ముంచేశావు బాబూ ..
-
జిల్లాలో 90 శాతం ఎండిపోయిన వేరుశనగ పంట
-
రెయిన్‌గన్‌లతో కాపాడలేకపోయిన ప్రభుత్వం
-
పంట ఎండిన సంగతి తనకు తెలీదని సీఎం వింత వాదన
-
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మంత్రులు పల్లె, పరిటాల, ప్రత్తిపాటి
-
రైతులను ఆదుకోవడంలో కొట్టొచ్చినట్లు కన్పిస్తోన్న ప్రభుత్వ నిర్లక్ష్యం
-
నేటి నుంచి రంగంలోకి మంత్రులు, ఐఏఎస్, గ్రూపు–1 అధికారులు
‘అనంత’ వేరుశనగ రైతుల పరిస్థితి నాలుగేళ్లుగా అత్యంత దయనీయంగా ఉంది. కరువు దెబ్బకు నిలవలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు తెగించారు. తక్కిన రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయనే వాతావరణ నిపుణుల ప్రకటనను నమ్మి జిల్లా వ్యాప్తంగా 6.06 లక్షల హెక్టార్లలో పంట సాగు చేశారు. ఇందులోనూ జూన్‌లో తొలకరి వర్షాలకు అధికశాతం పంట వేశారు. మామూలుగానైతే ఈ పంటను సెప్టెంబరు 15లోపు తొలగించాలి. అయితే.. నెల రోజులుగా వర్షం లేకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. ఇప్పటి వరకూ 57 మండలాల్లో ఎండిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో అధికారికంగానే 55 మండలాల్లో డ్రైస్పెల్స్(28 రోజులుగా వర్షం పడని మండలాలు)ను అధికారులు నిర్ధారించారు.
ఇప్పుడు అప్రమత్తమయినా..
జిల్లాలో వేరుశనగ సాధారణ సాగువిస్తీర్ణం 6.30 లక్షల హెక్టార్లు. ఇందులో 6.06 లక్షల హెక్టార్లలో పంటసాగు చేశారు. ఇందులో 5.41లక్షల హెక్టార్లు ఈ నెల 29 నాటికే ఎండుముఖం పట్టింది. ఇప్పుడు ప్రభుత్వం అన్ని పంటలకూ నీళ్లిస్తే రెండు లక్షల హెక్టార్లను ఒకమేర కాపాడొచ్చు. అయితే 50 శాతానికి పైగా పంట దిగుబడి తగ్గుతుంది. మరో 3లక్షల హెక్టార్ల పంట పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా 2–3బస్తాల కాయలు రావొచ్చు. తక్కిన 41వేల హెక్టార్లు దేనికీ పనికిరాకుండా ఎండిపోయింది. జూలైలో సాగైన పంటకు 2–3రోజుల్లో నీళ్లిస్తేనే పైన పేర్కొన్న దిగుబడి వస్తుంది. లేదంటే అది కూడా గ్రాసానికే పరిమితమవుతుంది. మరి ఈ మేరకు ప్రభుత్వం నీరిచ్చి పంటను కాపాడటం కష్టసాధ్యమైన పని.
కొట్టొచ్చినట్లు కన్పిస్తోన్న ప్రభుత్వ నిర్లక్ష్యం
పంట ఎండిపోవడం వెనుక ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. వర్షం రాకపోతే పంటను కాపాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 6న ధర్మవరం, 15న అనంతపురం పర్యటనలో ప్రకటించారు. అయితే.. ఈ నెల 6వ తేదీకే మంచి వర్షం కురవాల్సిన పరిస్థితి. వర్షం లేక అప్పటి నుంచే పంట ఎండుముఖం పట్టింది. అప్పుడే కాపాడే చర్యలకు ఉపక్రమించి ఉంటే కొంతమేర న ష్టం తగ్గేది. అయితే.. ఆగస్టు 15 వరకూ స్వాతంత్య్ర వేడుకలు మినహా అధికార యంత్రాంగానికి రైతుల సంక్షేమం పట్టలేదు. పంట స్థితిగతులపై మంత్రులు పల్లె, పరిటాల సునీత కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించలేదు. విపక్షపార్టీతో పాటు తక్కిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యమంత్రి కూడా ఈ నెల అరంభం నుంచి 24వరకూ కృష్ణాపుష్కరాలు, విజయోత్సవ సంబరాల్లో మునిగితేలారు. టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ ఎంత వర్షం కురిసింది, పంటల పరిస్థితి ఏంటనేది తాను చెప్పగలనని ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించిన చంద్రబాబుకు.. మరి ‘అనంత’ దుస్థితి ఎందుకు కన్పించలేదనేది తేలాల్సిన ప్రశ్న. ధర్మవరం పర్యటన తర్వాత సీఎం ‘అనంత’ పర్యటనకు వచ్చే సమయానికే పంట ఎండుతోంది. అప్పుడు కూడా నష్టనివారణ చర్యలకు ఉపక్రమించలేదు.
మంత్రులు, అధికారులే బాధ్యులా?
పంట ఎండిపోవడాన్ని ఆలస్యంగా గుర్తించడంలో మంత్రులు, అధికారుల నిర్లక్ష్యం ఉందని నేరుగా సీఎం వ్యాఖ్యానించడాన్ని చూస్తే ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది. దీంతో పాటు నెలరోజులుగా పంట పరిస్థితి తెలుసుకోలేకపోవడంలో సీఎం నిర్లక్ష్యం కూడా ఉంది. దీనికి ఆయన నైతిక బాధ్యత వహించాలి. జరిగిన నష్టాన్ని ప్రజలు మరచిపోయేలా, ప్రభుత్వం తీవ్రంగా శ్రమించిందనే భావన కలిగేలా నేటి నుంచి సీఎం, మంత్రులు, అధికారులు జిల్లాలో తిష్టవేసి హడావుడి చేస్తుండడం రైతులను మోసం చేయడమేనని స్పష్టమవుతోంది. జిల్లాలో ఇప్పటి వరకూ 61,430 హెక్టార్లలో పంట ఎండిపోయిందని, ఇందులో42వేల హెక్టార్లకు నీళ్లిచ్చి కాపాడామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి ప్రకటించడం కూడా విమర్శలకు దారితీస్తోంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు లెక్కలను వల్లించడమేనని పరిశీలకులు మండిపడుతున్నారు. ఇప్పుడైనా వాస్తవాలను గుర్తించి బతికే అవకాశమున్న పంటకు నీరివ్వాలి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. లేదంటే రైతుల ఆత్మహత్యలకు పాలకులు బాధ్యత వహించక తప్పదు.