పేదలకు భరోసాతో.. పెత్తందారులు బతికేదెలా ? | CM Jagans welfare regime towards rural sustainable development | Sakshi
Sakshi News home page

పేదలకు భరోసాతో.. పెత్తందారులు బతికేదెలా ?

Published Thu, Jul 6 2023 5:24 AM | Last Updated on Thu, Jul 6 2023 5:24 AM

CM Jagans welfare regime towards rural sustainable development - Sakshi

సాక్షి, అమరావతి: నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావం సహజంగానే దేశమంతా ఉంటుంది. వీటిని ఒక్క రాష్ట్రమే నియంత్రించాలంటే సాధ్యం కాదు!! మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఆయా ప్రభుత్వాలు తక్షణం స్పందించి రాయితీపై వినియోగదారులకు అందించి ఊరట కల్పించాలి! రాష్ట్ర ప్రభుత్వం అదే చేస్తుంటే కొందరు పెత్తందారులు మాత్రం సహించలేకపోతున్నారు! దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటిన మర్నాడే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై రైతు బజార్ల ద్వారా రూ.50కే అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపశమనం కల్పించింది.

నిత్యావసరాల బ్లాక్‌ మార్కెటింగ్‌కు తావులేకుండా నిల్వలపై పరిమితులు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా గంటల వ్యవధిలోనే స్పందించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఉల్లి ధరలు భగ్గుమన్నప్పుడు కూడా కర్నూలు సహా వివిధ ప్రధాన మార్కెట్లలో మార్కెటింగ్‌ శాఖను రంగంలోకి దించి నేరుగా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రాయితీపై ప్రజలకు అందచేసింది.

ధరలు పెరిగినా, పతనమైనా ప్రతి సందర్భంలోనూ వెంటనే జోక్యం చేసుకుని వినియోగదారులను, రైతన్నలను ఆదుకుంటోంది. నాలుగేళ్లలో రూ.70.32 కోట్ల విలువైన 15 వేల టన్నుల ఉల్లిపాయలు, టమాటా, బత్తాయిలను రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు పంపిణీ చేయడమే ఇందుకు నిదర్శనం.

చరిత్ర ఎరుగని సంక్షేమం
చరిత్రలో ఎన్నడూ లేనంత సంక్షేమాన్ని అందించి పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), ఇతర పథకాల (నాన్‌–డీబీటీ) ద్వారా ఏకంగా రూ.3.15 లక్షల కోట్లకుపైగా లబ్ధి చేకూర్చారు. కోవిడ్‌ సంక్షోభంలోనూ సంక్షేమ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది.

ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా కానరాని గ్రామీణ ఆర్థిక సుస్థిరత నాలుగేళ్లలోనే సాధ్యమైంది. గతంలోనూ ప్రభుత్వాలకు ఇదే బడ్జెట్‌ ఉన్నా ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు ప్రతి నిరుపేద బాగుపడుతున్నాడు. తన కుటుంబానికి ఆపదొస్తే ప్రభుత్వం చూసుకుంటుందన్న భరోసాతో జీవిస్తున్నాడు. ఇదంతా పచ్చమంద, పెత్తందారులకు కంటగింపుగా మారింది. అధికార దండం దూరం కావడంతో కాళ్లు చేతులు ఆడని రామోజీ ‘ఈ బాదుడుకు.. పేదలు బతికేదెలా’? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఓ కథనాన్ని తమ కరపత్రంలో ముద్రించారు. 

పెత్తనం కేంద్రానిదే
వంట గ్యాస్‌ ధరలపై అజమాయిషీ కేంద్ర ప్రభుత్వానిదే. 2020 – 21 నుంచి వంట గ్యాస్‌పై సబ్సిడీని కేంద్రం భారీగా తగ్గించింది. మరోవైపు సిలిండర్‌ ధర క్రమంగా రూ.1,100కి ఎగబాకింది. సబ్సిడీ రూపంలో రూ.11 మాత్రమే జమ చేస్తోంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ “ఈనాడు’ మభ్యపుచ్చే యత్నం చేసింది. ఇదే తరహాలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను బట్టి దేశంలో పెట్రోల్‌ రేట్లు నిర్ణయిస్తారు. పెట్రోల్‌ రేట్లు పెరిగినప్పుడల్లా ఆ ప్రభావం నిత్యావసరాలపై సహజంగానే ఉంటుంది. ఈ విషయం ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది! 

రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తి
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్ల విలువైన 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను అక్కచెల్లెమ్మలకు పంపిణీ చేసింది. ఇంటి నిర్మాణ సాయంతో కలిపి ఒక్కొక్కరికీ రూ.15 లక్షల విలువైన స్థిరాస్తిని అందిస్తోంది.  రెండు దశల్లో 21.25 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా ఇప్పటికే 5 లక్షల ఇళ్లు (టిడ్కో ఇళ్లు 72,400 + సాధారణ ఇళ్లు 4 లక్షలకు పైగా) పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో శరవేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఇళ్ల నిర్మాణాల ద్వారా కార్మికులకు 30 కోట్లకుపైగా పని దినాలను కల్పించింది.

ఏపీ పొదుపు సంఘాలకే ఎక్కువ రుణాలు
డ్వాక్రా మహిళలకు రూ.14,204 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మోసగించడంతో ఆ భారం రూ.25,571 కోట్లకు చేరుకుంది. 18.36 శాతం సంఘాలు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మిగిలాయి. అలాంటి తరుణంలో సీఎం జగన్‌ మాట ప్రకారం వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఆదుకున్నారు. ఇప్పటి వరకు పొదుపు సంఘాల మహిళలకు రూ.19,178.17 కోట్లు చెల్లించారు. దీంతో ఇప్పుడు ఎన్‌పీఏ రేటు 0.45 శాతానికి తగ్గిపోయింది.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. దేశంలో మొత్తం పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో  30 శాతం ఏపీలో సంఘాలకే పంపిణీ చేయడం విశేషం. ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ.1.16 లక్షల కోట్ల మేర బ్యాంకు రుణాలు కూడా ఇప్పించారు.

మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు వైఎస్సార్‌ చేయూత కింద 26.39 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు  అందిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.14,129 కోట్లు ఆర్థిక సాయం చేశారు. తద్వారా సుమారు 10 లక్షల మంది మహిళలు వ్యాపారాలు, స్వయం ఉపాధి, చిరు దుకాణాల ద్వారా శాశ్వత జీవనోపాధి పొందుతున్నారు. 

రైతు సాధికారత..
అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద 52.38 లక్షల కుటుంబాలకు వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా రూ.30,985.30 కోట్లను ప్రభుత్వం అందించింది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ రుణాల కింద రూ.73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్లు అందచేయగా వైఎస్సార్‌ పంటల బీమా కింద 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్లు అందించింది. 22.74 లక్షల మంది రైతులకు పంట నష్ట పరిహారం కింద రూ.1,965.43 కోట్లు సీజన్‌ ముగియక ముందే చెల్లించింది. 

నాడు ముక్కిపోయిన బియ్యమే..
గత సర్కారు హయాంలో రేషన్‌ పంపిణీ అంటే పెద్ద ప్రహసనమే! ముక్కిపోయినవి, పురుగులు పట్టిన బియ్యాన్ని ఇస్తే పేదలు ఎలా తినగలరని ఈనాడు ఏనాడు ప్రశ్నించలేదు. రీ సైక్లింగ్‌ చేస్తున్నా స్పందించిన పాపాన పోలేదు. సబ్సిడీ కందిపప్పు పేరుతో గత సర్కారు మార్కెట్‌ కంటే అధిక రేట్లకు టీడీపీ నేతలకు టెండర్లను కట్టబెట్టింది. గరిష్టంగా కిలో రూ.120కి విక్రయించారు. 2014 సెప్టెంబర్‌ నుంచి 2015 జూలై వరకు  కందిపప్పు పంపిణీ చేపట్టలేదు. అలాంటి అధ్వాన్న పరిస్థితులకు తెరదించి ఇప్పుడు నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని ఇంటి వద్దే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

రాళ్లు, పురుగులు, నూక, పొట్టు లేని బియ్యాన్ని ఇస్తుండటంతో ప్రతి నెలా రేషన్‌ తీసుకునేవారు 90 శాతానికి పెరిగారు. ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా తొలిదశలో రాయలసీమ జిల్లాల్లో ఉచితంగా రాగులు, జొన్నల పంపిణీని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో గోధుమపిండి కిలో రూ.16కే అందిస్తున్నారు. కార్డుకు అరకిలో పంచదార ఇవ్వడంతో పాటు కందిపప్పు రేటు ఎంత పెరిగినా 2020 నుంచి ఇప్పటిదాకా సబ్సిడీపై కిలో రూ.67కే అందిస్తుండటం గమనార్హం.

మరోవైపు ప్రజా పంపిణీలో యువతను భాగస్వాములను చేస్తూ 9,260 మందికి ఉపాధి కల్పించింది. కేంద్ర ప్రభుత్వం 80 లక్షల ఎన్‌ఎఫ్‌ఎస్‌ కార్డులకు మాత్రమే ఉచితంగా బియ్యం ఇస్తుండగా నాన్‌–ఎన్‌ఎఫ్‌ఎస్‌ కార్డుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ అందరికీ సార్టెక్స్‌ బియ్యాన్నే అందిస్తోంది. వీటితో పాటు 18 జిల్లాల్లో బలవర్థకమైన ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. మొత్తంగా రూ.23,860 కోట్లు పీడీఎస్‌పై ఖర్చు చేయడం విశేషం. 

దవ్యోల్బణం దేశంలోనే తక్కువ..
ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే భారత్‌లోనే ద్రవ్యోల్బణం రేటు తక్కువగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 7 నుంచి 9 శాతం వరకు రేట్ల పెరుగుదల ఉండగా మన దేశంలో 4.5 శాతం వద్ద నిలకడగా కొనసాగుతోంది. విదేశీ దిగుమతులను తగ్గించుకుని స్వదేశీ ఎగుమతులను పెంచుకోవడం ద్వారా ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.

గతంలో విదేశాల నుంచి వంట నూనె దిగుమతి చేసుకోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. ఇప్పుడు నిలకడగా ఉన్నాయి. స్థానికంగా ఆయిల్‌ పామ్‌ రైతులకు రాయితీలు కల్పించడం ద్వారా సాగును ప్రోత్సహించాయి. ఫలితంగా డిమాండ్, సప్లై మధ్య వ్యత్యాసాన్ని 37 నుంచి 25 శాతానికి తగ్గించగలిగారు.

అందుకే వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు పీడీఎస్‌ కింద పంపిణీ చేసే నిత్యావసరాలను రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి స్థానికంగానే వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఫలితంగా ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడి తక్కువ రేట్లకే నిత్యాసవరాలు లభించనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement