రేషన్ సరఫరాకు సరిపడా సన్నరకాల ధాన్యం సేకరణపై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి
గుర్తించిన 33 రకాలతోపాటు నిర్ణీత పరిమాణంలో ఉన్న ధాన్యానికి రూ.500 బోనస్
గ్రెయిన్ కాలిపర్ పరికరం ద్వారా సన్నాల గుర్తింపు
ఖరీఫ్ సీజన్‌లో కొనుగోలు కేంద్రాలకు మొత్తంగా 91 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
మరో వారంలో కొనుగోళ్లు షురూ.. రాష్ట్రవ్యాప్తంగా 7,185 కేంద్రాలు
ఇందులో సన్నరకాల సేకరణ కోసం ప్రత్యేక కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. దసరా పండుగ తర్వాత వరి కోతలు మొదల య్యే అవకాశమున్న నేపథ్యంలో.. జిల్లాల్లోని పౌర సరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదనపు కలెక్టర్ల నేతృత్వంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు వరకు సాగనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) 7,185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వ్యవసాయ శాఖ వివరాల ఆధారంగా..
రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 60.8 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. మొత్తంగా 146.70 లక్షల మెట్రిక్ టన్నులు (ఎంఎల్‌టీ) దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 91 లక్షల టన్నుల మేర కొనుగోలు కేంద్రాలకు వస్తుందని.. అందులో 50 లక్షల టన్నుల మేర సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ నుంచి ఆయా వివరాలు తీసుకొని జిల్లాల వారీగా సన్నాల కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. మొత్తంగా 7,185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. ఇందులో సగానికిపైగా సన్న ధాన్యం సేకరణ మాత్రమే చేస్తాయని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
వ్యవసాయ శాఖ లెక్కల ఆధారంగా జిల్లా కలెక్టర్లే సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఐకేపీ, పీఏసీఎస్‌తోపాటు ఇతర సహకార సంఘాల నేతృత్వంలో కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు.
ఎంపిక చేసిన రకాలు, కొలతలతో.. ‘బోనస్’
రాష్ట్రంలో పండించే ధాన్యానికి కనీస మద్ధతు ధర గ్రేడ్–ఏ రకాలకు రూ.2,320 సాధారణ రకాలకు రూ.2,300గా నిర్ణయించారు. సన్నరకాలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆయా రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2,800 చొప్పున చెల్లించనున్నారు.
వ్యవసాయ శాఖ ఇప్పటికే 33 రకాలను సన్నాలుగా గుర్తించింది. బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్– 15048, హెచ్‌ఎంటీ, సో నా, జైశ్రీరాం తదితర రకాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇవేకాకుండా.. బియ్యం గింజ పొడ వు 6 మిల్లీమీటర్లు, వెడల్పు 2 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉన్న ఇతర రకాలను కూడా సన్నాలుగా గుర్తిస్తారు.
బియ్యం గింజ పరిమాణాన్ని గుర్తించడానికి ‘గ్రెయిన్ కాలిపర్’యంత్రాలను వినియోగిస్తా రు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల కోసం అవసరమైన గ్రెయిన్ కాలిపర్లను కొనుగోలు చేసినట్లు ప్రొ క్యూర్‌మెంట్ విభాగం అధికారి ఒకరు తెలిపారు.
పెరిగిన సన్నాల సాగు..
సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. చాలా జిల్లాల్లో సన్నాల సాగు పెరిగింది. వ్యవసాయ శాఖ నిర్దేశించిన 33 రకాల్లో మేలిమి రకమైన హెచ్‌ఎంటీ, జైశ్రీరాం వంటివాటితోపాటు ఎక్కువ దిగుబడి ఇచ్చే బీపీటీ లోని పలు వెరైటీలను రైతులు భారీ ఎత్తున సాగు చేశారు.
ఆసిఫాబాద్ జిల్లాలో వరి వేసిన 45 వేల ఎకరాల్లో పూర్తిస్థాయిలో సన్నాల సాగే జరగగా.. పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, మహబూ బాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ సన్నాల సాగు ఎక్కువగా జరిగింది. జనవరి నుంచే రేషన్ దుకాణాలకు ఇవ్వాలని భావిస్తున్న సన్న బియ్యానికి అవసరమైన ధాన్యం సమకూరుతుందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment