ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్‌పై నిరంతర నిఘా ఉంచాలి
రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 2 వందల శాంపిల్స్ సేకరించి పరీక్షించాలి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాణ్యత, ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా నిర్వహించే ఫుడ్ యూనిట్లను ఏమాత్రం సంకోచం లేకుండా సీజ్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ తప్పకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్–2006కు లోబడి నిర్వహించాలన్నారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి రాజనర్సింహ ఫుడ్ సేఫ్టీ అంశంపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలను విక్రయించి ఇతర రాష్ట్రాలతో తెలంగాణ ఆదర్శంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తూనే ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా రోజుకు 180 నుంచి 200 ఫుడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలని, ఏమాత్రం లోపాలు గుర్తించినా వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేటు బోర్డింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్, బేకరీలు, డెయిరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు, హోటళ్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ యూనిట్లు తప్పనిసరిగా రిజి్రస్టేషన్ చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై మంత్రి దామోదర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రతి శనివారం మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా చేపట్టిన పరీక్షల వివరాల నివేదికను తనకు అందించాలన్నారు. ఫుడ్ సేఫ్టీపై ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్‌తో అవగాహన సదస్సులను నిర్వహించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల, స్టేట్ ఫుడ్ ల్యాబ్స్ హెడ్ లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment