సాక్షి, హుజూర్‌నగర్/ఖమ్మం: సూర్యాపేట జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన గుర్తుతెలియని యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులే సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు తేలింది. కేసు వివరాలను సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సోమవారం సీఐ రామలింగారెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన క్షత్రియ రామ్‌సింగ్, రాణిబాయి దంపతులు ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నారు. వీరి కుమారుడు సాయినాథ్ (26) మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటు పడి తల్లిదండ్రులను వేధిస్తుండగా, ఆయనను తుదముట్టించాలని నిర్ణయించుకున్నారు.
రాణిబాయి తమ్ముడైన మిర్యాలగూడకు చెందిన సహదేవుల సత్యనారాయణను సంప్రదించడంతో ఆయన మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన రమావత్ రవి, పానుగోతు నాగరాజు, బురుగు రాంబాబు, ధరావత్ సాయికి రూ.8లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో రూ.1.5లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈక్రమంలో రెండు సార్లు సాయినాథ్‌పై హత్యాయత్నం చేసినా విఫలమయ్యారు.
మూడోసారి..
సాయినాథ్ మేనమామ సత్యనారాయణ సహకారంతో సుపారీ గ్యాంగ్ సభ్యులు ఆయనను అక్టోబర్ 17న రాత్రి ఖమ్మం నుంచి మిరాల్యగూడకు తీసుకొచ్చారు. మరుసటి రోజు కల్లేపల్లి శివారు మైసమ్మ గుడి వద్ద మద్యం తాగించి ప్లాస్టిక్ తాడుతో ఉరివేసి హత్య చేశారు. అదేరోజు రాత్రి మృతుడి కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి పాలకవీడు మండలంశూన్యంపహాడ్ శివారు మూసీ నదిలో వేసి వెళ్లిపోయారు. కాగా, 19వ తేదీన మృతదేహం తేలడంతో పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎస్సై సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాహనం నంబర్ ఆధారంగా...
ఘటనాస్థలం సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఓ కారు వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వాహనం నంబర్ ఆధారంగా పరిశీలించి సాయినాథ్ కారుగా తేలడంతో ఆచూకీ కోసం ఆరా తీస్తుండగానే, ఆయన తల్లిదండ్రులు అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చారు. దీంతో అనుమానించిన పోలీసులు రామ్‌సింగ్ – రాణిబాయిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది.
సాయి తల్లిదండ్రులతో పాటు పాత్రధారులైన ఐదుగురిని అరెస్ట్ చేసి, నాలుగు కార్లు, రూ.23,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై సైదులు, సిబ్బంది అంజయ్య, వెంకటేశ్వర్లు, ఉపేందర్, జానీ పాషాను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment