వ్యవసాయంలో విజయదీపిక | gandla vijaya nirmala in agriculture | Sakshi
Sakshi News home page

వ్యవసాయంలో విజయదీపిక

Published Sat, Nov 15 2014 12:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

gandla vijaya nirmala in agriculture

 తాండూరు : గాండ్ల విజయ నిర్మల. తాండూరులోని మధ్య తరగతి కుటుంబం. పుట్టిన గ్రామం కందుకూరు. తండ్రి బసప్ప రిటైర్డ్ ఉపాధ్యాయుడు. పాత తాండూరుకు చెందిన గాండ్ల నర్సింహులును 1992లో వివాహం చేసుకున్నారు నిర్మల. భర్తకు నాలుగు ఎకరాల పొలం ఉంది. 1995లో భర్త తండ్రి(మామ) మృతి చెందాడు. వ్యవ సాయ పనులు భర్త ఒక్కడే చూసుకుంటుండడంతో ఆయన సాయంగా రోజూ పొలానికి వెళ్లేది.

భర్త వ్యవసాయ పనులు ఎలా చేస్తున్నాడు.. ఏ మందులు పిచికారీ చేస్తున్నాడు.. నీళ్లు పెట్టే పద్ధతి.. ఇవన్నీ పరిశీలించారు. ఇలా కొన్నాళ్లు తర్వాత వ్యవసాయ పనులపై పట్టు సాధించారు. భర్త అందుబాటులో లేకపోయినా పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేయించేది. కొద్ది రోజుల్లోనే ఇతర రైతులకూ సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. వారికున్న నాలుగు ఎకరాల్లో మొదట పెసర, మినుము పండించే వాళ్లు. కోత సమయంలో వర్షాలు పడి నష్టపోవడం చూసి పంట మార్పిడి చేయాలనే ఆలోచన వచ్చింది.

 దాంతో కంది పంట సాగుకు మొగ్గుచూపారు. కందితోపాటు రోజు వారీ ఆదాయం కోసం అంతరపంటలకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక అవసరాల నిమిత్తం కందిలో అంతర పంటల సాగుతో సుమారు మూడు నెలలపాటు స్థిరమైన రోజువారీ ఆదాయం కోసం కూరగాయాలు, ఆకు కూరలు పండిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిని ఎంచుకున్నారు. భర్త సహకారంతోపాటు తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.సీ.సుధాకర్, సుధారాణిల ప్రోత్సాహం తనకు ఎంతగానో ఉపయోగపడుతోందని చెబుతోంది నిర్మల. విజయ నిర్మల పెద్ద కుమారుడు రాజవర్ధన్ ఖమ్మం జిల్లా పాల్వంచలో బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ చేస్తుండగా చిన్న కొడుకు మణివర్ధన్ ఏడో తరగతి చదువుతున్నాడు.

 సాధించిన విజయాలు..
 ఇక్రిశాట్ తయారుచేసిన తొలి ఐసీపీహెచ్-2747 హైబ్రీడ్ రకం కంది సాగు చేపట్టారు నిర్మల. ఈ హైబ్రీడ్ రకంతో ఎకరానికి 14 క్వింటాళ్లకుపైగా దిగుబడి సాధించారు.
 నాటే పద్ధతిలో కంది సాగు చేసిన మొదటి మహిళా రైతు కూడా విజయనిర్మలే. మే నెలలో కంది నర్సరీని పెంచడం. జూన్ వరకు నర్సరీని కాపాడి, అదే నెల చివరిలో నాటుకోవడం.. ఇలా నాటే పద్ధతి క్లిష్టమైనప్పటికీ ఆమె విజయవంతంగా కంది సాగు చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధికంగా ఎకరాకు 12.80 క్వింటాళ్ల దిగుబడి సాధించారు.
 2013-14 సంవత్సరంలో డ్రిప్ ద్వారా నాటే పద్ధతిలో కంది సాగుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా రైతు కూడా ఈమే. డ్రిప్‌తో కంది చేస్తూనే ఏడాదిపాటు స్థిరమైన ఆదాయం కోసం అంతర పంటలుగా బెండకాయ, చిక్కుడు, కాకరతోపాటు పాలకూర, కొత్తిమీర వేశారు. ఆకు కూరలపై రోజూ రూ.500 -రూ.600, బెండకాయ తదితర పంటలతో రోజుకు రూ.700- రూ.వెయ్యి వరకు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఇలా వ్యవసాయంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను అందిపుచ్చుకుంటూ నూతన పద్ధతులతో పంటల సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించి సాధారణ గృహిణి స్థాయి నుంచి జాతీయ ఉత్తమ మహిళా రైతుగా విజయనిర్మల అవార్డు అందుకోవడం స్ఫూర్తిదాయకం.
 
ఇక్రిశాట్‌తోపాటు ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. దేశ వ్యాప్తంగా పప్పుదినుసులను సాగుచేస్తున్న 14 రాష్ట్రాల నుంచి అధిక దిగుబడులు సాధిస్తున్న మహిళా రైతులను ఎంపిక చేసింది. రాష్ట్రానికి ఒక్కరి చొప్పున ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రం నుంచి ‘గోల్డ్ కేటగిరి’లో జాతీయ ఉత్తమ మహిళా రైతుగా ఎంపికైన ఏకైక మహిళా రైతు విజయనిర్మల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement