ఇబ్బందుల్లో పెసర రైతులు
ఇబ్బందుల్లో పెసర రైతులు
Published Mon, Aug 29 2016 6:11 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
హుజూర్‌నగర్ రూరల్: ఎంతో ఆశతో ఖరీఫ్‌లో పెసర సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాభం మాట అటుంచితే కనీసం విత్తనాల ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పప్పుధాన్యాలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రచారం చేయడంతో మండలంలోని పలు గ్రామాల రైతులు ఈ ఏడు ఖరీఫ్ వరి పంటకు ముందు స్వల్ప కాలిక పంటగా పెసరను సాగు చేశారు. జూన్ నెలలో కురిసిన వర్షాలకు ఆనందపడిన రైతులు దాదాపు 1400 ఎకరాల్లో పెసర సాగు చేశారు. ఒక్కో రైతు ఎకరానికి దుక్కి, విత్తనాలు, పురుగు మందులకు, కోత కూళ్లు కలిపి సుమారు రూ. 10 వేల పై చిలుకు ఖర్చు పెట్టారు. తొలకరిలో కురిసిన వర్షాలు పెసర పంటలకు ప్రాణం పోశాయి. కానీ జూలై, ఆగస్టు నెలలో వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల పంట ఎండి పోయే దశకు చేరుకుంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పూత, పిందె దశలో పంటకు తెగుళ్లు ఆశించాయి. దీనికి తోడు సరైన వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఎకరానికి 30 కిలోలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. దీంతో రైతులు పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి ప్రకోపానికి రైతులు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
రెండు ఎకరాల్లో పెసర వేశా – బత్తుల నాగేశ్వరరావు, రైతు, వేపల సింగారం
నాకు ఉన్న 2 ఎకరాల్లో పెసర సాగు చేశాను. మొదట్లో వర్షాలు బాగానే కురిశాయి. దీంతో దున్నడం, విత్తనాలు, పురుగు మందు మిషన్‌తో కలిపి ఎకరానికి రూ. 10 వేలు ఖర్చు చేశాను. అదునులో వర్షాలు కురవక పంట సరిగా పండలేదు. అంతా ఎండిపోయే దశకు చేరకుంది. పెసర కాయలు కోసి పంట నూర్పిడి చేశాక చూస్తే నష్టాలే మిగిలాయి.
పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపాం – రాజగోపాల్, మండల వ్యవసాయ అధికారి
మండలంలో దాదాపు 1400 ఎకరాల్లో పెసర పంట సాగు చేశారు. వర్షాలు లేక బెట్ట వల్ల పంట దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరానికి 25 నుంచి 30 కిలోలు మాత్రమే దిగుబడి వచ్చింది. గ్రామాల వారీగా వివరాలు సేకరించాం. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపాం.
Advertisement
Advertisement