వేరుశనగ పొలంలో దిగాలుగా కూర్చున్న రైతు
రైతు కుదేలు
Published Sat, Sep 17 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
– రబీలో చీడపీడలు
– ఖరీఫ్‌లో వర్షాభావం
– అందని ఇన్‌పుట్ సబ్సిడీ
– వెంటాడుతున్న రుణపాశం
– బంగారంపై రుణాలివ్వద్దంటున్న ప్రభుత్వం
– అయోమయంలో అన్నదాతలు
చిత్తూరు (అగ్రికల్చర్) : జిల్లాలోని రైతులు నష్టాలను చవిచూస్తూ కుదేలవుతున్నారు. గత రబీసీజన్‌లో వరి పంటకు చీడపీడలు సోకడంతో దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంట పూర్తిగా చేజారిపోయింది. ఏ సీజన్‌కు ఆ సీజన్‌లో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
సాధారణంగా జిల్లాలో 2.11 లక్షల హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. రబీలో అత్యధికంగా తూర్పు మండలాల్లో వరి సాగుచేయగా, ఖరీఫ్‌లో పడమటి మండలాల్లో వేరుశనగను సాగుచేస్తారు. దశాబ్ద కాలంగా తీవ్ర వర్షాభావంతో పంటల సాగు అంతంత మాత్రంగా ఉంటోంది. గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు దాదాపుగా అన్ని చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. భూగర్భ జలాలు పెరిగాయి. రైతులు గత రబీ సీజన్‌లో పంటల సాగుపై ఆసక్తి చూపారు.
చీడపీడల బెడద
గత రబీలో జిల్లా వ్యాప్తంగా 80 వేల హెక్టార్లలో వరి సాగుచేశారు. పంట ఏపుగా పెరగడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావొచ్చని అందరూ భావించారు. అయితే పంట చేతికందే సమయంలో చీడపీడలు వరి కంకులను నాశనం చేశాయి. దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల మేరకు దిగుబడి తగ్గిపోయింది.
చేజారిన వేరుశనగ
ప్రస్తుత ఖరీఫ్‌లో సాగవుతున్న వేరుశనగ పంటకు సాగునీరు లేక పూర్తిగా చేజారింది. జిల్లాలో 1.21 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగుచేశారు. 50 రోజులుగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంట దాదాపుగా ఎండిపోయింది. ప్రభుత్వం రెండు వారాల క్రితం వేరుశనగకు రెయిన్‌గన్స్ ద్వారా తడులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. రైతులకు దాదాపు రూ.130 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు నిపుణులు చెబుతున్నారు.
అందని ఇన్‌పుట్ సబ్సిడీ
ఇన్‌పుట్ సబ్సిడీ అందించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్ణక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. 2013–14కి గాను రైతులకు 98 వేల హెక్టార్లలకు రూ.90 కోట్ల మేరకు, 2014–15కి గాను 1.1 లక్షల హె క్టార్లకు రూ.108 కోట్ల మేరకు ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం అందించాల్సి ఉంది. కానీ ఇంతవరకు చిల్లిగవ్వకూడా రైతులకు విదల్చలేదు. దీంతో వారు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది.
వెంటాడుతున్న రుణపాశం
2013 డిసెంబర్ నాటికి 8,70,321 మంది రైతులు రూ.11,780.25 కోట్ల మేర బ్యాంకర్లకు బకాయి పడ్డారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు మాటలు నమ్మి చాలా మంది రైతులు మోసపోయారు. అనేక ఆంక్షల కారణంగా జిల్లాలో 4,53,773 మంది రైతులే రుణమాఫీకి అర్హత సాధించారు. వీరికి కూడా స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ పేరుతో నిబంధనలు పెట్టి వడ్డీలకు కూడా చాలని విధంగా రుణమాఫీ చేశారు. అప్పులు ఏమాత్రం తీరకపోగా మరిన్ని కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది.
బంగారు రుణాలపై ఆంక్షలు
బంగారంపై తీసుకునే వ్యవసాయ రుణాల వల్ల రుణమాఫీలో సమస్యలు వస్తున్నాయని, కావున సాగుకు బంగారంపై రుణాలివ్వద్దంటూ ఈ నెల 13న నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. ఫలితంగా చాలా మంది రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. బ్యాంకు రుణాల పరపతి పూర్తిగా దెబ్బతింది. ఈ ఏడాదికి కేటాయించిన రూ.2,500 కోట్ల మేర రుణ లక్ష్యం అధికమించే పరిస్థితులు కనిపించడం లేదు.
Advertisement
Advertisement