అండుకొర్ర.. చిన్న చిరుధాన్యా(స్మాల్ మిల్లెట్స్)ల్లో విశిష్టమైన పంట. పంట కాలం 90–100 రోజులు. ధాన్యపు పంట ఏదైనా కోత కోసి, దుక్కి చేసిన తర్వాత మళ్లీ పంట రావాలంటే తిరిగి విత్తనాలు ఎదపెట్టాల్సిందేనని మనకు తెలుసు. అయితే, అండుకొర్ర పంటను రెండేళ్లుగా సాగు చేస్తున్న కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కె. హేమాద్రిరెడ్డి అనుభవం అందుకు భిన్నంగా ఉంది.
2022 జూౖలై లో తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తనం వేసి, అక్టోబర్‌లో పంట కోసుకున్నారు. నవంబర్‌లో దుక్కిచేసి మినుము చల్లి, నీటి తడి పెట్టారు. అండుకొర్ర వత్తుగా మొలవటంతో ఆశ్చర్యం కలిగింది. అండుకొర్ర కోత కోసే సమయంలో రాలిన ధాన్యమే నెల రోజుల తర్వాత దుక్కి చేసి తడి పెట్టగానే మొలిచిందన్నమాట. మినుము మొలకలు కనిపించినా అవి ఎదగలేకపోయాయి. అండుకొర్ర ఏపుగాపెరిగింది. సరే.. ఇదే పంట ఉండనిద్దామని నిర్ణయించుకొని.. ట్రాక్టర్‌తో సాళ్లు తీసి అండుకొర్ర పంటనే కొనసాగించారు.
అదే విధంగా మూడు పంటలు పూర్తయ్యాయి. నాలుగో పంట ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉందని, ప్రతి పంటలోనూ ఎకరానికి 10 క్వింటాళ్ల అండుకొర్ర దిగుబడి వస్తోందని, పంట పంటకు దిగుబడి ఏమాత్రం తగ్గలేదని, తక్కువ ఖర్చుతోనే అండుకొర్ర పంట అధికాదాయాన్ని అందిస్తోందని రైతు హేమాద్రి రెడ్డి సంతోషంగా చెప్పారు. అనంతపురంలో ఇటీవల జరిగిన మూడు రోజుల చిరుధాన్యాల సమ్మేళనం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ‘సాక్షి సాగుబడి’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. కదిరికి చెందిన ఎర్త్ 360 సంస్థ వ్యవస్థాపకులు దినేశ్ సూచనలు, సహాలతో చిరుధాన్యాల సాగు చేపట్టానని ఆయన తెలిపారు.
కలుపు బాధ లేని అండుకొర్ర పంట
40 ఎకరాల ఆసామి అయిన హేమాద్రిరెడ్డి సాగు భూమిని చాలా కాలంగా కౌలుకు ఇస్తూ వచ్చారు. రెండేళ్ల క్రితం మనుమడి సూచన మేరకు 5 ఎకరాల్లో అండుకొర్ర చిరుధాన్యాల సాగు ్ర΄ారంభించారు. కూలీల కొరతతో ఇబ్బంది అవుతుందని తొలుత సంశయించానని, అయితే అండుకొర్ర పంటకు కలుపు సమస్య లేక΄ోవటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నానని ఆయన అన్నారు. పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేని చక్కని పంట అండుకొర్ర అన్నారాయన. కలుపు మొక్కల కన్నా అండుకొర్ర మొక్కలు వేగంగా పెరుగుతుంది. అందువల్ల కలుపు పెరిగే అవకాశమే లేదన్నారు. దీంతో ప్రయాస లేకుండానే పంట చేతికి వస్తోందని, యంత్రంతో కోతలు జరుపుతున్నారు. ఇప్పుడు మొత్తం 20 ఎకరాలకు అండుకొర్ర సాగును విస్తరించారు.
మోళ్లు కలియదున్నుతాం..
దుక్కి చేసిన తర్వాత గొర్రెలను పొలంలో నిల్వగడతారు. గొర్రెల మలమూత్రాలు పొలాన్ని సారవంతం చేస్తాయి. ఆ తర్వాత కలియదున్నిన తర్వాత వరుసల మధ్య 15 అంగుళాలు ఉండే ట్రాక్టర్ గొర్రుతో ఎకరానికి 5 కిలోల అండుకొర్ర విత్తనాలను తొలి ఏడాది విత్తారు. రెండో పంట నుంచి.. పంట కోత తర్వాత మోళ్లను రొటవేటర్‌తో భూమిలో కలియదున్నుతున్నారు. పంట కాలంలో మూడు దఫాలు హంద్రీ నది నుంచి మోటారుతో తోడిన నీటిని పారగడుతున్నారు. నల్లరేగడి నేల కావటంతో ఎక్కువగా తడి ఇవ్వటం లేదని, ఇది మెట్ట పంట కాబట్టి నీరు ఎక్కువ పెడితే రొట్ట పెరుగుతుంది తప్ప దిగుబడి రాదని హేమాద్రి రెడ్డి వివరించారు. గొర్రెలు ఆపటానికి ఎకరానికి రూ. 1,500 ఖర్చవుతోంది. దుక్కి, అంతర సేద్యం అంతా సొంత ట్రాక్టర్‌తోనే చేస్తున్నారు. బయటి ట్రాక్టర్‌తో ఈ పనులు చేస్తే ఎకరానికి పంటకు రూ. 3 వేలు ఖర్చు వస్తుంది.
‘అంతకు మించి చేసేదేమీ లేదు. చీడపీడలు, తెగుళ్ల సమస్య లేదు కాబట్టి పురుగుమందుల పిచికారీ అవసరం రావటం లేద’న్నారాయన. కలుపు, చీడపీడల సమస్యలు లేని, కూలీల అవసరం పెద్దగా లేని అండుకొర్ర పంటను సునాయాసంగా సాగు చేస్తూ.. క్వింటాకు రూ. 9,500 ఆదాయం పొందుతున్నానని హేమాద్రిరెడ్డి తెలిపారు. మిషన్‌తో పంట కోత ఖర్చు, గడ్డి అమ్మితే సరిపోతోందన్నారు. కొర్ర కూడా సాగు చేస్తున్నానని, వచ్చే సీజన్ నుంచి అరికలు కూడా వేద్దామనుకుంటున్నానన్నారు.
అండుకొర్ర అద్భుత పంట
అద్భుతమైన చిరుధాన్య పంట అండుకొర్ర.. కలుపును ఎదగనివ్వదు. ఈ విత్తనానికి నిద్రావస్థ పెద్దగా ఉండదు. గింజ బాగా తయారైన తర్వాత కోత కోసి నూర్పిడి చేస్తే, వారం రోజుల తర్వాత మొలుస్తుంది. ఒక్కసారి విత్తి వరుసగా నాలుగో పంట తీసుకుంటున్న హేమాద్రిరెడ్డి సాగు అనుభవం రైతులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. పంట కోసిన తర్వాత మోళ్లను భూమిలోకి కలియదున్నటం, గొర్రెలను నిలపటం వల్ల భూమి సారవంతమవుతోంది. మార్కెట్‌లో అండుకొర్రలు సహా అన్ని చిరుధాన్యాలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ధర తగ్గే ప్రమాదం లేదు.
దినేశ్ (94408 70875), చిరుధాన్యాల నిపుణుడు, ఎర్త్ 360, కదిరి
క్వింటా రూ.9,500
రెండేళ్ల క్రితం తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పంటా ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. తొలి పంట క్వింటా రూ. 5 వేలకు అమ్మాను. రెండో పంటను క్వింటా రూ.7,500కు అమ్మాను. గత ఏడాది ఖరీఫ్‌లో మరో 15 ఎకరాల్లో కూడా అండుకొర్ర వేశా. మూడో పంటను క్వింటా రూ. 9,500కు అమ్మాను. నాలుగో పంట కొద్ది రోజుల్లో కోతకు సిద్ధమవుతోంది. రైతులకు విత్తనంగా కూడా ఇస్తున్నాను. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చులు పోగా మంచి నికరాదాయం వస్తోంది. 3 సార్లు నీరు కడుతున్నాం. నీరు ఎక్కువైతే దిగుబడి తగ్గిపోతుంది. ఒక పొలంలో జనుము సాగు చేసి రొటవేటర్ వేస్తే ఆ తర్వాత అండుకొర్ర దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు వచ్చింది. ప్రయాస లేని పంట అండుకొర్ర.
– కె. హేమాద్రిరెడ్డి (92469 22110), అండుకొర్ర రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment