రబీ సాగుకు అనువైన సమయం | good time for rabi cultivation | Sakshi
Sakshi News home page

రబీ సాగుకు అనువైన సమయం

Published Sat, Nov 15 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

good time for rabi cultivation

ప్రస్తుతం విద్యుత్ కొరత ఉందని, ఈనేపథ్యం లో వరి సాగు జోలికి వెళ్లకుండా నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో ఆరుతడి పంటలైన వేరు శనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తుకోవచ్చు.
 నల్లరేగడి నేలల్లో నిల్వ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శనగ పంటను సాగు చేసుకోవచ్చు.
 వరి మాగాణుల్లో మినుము, మొక్కజొన్న వేసుకోవచ్చు.
 నవంబర్ 20 నుంచి స్వల్ప కాలిక వరి రకాలను ఎన్నుకుని నారు సిద్ధం చేసుకోవాలి. కానీ ఈ సీజన్‌లో వరి సాగు తగ్గించడమే మంచిది.
 ప్రస్తుతం జిల్లా లో సుమారు వెయ్యి హెక్టార్లలోవేరుశనగ, 164 హెక్టార్లలో మొక్కజొన్న, మినుము 500 హెక్టార్లలో సాగు చేశారు. ఇంకా ఈ పంటలకు సాగు సమయం మించి పోలేదు. ఈ పంటల సాగకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి.

 వేరుశనగ
 వేరుశనగ నూనె గింజల పంట. ఎంచుకున్న  కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజమ్ లేదా మూడు గ్రాముల మాంకోజెబ్‌తో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. వేరు పురుగు ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్, లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్‌తో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 30 - 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7.5 - 10 సెంటీమీటర్ల తేడాతో విత్తనాన్ని 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో పడకుండా విత్తుకోవాలి.

 ఎరువుల యాజమాన్యం
 ఎకరానికి 4-5 టన్నుల మాగిన పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. ఎకరానికి 20 కిలో ల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎ రువులు దుక్కిలో వేయాలి. ఎకరానికి 20కిలోల జింక్‌సల్ఫేట్‌ను ఫాస్పేట్ ఎరువులతో కలవకుండా ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.

 కలుపు నివారణ
 విత్తిన మూడురోజుల్లో ఎకరానికి 1.2లీటర్ల పెం డిమిథాలిన్ 200లీటర్ల నీటిలో కలిపి తడి నేల పై పిచికారీ చేసి కలుపును నివారించుకోవాలి.

 మొక్కజొన్న
 ఈ పంట సాగుకు నల్లరేగడి నేలలు అనుకూలం. నవంబర్ నెలవరకు మొక్కజొన్నను విత్తుకోవచ్చు. ముందుగా నేలను రెండుసార్లు నాగలితో లోతుగా దున్ని వారం రోజుల తర్వాత కల్టివేటర్‌తో మట్టి గడ్డలు పగులకొట్టి చదును చేయాలి. వాలుకు అడ్డంగా దున్నడం వల్ల నీరు ఇంకుతుంది. ఎకరానికి 8 కిలోల విత్తనాన్ని వేయాలి.  వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు కాప్టాస్‌తో విత్తనశుద్ధి చేస్తే తొలిదశలోనే తెగుళ్లు ఆశించకుండా నివారించవచ్చు.

 విత్తే పద్ధతి
 బోదెలను తూర్పు, పడమర దిశల్లో తీసుకుని బోదెకు దక్షిణం వైపు నుంచి 3వ వంతు ఎత్తులో విత్తనట్లయితే మొక్కకు సూర్యరశ్మి బాగా తగిలి ఎదుగుదల బాగా ఉంటుంది.

 ఎరువులు
 ఎకరానికి 50కిలోల యూరియా, 200కిలోల సూపర్ ఫాస్పేట్, 50కిలోల మ్యూరేట్ ఆఫ్ పొ టాష్ దుక్కిలో వేయాలి. 20కిలోల జింక్‌సల్ఫేట్ ఫాస్పేట్ ఎరువులతో కలపకుండా వేయాలి. ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు కంపోస్టును ఆఖరి దుక్కిలో వేయాలి.
 
 నీటి యాజమాన్యం
 మొక్కజొన్న పైరు బెట్ట, నీటి ముంపు రెండింటినీ తట్టుకోలేదు. పొలంలో నీరు అధికంగా ఉండి నీరు నిల్వ ఉంటే మొలకెత్తదు. మోకాలు ఎత్తు పెరిగే దశ వరకు పైరుకు అధికనీరు హానికరం.

 కలుపు యాజమాన్యం
 విత్తిన తర్వాత నేలపై తేమ తగినంత ఉన్నప్పుడు ఆట్పజిన్ 1.2 కిలోలు, 500 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి.

 శనగ
 రబీ సీజన్‌లో నవంబర్ వరకు ఈ పంటను వేయవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరిదశలో బెట్టకు గురై అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గుతుంది. ఈ పంటకు నల్లరేగడి నేలలు అనుకూలం. నేలను మెత్తగా దున్ని నీరు నిల్వకుండా చదును చేయాలి.

 విత్తన శుద్ధి
 కిలో విత్తనానికి 4-5 గ్రాములు ట్రైకోడెర్మావిరిడి లేదా 2.5 గ్రాముల థైరామ్ లేదా కార్బాండిజమ్‌తో విత్తన శుద్ధిచేయాలి.

 ఎరువులు
 ఎకరానికి 50 కిలోల  డీఏపీ, 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్‌ఫాస్పేట్ వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్‌సల్ఫేట్‌ను కూడా వేయాలి. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు ప్లుక్లోరాలిన్ ఒక లీటరు లేదా పిండిమిథాలిన్ 1-1.3 లీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసి కలుపును నివారించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement