Moong
-
బడి పిల్లల మధ్యాహ్న భోజనంలో మార్పులకు కేంద్రం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని (ప్రధానమంత్రి పోషక్ పథకం) సమూలంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు పోషక విలువలున్న ఆహారాన్ని అందించేందుకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని సూచించింది. విద్యార్థులందరికీ మధ్యాహ్నం పోషకాలు ఎక్కువగా ఉండే రాగిజావను ఇవ్వాలని, దీంతోపాటే మొలకలు, బెల్లం అందించాలని పేర్కొంది. దీని అమలుకు గల సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరింది. అయితే, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాల్సిఉందని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దీనికి అదనపు నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనా స్పష్టత లేదని విద్యాశాఖలో అదనపు డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరు చెప్పారు. గతంలో కూడా మధ్యాహ్నం భోజనంతోపాటు పల్లీ పట్టీ ఇవ్వాలని కేంద్రం సూచించిందని, పెరిగిన ధరల ప్రకారం దీన్ని అమలు చేయడం సాధ్యం కాలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాగిజావను విధిగా ఇవ్వాల్సిందేనని కేంద్రంనుంచి ఒత్తిడి వస్తున్నట్టు చెప్పాయి. ఇప్పుడిచ్చే ఆహారంలో స్వల్ప మార్పులు చేసి రాగిజావ, బెల్లం, మొలకలు అందించే విషయం పరిశీలిస్తున్నామని, దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. జాతీయ సర్వే ప్రకారమే.. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కేంద్రస్థాయిలో కొన్నేళ్లుగా తరచూ సర్వేలు చేస్తున్నారు. స్కూలు సమయానికి విద్యార్థుల కుటుంబాల్లో సరైన పోషక విలువలున్న ఆహారం అందించడం లేదని సర్వేలో తేలింది. తల్లిదండ్రులు ఉపాధి కోసం హడావిడిగా ఉదయం వెళ్లాల్సి రావడం, విద్యార్థులు కూడా ఇంట్లో ఉన్నదేదో తిని వస్తున్నారని, దీంతో చాలామందిలో పోషకాహార లోపం కన్పిస్తోందని వెల్లడైంది. ఐదేళ్లుగా కనీసం 40 శాతం మంది విద్యార్థులు రక్తహీనత, ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. 32 శాతం మందిలో పోషక విలువలు లోపించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడైంది. వీళ్లంతా ఎక్కువ రోజులు స్కూలుకు హాజరవ్వడం లేదని, ఫలితంగా విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో బడిలోనే పోషకాలతో కూడిన ఆహారం అందించాలని ప్రతిపాదించింది. ఇందులో ప్రధానంగా రాగిజావ ఇవ్వాలని భావిస్తున్నారు. దీన్ని రోజూ ఇవ్వడమా? వారంలో కొన్ని రోజులు ఇవ్వడమా? అనే దానిపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు అంటున్నారు. నిధుల సర్దుబాటు ఎలా? మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు మంజూరు చేస్తున్నాయి. ఈ పథకానికి ఏటా రూ.550 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం విద్యార్థులకు రోజుకో విధంగా ఆహారం ఇస్తున్నారు. వారానికి మూడు రోజులు గుడ్డు, మిగతా రోజుల్లో ఆకు కూరలు, కాయగూరలు, సాంబార్, కిచిడీ ఇలా పలు రకాలుగా అందిస్తున్నారు. అయితే, కేంద్రం మెనూ ప్రకారం ధరలను నిర్ణయిస్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవి ఉండటం లేదని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఒక్కో గుడ్డు ధర దాదాపు రూ.6 ఉంటే.. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం రూ.2 మాత్రమే ఉంటోంది. దీంతో నిధుల సర్దుబాటు సమస్య వస్తోంది. ఇప్పుడు కూడా రాగిజావ, మొలకల కోసం ప్రత్యేక నిధులు అవసరమవుతాయని, లేని పక్షంలో పథకం అమలులో అనేక ఇబ్బందులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. (చదవండి: అంచు చీరలే ఆ‘దారం’) -
Diwali Special: స్వీట్ ఫ్రిట్టర్స్, మూంగ్ హల్వా ఇలా తయారు చేసుకోండి..
దీపావళి పర్వదినాన ఈ స్వీట్లతో మీ నోరు తీపిచేసుకోండి..! స్వీట్ ఫ్రిట్టర్స్ కావల్సిన పదార్థాలు బియ్యం – కప్పు అరటి పండ్లు – రెండు (తొక్కతీసి ముక్కలుగా తరగాలి) యాలకులు – మూడు, బెల్లం – ముప్పావు కప్పు నీళ్లు – రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి – టేబుల్ స్పూను ఎండుకొబ్బరి ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు సొంఠి పొడి – పావు టీస్పూను నువ్వులు – టీస్పూను బేకింగ్ సోడా – టీస్పూను ఉప్పు – చిటికడు ఆయిల్ లేదా నెయ్యి – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ విధానం ►ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. ►నానిన బియ్యాన్ని నీళ్లు తీసేసి, మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. దీనిలో అరటిపండు ముక్కలు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి బెల్లం, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మీడియం మంట మీద సిరప్ తయారయ్యాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ►బెల్లం సిరప్‌ను వడగట్టి, గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమంలో వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ►చిన్న పాన్ పెట్టి టీస్పూను నెయ్యి వేసి కొబ్బరి ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను నెయ్యితోపాటు పిండిలో వేయాలి. నువ్వులు, సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ►ఇప్పుడు మౌల్డ్స్‌లో నెయ్యి లేదా నూనె వేసి కాగాక బ్యాటర్‌ను వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు వేగనివ్వాలి. ►మరోవైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్కలర్లోకి మారేంత వరకు వేయించితే ఉన్ని అప్పం రెడీ. చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! మూంగ్ హల్వా కావల్సిన పదార్థాలు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు చాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి) నీళ్లు – రెండు కప్పులు నెయ్యి – అరకప్పు గోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లు పంచదార – ముప్పావు కప్పు ఫుడ్ కలర్ – చిటికెడు యాలకుల పొడి – పావు టీస్పూను జీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి. ►తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ►పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి. ►పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి. ►ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి. ►ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ►స్టవ్‌మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. చదవండి: Diwali Lakshmi Puja 2021: ఈ 5 చోట్ల దీపాలు తప్పక వెలిగించాలట..! -
కేంద్రం దృష్టికి పెసర సమస్య
సిద్దిపేటజోన్: పెసర సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మార్కెటింగ్, భారీ నీటిపారుదల శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం రాష్ట్ర బృందం ఇదే సమస్యపై ఢిల్లీకి వెళ్లనుందని చెప్పారు. ఆదివారం సిద్దిపేటలో మార్క్‌ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రారంభమైన తొలి కేంద్రమిది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పెసర పంటకు కేంద్రం నాణ్యతా ప్రమాణాలు కొంత ఇబ్బందిగా మారడంతో మద్దతు ధర సమస్య ఉత్పన్నం కాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ధర తగ్గినప్పటికీ రూ.వెయ్యి కోట్లతో కందులను కొనుగోలు చేశామన్నారు. రైతుకు మద్దతు ధర అందించే దిశగా ఈ ఏడాది వంద మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని వివరించారు. ఇప్పటికే 20 కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. 2–3 రోజుల్లో మిగతావి ప్రారంభిస్తామన్నారు. రైతు పండించిన ప్రతి చివరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో ఈసారి వరి రెట్టింపు దిగుబడి రానుందని మంత్రి చెప్పారు. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. పత్తి కొనుగోలు కోసం సీసీఐ కేంద్రాలతో పాటు అవసరమైన చోట డిమాండ్‌కు అనుగుణంగా జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు వెన్నుదన్నుగా సమితులు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని హరీశ్‌రావు తెలిపారు. ఆయన చిన్నకోడూరు మండలంలో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాలు అడ్డుతగలడం భావ్యం కాదన్నారు. భూమి దున్నే ప్రతి రైతు సమన్వయ సమితిలో సభ్యుడన్నారు. -
పెసర రైతులకు నిరాశ
కొనుగోళ్లపై నాఫెడ్ అధికారుల తాత్సారం వరంగల్‌సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పెసళ్ల కొనుగోలు విషయమై నాఫెడ్ అధికారులు తాత్సారం చేయడంతో ఎంతో ఆశతో ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలోని నాలుగు ప్రధాన మార్కెట్ల ల్లో గురువారం నుంచి నాఫెడ్‌తో కలసి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.5225కు పెసళ్లు కొనుగోలు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ వై.రంజిత్‌రెడ్డి ఈనెల 12న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు క్వాలిటీ కంట్రోలర్ రవీందర్‌రెడ్డి, నాఫెడ్ సర్వే అధికారి హుస్సేన్‌తో కలిసి గురువారం మార్కెట్ వచ్చిన రంజిత్‌రెడ్డి పెసళ్లు కొనుగోలు చేయడానికి చాలా సమయం వరకు తటపటాయించారు. అప్పటికే ప్రైవేట్ వ్యాపారు లు క్వింటాలుకు రూ.5071 ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంస్థల అధికారులు మచ్చులు చూçస్తూ కాలయాపన చేయడం తో నిరాశ చెందిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు సరుకు అమ్ముకోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన వ్యాపారులు ధర తగ్గించి రూ.4900లతో కొనుగోలు చేసినట్లు చాలా మంది రైతులు తెలి పారు. అనంతరం మార్కెట్ కార్యదర్శి అజ్మీర రాజుతో సమావేశమైన నాఫెడ్, మార్క్‌ఫెడ్ అధికారులు శుక్రవారం నుంచి కొనుగోళ్లు చేపడతామని వెల్ల్లడించారు. పర్యవేక్షణలో మార్కెట్ గ్రేడ్–2 కార్యదర్శి జగన్మోçßæ ¯ŒS, సూపర్ వైజర్లు లకీ‡్ష్మనారాయణ, వేణు పాల్గొన్నారు. -
ఇబ్బందుల్లో పెసర రైతులు
హుజూర్నగర్ రూరల్: ఎంతో ఆశతో ఖరీఫ్‌లో పెసర సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాభం మాట అటుంచితే కనీసం విత్తనాల ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పప్పుధాన్యాలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రచారం చేయడంతో మండలంలోని పలు గ్రామాల రైతులు ఈ ఏడు ఖరీఫ్ వరి పంటకు ముందు స్వల్ప కాలిక పంటగా పెసరను సాగు చేశారు. జూన్ నెలలో కురిసిన వర్షాలకు ఆనందపడిన రైతులు దాదాపు 1400 ఎకరాల్లో పెసర సాగు చేశారు. ఒక్కో రైతు ఎకరానికి దుక్కి, విత్తనాలు, పురుగు మందులకు, కోత కూళ్లు కలిపి సుమారు రూ. 10 వేల పై చిలుకు ఖర్చు పెట్టారు. తొలకరిలో కురిసిన వర్షాలు పెసర పంటలకు ప్రాణం పోశాయి. కానీ జూలై, ఆగస్టు నెలలో వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల పంట ఎండి పోయే దశకు చేరుకుంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పూత, పిందె దశలో పంటకు తెగుళ్లు ఆశించాయి. దీనికి తోడు సరైన వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఎకరానికి 30 కిలోలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. దీంతో రైతులు పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి ప్రకోపానికి రైతులు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రెండు ఎకరాల్లో పెసర వేశా – బత్తుల నాగేశ్వరరావు, రైతు, వేపల సింగారం నాకు ఉన్న 2 ఎకరాల్లో పెసర సాగు చేశాను. మొదట్లో వర్షాలు బాగానే కురిశాయి. దీంతో దున్నడం, విత్తనాలు, పురుగు మందు మిషన్‌తో కలిపి ఎకరానికి రూ. 10 వేలు ఖర్చు చేశాను. అదునులో వర్షాలు కురవక పంట సరిగా పండలేదు. అంతా ఎండిపోయే దశకు చేరకుంది. పెసర కాయలు కోసి పంట నూర్పిడి చేశాక చూస్తే నష్టాలే మిగిలాయి. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపాం – రాజగోపాల్, మండల వ్యవసాయ అధికారి మండలంలో దాదాపు 1400 ఎకరాల్లో పెసర పంట సాగు చేశారు. వర్షాలు లేక బెట్ట వల్ల పంట దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరానికి 25 నుంచి 30 కిలోలు మాత్రమే దిగుబడి వచ్చింది. గ్రామాల వారీగా వివరాలు సేకరించాం. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపాం. -
వ్యవసాయంలో విజయదీపిక
తాండూరు : గాండ్ల విజయ నిర్మల. తాండూరులోని మధ్య తరగతి కుటుంబం. పుట్టిన గ్రామం కందుకూరు. తండ్రి బసప్ప రిటైర్డ్ ఉపాధ్యాయుడు. పాత తాండూరుకు చెందిన గాండ్ల నర్సింహులును 1992లో వివాహం చేసుకున్నారు నిర్మల. భర్తకు నాలుగు ఎకరాల పొలం ఉంది. 1995లో భర్త తండ్రి(మామ) మృతి చెందాడు. వ్యవ సాయ పనులు భర్త ఒక్కడే చూసుకుంటుండడంతో ఆయన సాయంగా రోజూ పొలానికి వెళ్లేది. భర్త వ్యవసాయ పనులు ఎలా చేస్తున్నాడు.. ఏ మందులు పిచికారీ చేస్తున్నాడు.. నీళ్లు పెట్టే పద్ధతి.. ఇవన్నీ పరిశీలించారు. ఇలా కొన్నాళ్లు తర్వాత వ్యవసాయ పనులపై పట్టు సాధించారు. భర్త అందుబాటులో లేకపోయినా పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేయించేది. కొద్ది రోజుల్లోనే ఇతర రైతులకూ సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. వారికున్న నాలుగు ఎకరాల్లో మొదట పెసర, మినుము పండించే వాళ్లు. కోత సమయంలో వర్షాలు పడి నష్టపోవడం చూసి పంట మార్పిడి చేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో కంది పంట సాగుకు మొగ్గుచూపారు. కందితోపాటు రోజు వారీ ఆదాయం కోసం అంతరపంటలకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక అవసరాల నిమిత్తం కందిలో అంతర పంటల సాగుతో సుమారు మూడు నెలలపాటు స్థిరమైన రోజువారీ ఆదాయం కోసం కూరగాయాలు, ఆకు కూరలు పండిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిని ఎంచుకున్నారు. భర్త సహకారంతోపాటు తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.సీ.సుధాకర్, సుధారాణిల ప్రోత్సాహం తనకు ఎంతగానో ఉపయోగపడుతోందని చెబుతోంది నిర్మల. విజయ నిర్మల పెద్ద కుమారుడు రాజవర్ధన్ ఖమ్మం జిల్లా పాల్వంచలో బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ చేస్తుండగా చిన్న కొడుకు మణివర్ధన్ ఏడో తరగతి చదువుతున్నాడు. సాధించిన విజయాలు.. ఇక్రిశాట్ తయారుచేసిన తొలి ఐసీపీహెచ్-2747 హైబ్రీడ్ రకం కంది సాగు చేపట్టారు నిర్మల. ఈ హైబ్రీడ్ రకంతో ఎకరానికి 14 క్వింటాళ్లకుపైగా దిగుబడి సాధించారు. నాటే పద్ధతిలో కంది సాగు చేసిన మొదటి మహిళా రైతు కూడా విజయనిర్మలే. మే నెలలో కంది నర్సరీని పెంచడం. జూన్ వరకు నర్సరీని కాపాడి, అదే నెల చివరిలో నాటుకోవడం.. ఇలా నాటే పద్ధతి క్లిష్టమైనప్పటికీ ఆమె విజయవంతంగా కంది సాగు చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధికంగా ఎకరాకు 12.80 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. 2013-14 సంవత్సరంలో డ్రిప్ ద్వారా నాటే పద్ధతిలో కంది సాగుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా రైతు కూడా ఈమే. డ్రిప్‌తో కంది చేస్తూనే ఏడాదిపాటు స్థిరమైన ఆదాయం కోసం అంతర పంటలుగా బెండకాయ, చిక్కుడు, కాకరతోపాటు పాలకూర, కొత్తిమీర వేశారు. ఆకు కూరలపై రోజూ రూ.500 -రూ.600, బెండకాయ తదితర పంటలతో రోజుకు రూ.700- రూ.వెయ్యి వరకు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఇలా వ్యవసాయంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను అందిపుచ్చుకుంటూ నూతన పద్ధతులతో పంటల సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించి సాధారణ గృహిణి స్థాయి నుంచి జాతీయ ఉత్తమ మహిళా రైతుగా విజయనిర్మల అవార్డు అందుకోవడం స్ఫూర్తిదాయకం. ఇక్రిశాట్‌తోపాటు ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. దేశ వ్యాప్తంగా పప్పుదినుసులను సాగుచేస్తున్న 14 రాష్ట్రాల నుంచి అధిక దిగుబడులు సాధిస్తున్న మహిళా రైతులను ఎంపిక చేసింది. రాష్ట్రానికి ఒక్కరి చొప్పున ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రం నుంచి ‘గోల్డ్ కేటగిరి’లో జాతీయ ఉత్తమ మహిళా రైతుగా ఎంపికైన ఏకైక మహిళా రైతు విజయనిర్మల. -
మక్క సాగు భలే బాగు
బయ్యారం: వరికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో సాగవుతున్న ప్రధాన పంటల్లో మొక్కజొన్న మొదటిది. రబీలో ఆరుతడి పంటలు సేద్యం చేయాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో మొక్కజొన్న యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం... అనువైన నేలలు: మొక్కజొన్న సాగుకు సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి, ఎర్ర, ఒండ్రు మట్టి ఉన్న ఇసుక, గరపనేలలు అనుకూలం. దుక్కి తయారీ: నాగలితో నాలుగు సార్లు దుక్కి దున్నాలి. చివరి దుక్కిలో మాగిన పశువుల ఎరువు కాని కంపోస్టు ఎరువు కాని వేసి దున్నాలి. ఆ తరువాత విత్తనాలను బోదె పద్ధతి, నాగలి సాళ్ళలో తగినంత తేమను చూసుకొని విత్తాలి. విత్తే కాలం: రబీ మొక్కజొన్నను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తాలి. విత్తన మోతాదు: ఎకరానికి ఏడు కిలోల విత్తనాలను విత్తుకోవాలి. ఎకరం విస్తీర్ణంలో 33 వేల మొక్కలు ఉండేలా జాగ్రత్త పడాలి. సాళ్ళ మధ్య 75 సెం.మీ, సాళ్ళలో మొక్కల మధ్య 20 సెం.మీ ఎడం ఉండేలా, బోదెకు ఒకవైపున 2 లేదా 3 సెం.మీ లోతులో విత్తాలి. పాదుకు 2 లేదా 3 మొక్కలను నాటాలి. విత్తనాలు మొలకెత్తిన తరువాత పాదుకు ఒక మొక్కను మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసివేయాలి. విత్తనశుద్ధి: కిలో విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ మందును 5 గ్రాముల చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి. అంతరపంటలు: మొక్కజొన్నలో అంతరపంటగా కంది, అలసంద, పెసర, సోయాచిక్కుడు వంటి అపరాల పంటలను వేసుకోవచ్చు. 4 లేక 5 సాళ్లు మొక్కజొన్న వేసి ఆ తర్వాత ఒక సాలు పప్పుపంట వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొక్కజొన్నకు సహజ శత్రువులైన పరాన్నజీవులు, పరాన్నభుక్తుల సంఖ్యను పెంచుకోవటమే గాక అధిక దిగుబడి, అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. కూరగాయ పంటలు ముల్లంగి, ఆకుకూరలను వేసుకొని కూడా అధికాదాయం పొందవచ్చు. ఎరువులు మొక్కజొన్న సాగుకు రెండు కట్టల యూరియా, కట్టన్నర డీఏపీ, కట్ట పొటాష్ అవసరం. డీఏపీతో పాటు కట్ట పొటాష్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. యూరియాను నాలుగు దఫాలుగా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు చల్లుకోవాలి. భూమిలో జింకు లోపముంటే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ఏ ఎరువులో కలపకుండా విడిగా వేయాలి. కలుపునివారణ: మొక్కజొన్నలో అధిక దిగుబడి సాధించాలంటే విత్తిన 45-50 రోజుల వ్యవధిలో కలుపు మొక్కలు లేకుండా తొలగించాలి. విత్తనాలు విత్తిన మూడు రోజుల వ్యవధిలో భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి కిలో అట్రాజిన్ మందును 500 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. అంతరకృషి: విత్తిన 30రోజులకోసారి, 45- 50 రోజులకు మరో సారి గొర్రుతో గాని, నాగలితో గాని సాళ్ళ మధ్య దున్నాలి. ఈ విధంగా దున్నటం వల్ల కలుపును నివారించటంతో పాటు మొక్కలకు తేమ, గాలి సక్రమంగా అందుతుంది. పంట ఏపుగా పెరుగుతుంది. తడులు: పంట మొలకెత్తిన నెలరోజుల వరకు (పంట మోకాలు ఎత్తుకు వచ్చేంత వరకు) అవసరాన్ని బట్టి, భూమి స్వభావాన్ని బట్టి నీటితడులు ఇవ్వాలి. ఈ దశలో నీటితేమ అధికంగా ఉంటే పంట ఎదుగుల తగ్గే అవకాశం ఉంది. సస్యరక్షణ చర్యలు మొక్కజొన్నలో అశించే పలు రకాల పురుగులు, తెగుళ్ళను రైతులు సరైన సమయంలో గుర్తించి, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కాండంతొలిచే పురుగు: మొక్కజొన్న మొలకెత్తిన 10 నుంచి 20 రోజుల లోపు పైరును ఇది ఆశించి ఆకుల అడుగుభాగంలో గుడ్లను సముదాయంగా పెడుతుంది. ఈ గుడ్లలో ఉన్న పురుగులు 5 రోజుల వ్యవధిలో బయటకు వస్తాయి. మొక్కజొన్న అంకురంలోకి చేరి ఎదిగే అంకురాన్ని తింటాయి. ఈ పురుగుల వల్ల మొవ్వు చనిపోయి పంటకు నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు ఎకరానికి 3 కేజీల కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఆకు సుడులలో వేయాలి. లేదా లీటర్ నీటిలో 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 0.3 మి.లీ కొరోజాన్ మందును పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు: నెలరోజులు పైబడిన పంటను మొక్కజొన్న నల్లి, పేనుబంక ఆశిస్తాయి. వీటి తల్లిపురుగులు, పిల్లపురుగులు పంటలో ఎదిగే భాగాల నుంచి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పసుపురంగుకు మారి గిడసబారుతాయి. ఈ పురుగు నివారణకు 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 1 గ్రా ఎఫిసేట్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుమాడు తెగులు: అకుమాడు తెగులు నివారణకు 2.5 గ్రాముల మాంకోజెబ్ మందును లీటర్ నీటిలో కలిపి వారానికి ఒకసారి చొప్పున మూడు పర్యాయాలు పిచికారీ చేయాలి. మొక్క ఎండు తెగులు: ఈ తెగులు నివారణకు 1 మి.లీ ప్రాఫికొనజోల్ మందును లీటర్‌నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
కందిలో అంతర పంటలుగా పప్పు ధాన్యాల సాగు మేలు
పెసర ఎల్బీజీ-407, 457, 450, 410 రకాలు ప్రస్తుతం సాగు చేసుకోవడానికి అనుకూలం. మొక్కలు నిటారుగా పెరిగి మొక్క పై భాగాన కాయలు కాస్తాయి. ఇవి పల్లాకు, వేరుకుళ్లు, ఎల్లో మొజాయిక్ తెగుళ్లను తట్టుకుంటాయి. వరి మాగాణుల్లో అయితే నీటి తడి అవసరం లేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1, 2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడి వస్తుంది. పెసర, అలసంద, మినుమును రబీ కందిలో అంతర పంటగా వేసుకోవచ్చు. అంతర పంటగా సాగు చేసేటప్పుడు ఎకరాకు 5 కిలోల విత్తనం, 6 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం వేసుకోవాలి. అలసంద స్థానికంగా దొరికే విత్తనాలను రైతులు సాగు చేసుకోవచ్చు. కిలో విత్తనానికి 3 గ్రా. ఎం-45 మందుతో కలిపి శుద్ధి చేస్తే తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించవచ్చు. చివరి దుక్కిలో 50 కిలోల డీఏపీ వేసుకోవాలి. మినుము ఎల్బీజీ-752, ఎల్బీజీ-20, 623 రకాలను సాగు చేసుకోవచ్చు. 