ఆన్‌లైన్లోనూ ఎల్‌ఐసీ టర్మ్ పాలసీ..
తక్కువ ప్రీమియంలతో అత్యధిక కవరేజీ అందించే టర్మ్ పాలసీలను ఆన్‌లైన్లో పలు బీమా కంపెనీలు అందిస్తున్నాయి. దేశీయంగా అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఆన్‌లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది. సాధారణంగానే మిగతా పాలసీలతో పోలిస్తే టర్మ్ పాలసీల ప్రీమియంలు తక్కువగా ఉంటాయి.
అదే ఆన్‌లైన్లో తీసుకుంటే మరింత తగ్గుతాయి. ఏజెంట్ల ద్వారా తీసుకునే పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు సుమారు 35 శాతం తక్కువగా ఉంటున్నాయి. పాలసీలను విక్రయించినందుకు ఏజెంట్లకి ఇచ్చే కమీషన్ల భారం లేకపోవడం వల్ల ఆ ప్రయోజనాలను ఎల్‌ఐసీ లాంటి కంపెనీలు నేరుగా పాలసీదారులకు బదలాయిస్తున్నాయి.
తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇస్తాయి ఈ పాలసీలు. పాలసీదారు మరణించిన పక్షంలో మాత్రమే సమ్ అష్యూర్డ్‌ని వారి కుటుంబసభ్యులకు అందిస్తాయి కంపెనీలు. ఒకవేళ అలాంటిదేమీ జరగని పక్షంలో కట్టిన ప్రీమియం తిరిగి రాదు. అందుకే.. మిగతా పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు కాస్త తక్కువగా ఉంటాయి. రూ. 50 లక్షలు పైబడిన కవరేజీ తీసుకుంటున్న పక్షంలో పొగ త్రాగే అలవాటు ఉన్నవారికి ఒక రకంగానూ, అలవాటు లేని వారికి మరో రకంగానూ ప్రీమియంలు ఉంటాయి.
కనీసం పదేళ్ల నుంచి 35 ఏళ్ల వ్యవధి దాక పాలసీ తీసుకోవచ్చు. మిగతా కంపెనీల ఆన్‌లైన్ పాలసీల విషయానికొస్తే 30 ఏళ్ల పురుషులు (నాన్-స్మోకర్) ప్రీమియంలు రూ. 4,500 నుంచి రూ. 10,130 దాకా ఉంటుండగా.. ఎల్‌ఐసీ పాలసీ రూ. 8,820 స్థాయిలో ఉంటోంది. ఏదైనప్పటికీ.. క్లెయిమ్‌లను చెల్లించడంలో ఎల్‌ఐసీ రికార్డు, ఇతరత్రా ప్రయోజనాల కారణంగా ఈపాలసీ మెరుగైనదేనన్నది పరిశీలకుల అభిప్రాయం.