జయ జయ ధ్వాన్యాలు | Special Dishes For Sorghum | Sakshi
Sakshi News home page

జయ జయ ధ్వాన్యాలు

Published Sat, Jan 25 2020 4:17 AM | Last Updated on Sat, Jan 25 2020 4:17 AM

Special Dishes For Sorghum - Sakshi

జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. ప్రజలందరూ భరతమాతకు జయ జయ ధ్వానాలు అర్పించే రోజు. మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని మనం సమర్పించుకున్నాం. మరి... మన ఆహార విధానాలకు కూడా ఒక రాజ్యాంగం ఉండాలి కదా! ఈ ఆహార రాజ్యాంగంలో మొదట తారసపడేది సిరి ధాన్యాలే. దేశం చేవగా ఉండాలన్నా, దేహం దారుఢ్యంగా ఉండాలన్నా సిరి ధాన్యాలను స్వీకరించాల్సిందే! వీటిని చేసుకొని భుజించండి. జయ జయ ధాన్యాలు కొట్టండి.

జొన్న సంగటి
కావలసినవి: జొన్న రవ్వ – ఒక కప్పు; జొన్న పిండి – ఒక కప్పు; ఉప్పు – తగినంత.

తయారీ:
►ఒక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి
►ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి
►జొన్న రవ్వను నిదానంగా వేస్తూ, ఆపకుండా కలుపుతుండాలి
►జొన్న పిండి కూడా వేసి కలియబెట్టి, మూత పెట్టి బాగా ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి)
►బాగా ఉడికిన తరవాత దింపేయాలి
►కొద్దిగా చల్లారాక గుండ్రటి ముద్దలు చేయాలి
►ఉల్లితరుగు, పచ్చిమిర్చి, సాంబారుతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.

జొన్న ఇడ్లీ
కావలసినవి: జొన్న రవ్వ – 3 కప్పులు; మినప్పప్పు – ఒక కప్పు; నూనె – తగినంత; ఉప్పు – తగినంత.

తయారీ:
►మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు మూడు గంటలసేపు నానబెట్టాలి
►జొన్నరవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి మూడు గంటలసేపు నానబెట్టాలి
►మినప్పప్పులో నీళ్లు వడగట్టేసి, పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి
►రవ్వలో నీటిని గట్టిగా పిండి తీసేసి, రుబ్బిన పిండిలో కలుపుకోవాలి
►తగినంత ఉప్పు జత చేసి ఆరేడు గంటలు నానబెట్టాలి
►ఇడ్లీ రేకులకు నూనె పూసి, ఒక్కో గుంటలో గరిటెడు పిండి వేసి, ఇడ్లీ రేకులను కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి, ఆవిరి మీద ఉడికించాలి
►వేడి వేడి ఇడ్లీలను చట్నీతో అందించాలి.

జొన్న కిచిడీ
కావలసినవి: పెసరపప్పు – అర కప్పు; జొన్న రవ్వ – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూను; తరిగిన ఉల్లిపాయ – 1; అల్లం తురుము – అర టీ స్పూను; వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను; తరిగిన టొమాటో – 1; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – కొద్దిగా; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; క్యారట్‌ తరుగు – పావు కప్పు; కొత్తిమీర – కొద్దిగా

తయారీ:
►జొన్న రవ్వను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి
►స్టౌ మీద  బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
►ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, టొమాటో తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
►కరివేపాకు, పసుపు వేసి కలియబెట్టాలి
►ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి, తగినంత ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి, నీళ్లను మరిగించాలి
►పెసర పప్పు, జొన్న రవ్వ వేసి కలియబెట్టాలి
►మంట బాగా తగ్గించి గిన్నె మీద మూత పెట్టి, మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి (అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి)
►కొత్తిమీరతో అలంకరించి, అందించాలి.

