ఇంటికో ఉద్యోగమని ముంచేశాడు
- సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నాయకుల ధ్వజం
- ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే
అనంతపురం : ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులను నిలువునా ముంచాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో మేడేని ఘనంగా జరుపుకున్నారు. ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి జెండా ఆవిష్కరించారు. ముందుగా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ‡ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు బాసటగా నిలవడంతో పాటు కార్మికుల ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కార్మికులు, కర్షకులకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి వారికి కనీస భద్రత కూడా కల్పించలేని స్థితిలో ఉందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించిన ఘనత దివంగత నేత వైఎస్‌ఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్మికులకు అండగా నిలిచారన్నారు. ఆర్టీసీ కార్మికులు ఫిట్‌మెంట్ సాధించడంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ నాయకత్వంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన హక్కుల కోసం పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ ముందుంటుందన్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి ఎండగట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యులు బి.ఎర్రిస్వామిరెడ్డి, నాయకులు అనంత చంద్రారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, నగర అధ్యక్షుడు బలరాం, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలె జయరాంనాయక్, ఆటో యూనియన్ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, లారీ అసోసియేషన్ రంగనాయకులు, కిసాన్ విభాగం జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, నాయకులు రిలాక్స్ నాగరాజు, బోయ తిరుపాలు, జేఎం బాషా, గుజ్జల శివయ్య, వెంకటరామిరెడ్డి, గోపాల్‌మోహన్, మహిళా విభాగం శ్రీదేవి, కృష్ణవేణి, కార్పొరేటర్ గిరిజమ్మ, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.