Black gram
-
ఏపీలో 15 నుంచి పప్పుధాన్యాల సేకరణ
సాక్షి, అమరావతి: ఈ నెల 15 నుంచి రైతుల వద్ద పప్పుధాన్యాలను ప్రభుత్వం సేకరించనుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు ధరల స్థిరీకరణ నిధితో పంటలను కొనుగోలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పప్పుధాన్యాల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని 31 కొనుగోలు కేంద్రాల్లో అపరాల కొనుగోలుకు మార్క్‌ఫెడ్ చర్యలు తీసుకుంది. వైఎస్ జగన్ సీఎం బాధ్యతలు స్వీకరించాక తొలుత శనగల కొనుగోలుకు రూ.333 కోట్లు విడుదల చేశారు. రెండో విడతగా కేంద్ర నిధులు వచ్చే వరకు వేచి చూడకుండా ధరల స్థిరీకరణ నిధితో అపరాలను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కొనుగోలులో నిజమైన రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ–క్రాపింగ్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని, రైతులు ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోకపోతే ఈ నెల 15 లోపు వారి పేర్లను కూడా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. వ్యాపారుల పట్ల రైతు సంఘాల ఆందోళన శనగల కొనుగోలు సమయంలో కొందరు రైతులు ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోకపోవడంతో కొంత నష్టపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ–క్రాపింగ్‌పై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోని రైతులు గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ కార్యదర్శిని కలిసి నమోదు చేసుకోవాలని సూచించింది. ఆ వివరాలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రైతులు అపరాలను అమ్ముకోవచ్చని తెలిపింది. గతేడాది రైతులు అమ్ముకున్న అపరాలను వ్యాపారులు రైతుల పేరున నిల్వ చేసుకున్నారు. వారంతా కొనుగోలు కేంద్రాలకు ఆ పంటను తీసుకొచ్చి రైతుకు లభించాల్సిన మద్దతు ధరను తన్నుకుపోయే ప్రమాదముందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం క్వింటా పెసలకు రూ.7,050, మినుములకు రూ.5,700లను కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)గా ప్రకటించింది. అయితే.. మార్కెట్లో పెసలకు రూ.5,500, మినుములకు రూ.4,700లకు మించి ధర లభించడం లేదు. దీంతో రైతులకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. రెండో దశలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. గుంటూరు జిల్లా తెనాలి, పొన్నూరు, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, జెడ్ రంగంపేట, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, మైలవరం, పరిటాల, కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, పోలవరం, కన్నాయిగుట్ట, కృష్ణారావుపేటల్లో మినుముల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పెసల కొనుగోలు కేంద్రాలను తూర్పుగోదావరి జిల్లా రంగంపేట, జెడ్ రంగంపేట, కృష్ణా జిల్లా నందిగామ, పరిటాల, అల్లూరు, చౌటపల్లి, పొన్నవరం, మైలవరం, కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, పోలవరం, కన్నాయిగుట్ట, కృష్ణారావుపేటల్లో ఏర్పాటు చేస్తారు. పెసలు, మినుములు 20 వేల టన్నులు, కందులు 40 వేల టన్నులు రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. -
గాయాలను త్వరగా నయం చేసే మినుములు!
మినుముల్లో ప్రోటీన్లు ఎక్కువ. అవి కండరాల రిపేర్లకు ఉపయోగపడతాయి. అందుకే గాయాలైనవారిలో అవి త్వరగా తగ్గడానికి మినుములు మంచి ఆహారం. అంతేగాక మినుములు రోగనిరోధకశక్తిని పెంచి, అనేక వ్యాధులను నివారించడంతో పాటు ఒంటికి బలాన్నీ సమకూరుస్తాయి. మినుములతో కలిగే ప్రయోజనాల్లో కొన్ని... ♦ మినుముల్లో 72 శాతం పీచు ఉంటుంది. అందుకే అవి మలబద్దకాన్ని నివారిస్తాయి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను తొలగిస్తాయి. డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు మందులకు బదులు మినుముతో చేసిన వంటకాలు తింటే ఆ సమస్య దూరమవుతుందని ఆహార నిపుణుల సిఫార్సు. ♦ మినుముల్లోని పీచు ఆహారంలోని చక్కెరను మెల్లగా విడుదలయ్యేలా చూస్తుంది. అందుకే డయాబెటిస్ సమస ఉన్నవారికి మినుములు మంచి ఆహారం. ♦ మినుములు కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తాయి. -
భూమికి బలం.. పోషకాల యాజమాన్యం
జొన్న పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలయదున్నాలి. రబీలో సాగు చేసే జొన్నకు ఎకరానికి 32-40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి. నత్రజని ఎరువును రెండు సమభాగాలుగా అంటే విత్తేటప్పుడు , మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి. సిఫారసు చేసిన భాస్వరపు , పొటాష్ పూర్తి మోతాదును విత్తే సమయంలో వేయాలి. మొక్కజొన్న నీటి పారుదల కింద సాగు చేసి మొక్కజొన్నకు ఎకరానికి 80-100 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి. నత్రజనిని 4 సమ దఫాలుగా విభజించి వేయాలి. మొదటి దఫాను విత్తేటప్పుడు, రెండవ దఫాను విత్తిన 25-30 రోజులకు, మూడవ దఫాను 45-50 రోజులకు, నాలుగవ దఫాను 60-65 రోజుల మధ్య వేయాలి. సిఫారసు చేసిన భాస్వరపు పూర్తి మోతాదును విత్తే సమయంలోనే వేయాలి. సిఫారసు చేసిన పొటాష్ ఎరువును రెండు దఫాలుగా వేసుకోవాలి. సగభాగం విత్తే సమయంలోను, మిగిలిన సగభాగాన్ని విత్తిన నెలరోజులకు వేయాలి. భూమిలో జింక్ లోపముంటే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేటును మూడు పంటలకు ఒకసారి వేయాలి. అదే జింకు లోప లక్షణాలు పంటపై కనిపించినట్లయితే 0.2 శాతం జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని(లీటరు నీటికి 2 గ్రా జింక్ సల్ఫేట్ ) వారానికి ఒకసారి చొప్పున 2,3 సార్లు పంటపై పిచికారి చేయాలి. శనగ శనగ సాగులో ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం , 16 కిలోల గంథకాన్ని ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. పెసర పెసర సాగులో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు వేసి దుక్కిలో బాగా కలియదున్నాలి. తర్వాత విత్తనం వేసే ముందు దుక్కిలో ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. వరి మాగాణుల్లో పెసర సాగు చేసేటప్పుడు ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. మినుము మినుము సాగులో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. విత్తటానికి ముందు ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు వేసి గొల్లతో కలియదున్నాలి. వరి మాగాణుల్లో మినుము సాగు చేసేటప్పుడు ఎరువులు వాడనవసరం లేదు. పొద్దుతిరుగుడు పొద్దుతిరుగుడు సాగులో ఎకరానికి 3 టన్నుల పశువుల ఎరువును విత్తటానికి 2-3 వారాల ముందు వేసుకోవాలి నీటి పారుదల కింద హైబ్రిడ్లను సాగు చేసినట్లయితే ఎకరానికి నల్లరేగడి నేలల్లో 30 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్లను ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 3 దఫాలుగా విభజించి వేయాలి. వేయాల్సిన నత్రజని మోతాదులో సగభాగాన్ని మొదటి దఫా గా విత్తేటప్పుడు, నాలుగో వంతును రెండవ దఫాగా విత్తిన 30 రోజుల తరువాత మొగ్గ తొడిగే దశలో.. మిగి లిన నాలుగో వంతును మూడవ దఫాగా విత్తిన 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో వేసుకోవాలి. సిఫారసు చేసిన భాస్వరపు, పొటాష్ పూర్తి మోతాదులను ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. సూక్ష్మ పోషకాలలో పొద్దుతిరుగుడు సాగుకు బొరాన్ అత్యంత ఆవశ్యకమైనది. పైరు పూత దశలో ఆకర్షక పత్రాలు తెరుచుకొన్నప్పుడు 0.2 శాతం బొరాక్స్( లీటరు నీటికి 2 గ్రా బొరాక్స్) మందు ద్రావణాన్ని ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేసినట్లయితే గింజలు ఎక్కువగా తయారై, దిగుబడి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. లేదా ఆఖరి దుక్కలో ఎకరానికి 8 కిలోల బొరెక్ ఆమ్లాన్ని వేసుకోవాలి. గంధకం లోపించిన నేలల్లో ఎకరానికి 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే గింజలో నూనె శాతం పెరగడమే కాక అధిక దిగుబడులను సాధించవచ్చు( ఎకరానికి 55 కిలోల జిప్సం) -
రబీ సాగుకు అనువైన సమయం
ప్రస్తుతం విద్యుత్ కొరత ఉందని, ఈనేపథ్యం లో వరి సాగు జోలికి వెళ్లకుండా నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో ఆరుతడి పంటలైన వేరు శనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తుకోవచ్చు. నల్లరేగడి నేలల్లో నిల్వ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శనగ పంటను సాగు చేసుకోవచ్చు. వరి మాగాణుల్లో మినుము, మొక్కజొన్న వేసుకోవచ్చు. నవంబర్ 20 నుంచి స్వల్ప కాలిక వరి రకాలను ఎన్నుకుని నారు సిద్ధం చేసుకోవాలి. కానీ ఈ సీజన్లో వరి సాగు తగ్గించడమే మంచిది. ప్రస్తుతం జిల్లా లో సుమారు వెయ్యి హెక్టార్లలోవేరుశనగ, 164 హెక్టార్లలో మొక్కజొన్న, మినుము 500 హెక్టార్లలో సాగు చేశారు. ఇంకా ఈ పంటలకు సాగు సమయం మించి పోలేదు. ఈ పంటల సాగకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి. వేరుశనగ వేరుశనగ నూనె గింజల పంట. ఎంచుకున్న కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజమ్ లేదా మూడు గ్రాముల మాంకోజెబ్‌తో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. వేరు పురుగు ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్, లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్‌తో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 30 - 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7.5 - 10 సెంటీమీటర్ల తేడాతో విత్తనాన్ని 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో పడకుండా విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం ఎకరానికి 4-5 టన్నుల మాగిన పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. ఎకరానికి 20 కిలో ల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎ రువులు దుక్కిలో వేయాలి. ఎకరానికి 20కిలోల జింక్‌సల్ఫేట్‌ను ఫాస్పేట్ ఎరువులతో కలవకుండా ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. కలుపు నివారణ విత్తిన మూడురోజుల్లో ఎకరానికి 1.2లీటర్ల పెం డిమిథాలిన్ 200లీటర్ల నీటిలో కలిపి తడి నేల పై పిచికారీ చేసి కలుపును నివారించుకోవాలి. మొక్కజొన్న ఈ పంట సాగుకు నల్లరేగడి నేలలు అనుకూలం. నవంబర్ నెలవరకు మొక్కజొన్నను విత్తుకోవచ్చు. ముందుగా నేలను రెండుసార్లు నాగలితో లోతుగా దున్ని వారం రోజుల తర్వాత కల్టివేటర్‌తో మట్టి గడ్డలు పగులకొట్టి చదును చేయాలి. వాలుకు అడ్డంగా దున్నడం వల్ల నీరు ఇంకుతుంది. ఎకరానికి 8 కిలోల విత్తనాన్ని వేయాలి. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు కాప్టాస్తో విత్తనశుద్ధి చేస్తే తొలిదశలోనే తెగుళ్లు ఆశించకుండా నివారించవచ్చు. విత్తే పద్ధతి బోదెలను తూర్పు, పడమర దిశల్లో తీసుకుని బోదెకు దక్షిణం వైపు నుంచి 3వ వంతు ఎత్తులో విత్తనట్లయితే మొక్కకు సూర్యరశ్మి బాగా తగిలి ఎదుగుదల బాగా ఉంటుంది. ఎరువులు ఎకరానికి 50కిలోల యూరియా, 200కిలోల సూపర్ ఫాస్పేట్, 50కిలోల మ్యూరేట్ ఆఫ్ పొ టాష్ దుక్కిలో వేయాలి. 20కిలోల జింక్‌సల్ఫేట్ ఫాస్పేట్ ఎరువులతో కలపకుండా వేయాలి. ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు కంపోస్టును ఆఖరి దుక్కిలో వేయాలి. నీటి యాజమాన్యం మొక్కజొన్న పైరు బెట్ట, నీటి ముంపు రెండింటినీ తట్టుకోలేదు. పొలంలో నీరు అధికంగా ఉండి నీరు నిల్వ ఉంటే మొలకెత్తదు. మోకాలు ఎత్తు పెరిగే దశ వరకు పైరుకు అధికనీరు హానికరం. కలుపు యాజమాన్యం విత్తిన తర్వాత నేలపై తేమ తగినంత ఉన్నప్పుడు ఆట్పజిన్ 1.2 కిలోలు, 500 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. శనగ రబీ సీజన్లో నవంబర్ వరకు ఈ పంటను వేయవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరిదశలో బెట్టకు గురై అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గుతుంది. ఈ పంటకు నల్లరేగడి నేలలు అనుకూలం. నేలను మెత్తగా దున్ని నీరు నిల్వకుండా చదును చేయాలి. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 4-5 గ్రాములు ట్రైకోడెర్మావిరిడి లేదా 2.5 గ్రాముల థైరామ్ లేదా కార్బాండిజమ్తో విత్తన శుద్ధిచేయాలి. ఎరువులు ఎకరానికి 50 కిలోల డీఏపీ, 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్‌ఫాస్పేట్ వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్‌సల్ఫేట్‌ను కూడా వేయాలి. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు ప్లుక్లోరాలిన్ ఒక లీటరు లేదా పిండిమిథాలిన్ 1-1.3 లీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసి కలుపును నివారించుకోవచ్చు. -
వ్యవసాయంలో విజయదీపిక
తాండూరు : గాండ్ల విజయ నిర్మల. తాండూరులోని మధ్య తరగతి కుటుంబం. పుట్టిన గ్రామం కందుకూరు. తండ్రి బసప్ప రిటైర్డ్ ఉపాధ్యాయుడు. పాత తాండూరుకు చెందిన గాండ్ల నర్సింహులును 1992లో వివాహం చేసుకున్నారు నిర్మల. భర్తకు నాలుగు ఎకరాల పొలం ఉంది. 1995లో భర్త తండ్రి(మామ) మృతి చెందాడు. వ్యవ సాయ పనులు భర్త ఒక్కడే చూసుకుంటుండడంతో ఆయన సాయంగా రోజూ పొలానికి వెళ్లేది. భర్త వ్యవసాయ పనులు ఎలా చేస్తున్నాడు.. ఏ మందులు పిచికారీ చేస్తున్నాడు.. నీళ్లు పెట్టే పద్ధతి.. ఇవన్నీ పరిశీలించారు. ఇలా కొన్నాళ్లు తర్వాత వ్యవసాయ పనులపై పట్టు సాధించారు. భర్త అందుబాటులో లేకపోయినా పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేయించేది. కొద్ది రోజుల్లోనే ఇతర రైతులకూ సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. వారికున్న నాలుగు ఎకరాల్లో మొదట పెసర, మినుము పండించే వాళ్లు. కోత సమయంలో వర్షాలు పడి నష్టపోవడం చూసి పంట మార్పిడి చేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో కంది పంట సాగుకు మొగ్గుచూపారు. కందితోపాటు రోజు వారీ ఆదాయం కోసం అంతరపంటలకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక అవసరాల నిమిత్తం కందిలో అంతర పంటల సాగుతో సుమారు మూడు నెలలపాటు స్థిరమైన రోజువారీ ఆదాయం కోసం కూరగాయాలు, ఆకు కూరలు పండిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిని ఎంచుకున్నారు. భర్త సహకారంతోపాటు తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.సీ.సుధాకర్, సుధారాణిల ప్రోత్సాహం తనకు ఎంతగానో ఉపయోగపడుతోందని చెబుతోంది నిర్మల. విజయ నిర్మల పెద్ద కుమారుడు రాజవర్ధన్ ఖమ్మం జిల్లా పాల్వంచలో బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ చేస్తుండగా చిన్న కొడుకు మణివర్ధన్ ఏడో తరగతి చదువుతున్నాడు. సాధించిన విజయాలు.. ఇక్రిశాట్ తయారుచేసిన తొలి ఐసీపీహెచ్-2747 హైబ్రీడ్ రకం కంది సాగు చేపట్టారు నిర్మల. ఈ హైబ్రీడ్ రకంతో ఎకరానికి 14 క్వింటాళ్లకుపైగా దిగుబడి సాధించారు. నాటే పద్ధతిలో కంది సాగు చేసిన మొదటి మహిళా రైతు కూడా విజయనిర్మలే. మే నెలలో కంది నర్సరీని పెంచడం. జూన్ వరకు నర్సరీని కాపాడి, అదే నెల చివరిలో నాటుకోవడం.. ఇలా నాటే పద్ధతి క్లిష్టమైనప్పటికీ ఆమె విజయవంతంగా కంది సాగు చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధికంగా ఎకరాకు 12.80 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. 