కల్తీ కల్లోలం! | Counterfeit gangs in Telangana: Foodstuffs | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లోలం!

Published Tue, Jul 9 2024 1:56 AM | Last Updated on Tue, Jul 9 2024 1:56 AM

Counterfeit gangs in Telangana: Foodstuffs

నగరంలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ నుంచి ఆయిల్స్‌ దాకా కల్తీ

ఉద్యోగాలు, పని ఒత్తిడితో రెడీమేడ్‌ దినుసులు కొంటున్న సిటీ జనం

వారి అవసరం ఆసరాగా చెలరేగుతున్న ‘కల్తీ’ ముఠాలు

చెడిపోయిన పదార్థాలు, ప్రమాదకర రసాయనాలు కలిపి దినుసుల తయారీ

పలుమార్లు భారీగా నకిలీ, కల్తీ సరుకులను పట్టుకున్న పోలీసులు

అలాంటి సరుకులతో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యుల హెచ్చరికలు

సాక్షి, హైదరాబాద్‌: ఇందుగలదు అందులేదన్న సందేహమే లేదన్నట్టుగా.. నిత్యావసర సరుకుల్లో దేనిలో చూసినా కల్తీలు, నకిలీలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారంపొడి, మసాలాలు, నూనెలు వంటివి విపరీతంగా కల్తీ అవుతున్నాయి. గ్రేటర్‌ నగరంలో ఉద్యోగాలు, పని ఒత్తిడితో రెడీమేడ్‌ సరుకులు కొనేవారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని కల్తీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. చెడిపోయిన, కుళ్లిపోయిన పదార్థాలను వాడటంతోపాటు వివిధ రకాల రసాయనాలు, ప్రమాదకర పదార్థాలు కలిపి కల్తీ దినుసులను మార్కెట్లోకి వదులుతున్నాయి. టాస్‌్కఫోర్స్, ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేస్తున్న ప్రతిసారి భారీ మొత్తంలో ఇలాంటి నకిలీ, కల్తీ సరుకులు పట్టుబడుతూనే ఉన్నాయి. వీటివల్ల ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రమాదకర పదార్థాలతో..
⇒ కల్తీ ముఠాలు.. దినుసుల్లో కలుపుతున్న పదార్థాలు భయపెడుతున్నాయి. జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో తయారైన మంచి నూనె.. రంపపు పొడి, బోరిక్‌ పౌడర్లు కలిపిన మసాలా పౌడర్లు.. ప్రమాదకర రసాయనాలు కలిపిన మసాలాల విక్రయం సర్వసాధారణంగా మారింది. 

⇒ రాతిపొడి, పెయింట్‌ స్టెయినర్, మైదా పిండి వంటివి కలిపి నకిలీ గసగసాలు తయారు చేస్తున్నారు. 

⇒అంతేకాదు పలు దినుసులలో సింథటిక్‌ పెయింట్లు కలుపుతున్నట్టు అధికారుల దాడుల్లో తేలింది. ఆ పెయింట్లలో ఉండే సీసం విషపూరితమని, రక్తంలో హిమోగ్లోబిన్‌ను తగ్గిస్తుందని... బరువు తగ్గడం, మలబద్ధకం, రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆ పేస్ట్‌.. వరస్ట్‌..
కల్తీ లేకుండా దొరకాలంటే భూతద్దం పెట్టి వెతకాలేమో అనేలా మారిపోయిన సరుకుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఒకటి. మార్కెట్లో లభించే అత్యధిక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కల్తీదే. నాసిరకం అల్లం, వెల్లుల్లిలను వాడటమేకాదు.. ఉల్లి, దుంపలు, ఇతర పదార్థాలను కూడా కలుపుతున్నారు. ఈ మిశ్రమం డయేరియా, ఉదరకోశ వ్యాధులకు కారణమవుతోంది. అలాగే వీటిలో కలిపే సింథటిక్‌ పౌడర్,గమ్‌ పౌడర్లు కూడా ప్రమాదకరం.

⇒ఇటీవల ఉప్పర్‌పల్లిలో ఓ గోడౌన్‌ మీద దాడి చేసిన పోలీసులు.. ఏకంగా 4 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఖమ్మంలోని ప్రకాశ్‌నగర్‌లో 5 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను, యాదాద్రి జిల్లా బీబీనగర్‌ పరిధిలోనూ కల్తీ అల్లం పేస్ట్‌ను పోలీసులు పట్టుకున్నారు. పేస్ట్‌ చిక్కగా ఉండేందుకు వీరు సింథటిక్‌ పౌడర్, గమ్‌ పౌడర్‌ వంటి ప్రమాదకర పదార్థాలను కలిపినట్టు గుర్తించారు.

⇒  ఈ ఏడాది మే నెలలో కాటేదాన్‌లోని ఓ పరిశ్రమపై సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి.. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితోపాటు ప్రమాదకర రసాయనాలు కలిపిన అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను పట్టుకున్నారు.

⇒ పహాడీ షరీఫ్‌లో చెక్కపొడి,ఎండుటాకులు, కృత్రిమ రంగులను కలిపి కల్తీ గరం మసాలా తయారీ చేస్తూ, ప్రముఖ కంపెనీల లేబుళ్లతో విక్రయిస్తున్నవారిని అరెస్ట్‌ చేశారు.  

⇒ నకిలీ మసాలా ఉత్పత్తులను విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్‌ వాసిని నగరంలోని బేగంబజార్‌లో నిర్వహించిన దాడుల్లో పట్టుకున్నారు.

ఆయిల్‌.. అనారోగ్యం ఫుల్‌
అత్యధికంగా కల్తీ అవుతున్న సరుకుల్లో వంట నూనెలు కూడా ఒకటి. సన్‌ఫ్లవర్, పామాయిల్‌ వంటి ఎక్కువగా వాడే నూనెలను.. జంతు కళేబరాల నుంచి తీసిన కొవ్వులతో కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ఈ కల్తీ నూనెల వల్ల కంటి జబ్బులు, గుండె జబ్బులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
⇒ నగరంలో విషపూరిత రసాయనాలతో కల్తీ చేసిన మసాలాలు భారీగా పట్టుబడ్డాయి. బొప్పాయి గింజలకు సింథటిక్‌ గమ్, ఐరన్‌ ఆక్సైడ్, మైదా పిండి, కొన్ని రసాయనాలు కలిపి మిరియాలుగా విక్రయిస్తున్నారు.

ఆరోగ్యానికి అప‘కారం’
జనం ఒకప్పుడు ఎండు మిరపకాయలను కొని పొడి చేసుకునేవారు. కానీ ఇప్పుడు మార్కెట్లో నేరుగా కారంపొడి కొనుగోలు చేస్తున్నారు. ఈ కారంపొడి విపరీతంగా కల్తీ అవుతోంది. ఇటుక పొడి, పాడైన మిరియాలు, సున్నపు పొడి వంటి పదార్థాలను కలుపుతున్నారు. కారంపొడి ఎర్రగా కనిపించేందుకు ‘సుడాన్‌ డై’ అనే రసాయనాన్ని కలుపుతున్నారు. ఇది కేన్సర్‌ కారకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. కారంపొడిలో కలిసే కల్తీలతో డయేరియా, ఇతర అనారోగ్య సమస్యలూ వస్తాయని చెప్తున్నారు.

కల్తీని తెలుసుకోవడం ఎలా..  
నకిలీ, కల్తీ సరుకుల విషయంలో మోసపోకుండా, వాటిని గుర్తించేందుకు ఏం చేయాలన్న దానిపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తరచూ పలు సూచనలు చేస్తూ ఉంటుంది. వాటిని పాటిస్తే కల్తీల నుంచి మనం బయటపడవచ్చని నిపుణులు చెప్తున్నారు. వీలైనంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాల వంటివి ఇంట్లోనే తయారు చేసుకుంటే మేలు అని స్పష్టం చేస్తున్నారు.

ఉదాహరణకు కారంపొడిని తీసుకుంటే.. 
‘ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని, అందులో ఒక చెంచాడు కారంపొడి వేయాలి. నీళ్లన్నీ రంగు కలిపినట్టుగా ఎర్రగా అయితే అది కల్తీయే. గ్లాసులో అడుగుకు చేరిన కారం పొడిని చేతిలోకి తీసుకుని రుద్ది చూడాలి. గరుకుగా అనిపిస్తే ఇటుక పొడి కలిసి ఉందని అర్థం. కారంపొడి నీళ్లు సబ్బులా మృదువుగా అనిపిస్తే.. అందులో డిటర్జెంట్, యూరియా వంటివి కలిసి ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు.

కల్తీల నిరోధానికి చట్టం ఉన్నా.. 
ఆహార పదార్థాల కల్తీని నిరోధించేందుకు, కల్తీకి పాల్పడినవారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టం ఉంది.కల్తీలు, నకిలీలకు పాల్పడినవారికి గరిష్టంగా ఆరు నెలల జైలుశిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. కానీ అది సరిగా అమలుకాని పరిస్థితి. దాడుల్లో కల్తీ, నకిలీ ఉత్పత్తులను పట్టుకుంటున్న అధికారులు.. గట్టి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement