రైతన్నను కుంగతీస్తున్న వర్షాభావం
నీరందక ఎండుతున్న పంటలు
ఖరీఫ్‌లో తగ్గిపోయిన సాగు
జిల్లాలో వరుణుడు మొహం చాటేశాడు. నల్లని మేఘాలు కమ్ముకోవడం..ఇంతలోనే మటుమాయవడం నిత్యకృత్యమవుతోంది. వాన చినుకు జాడ కోసం రైతులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సకాలంలో పెట్టుబడులు, విత్తనాలు అందకపోయినా..అప్పో సొప్పో చేసి కోటి ఆశలతో సాగు చేసిన పంటలు నీరందక కళ్లముందే ఎండిపోతుంటే రైతులు విలవిల్లాడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సర్కారు చేయూత లేకపోయినా...అష్టకష్టాలు పడి పంటలు సాగు చేస్తున్న రైతులకు వరుణ దేవుడి కరుణ కూడా కరువైంది. వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో ఖరీఫ్ ఆలస్యమైంది. ఖరీఫ్ సీజన్ అక్టోబర్ 15తో ముగిసింది. వర్షాలు లేక జిల్లా వ్యాప్తంగా వరి కేవలం 53 శాతమే సాగు చేశారు. పత్తి, మినుములు, కందులు, సోయాబీన్, పత్తి వంటి పంటల విస్తీర్ణం పెరిగినా వరి విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది.
వర్షపాతం కూడా గణనీయంగా తగ్గింది. జూన్ నెలలో 80 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఒక మాదిరిగా వర్షపాతం నమోదైంది. ఆగస్టులో 54 శాతం, సెప్టెంబర్‌లో 44 శాతం వర్షపాతం తక్కువ నమోదు కాగా, అక్టోబర్‌లో ఇప్పటి వరకూ 88 శాతం తక్కువ నమోదైంది. దీంతో వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సజ్జలు 2994 హెక్టార్లలో, శనగలు 1957 హెక్టార్లలో, పత్తి 7705 హెక్టార్లలో, నువ్వులు 248 హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో 39,363 హెక్టార్లలో వరి విస్తీర్ణం ఉండగా, గత ఏడాది 58,103 హెక్టార్లలో వరి వేశారు. ఈసారి అది 20 వేల హెక్టార్లకు కూడా చేరుకోలేదు.
కృష్ణాడెల్టా కాల్వల పరిధిలో మాత్రమే వరి వేశారు. జొన్నలు 471 హెక్టార్లలో గత ఏడాది వేయగా, ఈ ఏడాది కేవలం 12 హెక్టార్లలోనే వేశారు. సజ్జలు గత ఏడాది 25277 హెక్టార్లలో వేయగా ఈ ఏడాది అది 10,611 హెక్టార్లకే పరిమితమైంది. మొక్కజొన్న గత ఏడాది 2,865 హెక్టార్లలో సాగు చేయగా ఇప్పటి వరకూ 1183 హెక్టార్లలో వేశారు. రాగి, చిరుధాన్యాలు 162 హెక్టార్లలో మాత్రమే వేశారు. పొగాకు, శనగ పంటల విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దీంతో పత్తి, మిర్చి ఇతర పంటల సాగు పెరిగింది. పత్తి సాధారణ విస్తీర్ణం 56,167 హెక్టార్లు కాగా ఈ ఏడాది 70,571 హెక్టార్లలో వేశారు. చెరుకు 446 హెక్టార్లకు గాను 900 హెక్టార్లలో సాగు చేశారు. అంటే సాగు 202 శాతానికి పెరిగింది. తుఫాన్ ప్రభావం కూడా జిల్లా మీద కనపడలేదు. రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడినా అవి పంటలకు సరిపడా లేవని రైతులు చెబుతున్నారు.
చినుకు..చింత
Published Sun, Oct 19 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM
Advertisement