70-80 రోజుల్లో పంట చేతికొస్తుంది. సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరాకు 6-7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 752, 20 విత్తన రకాలు పల్లాకు తెగులును తట్టుకుంటాయి. ఎల్బీజీ-623 రకం బూడిద తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉంటాయి. ఈ విత్తనాలను నాటుకోవచ్చు, వెదజల్లుకోవచ్చు. ఎల్బీజీ-645 రకం ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయలు పొడవుగా ఉంటాయి. కిలో విత్తనానికి 30 గ్రా. కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తనాలను శుద్ధి చేస్తే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఆముదం స్థానికంగా దొరికే రకాలతో పాటు క్రాంతి, హరిత, జ్యోతి, కిరణ్, జ్వాలా హైబ్రిడ్ రకాలైన జీసీహెచ్-4, డీసీహెచ్-177, 519 రకాలను సాగు చేసుకోవచ్చు. క్రాంతి రకం త్వరగా కోతకు వస్తుంది. బెట్టను తట్టుకుంటుంది. గింజ పెద్దదిగా ఉంటుంది. హరిత, జ్యోతి రకాలు ఎండు తెగులును తట్టుకుంటాయి. విత్తిన 7-10 రోజుల్లో మొలక వస్తుంది. 15-20 రోజుల తర్వాత కనుపునకు ఒకే మొక్క ఉండేలా.. చుట్టూ ఉన్న మొక్కలను పీకేయాలి. ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి కలియదున్నాలి. వివిధ రకాలు సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30-35 రోజులకు 6 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి. -
ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం
మోర్తాడ్ : వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెల రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేక పోవడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. వేసవి కాలం మాదిరిగా ఎండలు కాస్తున్నాయి. గత సంవత్సరం అతివృష్టి కారణంగా భూగర్భ జలాలు బాగానే ఉన్నా భూమి లో వేడిమి తగ్గని కారణంగా పంటల సాగుకు వాతావరణం అనుకూలించడం లేదు. సోయా విత్తితే మొలకెత్తని పరిస్థితి నెలకొంది. బోరుబావుల ద్వారా సోయా, వరి పంటలను సాగు చేయాలని రైతులు ప్రయత్నిస్తున్నా భూమి అనుకూలించక పోవడంతో విత్తనం వృథా అవుతోంది. జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం మిన హా అన్ని మండలాల్లో వర్షపాతం లోటు ఉంది. సాధారణ వర్షపాతానికి కనీసం 50 శాతం కూడా నమోదు కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనేక మంది రైతులు సోయా విత్తనాలను రెండు మార్లు విత్తారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉండటంతో ప్రత్యామ్నా య పంటల సాగుతో రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. పెసర్లు, మినుములు సాగు చేయడానికి అనుకూలంగా వాతావరణం ఉండటంతో ఈ రెండు పంటలను సాగు చేయించి రైతాంగానికి దారి చూపాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రతి మండలంలోను వ్యవసా య శాఖ అధికారులు ఈ ఖరీఫ్ సీజనుకుగాను సోయా, వరి పంటలకు బదులు పెసర్లు, మినుములు సాగు చేయించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. రైతాంగానికి ఎంత మేర విత్తనాలు అవసరమో అంచనా వేస్తున్నారు. సోయా, వరి సాగులకు ఇంకా కొంత సమయం ఉన్నా ముందు ముందు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలి యదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళి కను సిద్ధం చేస్తున్నారు. ఒక వేళ వర్షాలు కురిస్తే సోయా, వరి సాగుకు అవసరం అయిన విత్తనాలు రైతుల వద్ద రెడీగా ఉన్నాయి. రెండు, మూడు భారీ వర్షాలు కురిసే వరకు రైతులు కాస్తా ఓపిక పట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో వ్యవసాయ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికను సిద్ధం చేసి ఉంచు తున్నారు.