peanut crop
-
వేరుశనగ రైతులను ఆదుకోవాలి
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో వేరుశనగ పంటకు జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించనుంది. రైతులను ఆదుకోవడం కోసం పంట కొనుగోలు నిబంధనలు సడలించాలని కోరనుంది. రాయలసీమ జిల్లాల్లో ఏటా 7.46 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశనగ సాగు చేస్తున్నారు. సగటున ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంటే.. ఈ ఏడాది భారీ వర్షాల వల్ల 5 క్వింటాళ్లకు మించి రావడం లేదు. వేరుశనగ గింజ 50 శాతానికి పడిపోవడం, రంగు మారడం, తేమ శాతం అధికంగా ఉండటంతో రైతులు ప్రైవేట్ మార్కెట్లో క్వింటాకు రూ.4 వేలకు మించి అమ్ముకోలేకపోతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.5,275గా మద్దతు ధర ప్రకటించింది. అయితే వేరుశనగ గింజ 70 శాతం, డ్యామేజీ 2%, తేమ 8% లోపు ఉండాలని కేంద్రం నిబంధనలు విధించింది. వర్షాల వల్ల అరకొరగా పండిన పంటకు ఈ నిబంధనలు అనుకూలంగా లేకపోవడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. 4 రోజులపాటు సీమ జిల్లాల్లో వేరుశనగ పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలించిన మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూధనరెడ్డి అక్కడి పరిస్థితులను ప్రభుత్వానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో సడలింపులు తీసుకురావడం ద్వారా రైతులను ఆదుకోవాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నివేదిక అందచేయనుంది. 15 తర్వాత పంట కొనుగోళ్లు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా 1.83 లక్షల టన్నుల వేరుశనగ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రతి ఆర్బీకే పరిధిలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆయా జిల్లాల్లో దాదాపు 2,900 కొనుగోలు కేంద్రాల ద్వారా వేరుశనగను ప్రభుత్వం సేకరించనుంది. కేంద్రం నిబంధనల ప్రకారం ఉన్న వేరుశనగకు క్వింటాకు రూ.5,275 చెల్లిస్తామని ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలకంఠనాథరెడ్డి తెలిపారు. ఈ నెల 15 తర్వాత పంట నాణ్యతను పరిశీలించి.. కొనుగోలు చేస్తామని చెప్పారు. కాగా, భారీ వర్షాలకు ముందు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పంట చేతికి వచ్చిన రైతులకు ప్రైవేట్ మార్కెట్లో కూడా మంచి రేటు లభిస్తోంది. ఆ పంట నాణ్యంగా ఉండటంతో క్వింటాకు మద్దతు ధర కంటే అధికంగా అమ్ముకోగలిగారు. ఇలా వర్షాల ముందు పంట అమ్మిన రైతులు సాగు విస్తీర్ణంలో 30 శాతం వరకు ఉంటారని ఆయిల్‌ఫెడ్ అధికారులు తెలిపారు. ఆయిల్‌ఫెడ్ ఎండీ నీలకంఠనాథరెడ్డి ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తూ రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. -
పెట్టుబడి రాయితీపై కోటి ఆశలు
► ఏటా లబ్ధిదారుల ఎంపికలో విపక్ష ► సాంకేతిక కారణాలు కొంత అడ్డంకి ► మంజూరైనా అందని సబ్సిడీ కరువు సీమలో ఏ కాస్త సాయమందినా రైతుకు ఎంతో ఊరట. వరుసగా పంటలను కోల్పోయి పెట్టుబడికి పైసాలేనివారికి ఇది భరోసా. అయితే ఏటా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ప్రకటిస్తున్నా కంటితుడుపుగానే ఉంటోంది. కొండంత నష్టపోతే పిసరంత సహాయం అందుతోంది. అది కూడా సాంకేతిక కారణాలతో కొందరికి రెండేళ్లుగా అందడం లేదు. మరో పక్క అధికార పార్టీ తమ అనుయాయులకే ఇందులో అగ్రాసనమేస్తోందన్న అపప్రథ బలంగా ఉంది. ఈనేపథ్యంలో బుధవారం నుంచి విడుదల కానున్న పెట్టుబడి రాయితీపై మరోసారి అన్నదాత ఆశగా ఎదురుచూస్తున్నాడు. చిత్తూరు (కలెక్టరేట్): వేరుశనగ పంట కోల్పోయిన తమకు ప్రభుత్వమిచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈ సారైనా సక్రమంగా అందుతుందా అని రైతులు సందేహిస్తున్నారు. రెండేళ్లుగా సబ్సిడీ నిధులు అధికార పార్టీకి చెందిన వారికే దక్కాయని ఆవేదన చెందుతున్నారు. తాజాగా రూ. 163 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని బుధవారం నుంచి అందించనున్నట్లు సర్కారు ప్రకటించింది. రైతులు ఏటా ఖరీఫ్‌లో వర్షాధార పంటగా వేరుశనగ సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావంతో ఏ ఏడాదికాయేడాది పంటను నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నష్టపరిహారం కింద రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందిస్తోంది. 2014లో 83 వేల హెక్టార్లలో వేరుశనగ పంట నష్టపోయినట్లు గుర్తించారు. రూ.90 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించారు. 2015లో 80 వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు గుర్తించి రూ. 128 కోట్లు విడుదల చేశారు. మంజూరైందంతా రైతులకు చేరడం లేదు. 2014లో రూ.79 కోట్లు, 2015కు సంబంధించి ఇప్పటి వరకు రూ.110 కోట్లు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమయింది. మిగిలిన నిధులు చేరలేదు. ఆన్లైన్లో సాంకేతిక లోపాల వల్ల రైతులు నష్టపోయారు. దీనికితోడు రెండేళ్లుగా చాలా మంది అర్హులైన లబ్ధిదారులకు ఈ సాయం అందలేదనే విమర్శలున్నాయి. అధికార పార్టీకి అనుకూలమైన వారికి మాత్రమే రెవెన్యూ సిబ్బంది ఇన్పుట్ సబ్సిడీ వర్తించేలా లెక్కలు వేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై పలుమార్లు ప్రజా వాణిలో కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నాలు చేసినా ఫలితం లేకపోయింది. జిల్లాకు రూ. 163 కోట్లు మంజూరు గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లా రైతులు 1.21 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. ఆగస్టు మొదటి వారం నుంచే తీవ్ర వర్షాభావం నెలకొనడంతో పంట పూర్తిగా చేజారింది. లక్ష హెక్టార్లలో పంటను రైతులు నష్ఠపోయారని వ్యవసాయశాఖ అధికారులు నివేదికల్లో తేల్చారు. ఈమేరకు ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదించారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ దఫా రూ.163 కోట్లు కేటాయించినట్లు సమాచారం. బుధవారం నుంచి ఈనిధులను రైతుల ఖాతాల్లో జమచేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ దఫా అయినా అర్హులైనవారికి ఇన్పుట్ సబ్సిడీ అందించాలని రైతాంగం ఎదురుచూస్తోంది. -
శెనగ రైతులకు బీమా ఎందుకివ్వట్లేదు?
న్యూఢిల్లీ: రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల వేరు శెనగ పంట రైతులకు బీమా ఇచ్చేందుకు అగ్రికల్చర్ ఇన్సురెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఏఐసీఐ) నిరాకరించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు రైతులు విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ ఏఐసీసీ బీమా కల్పించేందుకు నిరాకరించిందని, అందుకుగల కారణాలేమిటో తెలియజేయాలని ఆయన రాజ్యసభలో వ్యవసాయం, రైతుల సంక్షేమశాఖను డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) లక్ష్యాలు, ఉద్దేశం ఏమిటని, దీనికింద ఏయే రకాల పంటలు కవర్ అవుతున్నాయని ప్రశ్నించారు. దీనికి సంబంధితశాఖ సహాయమంత్రి పర్శోత్తమ్ రుపాల లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ 2016లో వేరుశెనగలాంటి పంటలకు బీమా కల్పించేందుకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీతో బిడ్డింగ్ ద్వారా ఒప్పందం కుదుర్చుకుందని అందులో తెలియజేశారు. అలాగే, పీఎంఎఫ్‌బీవై ఉద్దేశం, లక్ష్యాలు తెలియజేస్తూ వ్యవసాయరంగంలో నిరంతర ఉత్పత్తిని ప్రోత్సాహించేందుకు ఈ పథకం తీసుకొచ్చామని వివరణ ఇచ్చారు. పంట విరామం, పంట నష్టం, ప్రకృతి విపత్తువంటి సమయాల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయంలో ఆధునిక పోకడలను మరింత అనుసరించేలా నవీన కల్పనలను ప్రోత్సహిస్తామని చెప్పారు. -
శనగ సాగు... భలే బాగు
‘రబీ’లో అనుకూలం సస్యరక్షణ చర్యలు తప్పనిసరి గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహాలు, సూచనలు గజ్వేల్: మరో 14 రోజుల్లో రైతులు ‘రబీ’కి సిద్ధం కాబోతున్నారు. ఈ సీజన్లో ఆరుతడిగా శనగ పంటను సాగు చేసి మంచి ఫలితాలను సాధించవచ్చునని గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ (సెల్: 7288894469) చెబుతున్నారు. జిల్లాలో ఈ పంటను రైతులు భారీ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ‘శనగ’ సాగుపై ఆయన అందించిన సలహాలు, సూచనలివి... యాజమాన్య పద్ధతులు విత్తే సమయం : అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురై మరింత అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గవచ్చు. విత్తే విధానం : సాధారణంగా శనగను వర్షాధారంగా సాగు చేస్తారు. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని 5-8సెంటీమీటర్ల లోతులో తడిమట్టి తగిలేలా విత్తుకోవాలి. వరుసల మధ్య 30సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేట్లు విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 33మొక్కలు ఉండేలా చూసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు, లావుగింజ కాబూలి రకాలను ఎంచుకున్నప్పుడు వరుసల మధ్య 45-60సెంటీమీటర్ల దూరం పాటించాలి. విత్తన మోతాదు : శనగ రకాలలో విత్తన బరువును బట్టి ఎకరాకు వేసుకోవాల్సిన విత్తన మోతాదు మారుతుంది. దేశవాళీ రకాలయితే 25నుంచి 30కిలోలు, కాబూలి రకాలయితే 45 నుంచి 60కిలోలు ఎకరానికి వినియోగించాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి : విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 3గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా 2.5గ్రాముల కార్బండిజమ్ లేదా 1.5గ్రాముల కార్బాక్సిన్తో విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా, నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టవచ్చు. అలాగే శనగను మొదటిసారి పొలంలో సాగుచేసినప్పుడు రైజోబియం కల్చర్‌ను విత్తనానికి పట్టించాలి. 200 గ్రాములు రైజోబియం మిశ్రమాన్ని 300 మి.లీ నీటిలో 10శాతం బెల్లం మిశ్రమం 8కిలోల విత్తనాలకు సరిపోతుంది. బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదట శిలీంద్రనాశక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియంను విత్తనాలకు పట్టించాలి. ఎరువుల యాజమాన్యం : నేల స్వభావాన్ని బట్టి నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువును వాడాలి. ఎకరా శనగసాగుకు 8కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం, 8కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి. నేలలో నిల్వలు సరిపడా ఉన్నప్పుడు భాస్వరం, పొటాష్ ఎరువులు వేయనక్కర్లేదు. పైన సూచించిన అన్ని ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 18కిలోల యూరియా, 125సింగల్ సూపర్ ఫాస్పేట్ లేదా 50కిలోల డీఏపీని వేసినట్లయితే పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ పాస్ఫేట్ రూపంలో వేసిన పంటకు కావాల్సిన గంధకం కూడా అందుతుంది. నీటి యాజమాన్యం : సాధారణంగా శనగను వర్షాధారంగా సాగు చేస్తారు. నీటి వసతి ఉన్నప్పుడు పూత దశకు పొలంలో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. కలుపు యాజమాన్యం : విత్తిన 24గంటలలోపు ప్లూక్లోరాలిన్ ఎకరాకు లీటరు లేదా పెండిమిథాలిన్ 1-1.3 లీటర్ల చొప్పున పిచికారి చేస్తే కలుపును పంట తొలిదశలో సమర్థంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30రోజుల వరకు కలుపు లేకుండాచూసుకోవాలి. గొర్రుతో అంతరకృషి చేసి కూడా కలుపు నివారించుకోవచ్చు. పంటల సరళి : మొక్కజొన్న-శనగ, పెసర/మినుము-శనగ, జొన్న-శనగ, సోయాచిక్కుడు-శనగ, నువ్వులు-శనగ, వరి(ఎడగారు)-శనగ, శనగ మరియు ధనియాలు(16:4) -
ముంచేశావు బాబూ ..
జిల్లాలో 90 శాతం ఎండిపోయిన వేరుశనగ పంట రెయిన్గన్లతో కాపాడలేకపోయిన ప్రభుత్వం పంట ఎండిన సంగతి తనకు తెలీదని సీఎం వింత వాదన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మంత్రులు పల్లె, పరిటాల, ప్రత్తిపాటి రైతులను ఆదుకోవడంలో కొట్టొచ్చినట్లు కన్పిస్తోన్న ప్రభుత్వ నిర్లక్ష్యం నేటి నుంచి రంగంలోకి మంత్రులు, ఐఏఎస్, గ్రూపు–1 అధికారులు ‘అనంత’ వేరుశనగ రైతుల పరిస్థితి నాలుగేళ్లుగా అత్యంత దయనీయంగా ఉంది. కరువు దెబ్బకు నిలవలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు తెగించారు. తక్కిన రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయనే వాతావరణ నిపుణుల ప్రకటనను నమ్మి జిల్లా వ్యాప్తంగా 6.06 లక్షల హెక్టార్లలో పంట సాగు చేశారు. ఇందులోనూ జూన్‌లో తొలకరి వర్షాలకు అధికశాతం పంట వేశారు. మామూలుగానైతే ఈ పంటను సెప్టెంబరు 15లోపు తొలగించాలి. అయితే.. నెల రోజులుగా వర్షం లేకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. ఇప్పటి వరకూ 57 మండలాల్లో ఎండిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో అధికారికంగానే 55 మండలాల్లో డ్రైస్పెల్స్(28 రోజులుగా వర్షం పడని మండలాలు)ను అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు అప్రమత్తమయినా.. జిల్లాలో వేరుశనగ సాధారణ సాగువిస్తీర్ణం 6.30 లక్షల హెక్టార్లు. ఇందులో 6.06 లక్షల హెక్టార్లలో పంటసాగు చేశారు. ఇందులో 5.41లక్షల హెక్టార్లు ఈ నెల 29 నాటికే ఎండుముఖం పట్టింది. ఇప్పుడు ప్రభుత్వం అన్ని పంటలకూ నీళ్లిస్తే రెండు లక్షల హెక్టార్లను ఒకమేర కాపాడొచ్చు. అయితే 50 శాతానికి పైగా పంట దిగుబడి తగ్గుతుంది. మరో 3లక్షల హెక్టార్ల పంట పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా 2–3బస్తాల కాయలు రావొచ్చు. తక్కిన 41వేల హెక్టార్లు దేనికీ పనికిరాకుండా ఎండిపోయింది. జూలైలో సాగైన పంటకు 2–3రోజుల్లో నీళ్లిస్తేనే పైన పేర్కొన్న దిగుబడి వస్తుంది. లేదంటే అది కూడా గ్రాసానికే పరిమితమవుతుంది. మరి ఈ మేరకు ప్రభుత్వం నీరిచ్చి పంటను కాపాడటం కష్టసాధ్యమైన పని. కొట్టొచ్చినట్లు కన్పిస్తోన్న ప్రభుత్వ నిర్లక్ష్యం పంట ఎండిపోవడం వెనుక ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. వర్షం రాకపోతే పంటను కాపాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 6న ధర్మవరం, 15న అనంతపురం పర్యటనలో ప్రకటించారు. అయితే.. ఈ నెల 6వ తేదీకే మంచి వర్షం కురవాల్సిన పరిస్థితి. వర్షం లేక అప్పటి నుంచే పంట ఎండుముఖం పట్టింది. అప్పుడే కాపాడే చర్యలకు ఉపక్రమించి ఉంటే కొంతమేర న ష్టం తగ్గేది. అయితే.. ఆగస్టు 15 వరకూ స్వాతంత్య్ర వేడుకలు మినహా అధికార యంత్రాంగానికి రైతుల సంక్షేమం పట్టలేదు. పంట స్థితిగతులపై మంత్రులు పల్లె, పరిటాల సునీత కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించలేదు. విపక్షపార్టీతో పాటు తక్కిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యమంత్రి కూడా ఈ నెల అరంభం నుంచి 24వరకూ కృష్ణాపుష్కరాలు, విజయోత్సవ సంబరాల్లో మునిగితేలారు. టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ ఎంత వర్షం కురిసింది, పంటల పరిస్థితి ఏంటనేది తాను చెప్పగలనని ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించిన చంద్రబాబుకు.. మరి ‘అనంత’ దుస్థితి ఎందుకు కన్పించలేదనేది తేలాల్సిన ప్రశ్న. ధర్మవరం పర్యటన తర్వాత సీఎం ‘అనంత’ పర్యటనకు వచ్చే సమయానికే పంట ఎండుతోంది. అప్పుడు కూడా నష్టనివారణ చర్యలకు ఉపక్రమించలేదు. మంత్రులు, అధికారులే బాధ్యులా? పంట ఎండిపోవడాన్ని ఆలస్యంగా గుర్తించడంలో మంత్రులు, అధికారుల నిర్లక్ష్యం ఉందని నేరుగా సీఎం వ్యాఖ్యానించడాన్ని చూస్తే ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది. దీంతో పాటు నెలరోజులుగా పంట పరిస్థితి తెలుసుకోలేకపోవడంలో సీఎం నిర్లక్ష్యం కూడా ఉంది. దీనికి ఆయన నైతిక బాధ్యత వహించాలి. జరిగిన నష్టాన్ని ప్రజలు మరచిపోయేలా, ప్రభుత్వం తీవ్రంగా శ్రమించిందనే భావన కలిగేలా నేటి నుంచి సీఎం, మంత్రులు, అధికారులు జిల్లాలో తిష్టవేసి హడావుడి చేస్తుండడం రైతులను మోసం చేయడమేనని స్పష్టమవుతోంది. జిల్లాలో ఇప్పటి వరకూ 61,430 హెక్టార్లలో పంట ఎండిపోయిందని, ఇందులో42వేల హెక్టార్లకు నీళ్లిచ్చి కాపాడామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి ప్రకటించడం కూడా విమర్శలకు దారితీస్తోంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు లెక్కలను వల్లించడమేనని పరిశీలకులు మండిపడుతున్నారు. ఇప్పుడైనా వాస్తవాలను గుర్తించి బతికే అవకాశమున్న పంటకు నీరివ్వాలి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. లేదంటే రైతుల ఆత్మహత్యలకు పాలకులు బాధ్యత వహించక తప్పదు. -
కరువుతో చితికిపోతున్నాం
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వైఎస్ జగన్‌తో వాపోయిన వేరుశనగ రైతులు కదిరి/కడప: ‘‘నాలుగు రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి పంట సాగుచేశాను. వర్షాల్లేక వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. కరువుతో దిక్కుతెలియని పరిస్థితుల్లో ఉన్నాం. పెట్టిన పెట్టుబడులు కూడా దక్కేలా లేవు. ఎట్లా బతకాలో అర్థం కావడం లేదు..’’ అని బాబ్జాన్ అనే రైతు ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డితో తన ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం బెంగళూరు నుంచి పులివెందులకు వెళ్తున్న జగన్మార్గమధ్యంలో చిలమత్తూరు మండలం శెట్టిపల్లి వద్ద పొలాల్లోకి వెళ్లి రైతులను పలకరించారు. ఈ సందర్భంగా బాబ్జాన్ అనే రైతు తమ పరిస్థితిని వివరించాడు. రైతుల వివరాలను ఆరా తీసిన అనంతరం జగన్ చేనులో కూర్చొని మీడియాతో మాట్లాడారు. ‘బాబ్జాన్ అనే ఈ రైతుకు మొత్తం రూ.2.50 లక్షల బ్యాంకు అప్పు ఉంది. దానికి రూ.28 వేలు వడ్డీ అయ్యింది. కేవలం రూ.18 వేలు మాత్రమే రుణ మాఫీ అయింది. అది వడ్డీకి కూడా సరిపోలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. రుణమాఫీ అంటే ఇదేనా? ఇలాగైతే రైతు ఎలా బాగుపడేది? మీరైనా పత్రికల్లో, టీవీల్లో ఇలాంటి రైతుల బాధలు చూపించి ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించండి’ అని ఆయన అన్నారు. డీలర్ల, పెన్షనర్ల తరపున న్యాయపోరాటం సోమవారం మధ్యాహ్నం జగన్ వైఎస్సార్ జిల్లా పులివెందులకు వచ్చారు.క్యాంపు కార్యాలయం వద్ద ప్రజల కష్టనష్టాలను విన్నారు. అధికార పార్టీ నేతలు రేషన్ డీలర్లను ఇష్టానుసారంగా తొలగిస్తున్నారని అగడూరు గ్రామానికి చెందిన కొందరు జగన్ దృష్టికి తెచ్చారు. పింఛన్లు,డీలర్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామని వారికి జగన్ ధైర్యం చెప్పారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, పార్టీ నేత చవ్వా సుదర్శన్‌రెడ్డి తదితరులు జగన్ వెంట ఉన్నారు. -
కన్నీరే..!
- వెంటాడిన వర్షాభావం,చెనక్కాయకు ముగిసిన గడువు - కీలకమైన జులై నెలలో 42 మండలాల్లో జాడలేని చినుకు - 67.4 మి.మీ గానూ కేవలం 20.2 మి.మీ కురిసిన వర్షం - ఇక ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం అంటున్న శాస్త్రవేత్తలు అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో ప్రధానపంటగా వర్థిల్లుతున్న చెనక్కాయకు కాలం చెల్లింది. వేరుశనగ పంట విత్తుకునేందుకు గడువు, అదనపు సమయం కూడా ముగిసిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కీలకమైన ఖరీఫ్ పూర్తిగా చతికిలపడింది. రాజస్తాన్ తరువాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాగా... దక్షిణ భారతదేశంలో ఎడారీకరణ దిశగా వేగంగా పయనిస్తున్న ప్రాంతంగా పేరొందిన అనంతపురం జిల్లా పేరుకు తగ్గట్టుగానే ఈ ఏడాదీ కరువు కోరల్లో చిక్కుకుంది. ఏటా జూన్ మొదటి లేదా రెండో వారంలో నైరుతీ రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నా అనుకున్న విధంగా వర్షాలు మాత్రం పడటం లేదు. జిల్లా వార్షిక వర్షపాతం 552.3 మి.మీ. కాగా అందులో కీలకమైన నైరుతీ రుతుపవనాల వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు 338.4 మి.మీ. వర్షం పడాల్సివుంటుంది. ఖరీఫ్‌లో ఏటా సరాసరి 9 లక్షల హెక్టార్ల విస్తీర్ణం వర్షాలపై ఆధారపడి వుంటుంది. కానీ... వరుణుడు కన్నెర చేస్తుండటంతో చినుకు పడటం కష్టంగా మారుతోంది. ఈసారి కూడా మరింత దారణ పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి, రెండో వారంలో మోస్తరుగా వర్షాలు పడటంతో ‘అనంత’ రైతులు వ్యవసాయానికి సన్నద్ధమయ్యారు. అప్పులు చేసి దుక్కులు దున్నుకుని, విత్తనాలు, ఎరువులతో ఖరీఫ్ పంటల సాగుకు సమాయత్తమయ్యారు. కానీ... జూన్ 10వ తేదీ తరువాత నైరుతీ రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించినా వానచుక్క కరువైపోయింది. అడపా దడపా అక్కడక్క తేలికపాటి వర్షాలు మినహా మరెక్కడా మంచి వర్షాలు పడకపోవడంతో ఖరీఫ్ పంటల సాగు పడకేసింది. మరీ ముఖ్యంగా గాలులు బలంగా వీస్తుండటంతో కమ్ముకున్న మేఘాలు చెల్లాచెదరై రైతుల ఆశలను ఆవిరి చేశాయి. 42 మండలాల్లో మరీ దారుణం- జూన్ నెలలో 63.9 మి.మీ గాను ఎట్టకేలకు 62.9 మి.మీ వర్షం పడింది. ఈ సారి ఆశాజనకంగా ఉందని భావించిన రైతులకు జూలై వర్షాలు భారీ దెబ్బతీశాయి. పంటల సాగుకు కీలకమైన జూలై నెలలో ప్రకృతి మరోసారి పగబట్టింది. జూలై నెలలో ఏకంగా 42 మండలాల్లో కనీసం తేలికపాటి వర్షం కూడా పడలేదంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జూలై సాధారణ వర్షపాతం 67.4 మి.మీ గాను కేవలం 20.2 మి.మీ వర్షపాతం నమోదైంది. హిరేహాల్, బొమ్మనహాల్, విడపనకల్, వజ్రకరూరు, శింగనమల, గార్లదిన్నె, కూడేరు, ఉరవకొండ, బెళుగుప్ప, కనేకల్లు, గుమ్మగట్ట, బుక్కరాయసముద్రం, బత్తలపల్లి, రాప్తాడు, కనగానపల్లి, కంబదూరు, రామగిరి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, తలుపుల, ఎన్పీ కుంట, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, కదిరి, అమడగూరు, నల్లమాడ, గోరంట్ల, పుట్టపర్తి, బుక్కపట్టణం, కొత్తచెరువు, పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి, పరిగి, మడకశిర, గుడిబండ, అమరాపురం మండలాల్లో కనీసం పదును వర్షం కూడా పడలేదు. మొత్తమ్మీద జూన్ నుంచి ఇప్పటివరకు 131.3 మి.మీ వర్షం పడాల్సివుండగా 83.1 మి.మీ కురిసింది. దీంతో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం పూర్తీగా పడిపోయింది. కకావికలమైన ఖరీఫ్.. జూలైలో వర్షం జాడ లేకపోవడంతో ఖరీఫ్ కల్లోలంగా మారింది. జూన్‌లో కురిసిన వర్షాలు, ఆతరువాత అడపాదడపా అరకొరగా కురిసిన వర్షాలకు అరతేమలోనే అక్కడక్కడ పంటలు వేశారు. జూన్‌లో విత్తుకున్న పంటలు వాడిపోయి ఎండుముఖం పట్టాయి. వారం పది రోజులు దాటితే వాటిపై కూడా ఆశలు వదులుకోవాల్సిందే. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 8.79 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి కాస్త అటుఇటుగా 2.10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు విత్తుకున్నారు. అందులో ప్రధానమైన వేరుశనగ పంట 1.85 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేశారు. పది మండలాల్లో మాత్రమే 50 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. 15 మండలాల్లో వేయి హెక్టార్లు లోపే పంటలు సాగులోకి వచ్చాయి. ఖరీఫ్‌కు పుణ్యకాలం ముగిసిపోవడంతో రైతు ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది. -
నల్లరేగడి నేలల్లో శనగ సాగు నయం
కందుకూరు/మొయినాబాద్: రబీలో నల్లరేగడి భూముల్లో రైతులు శనగ పంట సాగుచేసి లబ్ధి పొందవచ్చు. ఈ పంట లెగ్యూమ్ జాతికి చెందిన పంట కావడంతో దీని వేర్లలో రైజోబియం బాక్టీరియా గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరించి ఒక హెక్టార్‌కు దాదాపు 140 కిలోల నత్రజనిని అందించి భూసారాన్ని పెంచుతుందని జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.ప్రవీణ్ పేర్కొన్నారు. శనగ సాగులో మెలకువలపై రైతులకు ఆయన సలహాలు, సూచనలు అందించారు. వర్షాధారంతోనే గాక చలిలో మంచుతో పెరిగే పంట శనగ . వీలైతే తేలికపాటి నీటి తడులు ఇచ్చి అధిక దిగుబడులు పొందవచ్చు. అంతర పంటగా ఆవాలు లేదా ధనియాలు వేసుకుంటే అధిక లాభదాయకం. ఒక పంట దిగుబడి తగ్గినా ఇంకో పంట నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఎండు తెగులును తట్టుకునే రకాలు, త్వరగా కాపునకు వచ్చే రకాలు, కాబూలీ రకాలు అనువైనవి. పంట సరాసరి దిగుబడి హెక్టారుకు 1025 కిలోలు మాత్రమే వస్తుంది. దీనికి ముఖ్యకారణం సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, గింజ పట్టే దశలో పంట బెట్టకు గురయ్యే విషయంలో అవగాహన లేకపోవడమే. అవసరమైన ఒకటి రెండు నీటి తడులు ఇచ్చి సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటిస్తే హెక్టారుకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు. రబీలో శనగ సాగుకు అవకాశాలు.. కారణాంతరాలతో తొలకరిలో ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాలు. అధిక వర్షాలకు, బెట్టకు మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాలు. తొలకరిలో స్వల్పకాలిక పంటలు (పెసర, మినుము, సోయాచిక్కుడు) వేసుకుని రెండో పంటగా శనగ వేసుకోవచ్చు. స్వల్పకాలిక వరి రకాల తర్వాత కూడా శనగ పంటకు అవకాశం ఉంది. శనగ పంట ఎత్తు తక్కువగా ఉండటంతో సస్యరక్షణ చర్యలు చేపట్టడం తేలిక. రకాలు.. క్రాంతి(ఐసీసీసీ-37): పంట కాలం- 100 నుంచి 105 రోజులు. ఎకరాకు దిగుబడి- 8 నుంచి 10 క్వింటాళ్లు. పంట గుబురుగా పెరిగి గింజ మధ్యస్థం లావుగా ఉంటూ ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. శ్వేత (ఐసీసీవీ-2): పంట కాలం- 80 నుంచి 85 రోజులు. దిగుబడి-6 నుంచి 7 క్వింటాళ్లు. త్వరగా కాపునకు వచ్చే రకం. ఎండు తెగుళ్లను తట్టుకొనే కాబూలీ రకం. ఆలస్యంగా వేసుకోవడానికి అనుకూలం. అన్నిగిరి: పంట కాలం-100 నుంచి 110 రోజులు. దిగుబడి-7 నుంచి 9 క్వింటాళ్లు. మొక్క గుబురుగా పెరిగి కొమ్మలు ఎక్కువగా వేస్తుంది. గింజలు గోధుమ రంగులో నున్నగా లావుగా ఉంటాయి. కేఏకే-2: పంట కాలం-95-100 రోజులు. దిగుబడి-8 నుంచి 10 క్వింటాళ్లు. లావు గింజ, కాబూలీ రకం, మొక్క ఎత్తుగా పెరుగుతుంది. జేజీ-2: పంట కాలం-100 నుంచి 105 రోజులు. దిగుబడి-8 నుంచి 10 క్వింటాళ్లు. ఎండు తెగులు తట్టుకుంటుంది. లావుపాటి గింజలు గల దేశీ రకం. లామ్ శనగ: పంట కాలం-90 నుంచి 95 రోజులు. దిగుబడి-8 నుంచి 10 క్వింటాళ్లు. లావు గింజ కాబూలీ రకం, మొక్క ఎత్తుగా పెరుగుతుంది. విత్తనం: ఎకరాకు 20 నుంచి 26 కిలోల విత్తనం అవసరం. ఆలస్యంగా వేసినప్పుడు నవంబర్‌లో విత్తన మోతాదు 20 శాతం పెంచాలి. లావు కాబూలీ రకాలు 40 నుంచి 60 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి: ఎండు తెగులు ఉన్నచోట కిలో విత్తనానికి 4 గ్రా. ట్రెకోడెర్మావిరిడిని వాడితే మంచి ఫలితం ఉంటుంది. రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించి విత్తితే రైజోబియం లేని భూముల్లో 10 నుంచి 20 శాతం అధిక దిగుబడి పొందవచ్చు. 8 కిలోల విత్తనానికి ఒక రైజోబియం పాకెట్(200 గ్రా.)వాడాలి. విత్తటం: గొర్రుతో విత్తుకోవాలి. పదును తక్కువగా ఉన్నప్పుడు నాగలితో విత్తుకోవచ్చు. విత్తే దూరం: సాళ్ల మధ్య 30, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ఉండేలా విత్తుకోవాలి. ఎరువులు: ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల గంధకాన్ని ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. నీటి యాజమాన్యం: శనగ వర్షాధారపు పంట. తేలికపాటి నీటి తడులు ఇచ్చి అధిక దిగుబడులు పొందవచ్చు. నీటి తడులను పెట్టేటప్పుడు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పూత దశకు ముందు ఒకసారి, కాయ దశలో మరోసారి తడులు ఇవ్వాలి. కలుపు నివారణ: విత్తే ముందు ప్లూక్లోరలిన్ ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి, భూమిలో కలియదున్నాలి. లేదా పెండి మిథాలిన్ ఎకరాకు 1 నుంచి 1.6 లీటర్లతో విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. -
‘ఉపాధి’ ఎండమావే!
తీవ్ర దుర్భిక్షంతో 57 మండలాల్లో ఖరీఫ్ పంటలకు నష్టం సేద్యం పడకేయడంతో గ్రామాల్లో ఉపాధి దొరకని దుస్థితి ఉపాధిహామీ కింద పని కల్పించడంలో సర్కారు వైఫల్యం పొట్టచేత పట్టుకుని నగరాలకు వలస వెళ్తున్న గ్రామీణులు వరుసగా ఐదో ఏటా జిల్లాను కరవు కాటేసింది. దుర్భిక్షంతో సేద్యం పడకేసింది. రైతులే కూలీలుగా మారిపోవడంతో పల్లెల్లో పని దొరకని దుస్థితి నెలకొంది. ఉన్న ఊళ్లో చేతినిండా ఉపాధి కల్పించి.. వలసల నివారణకు చేసిన ఉపాధి చట్టాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పని కల్పించకపోవడంతో రెక్కాడితేగానీ డొక్కాడని రైతులు, రైతు కూలీలు పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇదీ మన జిల్లా గ్రామీణ చిత్రం..! సాక్షి ప్రతినిధి, తిరుపతి/బి.కొత్తకోట: జిల్లా లో పశ్చిమ మండలాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. తూర్పు మండలాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఏడాదికి జిల్లాలో 918.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ.. గత నాలుగేళ్లుగా వ్యవసాయాన్ని దుర్భిక్షం కాటేసింది. ఈ ఏడాది కోటి ఆశలతో ఖరీఫ్ పంటలను సాగుచేసిన రైతులను వరుణుడు చిన్నచూపు చూశాడు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో 439.4 మిమీల వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 217.4 మీమీల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 38 శాతం తక్కువ నమోదైనట్లు స్పష్టమవుతోంది. నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఖరీఫ్‌లో 1.38 లక్షల హెక్టార్లలో సాగుచేసిన వేరుశెనగ పంట ఎండిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలమట్టం 17.68 మీటర్లకు పడిపోయింది. భూగర్భజలమట్టం పడిపోవడంతో 60 వేలకుపైగా బోరుబావులు ఎండిపోయాయి. అటు మెట్ట భూముల్లోనూ.. ఇటు బోరు బావుల కింద సాగుచేసిన ఆరు తడి పంటలు ఎండిపోవడంతో ఖరీఫ్ రైతులను నట్టేట ముంచింది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో 395.4 మీమీల వర్షపాతం నమోదవ్వాలి. ఇప్పటికి 105.7 మిమీ. కురిసింది. నైరుతి, ఈశాన్య రుతపవనాల ప్రభావం వల్ల ఇప్పటికి 545.1 మిమీల వర్షం కురవాల్సి ఉండగా.. 317.5 మిమీలు కురిసింది. అంటే.. సాధారణ వర్షపాతం కన్నా 42 శాతం తక్కువ కురిసినట్లు స్పష్టమవుతోంది. వర్షపాతం.. పంటల పరిస్థితిని ఆధారంగా తీసుకుంటే జిల్లాలో 57 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్న ట్లు అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. ఖరీఫ్ పంట లు నష్టాల దిగుబడులను మిగల్చడంతో రబీ సాగు పై రైతులు ఆసక్తి చూపడం లేదు. రబీలో జిల్లాలో 59,970 హెక్టార్లలో పంటలు సాగుచేయాల్సి ఉండ గా.. ఇప్పటికి కేవలం 883 హెక్టార్లలోనే పంటలు సాగుచేయడమే అందుకు తార్కాణం. ఊళ్లకు ఊళ్లు ఖాళీ.. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం పడకేయడంతో పల్లెల్లో చేయడానికి పని దొరకని దుస్థితి నెలకొంది. రైతులే కూలీలుగా మారడంతో రైతు కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలతోపాటూ రైతులూ వలసబాట పట్టారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్ వంటి పట్టణాలకు వలస వెళ్తున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీలు వలస వెళ్లారు. కొందరైతే ముసలివాళ్లను, పిల్లలను ఇళ్లల్లో ఉంచి.. భార్యాభర్తలు ఇద్దరూ వలస వెళ్లారు. మరి కొందరైతే ఇంటికి తాళం వేసి.. కుటుంబం మొత్తం వలస వెళ్లారు. వలసలతో గ్రామాలన్నీ బోసిపోయాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆలనాపాలనా లేక వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదీ ఉపాధి హామీ..? ఉన్న ఊళ్లో చేతినిండా పని కల్పించడం కోసం 2005లో కేంద్రం ఉపాధి చట్టాన్ని చేసింది. ఆ చట్టం అమల్లో భాగంగా జిల్లాలో ఏప్రిల్ 2, 2006న ఉపాధిహామీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద 66 మండలాల్లోని 1,380 పంచాయతీల్లో 11,580 గ్రామాల్లోని 6.38 లక్షల మందికి జాబ్‌కార్డులు జారీ చేశారు. ఇందులో 5.07 లక్షల మంది సభ్యులతో శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటుచేశారు. ఏడాదికి గరిష్టంగా వంద పని దినాలు కల్పించాలని నిర్ణయించారు. పని కల్పించమని అడిగిన వారంలోగా పని కల్పించకపోతే సంబంధిత జాబ్‌కార్డ్ లబ్ధిదారునికి పరిహారం చెల్లించేలా నిబంధన పెట్టారు. కానీ.. ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్యీర్యం చేస్తోంది. అడిగిన తక్షణమే పని కల్పించకుండా.. వేతనాలు చెల్లించకుండా ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చుతున్నారు. ఉపాధిహామీ పథకం కింద పని చేసిన కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.13 కోట్లకు చేరుకోవడమే అందుకు తార్కాణం. ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్కో కుటుంబానికి సగటున 48.95 పని దినాలు కల్పించారు. వంద రోజులు పని దినాలు కేవలం 22,492 మందికి మాత్రమే కల్పించడం గమనార్హం. ఉపాధిహామీ కింద పని కల్పించకపోవడంతో రైతులు, రైతు కూలీలు కన్నతల్లి వంటి ఉన్న ఊళ్లను వదిలి వలస వెళ్తోండటం గమనార్హం. వంద రోజులు పని కల్పించలేని ప్రభుత్వం.. కరవు నేపథ్యంలో ఉపాధిహామీ పని దినాలను 150కి పెంచాలని ఇటీవల లేఖరాయడం కొసమెరుపు. పనిలేక ఖాళీగా ఉన్నాం మా ఊళ్లో వీరాంజనేయ, అమరేశ్వర గ్రూపుల్లో 27 మంది కూలీలు కరువు పనులకు వెళ్లేవాళ్లము. జూన్ నెల లో చెరువులో మట్టి పనులు చేసినాం. అప్పటి నుంచి పనుల్లేక ఇళ్లకాడ ఖాళీ గా ఉండాము. కరువు పనికి పోదామని ఉన్నా పనులు చేయమని చెప్పే వాళ్లే లేరు. ఆఫీసర్లు గూడా వచ్చి కరువు పనులు చేసుకోమని ఎవ రూ చెప్పలే. ఈసారి పంటలు పండకపోయా. ఇట్లే ఉంటే బెంగళూరుకు వెళ్లిపోవాల్సిందే. -వేమనారాయణ, ఉపాధి కూలీ, గజ్జెలవారిపల్లి ఇంతవరకు బిల్లులేదు ఈ ఏడాది జూన్‌లో మా గ్రూపులోని 12 మంది కూలీలు కలసి కొత్తచెరువులో మట్టి తవ్వే పనికిపోయాం. పొలాలకు తోలిన 300 ట్రాక్టర్ల మట్టిని చల్లాం. సగం బిల్లులు మాత్రం ఇచ్చారు. ఇంకా రూ.20 వేలు ఇవ్వాలి. పోస్టాఫీసుకు పోతే మా అకౌంట్లో బిల్లులు పడలేదంటున్నారు. -రమణ, ఉపాధి కూలీ, గజ్జెలవారిపల్లె -
చినుకు..చింత
రైతన్నను కుంగతీస్తున్న వర్షాభావం నీరందక ఎండుతున్న పంటలు ఖరీఫ్‌లో తగ్గిపోయిన సాగు జిల్లాలో వరుణుడు మొహం చాటేశాడు. నల్లని మేఘాలు కమ్ముకోవడం..ఇంతలోనే మటుమాయవడం నిత్యకృత్యమవుతోంది. వాన చినుకు జాడ కోసం రైతులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సకాలంలో పెట్టుబడులు, విత్తనాలు అందకపోయినా..అప్పో సొప్పో చేసి కోటి ఆశలతో సాగు చేసిన పంటలు నీరందక కళ్లముందే ఎండిపోతుంటే రైతులు విలవిల్లాడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సర్కారు చేయూత లేకపోయినా...అష్టకష్టాలు పడి పంటలు సాగు చేస్తున్న రైతులకు వరుణ దేవుడి కరుణ కూడా కరువైంది. వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో ఖరీఫ్ ఆలస్యమైంది. ఖరీఫ్ సీజన్ అక్టోబర్ 15తో ముగిసింది. వర్షాలు లేక జిల్లా వ్యాప్తంగా వరి కేవలం 53 శాతమే సాగు చేశారు. పత్తి, మినుములు, కందులు, సోయాబీన్, పత్తి వంటి పంటల విస్తీర్ణం పెరిగినా వరి విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. వర్షపాతం కూడా గణనీయంగా తగ్గింది. జూన్ నెలలో 80 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఒక మాదిరిగా వర్షపాతం నమోదైంది. ఆగస్టులో 54 శాతం, సెప్టెంబర్‌లో 44 శాతం వర్షపాతం తక్కువ నమోదు కాగా, అక్టోబర్‌లో ఇప్పటి వరకూ 88 శాతం తక్కువ నమోదైంది. దీంతో వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సజ్జలు 2994 హెక్టార్లలో, శనగలు 1957 హెక్టార్లలో, పత్తి 7705 హెక్టార్లలో, నువ్వులు 248 హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో 39,363 హెక్టార్లలో వరి విస్తీర్ణం ఉండగా, గత ఏడాది 58,103 హెక్టార్లలో వరి వేశారు. ఈసారి అది 20 వేల హెక్టార్లకు కూడా చేరుకోలేదు. కృష్ణాడెల్టా కాల్వల పరిధిలో మాత్రమే వరి వేశారు. జొన్నలు 471 హెక్టార్లలో గత ఏడాది వేయగా, ఈ ఏడాది కేవలం 12 హెక్టార్లలోనే వేశారు. సజ్జలు గత ఏడాది 25277 హెక్టార్లలో వేయగా ఈ ఏడాది అది 10,611 హెక్టార్లకే పరిమితమైంది. మొక్కజొన్న గత ఏడాది 2,865 హెక్టార్లలో సాగు చేయగా ఇప్పటి వరకూ 1183 హెక్టార్లలో వేశారు. రాగి, చిరుధాన్యాలు 162 హెక్టార్లలో మాత్రమే వేశారు. పొగాకు, శనగ పంటల విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దీంతో పత్తి, మిర్చి ఇతర పంటల సాగు పెరిగింది. పత్తి సాధారణ విస్తీర్ణం 56,167 హెక్టార్లు కాగా ఈ ఏడాది 70,571 హెక్టార్లలో వేశారు. చెరుకు 446 హెక్టార్లకు గాను 900 హెక్టార్లలో సాగు చేశారు. అంటే సాగు 202 శాతానికి పెరిగింది. తుఫాన్ ప్రభావం కూడా జిల్లా మీద కనపడలేదు. రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడినా అవి పంటలకు సరిపడా లేవని రైతులు చెబుతున్నారు. -
వేరుశెనగ పంట బీమాగోవిందా!
ఇన్సూరెన్స్ పొడిగింపు గడువును పట్టించుకోని ఏఐసీ నాన్ లోనీలకు ఇన్సూరెన్స్ వర్తించదట జిల్లాలోని 3వేల మంది రైతుల నోట్లో దుమ్మే రూ.3.45 కోట్ల నష్టపరిహారం హుష్‌కాకీ ఎక్కువగా నష్టపోయేది కుప్పం ప్రాంత రైతులే పలమనేరు: ఈ ప్రభుత్వం ఏ ముహుర్తానా అధికారంలోకొచ్చిందో గానీ రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ దఫా వేరుశెనగ పంట బీమా గడువును ప్రభుత్వం పొడిగించింది. పొడిగించిన గడువులో కట్టించుకున్న ప్రీమియంలతో తమకు సంబంధం లేదంటూ ఏఐసీ (అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) తెగేసి చెప్పింది. పైగా లోనీలకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని మెలిక పెట్టింది. ఈ కారణంగా జిల్లాలో 3 వేల మందికి పైగా రైతులకు నష్టపరిహారం అందని పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే.. ఈ సీజన్లో వేరుశెనగ పంటకు సంబంధించి ప్రభుత్వం పంటల బీమాకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జీవో నం బర్ 422 ప్రకారం ఆగస్ట్ 2వ తేదీలోపు వేరుశెనగ రైతులు ప్రీమియం చెల్లించాలని అధికారులు సూచించారు. ఎకరాకు రూ.550 చొప్పున డీడీలు తీసి సంబంధిత ఏవోలకు అంది వ్వమని చెప్పారు. గతంలో ఇన్సూరెన్స్ అందని కారణంగా పదిశాతం రైతులు మాత్రమే పంటల బీమాకు ముందుకొచ్చారు. దీంతో ప్రభుత్వం 452 జీవోను విడుదల చేసి బీమా గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. లోనీ (బ్యాంకులో రుణం పొందిన రైతులు), నాన్ లోనీ (రుణం పొందని రైతులు) ఎవరైనా బీమాకు అర్హులేనని తెలిపింది. మదనపల్లె, తంబళ్లపల్లె, పలమనేరు తదితర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాలకు సంబంధించి 1000 మంది రైతులు రూ.5.5 లక్షలు వేరుశెనగ పంటకు బీమా కోసం డీడీలు చెల్లించారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోనే 1000 మంది దాకా రైతులు రూ.5.5 లక్షల ప్రీమియంను చెల్లించారు. మొత్తం మీద జిల్లాలో మూడు వేల మంది రైతులు 3వేల ఎకరాలకు రూ.16.5 లక్షల ప్రీమియం కట్టారు. గడువు పెంపు ప్రీమియంను నిరాకరించిన ఏఐసీ రైతుల నుంచి గడువు పెంపుతో కట్టించుకున్న ప్రీమియంను సంబంధిత ఏడీలు హైదరాబాదులోని ఏఐసీకి మూడు రోజుల క్రితం పంపగా వాటిని వెనక్కి పంపారు. గడువు పెంచిన ప్రీమియంలు తాము తీసుకోమని, నాన్ లోనీల ప్రీమియంలు కూడా చెల్లుబాటు కావని ఓ ఆదేశాల కాపీని ఏఐసీ చీఫ్ రీజనల్ మేనేజర్ రాజేశ్వరి సింగ్ వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన్‌రావుకు పంపారు. ఇదే ఆదేశాలు కమిషనర్ నుంచి సంబంధిత ఏడీ కార్యాలయాలకు అందాయి. రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. రూ.3.45 కోట్ల నష్ట పరిహారం హుష్‌కాకీ.. ఈ ఆదేశాల మేరకు జిల్లాలోని 3 వేల మందికి పైగా రైతులకు ఎకరాకు రూ.11.500 చొప్పున అందాల్సిన పంట బీమా మొత్తం రూ.3.45 కోట్లు అందనట్టే. ఇంత మాత్రానికి గడువు పెంచి మరీ తమవద్ద ప్రీమియంలు ఎందుకు కట్టించుకున్నట్టని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కుప్పం ప్రాంత వేరుశెనగ రైతులకు ఈ ఆదేశాలతో తీరని నష్టం జరగడం ఖాయం. విషయం తెలుసుకున్న ఆ ప్రాంత రైతులు ముఖ్యమంత్రినే కలసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయమై పలమనేరు ఏడీ రమేష్‌ను వివరణ కోరగా తమ శాఖ కమిషనర్ నుంచి ఈ ఆదేశాలు అందిన మాట వాస్తవమేనన్నారు. -
శనగలకు గిట్టుబాటు ధర కల్పించాలి
నంద్యాల: శనగకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, క్వింటాల్ రూ.5 వేల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనగలకు గిట్టుబాటు ధర లేక కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో రైతులు మూడు సంవత్సరాల నుంచి ధాన్యాన్ని నిల్వ ఉంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బ్యాంకుల్లో కుదువకు పెట్టుకున్న సొత్తులు సమయానికి విడిపించుకోలేకపోవడంతో బ్యాంకులు వేలం వేస్తున్నాయన్నారు. ప్రభుత్వం మాత్రం క్వింటాల్ రూ.3100 చొప్పున కొనుగోలు చేయాలని భావిస్తుండటం దారుణమన్నారు. రాష్ట్ర విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన దాదాపు 50 వేల మంది రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ పరిధిలో ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలను తిరుపతికి కేటాయించడంతో హైదరాబాద్ నుంచి దరఖాస్తులు, డీడీలు తిరుపతికి చేరుకుంటే తప్ప ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు అత్యధికంగా నీటిని విడుదల చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల సీమ జిల్లాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని భూమా డిమాండ్ చేశారు. శాసన సభ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో ప్రజా సమస్యలు వెలుగులోకి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జరిగే శాసన సభ సమావేశాల్లోనైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. -
శనగపంటను వెంటనే కొనుగోలు చేయలి
-
శనగకు మద్దతు ధర ఇవ్వాలి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: శనగ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఆయ న శుక్రవారం లోక్‌సభలో మాట్లాడారు. ప్రకాశం జిల్లాను పప్పు ధాన్యాల ఉత్పత్తి చేసే ప్రాంతంగా జాతీయ ఆహారభద్రత కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విషయాన్ని, జిల్లాలో పొగాకు ఉత్పత్తులు తగ్గించేందుకు శనగను ప్రత్యామ్నాయ పంటగా ప్రోత్సహించాలని నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. జిల్లాలో శనగ విస్తీర్ణం పెరుగుతూ వస్తోందన్నారు. శనగ పంట ఉత్పత్తి వ్యయం విత్తన రకం ఆధారంగా మారుతున్నందున కనీస మద్దతు ధర కూడా దాని ఆధారంగా నిర్ణయించాలని కోరారు. జెజీ-11, కెఒకె-2, బోల్డ్ రకాలకు కూడా ఒకే ధర ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం శనగ దిగుమతులపై సుంకం పెంచడంతో పాటు ఎగుమతులపై ప్రోత్సాహకాలు ప్రకటించాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్‌లను ఆదేశించి అవి శనగలను కొనేవిధంగా చూడాలని కోరారు. జెజీ-11 రకానికి క్వింటాకు రూ.4 వేలు, కెఓకె-2 రకానికి రూ.4,500, బోల్డ్ రకానికి రూ.5 వేలు కనీస మద్దతు ధర ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత వారంలో ఒంగోలు వచ్చిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని శనగరైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న సంగతి తెలిసిందే. 2012-13, 2013-14 సంవత్సరాల్లో పండించిన పంట ఇప్పటికే జిల్లాలోని కోల్డ్‌స్టోరేజీల్లో పేరుకుపోయిన విషయం ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. -
భగ్గుమన్న రైతులు
దళారీ వ్యవస్థతో వేరుశనగ రైతుల అవస్థలు హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రాస్తారోకో పెట్రోల్ పోసి వేరుశనగకు నిప్పంటించిన వైనం కల్వకుర్తి, న్యూస్‌లైన్ : తాము పండించిన వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కడుపుమండిన రైతులు వేరుశెనగ పంటను పోగుగా పోసి నిప్పంటించారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మార్కెట్ యార్డు సమీపంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తెస్తున్నా దళారులు తమకు ధర రాకుండా చేస్తున్నారని ఆందోళనకు దిగారు. కల్వకుర్తి, వెల్దెండ్ల, వంగునూరు, చింతపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతులు 150 బస్తాల పంటను తెచ్చారు. ఇది 74 క్వింటాళ్లు ఉండగా దీని విలువ సుమారు రూ. రెండులక్షలకు పైబడి ఉంటుందని అంచనా. తమకు ఇతర మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ దళారులు క్వింటాలు ధరను రూ.2,800 నుంచి 3,700కు మించి పెంచనివ్వడం లేదని వేరే ప్రాంతాల్లో రూ.4,200 వరకూ చెల్లిస్తున్నారని మండి పడ్డారు. ఆగ్రహంతో హైదరాబాద్ చౌరస్తాలోని శ్రీశైలం - హైదరాబాద్ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. నిరసనగా పంటకు నిప్పు పెట్టారు. ఈ లోగా వర్షం రావడంతో దాన్ని రక్షించుకునేందుకు ఆందోళన విరమించి మార్కెట్‌కు తరలి వెళ్లారు. అక్కడా పంటపై కప్పేందుకు కవర్లు లేక అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మార్కెట్ కార్యాలయంపై దాడికి కూడా యత్నించారు. అయితే ఈ అంశంపై అధికారులు ఎవరూ స్పందించక పోవడం విశేషం. పోలీసులకు విషయం తెల్సి వచ్చేసరికి ఆందోళన సద్దుమణిగింది.