
విజ్ఞత మరిచినచోట విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేమీ లేదు. కావడ్ యాత్ర సందర్భంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మొన్న జూలైలో ఇచ్చిన తీర్పు అర్థం కాకనో లేక దాన్ని ధిక్కరించే ఉద్దేశమో... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఆహారంలో లేదా పానీయాల్లో ఉమ్మివేయటం లేదా మానవ వ్యర్థాలతో దాన్ని కలుషితపరచటం పదేళ్ల శిక్షకు అర్హమయ్యే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించటం, విక్రయదారుల పూర్తి వివరాలు అందరికీ కనబడేలా చేయటం ఈ ఆర్డినెన్సుల ఉద్దేశం.
ఇప్పుడున్న చట్టం ప్రకారం కల్తీ కారణంగా మరణం సంభవిస్తే బాధ్యులైనవారికి మూడేళ్ల కఠిన శిక్ష విధించవచ్చు. తినే ఆహారపదార్థం రుచిగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరు కుంటారు. అలాంటి ఆహారం దొరికేచోటకే వెళ్తారు. హోటళ్లు మొదలుకొని సైకిళ్లపై తిరుగుతూ అమ్ముకునే విక్రయదారుల వరకూ అందరూ కమ్మనైన ఆహారపదార్థాలు వడ్డించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.
ఒకవేళ ఎవరైనా లాభార్జనకు కక్కుర్తిపడి నాసిరకం పదార్థాలను అంటగడితే అలాంటివారి పనిబట్టడానికి రకరకాల చట్టాలున్నాయి. ఆహారకల్తీని అరికట్ట డానికీ, హానికరమైన, కాలంచెల్లిన పదార్థాల విక్రయాన్ని నిరోధించటానికీ హోటళ్లపై, ఇతర దుకాణాలపై విజిలెన్సు విభాగాలు దాడులు నిర్వహిస్తుంటాయి. కేసులు పెడతాయి.
అయితే ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగటం లేదని, ప్రభుత్వాలు మొక్కుబడిగా ఈ పనిచేస్తుంటాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆహారం తిని అస్వస్థతకు గురయి పదుల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలైనప్పుడు ఆదరాబాదరాగా చర్యలు తీసుకోవటం కూడా కనబడుతుంటుంది.
హఠాత్తుగా యూపీ సర్కారు ఈ చర్య తీసుకోవటం వెనక ఇలాంటి ఘటన ప్రభావం ఏమైనా ఉందా? పోనీ ఈ మాదిరి ఉదంతాల కారణంగా జనం తరచూ అస్వస్థులవుతున్న లేదా మరణిస్తున్న ఉదంతాలేమైనా గమనించారా? అసలు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకొచ్చాక ఎన్ని హోటళ్లపై, తినుబండారాల విక్రయ సంస్థలపై దాడులు నిర్వహించారు? అక్రమాలకు పాల్పడ్డారని తేలిన ఎంతమందిని శిక్షించారు? ఈ క్రమంలో ప్రస్తుత చట్టాలు నిరుపయోగంగా ఉన్నాయని భావిస్తే తగిన డేటాతో ఆ వివరాలు ప్రజల ముందు ఉంచొచ్చు.
అప్పుడు ఒక సమగ్రమైన చట్టం అవసరమేనని అందరూ భావిస్తారు. కానీ యూపీలో జరుగుతున్నది అది కాదు. ఫలానా వర్గంవారు విక్రయించే పండ్లు లేదా ఇతర ఆహారపదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయని, వాటిని కలుషితం చేసి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. వాటి ఆధారంగా ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్టు కనబడుతోంది.
దుశ్చర్యలకు పాల్పడేవారికి మతం, కులం ఉండవు. ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను వీడియో తీసి ఫలానా మతం వారంతా ఇలాగే చేస్తున్నారని వదంతులు వ్యాప్తిచేయటం విద్వేషాలు రెచ్చగొట్టడానికే తోడ్పడతాయి. ఇదే యూపీలోని ఘాజియాబాద్‌లో ఒక వ్యాపారి ఇంట్లో ఎనిమి దేళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న రీనా కుమార్ అనే యువతి రోటీల్లో మూత్రాన్ని కలుపుతోందని ఆరోపిస్తూ పోలీసులు బుధవారం ఆరెస్టు చేశారని మీడియా కథనాలు వెల్లడించాయి.
ఆ మధ్య తెలంగాణలో అధికారులు వరస దాడులు నిర్వహించినప్పుడు అనేక హోటళ్లు, తినుబండారాల దుకాణాలు పాచిపోయిన పదార్థాలను అమ్ముతున్నాయని తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిలో అన్ని మతాలకూ చెందినవారూ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరిగే కావడ్ యాత్ర సమయంలో ఆ మార్గంలోని దుకాణాల్లో విక్రయదారులు తమ పేర్లు, ఇతర వివరాలు కనబడే బోర్డులు ప్రదర్శించాలని పోలీసులు మొన్న జూలైలో నోటీసులిచ్చారు.
కావడ్ యాత్రికులు ‘స్వచ్ఛమైన శాకాహారులు’ గనుక అపశ్రుతులు చోటుచేసుకోకుండా ఈ పని చేశామని సంజాయిషీ ఇచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దుకాణంలో నచ్చిన, నాణ్యమైన, రుచికరమైన ఆహారం దొరుకుతున్నదో లేదో వినియోగదారులు చూస్తారు తప్ప, వాటి విక్రయదారు ఎవరన్నది పట్టించుకోరు. అలా పట్టించుకోవాలని యూపీ ప్రభుత్వం తహతహలాడుతున్నదని తాజా నిర్వాకం గమనిస్తే అర్థమవుతుంది.
వినియోగదారుల విశ్వాసాన్ని పరిరక్షించటమే ఆర్డినెన్సుల ఉద్దేశమన్న ప్రభుత్వ వాదన నమ్మదగ్గదిగా లేదు. ఆ పని విక్రయదారులది! వారిలో అక్రమార్కులుంటే చర్య తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. చెదురుమదురుగా జరిగిన ఉదంతాలను భూతద్దంలో చూపి జనాన్ని కలవరపెట్టడం సబబు కాదు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనకున్న స్ఫూర్తి అర్థం చేసుకుంటే యూపీ ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్సుల ఆలోచన చేసేది కాదు. యూపీలో గోసంరక్షణ, లవ్ జీహాద్ తదితర ఆరోపణలతో గుంపు దాడులు, గృహదహనాలు, హత్యోదంతాల వంటివి జరిగాయి. నిందితుల ఇళ్లూ, దుకాణాలూ బుల్‌డోజర్లతో నేలమట్టం చేయటం కూడా రివాజుగా మారింది. ఎన్‌కౌంటర్లు సరేసరి. ఆర్డినెన్సుల ప్రతిపాదన ఆ క్రమంలో మరో చర్య కావొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉపాధి కరువైందని యువత... ధరలు ఆకాశాన్నంటాయని సామాన్యులు మొత్తుకుంటున్నారు. విద్య, వైద్య రంగాలు పడకేశాయని గగ్గోలు పెడుతున్నారు. వీటిపై సమర్థవంతంగా వ్యవహరించి ప్రజల విశ్వా సాన్ని పొందాల్సివుండగా, ప్రజల్లో పరస్పర అవిశ్వాసాన్ని కలిగించే ఇలాంటి పనులకు పూను కోవటం ఏం న్యాయం? అసలు నేరానికి తగ్గ శిక్ష ఉండాలన్న ఇంగితం కరువైతే ఎలా? ఆర్డినెన్సుల ప్రతిపాదనపై యూపీ సర్కారు పునరాలోచన చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment