శనగ చేను
‘రబీ’లో అనుకూలం
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహాలు, సూచనలు
గజ్వేల్: మరో 14 రోజుల్లో రైతులు ‘రబీ’కి సిద్ధం కాబోతున్నారు. ఈ సీజన్‌లో ఆరుతడిగా శనగ పంటను సాగు చేసి మంచి ఫలితాలను సాధించవచ్చునని గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ (సెల్: 7288894469) చెబుతున్నారు. జిల్లాలో ఈ పంటను రైతులు భారీ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ‘శనగ’ సాగుపై ఆయన అందించిన సలహాలు, సూచనలివి...
యాజమాన్య పద్ధతులు
విత్తే సమయం : అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురై మరింత అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గవచ్చు.
విత్తే విధానం : సాధారణంగా శనగను వర్షాధారంగా సాగు చేస్తారు. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని 5-8సెంటీమీటర్ల లోతులో తడిమట్టి తగిలేలా విత్తుకోవాలి. వరుసల మధ్య 30సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేట్లు విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 33మొక్కలు ఉండేలా చూసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు, లావుగింజ కాబూలి రకాలను ఎంచుకున్నప్పుడు వరుసల మధ్య 45-60సెంటీమీటర్ల దూరం పాటించాలి.
విత్తన మోతాదు : శనగ రకాలలో విత్తన బరువును బట్టి ఎకరాకు వేసుకోవాల్సిన విత్తన మోతాదు మారుతుంది. దేశవాళీ రకాలయితే 25నుంచి 30కిలోలు, కాబూలి రకాలయితే 45 నుంచి 60కిలోలు ఎకరానికి వినియోగించాల్సి ఉంటుంది.
విత్తన శుద్ధి : విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 3గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా 2.5గ్రాముల కార్బండిజమ్ లేదా 1.5గ్రాముల కార్బాక్సిన్‌తో విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా, నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టవచ్చు. అలాగే శనగను మొదటిసారి పొలంలో సాగుచేసినప్పుడు రైజోబియం కల్చర్‌ను విత్తనానికి పట్టించాలి. 200 గ్రాములు రైజోబియం మిశ్రమాన్ని 300 మి.లీ నీటిలో 10శాతం బెల్లం మిశ్రమం 8కిలోల విత్తనాలకు సరిపోతుంది. బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదట శిలీంద్రనాశక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియంను విత్తనాలకు పట్టించాలి.
ఎరువుల యాజమాన్యం :
నేల స్వభావాన్ని బట్టి నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువును వాడాలి. ఎకరా శనగసాగుకు 8కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం, 8కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి. నేలలో నిల్వలు సరిపడా ఉన్నప్పుడు భాస్వరం, పొటాష్ ఎరువులు వేయనక్కర్లేదు. పైన సూచించిన అన్ని ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 18కిలోల యూరియా, 125సింగల్ సూపర్ ఫాస్పేట్ లేదా 50కిలోల డీఏపీని వేసినట్లయితే పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ పాస్ఫేట్ రూపంలో వేసిన పంటకు కావాల్సిన గంధకం కూడా అందుతుంది.
నీటి యాజమాన్యం : సాధారణంగా శనగను వర్షాధారంగా సాగు చేస్తారు. నీటి వసతి ఉన్నప్పుడు పూత దశకు పొలంలో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి.
కలుపు యాజమాన్యం : విత్తిన 24గంటలలోపు ప్లూక్లోరాలిన్ ఎకరాకు లీటరు లేదా పెండిమిథాలిన్ 1-1.3 లీటర్ల చొప్పున పిచికారి చేస్తే కలుపును పంట తొలిదశలో సమర్థంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30రోజుల వరకు కలుపు లేకుండాచూసుకోవాలి. గొర్రుతో అంతరకృషి చేసి కూడా కలుపు నివారించుకోవచ్చు.
పంటల సరళి : మొక్కజొన్న-శనగ, పెసర/మినుము-శనగ, జొన్న-శనగ, సోయాచిక్కుడు-శనగ, నువ్వులు-శనగ, వరి(ఎడగారు)-శనగ, శనగ మరియు ధనియాలు(16:4)