వేరుశెనగ పంట బీమాగోవిందా!
- ఇన్సూరెన్స్ పొడిగింపు గడువును పట్టించుకోని ఏఐసీ
- నాన్ లోనీలకు ఇన్సూరెన్స్ వర్తించదట
- జిల్లాలోని 3వేల మంది రైతుల నోట్లో దుమ్మే
- రూ.3.45 కోట్ల నష్టపరిహారం హుష్‌కాకీ
- ఎక్కువగా నష్టపోయేది కుప్పం ప్రాంత రైతులే
పలమనేరు: ఈ ప్రభుత్వం ఏ ముహుర్తానా అధికారంలోకొచ్చిందో గానీ రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ దఫా వేరుశెనగ పంట బీమా గడువును ప్రభుత్వం పొడిగించింది. పొడిగించిన గడువులో కట్టించుకున్న ప్రీమియంలతో తమకు సంబంధం లేదంటూ ఏఐసీ (అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) తెగేసి చెప్పింది. పైగా లోనీలకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని మెలిక పెట్టింది. ఈ కారణంగా జిల్లాలో 3 వేల మందికి పైగా రైతులకు నష్టపరిహారం అందని పరిస్థితి ఏర్పడింది.
అసలేం జరిగిందంటే..
ఈ సీజన్‌లో వేరుశెనగ పంటకు సంబంధించి ప్రభుత్వం పంటల బీమాకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జీవో నం బర్ 422 ప్రకారం ఆగస్ట్ 2వ తేదీలోపు వేరుశెనగ రైతులు ప్రీమియం చెల్లించాలని అధికారులు సూచించారు. ఎకరాకు రూ.550 చొప్పున డీడీలు తీసి సంబంధిత ఏవోలకు అంది వ్వమని చెప్పారు. గతంలో ఇన్సూరెన్స్ అందని కారణంగా పదిశాతం రైతులు మాత్రమే పంటల బీమాకు ముందుకొచ్చారు. దీంతో ప్రభుత్వం 452 జీవోను విడుదల చేసి బీమా గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. లోనీ (బ్యాంకులో రుణం పొందిన రైతులు), నాన్ లోనీ (రుణం పొందని రైతులు) ఎవరైనా బీమాకు అర్హులేనని తెలిపింది.
మదనపల్లె, తంబళ్లపల్లె, పలమనేరు తదితర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాలకు సంబంధించి 1000 మంది రైతులు రూ.5.5 లక్షలు వేరుశెనగ పంటకు బీమా కోసం డీడీలు చెల్లించారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోనే 1000 మంది దాకా రైతులు రూ.5.5 లక్షల ప్రీమియంను చెల్లించారు. మొత్తం మీద జిల్లాలో మూడు వేల మంది రైతులు 3వేల ఎకరాలకు రూ.16.5 లక్షల ప్రీమియం కట్టారు.
గడువు పెంపు ప్రీమియంను నిరాకరించిన ఏఐసీ
రైతుల నుంచి గడువు పెంపుతో కట్టించుకున్న ప్రీమియంను సంబంధిత ఏడీలు హైదరాబాదులోని ఏఐసీకి మూడు రోజుల క్రితం పంపగా వాటిని వెనక్కి పంపారు. గడువు పెంచిన ప్రీమియంలు తాము తీసుకోమని, నాన్ లోనీల ప్రీమియంలు కూడా చెల్లుబాటు కావని ఓ ఆదేశాల కాపీని ఏఐసీ చీఫ్ రీజనల్ మేనేజర్ రాజేశ్వరి సింగ్ వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన్‌రావుకు పంపారు. ఇదే ఆదేశాలు కమిషనర్ నుంచి సంబంధిత ఏడీ కార్యాలయాలకు అందాయి. రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక అధికారులు ఆందోళన చెందుతున్నారు.
రూ.3.45 కోట్ల నష్ట పరిహారం హుష్‌కాకీ..
ఈ ఆదేశాల మేరకు జిల్లాలోని 3 వేల మందికి పైగా రైతులకు ఎకరాకు రూ.11.500 చొప్పున అందాల్సిన పంట బీమా మొత్తం రూ.3.45 కోట్లు అందనట్టే. ఇంత మాత్రానికి గడువు పెంచి మరీ తమవద్ద ప్రీమియంలు ఎందుకు కట్టించుకున్నట్టని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కుప్పం ప్రాంత వేరుశెనగ రైతులకు ఈ ఆదేశాలతో తీరని నష్టం జరగడం ఖాయం. విషయం తెలుసుకున్న ఆ ప్రాంత రైతులు ముఖ్యమంత్రినే కలసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయమై పలమనేరు ఏడీ రమేష్‌ను వివరణ కోరగా తమ శాఖ కమిషనర్ నుంచి ఈ ఆదేశాలు అందిన మాట వాస్తవమేనన్నారు.