2013-14 సంవత్సరంలో డ్రిప్ ద్వారా నాటే పద్ధతిలో కంది సాగుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా రైతు కూడా ఈమే. డ్రిప్‌తో కంది చేస్తూనే ఏడాదిపాటు స్థిరమైన ఆదాయం కోసం అంతర పంటలుగా బెండకాయ, చిక్కుడు, కాకరతోపాటు పాలకూర, కొత్తిమీర వేశారు. ఆకు కూరలపై రోజూ రూ.500 -రూ.600, బెండకాయ తదితర పంటలతో రోజుకు రూ.700- రూ.వెయ్యి వరకు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఇలా వ్యవసాయంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను అందిపుచ్చుకుంటూ నూతన పద్ధతులతో పంటల సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించి సాధారణ గృహిణి స్థాయి నుంచి జాతీయ ఉత్తమ మహిళా రైతుగా విజయనిర్మల అవార్డు అందుకోవడం స్ఫూర్తిదాయకం. ఇక్రిశాట్‌తోపాటు ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. దేశ వ్యాప్తంగా పప్పుదినుసులను సాగుచేస్తున్న 14 రాష్ట్రాల నుంచి అధిక దిగుబడులు సాధిస్తున్న మహిళా రైతులను ఎంపిక చేసింది. రాష్ట్రానికి ఒక్కరి చొప్పున ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రం నుంచి ‘గోల్డ్ కేటగిరి’లో జాతీయ ఉత్తమ మహిళా రైతుగా ఎంపికైన ఏకైక మహిళా రైతు విజయనిర్మల. -
అంతర పంట లాభదాయకం
వలేటివారిపాలెం : సపోట, మామి డి, జామ పండ్ల తోటల్లో కూరగాయలు, మినుమును అంతర పంటలుగా సాగు చేస్తూ రైతులు లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం వలేటివారిపాలెం మండలంలో పలువురు రైతులు మినుము, దొండ, బెండ, కాకర, దోస, చిక్కుడు, వంగ, గోంగూర, తోటకూర, పాలకూరను రైతులు అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. పండ్ల తోటల్లో అంతర పంటలు సాగు చేసినా, చేయకపోయినా దుక్కి, కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకుగాను ఏడాదికి రూ.7 వేలు ఖర్చు చేయాలి. అంతర పంటలు సాగు చేసినా అదే ఖర్చు అవుతుంది. పండ్ల తోటలో కూరగాయలు, మినుము పంట లను సాగు చేస్తే వాటికి వాడే మందులు పండ్ల తోటలకు కూడా ఉపయోగపడతాయి. పండ్ల తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన పని ఉండదు. పైగా పండ్ల మొక్కలు త్వరితగతిన పెరగడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల సాగుకు మూడు నెలలు శ్రమిస్తే ఆ తర్వాత మూడు నెలలపాటు పంటను కోసి విక్రయించుకోవచ్చు. పండ్ల తోటల్లో అంతర పంటలను ఆరేళ్లపాటు సాగు చేసుకోవచ్చు. పండ్ల మొక్కలు ఎదిగిన త ర్వాత అంతర పంటలు సాగు చేయడం అంత శ్రేయస్కరం కాదు. -
ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం
మోర్తాడ్ : వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెల రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేక పోవడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. వేసవి కాలం మాదిరిగా ఎండలు కాస్తున్నాయి. గత సంవత్సరం అతివృష్టి కారణంగా భూగర్భ జలాలు బాగానే ఉన్నా భూమి లో వేడిమి తగ్గని కారణంగా పంటల సాగుకు వాతావరణం అనుకూలించడం లేదు. సోయా విత్తితే మొలకెత్తని పరిస్థితి నెలకొంది. బోరుబావుల ద్వారా సోయా, వరి పంటలను సాగు చేయాలని రైతులు ప్రయత్నిస్తున్నా భూమి అనుకూలించక పోవడంతో విత్తనం వృథా అవుతోంది. జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం మిన హా అన్ని మండలాల్లో వర్షపాతం లోటు ఉంది. సాధారణ వర్షపాతానికి కనీసం 50 శాతం కూడా నమోదు కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనేక మంది రైతులు సోయా విత్తనాలను రెండు మార్లు విత్తారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉండటంతో ప్రత్యామ్నా య పంటల సాగుతో రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. పెసర్లు, మినుములు సాగు చేయడానికి అనుకూలంగా వాతావరణం ఉండటంతో ఈ రెండు పంటలను సాగు చేయించి రైతాంగానికి దారి చూపాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రతి మండలంలోను వ్యవసా య శాఖ అధికారులు ఈ ఖరీఫ్ సీజనుకుగాను సోయా, వరి పంటలకు బదులు పెసర్లు, మినుములు సాగు చేయించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. రైతాంగానికి ఎంత మేర విత్తనాలు అవసరమో అంచనా వేస్తున్నారు. సోయా, వరి సాగులకు ఇంకా కొంత సమయం ఉన్నా ముందు ముందు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలి యదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళి కను సిద్ధం చేస్తున్నారు. ఒక వేళ వర్షాలు కురిస్తే సోయా, వరి సాగుకు అవసరం అయిన విత్తనాలు రైతుల వద్ద రెడీగా ఉన్నాయి. రెండు, మూడు భారీ వర్షాలు కురిసే వరకు రైతులు కాస్తా ఓపిక పట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో వ్యవసాయ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికను సిద్ధం చేసి ఉంచు తున్నారు. -
సంప్రదాయ పంటలకు స్వస్తి
వ్యవసాయంలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. ఆహార పంటలైన జొన్న, పెసర్లు, గోధుమ సాగుకు స్వస్తి చెబుతున్న రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో.. అధిక దిగుబడి.. అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఆ దిశగా ముందుకు ‘సాగు’తున్నారు. ముఖ్యంగా భూములన్నింటినీ పత్తి, సోయూబీన్ పంటలు ఆక్రమించారుు. ఫలితంగా అన్నదాతలకే ప్రస్తుతం ఇళ్లలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితిలో సంప్రదాయ పంటలు ప్రభను కోల్పోగా కొత్త పంటలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి, లాభాలిచ్చే పంటల వైపే అన్నదాతలు మొగ్గుచూపుతుండడంతో సంప్రదాయ పంటలకు కాలం చెల్లుతోంది. అధిక దిగుబడి, లాభాలు ఇచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలు జరగకపోవడంతో పాత పంటల సాగు ఏడాదికేడాది తగ్గిపోతుండగా.. కొత్త పంటల సాగు విస్తీర్ణం అమాంతం పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేసిన పంటలు ఇప్పుడు చిన్నబోయాయి. రబీ సీజన్లో ఐదేళ్ల క్రితం వరకు జిల్లాలో వరి, జొన్న, పెసర్లు, గొధుమ. మినుములు, ఇతర పప్పు ధాన్యాల సాగు భారీగా ఉండేది. రానురాను తగ్గిపోయూరుు. 2008-09లో లక్షా 12 వేల 23 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైన ఆహార పంటలు.. 2013-14కు వచ్చేసరికి రబీలో 61 వేల 801 హెక్టార్లకు పడిపోరుుంది. రబీలో జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 2008-9లో 18,433 హెక్టార్లు కాగా.. ఈ ఏడాది రబీలో 10 వేల 100 హెక్టార్లకు చేరింది. ఇక చిన్నపంటలైన పొద్దుతిరుగుడు, మిరప, నువ్వులు, వేరుశెనగ, ఉల్వలు, ఉల్లి పంటలు సైతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. నేటి మొక్కజొన్న, పత్తి.. రేపటి సోయాదే.. ఒకప్పుడు జిల్లాలో నామమాత్రంగా సాగైన పత్తి, సోయాబీన్, వరి పంటలపై రైతుల్లో మోజు పెరిగింది. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి, రాబడి ఇస్తుండడంతో రైతులు మూకుమ్మడిగా ఈ పంటల సాగుకే కట్టుబడిపోయారు. బీటీ విత్తనాల రాకతో పత్తి సాగు అమాంతం పెరిగింది. ఖరీఫ్, రబీలో 2008-09లో 2,82,860 హెక్టార్లలో సాగైన పత్తి ఖరీఫ్ 2013 నాటికి 3 లక్షల 10 వేల హెక్టార్లకు పెరిగడమే ఇందుకు నిదర్శనం. సోయాబీన్ 95,895 హెక్టార్లకు గాను లక్ష 13 వేల హెక్టార్లకు చేరింది. జొన్న పంట స్థానాన్ని సోయాబీన్ ఆక్రమించగా.. పప్పు దినుసులు, నూనె గింజల స్థానంలో పత్తి పంట చొచ్చుకొచ్చింది. రెండేళ్లుగా జిల్లాలో సోయా చిక్కుడు సాగు పెరుగుతుండడంతో.. భవిష్యత్తులో భారీ స్థాయిలో ఈ పంటను సాగుచేసే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పప్పుదినుసుల్లో కంది మాత్రమే ఆదరణకు నోచుకుంటోంది.