రాగి ఉల్లిపాయల చపాతీ
కావలసినవి: రాగి పిండి – ఒక కప్పు; తరిగిన ఉల్లిపాయ – ఒకటి; ఉప్పు – తగినంత; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3; పెరుగు – 2 చెంచాలు; కొత్తిమీర – అర కప్పు; నూనె – తగినంత.

తయారీ:
►వెడల్పాటి పాత్రలో రాగి పిండి, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, పెరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి
►చిన్న చిన్న ఉండలు చేసి, చపాతీలా ఒత్తాలి (రాగి చపాతీ తొందరగా విరిగిపోతుంది కనుక చేతికి నూనె పూసుకుని, చేతితోనే ఒత్తాలి)
►స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి
►ఒత్తి ఉంచుకున్న రాగి చపాతీ వేసి రెండు వైపులా జాగ్రత్తగా కాల్చి తీసేయాలి
►పెరుగు, టొమాటో సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది.

రాగి సేమ్యా ఖీర్‌
కావలసినవి: రాగి సేమ్యా – అర కప్పు; పాలు – 2 కప్పులు, కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – చిటికెడు; జీడి పప్పు పలుకులు – 2 టేబుల్‌ స్పూన్లు; నెయ్యి – తగినంత.

తయారీ:
►ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి
►స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగించాక, జీడిపప్పు పలుకులను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి
►రాగి సేమ్యా వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాక, మరుగుతున్న పాలలో వేసి కలియబెట్టాలి
►సేమ్యా ఉడికిన తరవాత పంచదార, కొబ్బరి తురుము వేసి కలిపి, బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి, ఒకసారి కలిపి స్టౌ మీద నుంచి దింపేసి, వేడివేడిగా అందించాలి.

సజ్జ పరాఠా
కావలసినవి: సజ్జ పిండి – ఒకటిన్నర కప్పులు; గోధుమ పిండి – అర కప్పు; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; మెంతి పొడి – చిటికెడు; పచ్చి మిర్చి + అల్లం + వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; కొత్తిమీర – 2 టీ స్పూన్లు; పంచదార పొడి – ఒక టీ స్పూను; పెరుగు – పిండి కలపడానికి తగినంత.

తయారీ:
►ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, నీళ్లు మరుగుతుండగా ఉప్పు జత చేయాలి
►ఒక పాత్రలో గోధుమ పిండి, సజ్జ పిండి, మెంతి పొడి, పంచదార పొడి వేసి కలపాలి
►వేడి నీళ్లు జత చేస్తూ పిండిని కలపాలి ∙పెరుగు జత చేస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలపాలి
►పరాఠాలుగా ఒత్తాలి
►స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, పరాఠాను పెనం మీద వేసి, రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి.

సజ్జ పెసరట్టు
కావలసినవి: సజ్జలు – ఒక కప్పు; పెసలు – ఒక కప్పు; బియ్యం – గుప్పెడు; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పచ్చి మిర్చి – 4; అల్లం – చిన్న ముక్క; ఉప్పు – తగినంత; నూనె లేదా నెయ్యి – తగినంత

తయారీ:
►ఒక పాత్రలో సజ్జలు, పెసలు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీరు ఒంపేయాలి
►అన్నిటినీ గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి
►అల్లం, పచ్చి మిర్చి, ఇంగువ జత చేసి మరోమారు రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి
►ఉప్పు, జీలకర్ర జత చేసి, మూత పెట్టి, గంటసేపు నాననివ్వాలి
►స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి
►గరిటెడు పిండి తీసుకుని, పెనం మీద సమానంగా పరచాలి
►రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి
►కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి.

సజ్జ పకోడీ
కావలసినవి: సజ్జ పిండి – అర కప్పు; సెనగ పిండి – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; క్యారట్‌ తురుము – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ:
►ఒక పాత్రలో సజ్జ పిండి, సెనగ పిండి, ఉల్లి తరుగు, క్యారట్‌ తురుము, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలి లో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా వేయాలి
►బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
►టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి.
నిర్వహణ: వైజయంతి
పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement