సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్‌లోని అంకాపూర్ అనగానే రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ దేశీ చికెన్ గుర్తొస్తుంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు సైతంఈ దేశీ చికెన్ పార్సిళ్ల రూపంలో వెళుతోంది. అయితే ఇదే అంకాపూర్ పశుగ్రాసం కోసం పెంచే ఎర్రజొన్న విత్తనాల ఎగుమతిలోనూ ప్రత్యేకత పొందింది. ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌తోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాకు సైతం ఎర్రజొన్న విత్తనాలు ఎగుమతి చేస్తున్నారు.
ఉత్తరాదిలో పశుగ్రాసానికి ఆధారం ఇదే..
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్‌లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు ఏటా ఎర్రజొన్న సాగు చేస్తున్నారు. పక్కనే ఉన్న నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోనూ రైతులు మరో 30 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఉత్తరాదిలో పశుగ్రాసం పెంచేందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ఎర్రజొన్నలను వాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్‌లో 40 చోట్ల ఎర్రజొన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వాటిలో 10 యూనిట్లు చుట్టుపక్కల ఉండగా ఒక్క అంకాపూర్‌లోనే 30 ఎర్రజొన్న యూనిట్లు ఉన్నాయి. దీంతో ఎర్రజొన్న విత్తనాలకు కేరాఫ్‌గా అంకాపూర్ పేరుగాంచింది.
ఏపీలో చూసొచ్చి..
1983లో ఏపీలోని ఏలూరులో ఎర్రజొన్న విత్తనాల పంటలను పరిశీలించి వచ్చిన ఆర్మూర్ ప్రాంత రైతులు ఈ సాగు ప్రారంభించారు. రైతులు ఏటా అక్టోబర్, నవంబర్‌లలో ఒప్పందం ద్వారా విత్తన వ్యాపారుల నుంచి ఫౌండేషన్ సీడ్‌ను తీసుకుంటారు. ఫిబ్రవరిలో పంట చేతికి రాగానే ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చిన వ్యాపారులకే రైతులు అమ్ముతారు.
రైతుల నుంచి సేకరించిన విత్తనాలను వ్యాపారులు ఆయా యూనిట్లలో శుద్ధిచేసి ప్యాక్ చేసి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
నిజామాబాద్ భూములే సాగుకు అనుకూలం..
దేశం మొత్తంలో తెలంగాణలోని నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే భూములు ఎర్రజొన్న విత్తనాలు పండించేందుకు అనుకూలంగా ఉన్నాయి. కర్ణాటకలోని బళ్లారిలో 15 శాతం ఎర్రజొన్న విత్తనాలు పండిస్తుండగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో కలిపి 85 శాతం ఎర్రజొన్న విత్తనాలను పండిస్తున్నారు.
రైతుల నుంచి కిలో రూ.45 చొప్పున ఎర్రజొన్నలను తీసుకుంటున్న వ్యాపారులు వాటిని శుద్ధిచేసి కిలో రూ.65 చొప్పున అమ్ముతున్నారు. ఏటా ఇక్కడి నుంచి 60 వేల మెట్రిక్ టన్నుల ఎర్రజొన్న విత్తనాలను శుద్ధిచేసి ఎగుమతి చేస్తున్నారు.
ప్రభుత్వం కొంటేనే మేలంటున్న రైతులు..
సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారుతుండడంతో ఏటా ధర విషయంలో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వమే విత్తన విధానాన్ని రూపొందించి రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకునే విధానాన్ని తయారుచేస్తే రైతులకు మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక్కడి ఎర్రగరప నేలలు అనుకూలం
నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఎర్రగరప నేలలు ఎర్రజొన్న పంటకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే, పశువుల పెంట, చెరువు నల్లమట్టి ఈ భూముల్లో వేస్తారు. మరోవైపు ఈ మూడు జిల్లాల్లోని వాతావరణ పరిస్థితులు ఎర్రజొన్న సాగుకు కలిసివస్తున్నాయి.
రైతులు పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న పంటల మార్పిడి వ్యవసాయం చేస్తుండడంతో మరింత మేలు చేస్తోంది. ప్రైవేటు వ్యాపారులు అంకాపూర్‌లో యూనిట్లు ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహిస్తుండడంతో ఎర్రజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. – హరికృష్ణ, వ్యవసాయాధికారి, ఆర్మూర్
Comments
Please login to add a commentAdd a comment