బాసుమతి బియ్యం సువాసనకు పెట్టింది పేరు. అదేవిధంగా మరికొన్ని రకాల దేశీ వరి వంగడాలు కూడా సువాసనను వెదజల్లుతుంటాయి. అయితే, సువాసనను వెదజల్లే జొన్న వంగడం కూడా ఒకటి ఉంది! హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) కృషితో ఇది వెలుగులోకి వచ్చింది. ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ ఎం. ఇలంగోవన్ సంప్రదాయ జొన్న వంగడాలపై వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్న క్రమంలో మధ్యప్రదేశ్‌లో ‘బాసుమతి జొన్న’ గురించి తెలిసింది. ఛత్తర్‌పూర్ జిల్లా బిజావర్ సమీపంలోని కర్రి, సర్వ గ్రామాల ప్రజలు సువాసన కలిగిన జొన్న గురించి చెప్పారని డాక్టర్ ఎం. ఇలంగోవన్ తెలిపారు. దీన్ని ‘బాసుమతి జొన్న’ అని వారు పిలుస్తూ ఉన్నారు.
అయితే, అప్పటికే ఇది దాదాపు అంతరించిపోయింది. అతికష్టం మీద నాలుగైదు కంకులు దొరికాయి. ఆ తర్వాత కాలంలో అదే జిల్లాలోని కటియ, కెర్వన్ గ్రామాల్లో కూడా ఈ జొన్న కనిపించింది. ఎస్.బి.బి.ఎ.డి.హెచ్.2 అనే జన్యువు సువాసనకు కారణమని పరిశోధనలో తేలిందని డాక్టర్ ఇలంగోవన్ తెలిపారు. సువాసన కలిగి ఉండే తిండి గింజలకు దేశ విదేశీ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంటుందన్నారు. ఆ గ్రామాలలో కొందరు రైతులకు ఇచ్చి సాగు చేయించదలిచామని డా. ఇలంగోవన్ (elangovan @millets.res.in) ‘సాక్షి’కి చెప్పారు. ఈ వంగడం బాగా వ్యాప్తిలోకి వస్తే ఆయా గ్రామాలకు ఆదాయం కూడా సమకూరుతుంది. అంతరించిపోతున్న అరుదైన జొన్న వంగడాన్ని తిరిగి సాగులోకి తెస్తున్న ఐఐఎంఆర్‌కు జేజేలు!
డా. ఇలంగోవన్
Comments
Please login to add a commentAdd a comment