Unexpected Response To The eFarmarket Introduced By The AP State Government - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఆన్‌లైన్‌లో అన్నదాత

Published Tue, May 31 2022 3:40 AM | Last Updated on Tue, May 31 2022 10:44 AM

Online Crop sales for farmers with Andhra Pradesh Govt Support - Sakshi

బాపట్ల జిల్లా వెల్లటూరులో రైతు నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న లోడ్‌

సాక్షి, అమరావతి: దేశ రాజధానిలో ఉన్న ఓ కంపెనీ మన రైతన్న పండించిన పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసి చెల్లింపులు పక్కాగా జరపడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. అన్నదాతలు తాము పండించిన పంటను కళ్లాల నుంచే నేరుగా తమకు నచ్చిన ధరకు విక్రయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ–ఫార్మార్కెటింగ్‌’కు అనూహ్య స్పందన లభిస్తోంది. మండీలకు ప్రత్యామ్నాయంగా రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రాసెసర్‌లను అనుసంధానిస్తూ దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెచ్చిన ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ పోర్టల్, యాప్‌ ద్వారా క్రయవిక్రయాలు నిర్వహించేందుకు పోటీ పడుతున్నారు.

నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌కు చెందిన అగ్రీ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గూగుల్‌ ప్లే స్టోర్‌లో eFarmarket యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పేరు, ఆధార్, మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా సులభంగా పొలం నుంచే పంట ఉత్పత్తులను విక్రయించవచ్చు. ఇప్పటికే 23 రకాల పంటలను వెబ్‌ పోర్టల్‌లో రైతులు నమోదు చేసుకున్నారు. 

రూ.10.33 కోట్ల కొనుగోళ్లు
అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. http://eFarmarket.ap.gov.in/web వెబ్‌ పోర్టల్‌లో ఇప్పటివరకు 463 మంది రైతులు, 551 మంది వ్యాపారులు నమోదు చేసుకున్నారు. వీరిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులున్నారు. గత ఎనిమిది నెలల్లో 197 మంది వ్యాపారులు రాష్ట్ర రైతుల నుంచి రూ.10.33 కోట్ల విలువైన 79,650 క్వింటాళ్ల వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేశారు. 

ఎండు మిరప క్వింటాల్‌ రూ.11,704
ఈ–ఫార్మార్కెటింగ్‌ ద్వారా అత్యధికంగా కర్నూలు జిల్లాలో రూ.2.43 కోట్లు, గుంటూరులో రూ.2.29 కోట్లు, నంద్యాలలో రూ.1.63 కోట్లు, పల్నాడు జిల్లాలో రూ.కోటికి పైగా లావాదేవీలు జరిగాయి. అత్యధికంగా రూ.3.18 కోట్ల విలువైన 16 వేల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేశారు. రూ.1.78 కోట్ల విలువైన 2,552 క్వింటాళ్ల పత్తి, రూ.1.58 కోట్ల విలువైన 9,120 క్వింటాళ్ల ఫైన్‌ వెరైటీ ధాన్యం, రూ.98.19 లక్షల విలువైన 1,853 క్వింటాళ్ల వేరుశనగను రైతులు విక్రయించారు. అత్యధికంగా క్వింటాల్‌ ఎండు మిరప రూ.11,704 ధర పలికింది. క్వింటాల్‌ జీడిపప్పు రూ.9,100, మామిడి రూ.7 వేలు, పత్తి రూ.6,995, మినుములు రూ.6,255 చొప్పున రైతులకు ధర లభించింది.

ఈ ఫార్మార్కెటింగ్‌తో ప్రయోజనాలెన్నో..
► కేంద్రం ప్రభుత్వం తెచ్చిన ఈనామ్‌లో మార్కెట్‌ యార్డుల్లో రిజిస్ట్రర్డ్‌ వ్యాపారులు మాత్రమే అందులో నమోదైన రైతుల నుంచి కొనుగోలు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–ఫార్మార్కెటింగ్‌లో దళారీల ప్రమేయంతో పాటు ఎలాంటి ఫీజులు, రుసుములు ఉండవు. రైతుల నేరుగా కళ్లాల నుంచే మంచి ధరకు అమ్ముకోవచ్చు.
► పంట వివరాలు, ఉత్పత్తి లభ్యత, నాణ్యత వివరాలను రైతులు ‘ఏపీ ఫార్మర్స్‌ ఈ–విక్రయ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ (ఏపీఎఫ్‌ఈవీసీఎల్‌) ద్వారా ఎలక్ట్రానిక్‌ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే దీని ద్వారానే వ్యాపారులు నచ్చిన ఉత్పత్తులను ఎంచుకొని నేరుగా రైతులతో సంప్రదించి కొనుగోలు చేస్తారు. రైతుల ఖాతాలకు డబ్బులు నేరుగా జమ చేస్తారు. రైతులు తమ ఉత్పత్తుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసుకునేలా ఈ–విక్రయ కార్పొరేషన్‌ సిబ్బందితో పాటు ఆర్బీకేలు కూడా సహకరిస్తాయి. 
► రైతులు పండించిన ఉత్పత్తులకు ప్రభుత్వమే సర్టిఫైడ్‌ క్వాలిటీ అసెస్‌మెంట్‌ సర్టిఫికెట్‌ కూడా జారీ చేస్తున్నందున నాణ్యతకు ఢోకా ఉండదు. ప్రభుత్వ పర్యవేక్షణ ఉన్నందున ఎలాంటి మోసాలకు తావుండదు. 
అనంతపురం జిల్లా రేగడికొత్తూరులో రైతుల నుంచి కొన్న మొక్క జొన్నను లోడ్‌ చేస్తున్న దృశ్యం 
 
స్పందన బాగుంది 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేస్తూ ఉత్పత్తులకు మంచి ధర లభించే లక్ష్యంతో ‘ఈ ఫార్మార్కెటింగ్‌’ తీసుకొచ్చాం. నాలుగు జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. రైతులు, వ్యాపారుల నుంచి మంచి స్పందన వస్తోంది.
– పీఎస్‌ ప్రద్యుమ్న, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌

మార్కెట్‌ కంటే మంచి రేటు 
బాపట్ల జిల్లా వేమూరు మండలం వెల్లటూరు రైతు ఎం.గంగాధర్‌ రబీలో 20 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మార్కెట్‌లో క్వింటాల్‌ రూ.2,150 పలుకుతుండగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ–ఫార్మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఢిల్లీకి చెందిన ఓరిగో కమోడెటీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి క్వింటాల్‌ రూ.2,220 చొప్పున 600 క్వింటాళ్లు విక్రయించాడు. మార్కెట్‌ రేటుతో పోలిస్తే భారీగా లాభం వచ్చింది. ఐదు రోజుల్లోనే ఖాతాకు డబ్బులు జమ అయ్యాయి. ఈ సదుపాయం ఎంతో బాగుందని ‘సాక్షి’తో రైతు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement