the premium
-
పెత్తనం కాంట్రాక్టర్లదే
రెండు కార్పొరేషన్లలో అధికారులు, పాలకవర్గ సభ్యులతో కుమ్మక్కు రెండు నెలలుగా వేతనాల్లేక కార్మికుల ఇబ్బందులు ఏకపక్షంగా టెండర్ల ప్రక్రియ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలోని రెండు కార్పొరేషన్లలో కాంట్రాక్టర్ల హవానే కొనసాగుతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో తొమ్మిదేళ్లుగా ఒకే గ్రూపు శానిటేషన్ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. రామగుండం నగరపాలక సంస్థలోనూ దాదాపు ఇదే తంతు కొనసాగుతోంది. ఇక్కడా కొందరు కాంట్రాక్టర్లదే పెత్తనం నడుస్తోంది. నగర పాలక సంస్థకు చెందిన కొందరు పాలక వర్గ సభ్యులు, అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు సకాలంలో వేతనాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత రెండు నెలలుగా ఆయా ఉద్యోగులకు వేతనాలివ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపుల్లోనూ ఇదే తంతు ! బ్యాంకుల ద్వారానే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో హడావుడిగా కార్మికులందరికి బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి కొద్దికాలంపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించినప్పటికీ మూడేళ్లుగా ఈ ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో వేతనాల చెల్లింపుల విషయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు పీఎఫ్, ఈఎస్ఐ ప్రీమియం మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించడం లేదు. ఫలితంగా కార్మికులు వైద్య సేవలను సైతం పొందలేని దుస్థితి నెలకొంది. అంతా ఏకపక్షమే..! రామగుండం నగర పాలక సంస్థలో టెండర్ల ప్రక్రియ పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో టెండర్ల ప్రక్రియ లేకుండానే కాంట్రాక్టర్లకు ఔట్సోర్సింగ్ కార్మికుల కొనసాగింపు పనులను అప్పగించారు. కార్పొరేషన్లో ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు... ఎంత మంది గైర్హాజరయ్యారనే వివరాలు సైతం బహిర్గతం కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు జాగ్రత్తపడ్డారు. కార్పొరేషన్లో మొత్తం 485 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కాగా, వీరిలో 361 మంది పారిశుధ్య కార్మికులున్నారు. రోజుకు సగటున 50 కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నప్పటికీ వారంతా హాజరైనట్లుగా రికార్డుల్లో చూపుతూ ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లు, అధికారులు, కొందరు పాలకవర్గ సభ్యులు పంచుకు తింటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల కాంట్రాక్టు ముగియడంతో గత నెల 23న ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా 10 పనులకు రూ.317.15 లక్షల వ్యయం అంచనాలతో టెండర్లు నిర్వహించారు. పరిపాలనా కారణాలతో ఈ టెండర్లను వాయి దా వేసిన నగర పాలక సంస్థ కమిషనర్ మల్లిఖార్జునుడు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా తాజాగా టెండర్లను ఆహ్వానించగా, పలు కాంట్రాక్టు సం స్థలు అందులో పాల్గొన్నాయి. షెడ్యూల్ ప్రకా రం ఈనెల 14న టెండర్లను తెరవాల్సి ఉండగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన శానిటేషన్ టెండర్లలో జరిగిన అవకతవకలు ఇటీవల వెలుగుచూడడంతో రామగుం డం కార్పొరేషన్ అధికారుల్లోనూ వణుకు మొదలైంది. తాత్కాలికంగా టెండర్లు తెరిచే ప్రక్రియను వాయిదా వేసిన అధికారులు గత పక్షం రోజులుగా టెండర్ల షెడ్యూళ్లను పరిశీలించే పనుల్లో నిమగ్నమవడం గమనార్హం. -
వేరుశెనగ పంట బీమాగోవిందా!
ఇన్సూరెన్స్ పొడిగింపు గడువును పట్టించుకోని ఏఐసీ నాన్ లోనీలకు ఇన్సూరెన్స్ వర్తించదట జిల్లాలోని 3వేల మంది రైతుల నోట్లో దుమ్మే రూ.3.45 కోట్ల నష్టపరిహారం హుష్‌కాకీ ఎక్కువగా నష్టపోయేది కుప్పం ప్రాంత రైతులే పలమనేరు: ఈ ప్రభుత్వం ఏ ముహుర్తానా అధికారంలోకొచ్చిందో గానీ రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ దఫా వేరుశెనగ పంట బీమా గడువును ప్రభుత్వం పొడిగించింది. పొడిగించిన గడువులో కట్టించుకున్న ప్రీమియంలతో తమకు సంబంధం లేదంటూ ఏఐసీ (అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) తెగేసి చెప్పింది. పైగా లోనీలకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని మెలిక పెట్టింది. ఈ కారణంగా జిల్లాలో 3 వేల మందికి పైగా రైతులకు నష్టపరిహారం అందని పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే.. ఈ సీజన్లో వేరుశెనగ పంటకు సంబంధించి ప్రభుత్వం పంటల బీమాకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జీవో నం బర్ 422 ప్రకారం ఆగస్ట్ 2వ తేదీలోపు వేరుశెనగ రైతులు ప్రీమియం చెల్లించాలని అధికారులు సూచించారు. ఎకరాకు రూ.550 చొప్పున డీడీలు తీసి సంబంధిత ఏవోలకు అంది వ్వమని చెప్పారు. గతంలో ఇన్సూరెన్స్ అందని కారణంగా పదిశాతం రైతులు మాత్రమే పంటల బీమాకు ముందుకొచ్చారు. దీంతో ప్రభుత్వం 452 జీవోను విడుదల చేసి బీమా గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. లోనీ (బ్యాంకులో రుణం పొందిన రైతులు), నాన్ లోనీ (రుణం పొందని రైతులు) ఎవరైనా బీమాకు అర్హులేనని తెలిపింది. మదనపల్లె, తంబళ్లపల్లె, పలమనేరు తదితర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాలకు సంబంధించి 1000 మంది రైతులు రూ.5.5 లక్షలు వేరుశెనగ పంటకు బీమా కోసం డీడీలు చెల్లించారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోనే 1000 మంది దాకా రైతులు రూ.5.5 లక్షల ప్రీమియంను చెల్లించారు. మొత్తం మీద జిల్లాలో మూడు వేల మంది రైతులు 3వేల ఎకరాలకు రూ.16.5 లక్షల ప్రీమియం కట్టారు. గడువు పెంపు ప్రీమియంను నిరాకరించిన ఏఐసీ రైతుల నుంచి గడువు పెంపుతో కట్టించుకున్న ప్రీమియంను సంబంధిత ఏడీలు హైదరాబాదులోని ఏఐసీకి మూడు రోజుల క్రితం పంపగా వాటిని వెనక్కి పంపారు. గడువు పెంచిన ప్రీమియంలు తాము తీసుకోమని, నాన్ లోనీల ప్రీమియంలు కూడా చెల్లుబాటు కావని ఓ ఆదేశాల కాపీని ఏఐసీ చీఫ్ రీజనల్ మేనేజర్ రాజేశ్వరి సింగ్ వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన్‌రావుకు పంపారు. ఇదే ఆదేశాలు కమిషనర్ నుంచి సంబంధిత ఏడీ కార్యాలయాలకు అందాయి. రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. రూ.3.45 కోట్ల నష్ట పరిహారం హుష్‌కాకీ.. ఈ ఆదేశాల మేరకు జిల్లాలోని 3 వేల మందికి పైగా రైతులకు ఎకరాకు రూ.11.500 చొప్పున అందాల్సిన పంట బీమా మొత్తం రూ.3.45 కోట్లు అందనట్టే. ఇంత మాత్రానికి గడువు పెంచి మరీ తమవద్ద ప్రీమియంలు ఎందుకు కట్టించుకున్నట్టని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కుప్పం ప్రాంత వేరుశెనగ రైతులకు ఈ ఆదేశాలతో తీరని నష్టం జరగడం ఖాయం. విషయం తెలుసుకున్న ఆ ప్రాంత రైతులు ముఖ్యమంత్రినే కలసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయమై పలమనేరు ఏడీ రమేష్‌ను వివరణ కోరగా తమ శాఖ కమిషనర్ నుంచి ఈ ఆదేశాలు అందిన మాట వాస్తవమేనన్నారు. -
స్మార్ట్‌ఫోన్‌కూ బీమా ధీమా..
అనధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 20 లక్షల పైచిలుకు ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. అందుకే, వాహనాలకు, ఇంటికి, జీవితానికి ఉన్నట్లే మొబైల్ ఫోన్లకు కూడా ప్రస్తుతం బీమా పాలసీలు లభిస్తున్నాయి. బీమా కంపెనీలే కాకుండా ఫోన్లు విక్రయించే స్టోర్లు కూడా ఈ పాలసీలను అందిస్తున్నాయి. పాలసీకి సంబంధించి ఒక్కో కంపెనీ వసూలు చేసే ప్రీమియం ఒక్కో రకంగా ఉంటోంది. సాధారణంగా ప్రతి రూ.1,000 కవరేజీకి ప్రీమియం సుమారు రూ. 15-20 దాకా ఉంటోంది. ఉదాహరణకు రూ. 40,000 ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ బీమా కవరేజీ కోసం ప్రీమియం దాదాపు రూ. 600 - 800 దాకా ఉంటుంది. మొబైల్‌ఫోన్ చోరీకి గురైనా లేదా పోయినా.. క్లెయిమ్ పొందాలంటే ముందుగా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత మొబైల్‌ను కొన్న బిల్లు, పోలీస్ ఎఫ్ఐఆర్ను.. బీమా కంపెనీకి గానీ లేదా గ్రూప్ పాలసీ ఇచ్చిన మొబైల్ స్టోర్‌కి గానీ అందజేయాలి. ఫోన్ పోయిన 48 గంటల్లోగా క్లెయిమ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. క్లెయిము విషయంలో ఫోన్ విలువ తరుగుదల కూడా కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా కొన్న 90 రోజుల్లోగా ఫోన్ పోయి, క్లెయిమ్ కోసం దాఖలు చేస్తే బీమా కంపెనీలు తరుగుదలను లెక్కకట్టవు. అదే 91 రోజుల నుంచి 180 రోజుల మధ్య కాలం అయితే ఫోన్ ఖరీదులో 25 శాతం మేర, 181 రోజులు గడిచిన తర్వాత 50 శాతం తరుగుదలను లెక్కగట్టి ఆ మేరకు క్లెయిమ్ మొత్తం ఇస్తాయి. అగ్నిప్రమాదం, దొంగతనం, ఇతరత్రా కొన్ని కారణాల వల్ల ఫోన్ దెబ్బతిన్నా ఫోన్‌కు పాలసీ రక్షణ ఉంటుంది. అయితే, వ్యక్తిగత నిర్లక్ష్యం కారణంగా పోగొట్టుకుంటే మాత్రం కవరేజీ ఉండదు. కాబట్టి పాలసీ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి అంశాలన్నీ చూసుకుని మాత్రమే తీసుకోవాలి. -
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ టర్మ్ పాలసీ..
తక్కువ ప్రీమియంలతో అత్యధిక కవరేజీ అందించే టర్మ్ పాలసీలను ఆన్లైన్లో పలు బీమా కంపెనీలు అందిస్తున్నాయి. దేశీయంగా అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఆన్లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది. సాధారణంగానే మిగతా పాలసీలతో పోలిస్తే టర్మ్ పాలసీల ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. అదే ఆన్లైన్లో తీసుకుంటే మరింత తగ్గుతాయి. ఏజెంట్ల ద్వారా తీసుకునే పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు సుమారు 35 శాతం తక్కువగా ఉంటున్నాయి. పాలసీలను విక్రయించినందుకు ఏజెంట్లకి ఇచ్చే కమీషన్ల భారం లేకపోవడం వల్ల ఆ ప్రయోజనాలను ఎల్ఐసీ లాంటి కంపెనీలు నేరుగా పాలసీదారులకు బదలాయిస్తున్నాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇస్తాయి ఈ పాలసీలు. పాలసీదారు మరణించిన పక్షంలో మాత్రమే సమ్ అష్యూర్డ్‌ని వారి కుటుంబసభ్యులకు అందిస్తాయి కంపెనీలు. ఒకవేళ అలాంటిదేమీ జరగని పక్షంలో కట్టిన ప్రీమియం తిరిగి రాదు. అందుకే.. మిగతా పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు కాస్త తక్కువగా ఉంటాయి. రూ. 50 లక్షలు పైబడిన కవరేజీ తీసుకుంటున్న పక్షంలో పొగ త్రాగే అలవాటు ఉన్నవారికి ఒక రకంగానూ, అలవాటు లేని వారికి మరో రకంగానూ ప్రీమియంలు ఉంటాయి. కనీసం పదేళ్ల నుంచి 35 ఏళ్ల వ్యవధి దాక పాలసీ తీసుకోవచ్చు. మిగతా కంపెనీల ఆన్లైన్ పాలసీల విషయానికొస్తే 30 ఏళ్ల పురుషులు (నాన్-స్మోకర్) ప్రీమియంలు రూ. 4,500 నుంచి రూ. 10,130 దాకా ఉంటుండగా.. ఎల్ఐసీ పాలసీ రూ. 8,820 స్థాయిలో ఉంటోంది. ఏదైనప్పటికీ.. క్లెయిమ్‌లను చెల్లించడంలో ఎల్ఐసీ రికార్డు, ఇతరత్రా ప్రయోజనాల కారణంగా ఈపాలసీ మెరుగైనదేనన్నది పరిశీలకుల అభిప్రాయం.