ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ .. తమ సర్వీసులను కూడా అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందులో భాగంగా పాలసీదారులు తమ పాలసీలపై రుణం పొందేందుకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేకతల గురించి వివరించేదే ఈ కథనం.
ఎంత రుణం వస్తుంది..
ఎల్‌ఐసీ పాలసీ సరెండర్ విలువలో (బోనస్ క్యాష్ వ్యాల్యూతో కలిపి) గరిష్టంగా 90 శాతం మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. అదే పెయిడప్ పాలసీలపైనేతే సరెండర్ విలువపై 85 శాతం దాకా పొందవచ్చు. అయితే, అన్ని పాలసీలపై ఈ రుణాలు పొందే అవకాశం ఉండదు (ఉదాహరణకు టర్మ్ పాలసీల్లాంటివి). కాబట్టి రుణం తీసుకోవాలనుకున్నప్పుడు మీ పాలసీపై ఆ సదుపాయం ఉందా లేదా ఒకసారి ధ్రువీకరించుకోవాలి. రుణంపై వడ్డీని ఆరునెలలకోసారి చెల్లించవచ్చు. ఒకవేళ 6 నెలలలోపే పాలసీ మెచ్యూర్ అయినా.. క్లెయిమ్ తలెత్తినా (పాలసీదారు అకాల మరణంలాంటివి జరిగి).. ఆ సమయం దాకా మాత్రమే వడ్డీ లెక్కిస్తారు.
పాలసీపై రుణం పొందాలంటే ప్రీమియంను కనీసం మూడేళ్లు కట్టాలి. సదరు పాలసీ ఒరిజినల్ బాండును ఎల్‌ఐసీ వద్ద తనఖా పెట్టాలి.
ఒకవేళ గడువు దాటాక ముప్ఫై రోజుల్లోగా వడ్డీ చెల్లించకపోతే, పాలసీని ముందస్తుగానే క్లోజ్ చేసి రుణ మొత్తాన్ని సెటిల్ చేసుకునేందుకు ఎల్‌ఐసీకి అధికారాలు ఉంటాయి. అయితే, ఫుల్లీ పెయిడప్ పాలసీలకు ఇది వర్తించదు.
పాలసీ తదుపరి ప్రీమియం చెల్లింపు తేదీ రోజు లేదా, తదుపరి చెల్లింపు తేదీ కన్నా ఆరు నెలలు ముందుగా (ఏది ముందైతే అది) తొలి విడత వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి అర్ధ సంవత్సరానికోసారి వడ్డీ చెల్లించాలి.
మొదటి లోన్ పూర్తిగా చెల్లించకుండానే మరో విడత రుణం కూడా తీసుకునే వీలూ ఉంది. అయితే, ఎంత తీసుకున్నా సరెండర్ విలువలో గరిష్టంగా 90 శాతం పరిమితికి లోబడే ఉంటుంది.
ఎల్‌ఐసీ పాలసీపై ఇతరత్రా బ్యాంకుల నుంచి కూడా రుణం తీసుకోవచ్చు. అయితే, అవి ఎల్‌ఐసీ కన్నా ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేయడంతో పాటు వచ్చే రుణ పరిమాణం కూడా తగ్గవచ్చు.
ప్రయోజనాలు
వ్యక్తిగత రుణం మీద కన్నా తక్కువగా వడ్డీ రేటు
రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో ఎప్పటికప్పుడు కేవలం వడ్డీనే చెల్లించే సదుపాయం. పాలసీ గడువు తీరేలోగా ఎప్పుడైనా అసలు తీర్చేసేందుకు వెసులుబాటు. వ్యక్తిగత రుణంలో ఈ వెసులుబాటు ఉండదు.
ఈ రుణంపై ధ్రువీకరణ పత్రంగా మీ పాలసీయే సరిపోతుంది. అదే మిగతా వాటికైతే మీ క్రెడిట్ స్కోరు, మీరు తనఖా పెట్టే ఆస్తుల విలువ మొదలైనవన్నీ అవసరమవుతాయి.
ప్రతికూలాంశాలు..
కేవలం సరెండర్ విలువ మాత్రమే లభించడం వల్ల ... మరింత ఎక్కువ రుణం అవసరమైనప్పుడు ఇది పెద్దగా పనిచేయదు. సాధారణంగా పాలసీ తొలినాళ్లలో సరెండర్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. పాలసీ గడువు ముగిసే సమయానికి క్రమంగా దాని విలువతో పాటు పొందగలిగే రుణ పరిమాణం కూడా పెరుగుతుంది.
అసలు లేదా వడ్డీ చెల్లించేటప్పుడు పన్ను ప్రయోజనాలేవీ దక్కవు.
రుణ సందర్భంలో పాలసీదారు అకాల మరణం చెందితే.. వచ్చే బీమా ప్రయోజనాలు తగ్గుతాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా..
ఆన్‌లైన్ ప్లాట్‌పాం ద్వారా లోన్ తీసుకోవడంతో పాటు వడ్డీని లేదా అసలును కూడా ఆన్‌లైన్‌లోనే కట్టేసే వీలు కూడా ఉంది. ఇందుకోసం ఏం చేయాలంటే..
► ఎల్‌ఐసీ హోమ్‌పేజ్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ సర్వీసెస్ కేటగిరీలో ఆన్‌లైన్ లోన్ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.
దీంతో మరో పేజీ వస్తుంది. అందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఒకటి.. వడ్డీ లేదా అసలు ఆన్‌లైన్‌లో కట్టేసేందుకు ఉపయోగపడుతుంది. రిజిస్టర్ చేసుకున్న వారైనా చేసుకోనివారైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక రెండో దాని విషయానికొస్తే.. మీ లాగిన్ ద్వారా రుణ దరఖాస్తు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
► ఆన్‌లైన్ లోను పొందాలంటే ఎల్‌ఐసీ రిజిస్టర్డ్ కస్టమర్ అయి ఉండాలి. అయితే, రుణంపై వడ్డీ లేదా అసలు చెల్లించాలంటే లాగిన్ ఉన్నా లేకపోయినా కట్టొచ్చు. ఆన్‌లైన్‌లో రుణ సదుపాయం పొందాలంటే మీ బ్యాంకు ఖాతా వివరాలను కూడా సమర్పించాల్సి రావొచ్చు. ఈ సమాచారాన్ని అప్‌డేట్ చేస్తే.. మంజూరైన రుణ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమవుతుంది.