సాక్షి, అమరావతి: వచ్చే నెల (ఏప్రిల్) 1 నుంచి జొన్న, మొక్కజొన్నను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఐదెకరాలలోపు మొక్కజొన్న పంట మొత్తాన్ని కొనుగోలు చేసి చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం మార్కెటింగ్ శాఖపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తర్వాత వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. కన్నబాబు ఏం చెప్పారంటే..
- ఈ సీజన్‌లో 15 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేశాం. ఇందులో సగం ఉత్పత్తిని అయినా కొనాలని సీఎం ఆదేశించారు. 5 ఎకరాలలోపు ఉన్న రైతుల పంట మొత్తం కొనుగోలు చేస్తాం. అత్యధికంగా ఒక్కో రైతు నుంచి 150 క్వింటాళ్ల వరకు మొక్క జొన్నని కనీస మద్దతు ధరలకు కొంటాం.
- ఏప్రిల్ 1 నుంచి 150 మొక్క జొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయనున్నాం.
- ఖరీఫ్, రబీలో వరి ఉత్పత్తి పెరగడంతో గోడౌన్ల ఏర్పాటుపై కూడా సీఎం సమీక్ష చేశారు. మన గోడౌన్లతోపాటు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోడౌన్లను కూడా తీసుకోవాలని ఆదేశించారు.
- వచ్చే ఏడాది నుంచి ‘మిషన్ గోడౌన్స్ (గిడ్డంగుల నిర్మాణం)’ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఇప్పటికే రూ.321 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. వీటి కోసం స్థలాలు చూడాలని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశాం.
- ఈ ఏడాది అన్ని రైతు భరోసా కేంద్రాల్లో వేరుశనగ విత్తనాల పంపిణీ చేస్తాం.
- విత్తన సేకరణ ఎలా జరుగుతుందో పర్యవేక్షించాలని, నాణ్యమైన విత్తన సేకరణలో రాజీ పడొద్దని సీఎం సూచించారు.
పుడ్ ప్రాసెసింగ్‌పై సీఎం సమీక్ష
- అరటి, టమాట, నిమ్మ, చీనీ వంటి వాటిని శుద్ధి చేసి విక్రయించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని పుడ్ ప్రాసెసింగ్‌పై జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
- అరటికి గతంలోనే క్వింటాల్‌కి రూ.800 గిట్టుబాటు ధర ప్రకటించాం.
- గోదావరి డెల్టాలో రబీకు సాగునీటి ఎద్దడి రాకుండా, చివరి ప్రాంతాలకు నీరందని పరిస్ధితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
- సీలేరు నుంచి ఇప్పటికే 8 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నాం. అవసరమైతే మరో వేయి క్యూసెక్కులు నీటిని విడుదల చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment