
సాక్షి, అమరావతి: ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో అప్పులు 34.70 శాతం ఉంటాయని చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2023–24)లో జీఎస్‌డీపీలో అప్పులు 34.58 శాతమని వెల్లడించారు.
సోమవారం లోక్‌సభలో ఎంపీ మనీష్ తివారి అడిగిన ప్రశ్నకు దేశంలోని రాష్ట్రాల అప్పుల వివరాలను పంకజ్ చౌదరి వెల్లడించారు. రాష్ట్రాల నికర రుణ పరిమితిని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాలకు సర్దుబాట్లు ఏమైనా ఉంటే ఆ తర్వాత సంవత్సరాల రుణాల పరిమితుల్లో చేరుతాయని వివరించారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి అనుగుణంగా అప్పులు ఉన్నాయా..? లేదా..? అనేది రాష్ట్రాల శాసనసభలు పర్యవేక్షిస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment