‘ఉపాధి’ ఎండమావే! | Employment' mirage! | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ ఎండమావే!

Published Sat, Nov 1 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

‘ఉపాధి’ ఎండమావే!

‘ఉపాధి’ ఎండమావే!

  • తీవ్ర దుర్భిక్షంతో 57 మండలాల్లో ఖరీఫ్ పంటలకు నష్టం
  •  సేద్యం పడకేయడంతో గ్రామాల్లో ఉపాధి దొరకని దుస్థితి
  •  ఉపాధిహామీ కింద పని కల్పించడంలో సర్కారు వైఫల్యం
  •  పొట్టచేత పట్టుకుని నగరాలకు వలస వెళ్తున్న గ్రామీణులు
  • వరుసగా ఐదో ఏటా జిల్లాను కరవు కాటేసింది. దుర్భిక్షంతో సేద్యం పడకేసింది. రైతులే కూలీలుగా మారిపోవడంతో పల్లెల్లో పని దొరకని దుస్థితి నెలకొంది. ఉన్న ఊళ్లో చేతినిండా ఉపాధి కల్పించి.. వలసల నివారణకు చేసిన ఉపాధి చట్టాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పని కల్పించకపోవడంతో రెక్కాడితేగానీ డొక్కాడని రైతులు, రైతు కూలీలు పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇదీ మన జిల్లా గ్రామీణ చిత్రం..!
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి/బి.కొత్తకోట: జిల్లా లో పశ్చిమ మండలాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. తూర్పు మండలాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఏడాదికి జిల్లాలో 918.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ.. గత నాలుగేళ్లుగా వ్యవసాయాన్ని దుర్భిక్షం కాటేసింది. ఈ ఏడాది కోటి ఆశలతో ఖరీఫ్ పంటలను సాగుచేసిన రైతులను వరుణుడు చిన్నచూపు చూశాడు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో 439.4 మిమీల వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 217.4 మీమీల వర్షం కురిసింది.

    సాధారణ వర్షపాతం కంటే 38 శాతం తక్కువ నమోదైనట్లు స్పష్టమవుతోంది. నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఖరీఫ్‌లో 1.38 లక్షల హెక్టార్లలో సాగుచేసిన వేరుశెనగ పంట ఎండిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలమట్టం 17.68 మీటర్లకు పడిపోయింది. భూగర్భజలమట్టం పడిపోవడంతో 60 వేలకుపైగా బోరుబావులు ఎండిపోయాయి. అటు మెట్ట భూముల్లోనూ.. ఇటు బోరు బావుల కింద సాగుచేసిన ఆరు తడి పంటలు ఎండిపోవడంతో ఖరీఫ్ రైతులను నట్టేట ముంచింది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో 395.4 మీమీల వర్షపాతం నమోదవ్వాలి.

    ఇప్పటికి 105.7 మిమీ. కురిసింది. నైరుతి, ఈశాన్య రుతపవనాల ప్రభావం వల్ల ఇప్పటికి 545.1 మిమీల వర్షం కురవాల్సి ఉండగా.. 317.5 మిమీలు కురిసింది. అంటే.. సాధారణ వర్షపాతం కన్నా 42 శాతం తక్కువ కురిసినట్లు స్పష్టమవుతోంది. వర్షపాతం.. పంటల పరిస్థితిని ఆధారంగా తీసుకుంటే జిల్లాలో 57 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్న ట్లు అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. ఖరీఫ్ పంట లు నష్టాల దిగుబడులను మిగల్చడంతో రబీ సాగు పై రైతులు ఆసక్తి చూపడం లేదు. రబీలో జిల్లాలో 59,970 హెక్టార్లలో పంటలు సాగుచేయాల్సి ఉండ గా.. ఇప్పటికి కేవలం 883 హెక్టార్లలోనే పంటలు సాగుచేయడమే అందుకు తార్కాణం.
     
    ఊళ్లకు ఊళ్లు ఖాళీ..

    వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం పడకేయడంతో పల్లెల్లో చేయడానికి పని దొరకని దుస్థితి నెలకొంది. రైతులే కూలీలుగా మారడంతో రైతు కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలతోపాటూ రైతులూ వలసబాట పట్టారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్ వంటి పట్టణాలకు వలస వెళ్తున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి.

    ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీలు వలస వెళ్లారు. కొందరైతే ముసలివాళ్లను, పిల్లలను ఇళ్లల్లో ఉంచి.. భార్యాభర్తలు ఇద్దరూ వలస వెళ్లారు. మరి కొందరైతే ఇంటికి తాళం వేసి.. కుటుంబం మొత్తం వలస వెళ్లారు. వలసలతో గ్రామాలన్నీ బోసిపోయాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆలనాపాలనా లేక వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
     
    ఏదీ ఉపాధి హామీ..?

    ఉన్న ఊళ్లో చేతినిండా పని కల్పించడం కోసం 2005లో కేంద్రం ఉపాధి చట్టాన్ని చేసింది. ఆ చట్టం అమల్లో భాగంగా జిల్లాలో ఏప్రిల్ 2, 2006న ఉపాధిహామీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద 66 మండలాల్లోని 1,380 పంచాయతీల్లో 11,580 గ్రామాల్లోని 6.38 లక్షల మందికి జాబ్‌కార్డులు జారీ చేశారు. ఇందులో 5.07 లక్షల మంది సభ్యులతో శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటుచేశారు. ఏడాదికి గరిష్టంగా వంద పని దినాలు కల్పించాలని నిర్ణయించారు.

    పని కల్పించమని అడిగిన వారంలోగా పని కల్పించకపోతే సంబంధిత జాబ్‌కార్డ్ లబ్ధిదారునికి పరిహారం చెల్లించేలా నిబంధన పెట్టారు. కానీ.. ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్యీర్యం చేస్తోంది. అడిగిన తక్షణమే పని కల్పించకుండా.. వేతనాలు చెల్లించకుండా ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చుతున్నారు. ఉపాధిహామీ పథకం కింద పని చేసిన కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.13 కోట్లకు చేరుకోవడమే అందుకు తార్కాణం.

    ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్కో కుటుంబానికి సగటున 48.95 పని దినాలు కల్పించారు. వంద రోజులు పని దినాలు కేవలం 22,492 మందికి మాత్రమే కల్పించడం గమనార్హం. ఉపాధిహామీ కింద పని కల్పించకపోవడంతో రైతులు, రైతు కూలీలు కన్నతల్లి వంటి ఉన్న ఊళ్లను వదిలి వలస వెళ్తోండటం గమనార్హం. వంద రోజులు పని కల్పించలేని ప్రభుత్వం.. కరవు నేపథ్యంలో ఉపాధిహామీ పని దినాలను 150కి పెంచాలని ఇటీవల లేఖరాయడం కొసమెరుపు.
     
    పనిలేక ఖాళీగా ఉన్నాం
    మా ఊళ్లో వీరాంజనేయ, అమరేశ్వర గ్రూపుల్లో 27 మంది కూలీలు కరువు పనులకు వెళ్లేవాళ్లము. జూన్ నెల లో చెరువులో మట్టి పనులు చేసినాం. అప్పటి నుంచి పనుల్లేక ఇళ్లకాడ ఖాళీ గా ఉండాము. కరువు పనికి పోదామని ఉన్నా పనులు చేయమని చెప్పే వాళ్లే లేరు. ఆఫీసర్లు గూడా వచ్చి కరువు పనులు చేసుకోమని ఎవ రూ చెప్పలే. ఈసారి పంటలు పండకపోయా. ఇట్లే ఉంటే బెంగళూరుకు వెళ్లిపోవాల్సిందే.
     -వేమనారాయణ, ఉపాధి కూలీ, గజ్జెలవారిపల్లి  
     
     ఇంతవరకు బిల్లులేదు
     ఈ ఏడాది జూన్‌లో మా గ్రూపులోని 12 మంది కూలీలు కలసి కొత్తచెరువులో మట్టి తవ్వే పనికిపోయాం. పొలాలకు తోలిన 300 ట్రాక్టర్ల మట్టిని చల్లాం. సగం బిల్లులు మాత్రం ఇచ్చారు. ఇంకా రూ.20 వేలు ఇవ్వాలి. పోస్టాఫీసుకు పోతే మా అకౌంట్లో బిల్లులు పడలేదంటున్నారు.  
     -రమణ, ఉపాధి కూలీ, గజ్జెలవారిపల్లె  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement