కరువుతో చితికిపోతున్నాం
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
వైఎస్ జగన్‌తో వాపోయిన వేరుశనగ రైతులు
కదిరి/కడప: ‘‘నాలుగు రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి పంట సాగుచేశాను. వర్షాల్లేక వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. కరువుతో దిక్కుతెలియని పరిస్థితుల్లో ఉన్నాం. పెట్టిన పెట్టుబడులు కూడా దక్కేలా లేవు. ఎట్లా బతకాలో అర్థం కావడం లేదు..’’ అని బాబ్‌జాన్ అనే రైతు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డితో తన ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం బెంగళూరు నుంచి పులివెందులకు వెళ్తున్న జగన్‌మార్గమధ్యంలో చిలమత్తూరు మండలం శెట్టిపల్లి వద్ద పొలాల్లోకి వెళ్లి రైతులను పలకరించారు. ఈ సందర్భంగా బాబ్‌జాన్ అనే రైతు తమ పరిస్థితిని వివరించాడు. రైతుల వివరాలను ఆరా తీసిన అనంతరం జగన్ చేనులో కూర్చొని మీడియాతో మాట్లాడారు. ‘బాబ్‌జాన్ అనే ఈ రైతుకు మొత్తం రూ.2.50 లక్షల బ్యాంకు అప్పు ఉంది. దానికి రూ.28 వేలు వడ్డీ అయ్యింది. కేవలం రూ.18 వేలు మాత్రమే రుణ మాఫీ అయింది. అది వడ్డీకి కూడా సరిపోలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. రుణమాఫీ అంటే ఇదేనా? ఇలాగైతే రైతు ఎలా బాగుపడేది? మీరైనా పత్రికల్లో, టీవీల్లో ఇలాంటి రైతుల బాధలు చూపించి ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించండి’ అని ఆయన అన్నారు.
డీలర్ల, పెన్షనర్ల తరపున న్యాయపోరాటం
సోమవారం మధ్యాహ్నం జగన్ వైఎస్సార్ జిల్లా పులివెందులకు వచ్చారు.క్యాంపు కార్యాలయం వద్ద ప్రజల కష్టనష్టాలను విన్నారు. అధికార పార్టీ నేతలు రేషన్ డీలర్లను ఇష్టానుసారంగా తొలగిస్తున్నారని అగడూరు గ్రామానికి చెందిన కొందరు జగన్ దృష్టికి తెచ్చారు. పింఛన్లు,డీలర్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామని వారికి జగన్ ధైర్యం చెప్పారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, పార్టీ నేత చవ్వా సుదర్శన్‌రెడ్డి తదితరులు జగన్ వెంట ఉన్నారు.