యూత్‌ మళ్లీ ‘జొన్న’పై మనసు పారేసుకుంటోంది.. | Sorghum Food Good For Health | Sakshi
Sakshi News home page

జొన్నకు' జై'

Published Wed, Nov 6 2019 8:19 AM | Last Updated on Wed, Nov 6 2019 8:19 AM

Sorghum Food Good For Health - Sakshi

జొన్న అన్నం.. అందులో కాసింత మజ్జిగ.. ఆపై ఘాటైన పచ్చిమిర్చితో నంజుకుంటే.. ఆ టేస్టే వేరు. దీని రుచి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చేమో గానీ.. నాటి తరానికి అదో మరచిపోలేని జ్ఞాపకమే. అది ఒక మధుర స్మృతే కాదు.. ఆరోగ్య రహస్యం కూడా. దాని గురించి పాత తరాన్ని అడిగితే.. అందులోని పరమార్థం గుట్టు విప్పుతారు. ప్రస్తుతం ఫాస్ట్‌ ఫుడ్‌ కల్చర్‌ను ఆస్వాదించి బోర్‌ కొట్టేసిందేమో.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్లు యూత్‌ మళ్లీ ‘జొన్న’పై మనసు పారేసుకుంటోంది. ఆరోగ్యం కాపాడుకునే క్రమంలో జొన్నను రోజువారీ మెనూలో భాగం చేసేస్తోంది. దీంతో నగర గల్లీల్లో జొన్న రొట్టెల విక్రయ స్టాల్స్‌ పుట్టుకొస్తున్నాయి. నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా పేరొందిన పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుంచి వీధుల్లో చిన్న డబ్బా పెట్టుకుని ఉపాధి పొందుతున్న వారి వరకు జొన్నతో చేసిన ఆహార పదార్థాలకు ఇప్పుడు భలే గిరాకీ పెరిగింది. డాక్టర్లు కూడా సంప్రదాయజొన్నలతో పాటు రాగులు, అరికలు, సజ్జలు వంటి ధాన్యాలను సూచిస్తుండడంతో ఇప్పుడు ఆయా ఆహార పదార్ధాల ‘టేస్ట్‌’కు డిమాండ్‌ పెరిగింది. వీధివీధినా పుట్టుకొస్తున్న విక్రయ కేంద్రాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కల్లంలో నుంచి సిటీ గల్లీల్లోకి జొన్నలు చేరి ఆరోగ్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. జొన్న అన్నం, జొన్న ఇడ్లీ, జొన్న దోశెలు.. ఇలా రకరకాల వంటకాలకు ఇప్పుడు క్రేజీ వచ్చింది.

ఉపాధికి నెలవు..
ఉదయం టిఫిన్‌గా.. రాత్రి డిన్నర్‌గా ఇప్పుడు ఈ సంప్రదాయ వంటకాలు మెనూలో వచ్చి చేరాయి. దీంతో తక్కువ పెట్టుబడితో పాటు ఎక్కువ రాబడి తెచ్చుకునేందుకు జొన్న రొట్టెల విక్రయ కేంద్రాలను నెలకొల్పి ఉపాధిగా మలచుకుంటున్న వారు ఎందరో. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ శాతం సిటీజనులు జొన్న రొట్టెలు, ఇతర సిరి (చిరు) ధాన్యాలను టిఫిన్‌గా తినడం అలవాటు చేసుకున్నారు.  ఈ క్రమంలోనే నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ జొన్న రొట్టెల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు ఉపాధికి ఆసరాగా ఉంటే.. మరోవైపు నగరవాసుల ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. 

జొన్నలో ఏముంది.. ప్రయోజనమేంటి? 

జొన్నల్లో పిండి పదార్ధాలు, చక్కెరలు, పీచు పదార్థం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బీ1, బీ2, బీ3, బీ5 విటమన్లు ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
జొన్నల్లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉండటంతోజీర్ణకోశానికి మేలు చేస్తాయి. శరీరంలోని చెడు కొవ్వును నియంత్రిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఎముకలదారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి.
జొన్నల్లో ప్రొటీన్లు, పైబర్‌ అధిక మొత్తంలో లభిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు జొన్నలను ఆహారంగా చేర్చడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. త్వరగా ఆకలి కాకుండా చూస్తాయి.
వీటిలో నియాసిస్‌ అనే బీ6 విటమిన్‌ ఉంటుంది. ఇది తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణమై శక్తిలాగా మారడానికి దోహదంచేస్తుంది. కేలరీలు పేరుకుపోకుండా శరీర బరువునుతగ్గిస్తుంది.  
బాలింతలకు జొన్నలతో చేసిన ఆహార పదార్థాలు మేలు చేస్తాయి. వీటిల్లో ఉంటే ప్రొటీన్స్‌ పిల్లలఎదుగుదలకు ఉపయోగపడతాయి.
ఇతర ధాన్యాల కంటే జొన్నల్లో ఐరన్, జింక్‌ ఎక్కువగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెప్పేమాట.

అన్నీ మిల్లెట్స్‌ టిఫిన్లే..
జనాల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్‌ నుంచి ఇప్పుడిప్పుడే ‘సంప్రదాయ’ వంటకాల వైపు మళ్లుతున్నారు. మూడేళ్లుగా మోతీనగర్‌ ప్రాంతంలో జొన్నలతో పాటు కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు, రాగులు వంటి మిల్లెట్స్‌తో ఇడ్లీలు, దోశలు, ఉప్మా, కిచిడీ, పొంగలి వంటి ఆహార పదార్థాలను చేసి అందిస్తున్నాం.  – రామ్‌నాథ్, హౌస్‌ ఆఫ్‌ మిల్లెట్స్,     మోతీనగర్‌

శరీరానికి పోషకాలు.. 
ఒక్కో చిరుధాన్యంలో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడడంలో మిల్లెట్స్‌ ఎంతో ఉపకరిస్తాయి. ముఖ్యంగా రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ప్రకృతిపరంగా ఎలా లభిస్తాయో అలాగే వాటిని తీసుకోవడం ఉత్తమం. నూనెలో వేయించడం లాంటివి ఉత్తమం కాదు.    – డాక్టర్‌ ఎంఆర్‌ఎస్‌ రాజు, ప్రగతినగర్‌

అప్పట్లో జొన్న పదార్థాలే ఎక్కువ..
మా చిన్నతనంలో బియ్యం కంటే ఎక్కువగా జొన్న పదార్థాలనే ఎక్కువగా తినేవాళ్లం. జొన్న అన్నం, ఇడ్లీ.. ఆవిరి కుడుం.. ఇలా రకరకాలుగా చేసుకుని తినేవాళ్లం. ఇప్పటికీ మా ఇంట్లో జొన్న అన్నం చేసుకుని తింటాం. ఇప్పుడు ఏ సెంటర్‌కు వెళ్లినా జొన్న రొట్టెల అమ్మకాలు  చూస్తుంటే మళ్లీ పాత రోజులు వచ్చాయనిపిస్తోంది.  – జేఎస్‌టీ శాయి,    మోడల్‌ కాలనీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement