కన్నీరే..! | Main crop time no rains | Sakshi
Sakshi News home page

కన్నీరే..!

Published Sat, Aug 1 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

కన్నీరే..!

కన్నీరే..!

- వెంటాడిన వర్షాభావం,చెనక్కాయకు ముగిసిన గడువు
- కీలకమైన జులై నెలలో 42 మండలాల్లో జాడలేని చినుకు
- 67.4 మి.మీ గానూ కేవలం 20.2 మి.మీ కురిసిన వర్షం
- ఇక ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం అంటున్న శాస్త్రవేత్తలు
అనంతపురం అగ్రికల్చర్:
జిల్లాలో ప్రధానపంటగా వర్థిల్లుతున్న చెనక్కాయకు కాలం చెల్లింది. వేరుశనగ పంట విత్తుకునేందుకు గడువు, అదనపు సమయం కూడా ముగిసిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కీలకమైన ఖరీఫ్ పూర్తిగా చతికిలపడింది. రాజస్తాన్ తరువాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాగా... దక్షిణ భారతదేశంలో ఎడారీకరణ దిశగా వేగంగా పయనిస్తున్న ప్రాంతంగా పేరొందిన అనంతపురం జిల్లా పేరుకు తగ్గట్టుగానే ఈ ఏడాదీ కరువు కోరల్లో చిక్కుకుంది.

ఏటా జూన్ మొదటి లేదా రెండో వారంలో నైరుతీ రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నా అనుకున్న విధంగా వర్షాలు మాత్రం పడటం లేదు. జిల్లా వార్షిక వర్షపాతం 552.3 మి.మీ. కాగా అందులో కీలకమైన నైరుతీ రుతుపవనాల వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు 338.4 మి.మీ. వర్షం పడాల్సివుంటుంది. ఖరీఫ్‌లో ఏటా సరాసరి 9 లక్షల హెక్టార్ల విస్తీర్ణం వర్షాలపై ఆధారపడి వుంటుంది. కానీ... వరుణుడు కన్నెర చేస్తుండటంతో చినుకు పడటం కష్టంగా మారుతోంది. ఈసారి కూడా మరింత దారణ పరిస్థితి నెలకొంది.

జూన్ మొదటి, రెండో వారంలో మోస్తరుగా వర్షాలు పడటంతో ‘అనంత’ రైతులు వ్యవసాయానికి సన్నద్ధమయ్యారు. అప్పులు చేసి దుక్కులు దున్నుకుని, విత్తనాలు, ఎరువులతో ఖరీఫ్ పంటల సాగుకు సమాయత్తమయ్యారు. కానీ... జూన్ 10వ తేదీ తరువాత నైరుతీ రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించినా వానచుక్క కరువైపోయింది. అడపా దడపా అక్కడక్క తేలికపాటి వర్షాలు మినహా మరెక్కడా మంచి వర్షాలు పడకపోవడంతో ఖరీఫ్ పంటల సాగు పడకేసింది. మరీ ముఖ్యంగా  గాలులు బలంగా వీస్తుండటంతో కమ్ముకున్న మేఘాలు చెల్లాచెదరై రైతుల ఆశలను ఆవిరి చేశాయి.
 
42 మండలాల్లో మరీ దారుణం- జూన్ నెలలో 63.9 మి.మీ గాను ఎట్టకేలకు 62.9 మి.మీ వర్షం పడింది. ఈ సారి ఆశాజనకంగా ఉందని భావించిన రైతులకు జూలై వర్షాలు భారీ దెబ్బతీశాయి. పంటల సాగుకు కీలకమైన జూలై నెలలో ప్రకృతి మరోసారి పగబట్టింది. జూలై నెలలో ఏకంగా 42 మండలాల్లో కనీసం తేలికపాటి వర్షం కూడా పడలేదంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జూలై సాధారణ వర్షపాతం 67.4 మి.మీ గాను కేవలం 20.2 మి.మీ వర్షపాతం నమోదైంది.  

హిరేహాల్, బొమ్మనహాల్, విడపనకల్, వజ్రకరూరు, శింగనమల, గార్లదిన్నె, కూడేరు, ఉరవకొండ, బెళుగుప్ప, కనేకల్లు, గుమ్మగట్ట, బుక్కరాయసముద్రం, బత్తలపల్లి, రాప్తాడు, కనగానపల్లి, కంబదూరు, రామగిరి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, తలుపుల, ఎన్‌పీ కుంట, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, కదిరి, అమడగూరు, నల్లమాడ, గోరంట్ల, పుట్టపర్తి, బుక్కపట్టణం, కొత్తచెరువు, పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి, పరిగి, మడకశిర, గుడిబండ, అమరాపురం మండలాల్లో కనీసం పదును వర్షం కూడా పడలేదు. మొత్తమ్మీద జూన్ నుంచి ఇప్పటివరకు 131.3 మి.మీ వర్షం పడాల్సివుండగా 83.1 మి.మీ కురిసింది. దీంతో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం పూర్తీగా పడిపోయింది.
 
కకావికలమైన ఖరీఫ్.. జూలైలో వర్షం జాడ లేకపోవడంతో ఖరీఫ్ కల్లోలంగా మారింది. జూన్‌లో కురిసిన వర్షాలు, ఆతరువాత అడపాదడపా అరకొరగా కురిసిన వర్షాలకు అరతేమలోనే అక్కడక్కడ పంటలు వేశారు. జూన్‌లో విత్తుకున్న పంటలు వాడిపోయి ఎండుముఖం పట్టాయి. వారం పది రోజులు దాటితే వాటిపై కూడా ఆశలు వదులుకోవాల్సిందే. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 8.79 లక్షల హెక్టార్లు కాగా  ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి  కాస్త అటుఇటుగా 2.10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు విత్తుకున్నారు. అందులో ప్రధానమైన వేరుశనగ పంట 1.85 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేశారు.  పది మండలాల్లో మాత్రమే 50 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. 15 మండలాల్లో వేయి హెక్టార్లు లోపే పంటలు సాగులోకి వచ్చాయి. ఖరీఫ్‌కు పుణ్యకాలం ముగిసిపోవడంతో రైతు ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement