కందుకూరు/మొయినాబాద్: రబీలో నల్లరేగడి భూముల్లో రైతులు శనగ పంట సాగుచేసి లబ్ధి పొందవచ్చు. ఈ పంట లెగ్యూమ్ జాతికి చెందిన పంట కావడంతో దీని వేర్లలో రైజోబియం బాక్టీరియా గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరించి ఒక హెక్టార్‌కు దాదాపు 140 కిలోల నత్రజనిని అందించి భూసారాన్ని పెంచుతుందని జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.ప్రవీణ్ పేర్కొన్నారు. శనగ సాగులో మెలకువలపై రైతులకు ఆయన సలహాలు, సూచనలు అందించారు.
వర్షాధారంతోనే గాక చలిలో మంచుతో పెరిగే పంట శనగ . వీలైతే తేలికపాటి నీటి తడులు ఇచ్చి అధిక దిగుబడులు పొందవచ్చు. అంతర పంటగా ఆవాలు లేదా ధనియాలు వేసుకుంటే అధిక లాభదాయకం. ఒక పంట దిగుబడి తగ్గినా ఇంకో పంట నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఎండు తెగులును తట్టుకునే రకాలు, త్వరగా కాపునకు వచ్చే రకాలు, కాబూలీ రకాలు అనువైనవి.
పంట సరాసరి దిగుబడి హెక్టారుకు 1025 కిలోలు మాత్రమే వస్తుంది. దీనికి ముఖ్యకారణం సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, గింజ పట్టే దశలో పంట బెట్టకు గురయ్యే విషయంలో అవగాహన లేకపోవడమే. అవసరమైన ఒకటి రెండు నీటి తడులు ఇచ్చి సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటిస్తే హెక్టారుకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు.
రబీలో శనగ సాగుకు అవకాశాలు..
కారణాంతరాలతో తొలకరిలో ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాలు.
అధిక వర్షాలకు, బెట్టకు మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాలు.
తొలకరిలో స్వల్పకాలిక పంటలు (పెసర, మినుము, సోయాచిక్కుడు) వేసుకుని రెండో పంటగా శనగ వేసుకోవచ్చు.
స్వల్పకాలిక వరి రకాల తర్వాత కూడా శనగ పంటకు అవకాశం ఉంది.
శనగ పంట ఎత్తు తక్కువగా ఉండటంతో సస్యరక్షణ చర్యలు చేపట్టడం తేలిక.
రకాలు..
క్రాంతి(ఐసీసీసీ-37): పంట కాలం- 100 నుంచి 105 రోజులు. ఎకరాకు దిగుబడి- 8 నుంచి 10 క్వింటాళ్లు. పంట గుబురుగా పెరిగి గింజ మధ్యస్థం లావుగా ఉంటూ ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది.
శ్వేత (ఐసీసీవీ-2): పంట కాలం- 80 నుంచి 85 రోజులు. దిగుబడి-6 నుంచి 7 క్వింటాళ్లు. త్వరగా కాపునకు వచ్చే రకం. ఎండు తెగుళ్లను తట్టుకొనే కాబూలీ రకం. ఆలస్యంగా వేసుకోవడానికి అనుకూలం.
అన్నిగిరి: పంట కాలం-100 నుంచి 110 రోజులు. దిగుబడి-7 నుంచి 9 క్వింటాళ్లు. మొక్క గుబురుగా పెరిగి కొమ్మలు ఎక్కువగా వేస్తుంది. గింజలు గోధుమ రంగులో నున్నగా లావుగా ఉంటాయి.
కేఏకే-2: పంట కాలం-95-100 రోజులు. దిగుబడి-8 నుంచి 10 క్వింటాళ్లు. లావు గింజ, కాబూలీ రకం, మొక్క ఎత్తుగా పెరుగుతుంది.
జేజీ-2: పంట కాలం-100 నుంచి 105 రోజులు. దిగుబడి-8 నుంచి 10 క్వింటాళ్లు. ఎండు తెగులు తట్టుకుంటుంది. లావుపాటి గింజలు గల దేశీ రకం.
లామ్ శనగ: పంట కాలం-90 నుంచి 95 రోజులు. దిగుబడి-8 నుంచి 10 క్వింటాళ్లు. లావు గింజ కాబూలీ రకం, మొక్క ఎత్తుగా పెరుగుతుంది.
విత్తనం: ఎకరాకు 20 నుంచి 26 కిలోల విత్తనం అవసరం. ఆలస్యంగా వేసినప్పుడు నవంబర్‌లో విత్తన మోతాదు 20 శాతం పెంచాలి. లావు కాబూలీ రకాలు 40 నుంచి 60 కిలోల విత్తనం అవసరం ఉంటుంది.
విత్తన శుద్ధి: ఎండు తెగులు ఉన్నచోట కిలో విత్తనానికి 4 గ్రా. ట్రెకోడెర్మావిరిడిని వాడితే మంచి ఫలితం ఉంటుంది. రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించి విత్తితే రైజోబియం లేని భూముల్లో 10 నుంచి 20 శాతం అధిక దిగుబడి పొందవచ్చు. 8 కిలోల విత్తనానికి ఒక రైజోబియం పాకెట్(200 గ్రా.)వాడాలి.
విత్తటం: గొర్రుతో విత్తుకోవాలి. పదును తక్కువగా ఉన్నప్పుడు నాగలితో విత్తుకోవచ్చు.
విత్తే దూరం: సాళ్ల మధ్య 30, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ఉండేలా విత్తుకోవాలి.
ఎరువులు: ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల గంధకాన్ని ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి.
నీటి యాజమాన్యం: శనగ వర్షాధారపు పంట. తేలికపాటి నీటి తడులు ఇచ్చి అధిక దిగుబడులు పొందవచ్చు. నీటి తడులను పెట్టేటప్పుడు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పూత దశకు ముందు ఒకసారి, కాయ దశలో మరోసారి తడులు ఇవ్వాలి.
కలుపు నివారణ: విత్తే ముందు ప్లూక్లోరలిన్ ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి, భూమిలో కలియదున్నాలి. లేదా పెండి మిథాలిన్ ఎకరాకు 1 నుంచి 1.6 లీటర్లతో విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి.
నల్లరేగడి నేలల్లో శనగ సాగు నయం
Published Thu, Nov 13 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement