ఈ వారం వ్యవసాయ సూచనలు
మాఘీ జొన్న సాగుకు ఇదే అదను
* సెప్టెంబర్ మాసం రబీ (మాఘీ) తెల్లజొన్న, పచ్చజొన్న, జొన్న విత్తనోత్పత్తికి అనుకూలం. వరంగల్, మెదక్, రంగారెడ్డి, కర్నూలు, కడప జిల్లాల్లో జొన్న సాగుకు ఈ సమయం అనుకూలం.
* మాఘీకి అనువైన తెల్లజొన్న రకాలు: ఎన్.టి.జె-1, ఎన్.టి.జె-2, ఎన్.టి.జె-3, ఎన్.టి.జె-4, కిన్నెర, సి.ఎస్.హెచ్-16. అనువైన పచ్చజొన్న రకాలు: ఎన్-13, ఎన్-14. ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని విత్తుకోవాలి.
* శిలీంధ్ర నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల ధైరమ్ లేదా కాప్టాన్, మొవ్వు ఈగ నివారణకు 3 గ్రాముల థమోమిధాక్సాం కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
* కలుపు నివారణకు అట్రజన్ 50% పొడి మందును ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల లోపల నేలపై తడి ఆరకముందే పిచికారీ చేయాలి.
* మాఘీ జొన్నలో సమస్యగా ఉన్న ఈ జొన్నమల్లె కలుపు నివారణకు 50 గ్రా. అమ్మోనియం సల్ఫేటు లేదా 200 గ్రాముల యూరియాను లీటరు నీటికి కలిపి మల్లెపై పిచికారీ చేసి నివారించవచ్చు.
* విత్తిన 35-40 రోజులప్పుడు జొన్న పంటలో మల్లె కలుపు మొక్క మొలకెత్తుతుంది. ఇది జొన్న మొక్క వేళ్ల మీద నుంచి సారాన్ని పీల్చుకోవడం ద్వారా జొన్న పంట ఎదుగుదలను తగ్గిస్తుంది.
* భూసారాన్ని అనుసరించి వరుసల మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరంతో విత్తుకొని ఎకరాకు 58 వేల నుంచి 70 వేల మొక్కల సాంద్రత ఉండేట్లుగా చూసుకోవాలి.
* వర్షాధారపు మాఘీ జొన్నకు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేయాలి.
* 24-32 కిలోల నత్రజని ఎరువును విత్తేటప్పుడు ఒకసారి, 30-45 రోజుల మధ్యలో రెండు దఫాలుగా వేసుకోవాలి.
* విత్తిన తొలి 30 రోజుల్లో జొన్నకు మొవ్వు తొలిచే ఈగ ఆశించి నష్టపరుస్తుంది. సరైన సమయంలో విత్తుకోవడంతోపాటు కార్బోఫ్యురాన్ 3జి గుళికలను మీటరు సాలుకు 2 గ్రాముల వంతున ఇసుకలో కలిపి విత్తేటప్పుడు సాళ్లలో వేసుకోవాలి.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
చేపల సాగులో ఎఫ్.సి.ఆర్.ను బట్టే లాభనష్టాలు
* ఆక్వా సాగులో రైతులు 50 శాతం పైగా పెట్టుబడి మేత కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ‘మేత వినిమయ నిష్పత్తి’(ఎఫ్.సి.ఆర్.)మీదే లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి.
* ఎన్ని కేజీల మేతకు, ఎన్ని కేజీల చేపలు ఉత్పత్తి అయ్యాయనే విష యాన్ని అంచనావేసే పద్ధతినే ‘మేత వినిమయ నిష్పత్తి’ అంటారు.
* సాధారణంగా నూనె తీసిన తవుడు, వేరుశనగ చెక్కను మేతగా వాడి న చెరువుల్లో ఎఫ్.సి.ఆర్. 2.5-3.0 :1.0 గాను, కణికల (పెల్లెట్స్) మేత వాడిన మేతలో 1.5:1.0 గాను ఉండే అవకాశముంది.
* ఎఫ్.సి.ఆర్. ఎంత తక్కువగా ఉన్నట్లయితే, మేత అంత నాణ్యమైనదని అర్థం. అంతేగాక తక్కువ ఎఫ్.సి.ఆర్. ఉన్నప్పుడు, రైతులకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశముంది.
- డాక్టర్ పి. రామ్మోహన్ రావ్(98851 44557), అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఫిషరీస్, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, కాకినాడ
గొర్రెలకు వైరస్ వ్యాధులతో ముప్పు
* గొర్రెల పెంపకానికి గొడ్డలిపెట్టులా మారిన వ్యాధుల్లో బ్యాక్టీరియా వ్యాధులతోపాటు వైరస్ వ్యాధులు కూడా ఉన్నాయి. కొన్ని వివరాలు తెలుసుకుందాం.
* గాలికుంటు వ్యాధి(గాళ్లు): ఈ వ్యాధి సోకితే నోరు, నాలుక, గిట్టల మధ్య పుండ్లు వస్తాయి. 104-105 డిగ్రీల జ్వరం వస్తుంది. చొంగ కారుతుంటుంది. పుండ్ల వల్ల మేత తినలేక పశువులు నీరసించి చనిపోతాయి. జొన్నజావ, గ్లూకోజ్ కలిపి తాగించాలి. దీని నివారణకు టీకా వేయించాలి.
*నీటి నాలుక వ్యాధి: దీన్ని మూతి వాపు వ్యాధి అని కూడా అంటారు. ఈ వర్షాకాలపు వ్యాధి ప్రస్తుతం చాలా పశువులకు సోకింది. దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. 1% పొటాషియం పర్మాంగనేట్‌తో కడగడం ఉపశమనాన్నిస్తుంది. టీకాలు లేవు.
*అమ్మతల్లి/బొబ్బ రోగం: ఈ వ్యాధి సోకిన గొర్రెల చెవులు, పొదుగు, తొడలు, కంటి రెప్పలపై దద్దుర్లు వస్తాయి. అవి చీము పట్టి, పగిలి రసికారతాయి. దీని నివారణకు టీకా వేయించాలి.
- డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా
తెల్లమచ్చల వైరస్ వ్యాధికి నీటి శుద్ధే మందు!
* వెనామీ రైతులు తెల్ల మచ్చల వైరస్‌ను గమనించినప్పుడు చేయగలిగింది నీటిని శుద్ధి చేయడం మాత్రమే. నీటిలో సంచరించే విర్యాన్ కణాలు / వైరస్ కణాల రోగ కారకతను తగ్గించేందుకు బ్లీచింగ్ పౌడర్(ఎకరాకు 25 కిలోల మోతాదు) లేదా ఫార్మలిన్ ద్రావణం(చెరువు లోతును బట్టి ఎకరానికి 5-10 లీటర్లు) వాడటం ఒక్కటే పరిష్కారం.
* అయితే, రొయ్య శరీరంలోని వైరస్ నిర్మూలనకు మందులు లేవు. పైన చెప్పుకున్న మందులు శరీరంలోని వైరస్‌ను ఏమీ చేయలేవు.
* వైరస్ తీవ్రత వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. తెల్లమచ్చల వైరస్ కణం రొయ్య శరీరంలోకి ప్రవేశించిన 6 గంటల నుంచి కణజాలంలో వ్యాధికి సంబంధించిన మార్పులు మొదలవుతాయి.
* తెల్లమచ్చల వైరస్ వ్యాధి స్కాంపీ, టైగర్ రొయ్యల్లో కంటే తెల్ల రొయ్యలు, వెనామీ రొయ్యలకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది.
- ఆచార్య పి. హరిబాబు, ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా