సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో వేరుశనగ పంటకు జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించనుంది. రైతులను ఆదుకోవడం కోసం పంట కొనుగోలు నిబంధనలు సడలించాలని కోరనుంది. రాయలసీమ జిల్లాల్లో ఏటా 7.46 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశనగ సాగు చేస్తున్నారు. సగటున ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంటే.. ఈ ఏడాది భారీ వర్షాల వల్ల 5 క్వింటాళ్లకు మించి రావడం లేదు. వేరుశనగ గింజ 50 శాతానికి పడిపోవడం, రంగు మారడం, తేమ శాతం అధికంగా ఉండటంతో రైతులు ప్రైవేట్ మార్కెట్‌లో క్వింటాకు రూ.4 వేలకు మించి అమ్ముకోలేకపోతున్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.5,275గా మద్దతు ధర ప్రకటించింది. అయితే వేరుశనగ గింజ 70 శాతం, డ్యామేజీ 2%, తేమ 8% లోపు ఉండాలని కేంద్రం నిబంధనలు విధించింది. వర్షాల వల్ల అరకొరగా పండిన పంటకు ఈ నిబంధనలు అనుకూలంగా లేకపోవడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. 4 రోజులపాటు సీమ జిల్లాల్లో వేరుశనగ పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలించిన మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూధనరెడ్డి అక్కడి పరిస్థితులను ప్రభుత్వానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో సడలింపులు తీసుకురావడం ద్వారా రైతులను ఆదుకోవాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నివేదిక అందచేయనుంది.
15 తర్వాత పంట కొనుగోళ్లు
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా 1.83 లక్షల టన్నుల వేరుశనగ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రతి ఆర్బీకే పరిధిలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆయా జిల్లాల్లో దాదాపు 2,900 కొనుగోలు కేంద్రాల ద్వారా వేరుశనగను ప్రభుత్వం సేకరించనుంది. కేంద్రం నిబంధనల ప్రకారం ఉన్న వేరుశనగకు క్వింటాకు రూ.5,275 చెల్లిస్తామని ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలకంఠనాథరెడ్డి తెలిపారు. ఈ నెల 15 తర్వాత పంట నాణ్యతను పరిశీలించి.. కొనుగోలు చేస్తామని చెప్పారు. కాగా, భారీ వర్షాలకు ముందు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పంట చేతికి వచ్చిన రైతులకు ప్రైవేట్ మార్కెట్‌లో కూడా మంచి రేటు లభిస్తోంది. ఆ పంట నాణ్యంగా ఉండటంతో క్వింటాకు మద్దతు ధర కంటే అధికంగా అమ్ముకోగలిగారు. ఇలా వర్షాల ముందు పంట అమ్మిన రైతులు సాగు విస్తీర్ణంలో 30 శాతం వరకు ఉంటారని ఆయిల్‌ఫెడ్ అధికారులు తెలిపారు. ఆయిల్‌ఫెడ్ ఎండీ నీలకంఠనాథరెడ్డి ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తూ రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
వేరుశనగ రైతులను ఆదుకోవాలి
Published Tue, Nov 3 2020 3:21 AM | Last Updated on Tue, Nov 3 2020 3:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment