సంప్రదాయ పంటలకు స్వస్తి | goodbye to traditional crops | Sakshi
Sakshi News home page

సంప్రదాయ పంటలకు స్వస్తి

Published Sat, Jan 25 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

goodbye to traditional crops

 వ్యవసాయంలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. ఆహార పంటలైన జొన్న, పెసర్లు, గోధుమ సాగుకు స్వస్తి చెబుతున్న రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో.. అధిక దిగుబడి.. అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఆ దిశగా ముందుకు ‘సాగు’తున్నారు. ముఖ్యంగా భూములన్నింటినీ పత్తి, సోయూబీన్ పంటలు ఆక్రమించారుు. ఫలితంగా అన్నదాతలకే ప్రస్తుతం ఇళ్లలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోంది.
 

 ప్రస్తుత పరిస్థితిలో సంప్రదాయ పంటలు ప్రభను కోల్పోగా కొత్త పంటలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి, లాభాలిచ్చే పంటల వైపే అన్నదాతలు మొగ్గుచూపుతుండడంతో సంప్రదాయ పంటలకు కాలం చెల్లుతోంది. అధిక దిగుబడి, లాభాలు ఇచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలు జరగకపోవడంతో పాత పంటల సాగు ఏడాదికేడాది తగ్గిపోతుండగా.. కొత్త పంటల సాగు విస్తీర్ణం అమాంతం పెరుగుతూ వస్తోంది.

 ఒకప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేసిన పంటలు ఇప్పుడు చిన్నబోయాయి. రబీ సీజన్‌లో ఐదేళ్ల క్రితం వరకు జిల్లాలో వరి, జొన్న, పెసర్లు, గొధుమ. మినుములు, ఇతర పప్పు ధాన్యాల సాగు భారీగా ఉండేది. రానురాను తగ్గిపోయూరుు. 2008-09లో లక్షా 12 వేల 23 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైన ఆహార పంటలు.. 2013-14కు వచ్చేసరికి రబీలో 61 వేల 801 హెక్టార్లకు పడిపోరుుంది. రబీలో జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 2008-9లో 18,433 హెక్టార్లు కాగా.. ఈ ఏడాది రబీలో 10 వేల 100 హెక్టార్లకు చేరింది. ఇక చిన్నపంటలైన పొద్దుతిరుగుడు, మిరప, నువ్వులు, వేరుశెనగ, ఉల్వలు, ఉల్లి పంటలు సైతం అంతరించిపోయే దశలో ఉన్నాయి.

 నేటి మొక్కజొన్న, పత్తి.. రేపటి సోయాదే..
 ఒకప్పుడు జిల్లాలో నామమాత్రంగా సాగైన పత్తి, సోయాబీన్, వరి పంటలపై రైతుల్లో మోజు పెరిగింది. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి, రాబడి ఇస్తుండడంతో రైతులు మూకుమ్మడిగా ఈ పంటల సాగుకే కట్టుబడిపోయారు. బీటీ విత్తనాల రాకతో పత్తి సాగు అమాంతం పెరిగింది. ఖరీఫ్, రబీలో 2008-09లో 2,82,860 హెక్టార్లలో సాగైన పత్తి ఖరీఫ్ 2013 నాటికి 3 లక్షల 10 వేల హెక్టార్లకు పెరిగడమే ఇందుకు నిదర్శనం.

సోయాబీన్ 95,895 హెక్టార్లకు గాను లక్ష 13 వేల హెక్టార్లకు చేరింది. జొన్న పంట స్థానాన్ని సోయాబీన్ ఆక్రమించగా.. పప్పు దినుసులు, నూనె గింజల స్థానంలో పత్తి పంట చొచ్చుకొచ్చింది. రెండేళ్లుగా జిల్లాలో సోయా చిక్కుడు సాగు పెరుగుతుండడంతో.. భవిష్యత్తులో భారీ స్థాయిలో ఈ పంటను సాగుచేసే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పప్పుదినుసుల్లో కంది మాత్రమే ఆదరణకు నోచుకుంటోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement