్ల మీద నుంచి సారాన్ని పీల్చుకోవడం ద్వారా జొన్న పంట ఎదుగుదలను తగ్గిస్తుంది. * భూసారాన్ని అనుసరించి వరుసల మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరంతో విత్తుకొని ఎకరాకు 58 వేల నుంచి 70 వేల మొక్కల సాంద్రత ఉండేట్లుగా చూసుకోవాలి. * వర్షాధారపు మాఘీ జొన్నకు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేయాలి. * 24-32 కిలోల నత్రజని ఎరువును విత్తేటప్పుడు ఒకసారి, 30-45 రోజుల మధ్యలో రెండు దఫాలుగా వేసుకోవాలి. * విత్తిన తొలి 30 రోజుల్లో జొన్నకు మొవ్వు తొలిచే ఈగ ఆశించి నష్టపరుస్తుంది. సరైన సమయంలో విత్తుకోవడంతోపాటు కార్బోఫ్యురాన్ 3జి గుళికలను మీటరు సాలుకు 2 గ్రాముల వంతున ఇసుకలో కలిపి విత్తేటప్పుడు సాళ్లలో వేసుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపల సాగులో ఎఫ్.సి.ఆర్.ను బట్టే లాభనష్టాలు * ఆక్వా సాగులో రైతులు 50 శాతం పైగా పెట్టుబడి మేత కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ‘మేత వినిమయ నిష్పత్తి’(ఎఫ్.సి.ఆర్.)మీదే లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి. * ఎన్ని కేజీల మేతకు, ఎన్ని కేజీల చేపలు ఉత్పత్తి అయ్యాయనే విష యాన్ని అంచనావేసే పద్ధతినే ‘మేత వినిమయ నిష్పత్తి’ అంటారు. * సాధారణంగా నూనె తీసిన తవుడు, వేరుశనగ చెక్కను మేతగా వాడి న చెరువుల్లో ఎఫ్.సి.ఆర్. 2.5-3.0 :1.0 గాను, కణికల (పెల్లెట్స్) మేత వాడిన మేతలో 1.5:1.0 గాను ఉండే అవకాశముంది. * ఎఫ్.సి.ఆర్. ఎంత తక్కువగా ఉన్నట్లయితే, మేత అంత నాణ్యమైనదని అర్థం. అంతేగాక తక్కువ ఎఫ్.సి.ఆర్. ఉన్నప్పుడు, రైతులకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశముంది. - డాక్టర్ పి. రామ్మోహన్ రావ్(98851 44557), అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఫిషరీస్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, కాకినాడ గొర్రెలకు వైరస్ వ్యాధులతో ముప్పు * గొర్రెల పెంపకానికి గొడ్డలిపెట్టులా మారిన వ్యాధుల్లో బ్యాక్టీరియా వ్యాధులతోపాటు వైరస్ వ్యాధులు కూడా ఉన్నాయి. కొన్ని వివరాలు తెలుసుకుందాం. * గాలికుంటు వ్యాధి(గాళ్లు): ఈ వ్యాధి సోకితే నోరు, నాలుక, గిట్టల మధ్య పుండ్లు వస్తాయి. 104-105 డిగ్రీల జ్వరం వస్తుంది. చొంగ కారుతుంటుంది. పుండ్ల వల్ల మేత తినలేక పశువులు నీరసించి చనిపోతాయి. జొన్నజావ, గ్లూకోజ్ కలిపి తాగించాలి. దీని నివారణకు టీకా వేయించాలి. *నీటి నాలుక వ్యాధి: దీన్ని మూతి వాపు వ్యాధి అని కూడా అంటారు. ఈ వర్షాకాలపు వ్యాధి ప్రస్తుతం చాలా పశువులకు సోకింది. దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. 1% పొటాషియం పర్మాంగనేట్‌తో కడగడం ఉపశమనాన్నిస్తుంది. టీకాలు లేవు. *అమ్మతల్లి/బొబ్బ రోగం: ఈ వ్యాధి సోకిన గొర్రెల చెవులు, పొదుగు, తొడలు, కంటి రెప్పలపై దద్దుర్లు వస్తాయి. అవి చీము పట్టి, పగిలి రసికారతాయి. దీని నివారణకు టీకా వేయించాలి. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా తెల్లమచ్చల వైరస్ వ్యాధికి నీటి శుద్ధే మందు! * వెనామీ రైతులు తెల్ల మచ్చల వైరస్‌ను గమనించినప్పుడు చేయగలిగింది నీటిని శుద్ధి చేయడం మాత్రమే. నీటిలో సంచరించే విర్యాన్ కణాలు / వైరస్ కణాల రోగ కారకతను తగ్గించేందుకు బ్లీచింగ్ పౌడర్(ఎకరాకు 25 కిలోల మోతాదు) లేదా ఫార్మలిన్ ద్రావణం(చెరువు లోతును బట్టి ఎకరానికి 5-10 లీటర్లు) వాడటం ఒక్కటే పరిష్కారం. * అయితే, రొయ్య శరీరంలోని వైరస్ నిర్మూలనకు మందులు లేవు. పైన చెప్పుకున్న మందులు శరీరంలోని వైరస్‌ను ఏమీ చేయలేవు. * వైరస్ తీవ్రత వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. తెల్లమచ్చల వైరస్ కణం రొయ్య శరీరంలోకి ప్రవేశించిన 6 గంటల నుంచి కణజాలంలో వ్యాధికి సంబంధించిన మార్పులు మొదలవుతాయి. * తెల్లమచ్చల వైరస్ వ్యాధి స్కాంపీ, టైగర్ రొయ్యల్లో కంటే తెల్ల రొయ్యలు, వెనామీ రొయ్యలకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. - ఆచార్య పి. హరిబాబు, ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా -
సంప్రదాయ పంటలకు స్వస్తి
వ్యవసాయంలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. ఆహార పంటలైన జొన్న, పెసర్లు, గోధుమ సాగుకు స్వస్తి చెబుతున్న రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో.. అధిక దిగుబడి.. అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఆ దిశగా ముందుకు ‘సాగు’తున్నారు. ముఖ్యంగా భూములన్నింటినీ పత్తి, సోయూబీన్ పంటలు ఆక్రమించారుు. ఫలితంగా అన్నదాతలకే ప్రస్తుతం ఇళ్లలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితిలో సంప్రదాయ పంటలు ప్రభను కోల్పోగా కొత్త పంటలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి, లాభాలిచ్చే పంటల వైపే అన్నదాతలు మొగ్గుచూపుతుండడంతో సంప్రదాయ పంటలకు కాలం చెల్లుతోంది. అధిక దిగుబడి, లాభాలు ఇచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలు జరగకపోవడంతో పాత పంటల సాగు ఏడాదికేడాది తగ్గిపోతుండగా.. కొత్త పంటల సాగు విస్తీర్ణం అమాంతం పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేసిన పంటలు ఇప్పుడు చిన్నబోయాయి. రబీ సీజన్లో ఐదేళ్ల క్రితం వరకు జిల్లాలో వరి, జొన్న, పెసర్లు, గొధుమ. మినుములు, ఇతర పప్పు ధాన్యాల సాగు భారీగా ఉండేది. రానురాను తగ్గిపోయూరుు. 2008-09లో లక్షా 12 వేల 23 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైన ఆహార పంటలు.. 2013-14కు వచ్చేసరికి రబీలో 61 వేల 801 హెక్టార్లకు పడిపోరుుంది. రబీలో జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 2008-9లో 18,433 హెక్టార్లు కాగా.. ఈ ఏడాది రబీలో 10 వేల 100 హెక్టార్లకు చేరింది. ఇక చిన్నపంటలైన పొద్దుతిరుగుడు, మిరప, నువ్వులు, వేరుశెనగ, ఉల్వలు, ఉల్లి పంటలు సైతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. నేటి మొక్కజొన్న, పత్తి.. రేపటి సోయాదే.. ఒకప్పుడు జిల్లాలో నామమాత్రంగా సాగైన పత్తి, సోయాబీన్, వరి పంటలపై రైతుల్లో మోజు పెరిగింది. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి, రాబడి ఇస్తుండడంతో రైతులు మూకుమ్మడిగా ఈ పంటల సాగుకే కట్టుబడిపోయారు. బీటీ విత్తనాల రాకతో పత్తి సాగు అమాంతం పెరిగింది. ఖరీఫ్, రబీలో 2008-09లో 2,82,860 హెక్టార్లలో సాగైన పత్తి ఖరీఫ్ 2013 నాటికి 3 లక్షల 10 వేల హెక్టార్లకు పెరిగడమే ఇందుకు నిదర్శనం. సోయాబీన్ 95,895 హెక్టార్లకు గాను లక్ష 13 వేల హెక్టార్లకు చేరింది. జొన్న పంట స్థానాన్ని సోయాబీన్ ఆక్రమించగా.. పప్పు దినుసులు, నూనె గింజల స్థానంలో పత్తి పంట చొచ్చుకొచ్చింది. రెండేళ్లుగా జిల్లాలో సోయా చిక్కుడు సాగు పెరుగుతుండడంతో.. భవిష్యత్తులో భారీ స్థాయిలో ఈ పంటను సాగుచేసే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పప్పుదినుసుల్లో కంది మాత్రమే ఆదరణకు నోచుకుంటోంది.