ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో దారుణంగా విఫలమయ్యారంటూ ప్రతిపక్షాలు మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి. ఎప్పుడో జరిగిన సంఘటనకు ఇప్పుడు రాజీనామా చెయ్యమంటే ఎలా అని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
మే 4న జరిగిన మణిపూర్ అల్లర్లలో ఒక చీకటి అధ్యాయం వెలుగు రావడానికి చాలా ఆలస్యమైంది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న రోజునే ఆనాటి వీడియో బయటకి రావడంతో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. అందులోని అమానవీయ సంఘటన చూసి దేశమంతా నివ్వెరపోయింది. పార్లమెంటు సమావేశాలు మొదటిరోజే అట్టుడికింది. ఇది కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యమేనని వేలెత్తి చూపుతూ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ అల్లర్లను నియంత్రించడంలో విఫలమైన కారణంగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ఊహాగానాలు కూడా వెలువడ్డాయి.
కానీ ఈ ఊహాగానాలన్నిటినీ ప్రభుత్వ వర్గాలు కొట్టి పారేశాయి. ప్రభుత్వ వర్గాలు ఈ డిమాండ్లపై స్పందిస్తూ అది ఒకప్పటి వీడియో అని ఇప్పుడు మణిపూర్లో పరిస్థితి చాలా వరకు సర్దుకుంది శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని చెప్పుకొచ్చాయి. మణిపూర్ హోమ్ మంత్రి కుకీ తెగ వారితో చర్చించారని వారికి సత్వర న్యాయం చేకూరేలా చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను మెయిటీ వర్గం వారు నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన రెండు నెలల క్రితమే జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పటివరకు నిందితులను అదుపులోకి తీసుకోకపోవడాన్ని ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి. బుధవారం ఈ ఉదంతం వెలుగులోకి రాగానే మణిపూర్ ప్రభుత్వం, పోలీసు వర్గాలు అప్రమత్తమై వీడియో ఆధారంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: భారీ వర్షాలు.. పసిబిడ్డను ఎత్తుకొని రైలు దిగిన తండ్రి, పట్టుతప్పడంతో
Comments
Please login to add a commentAdd a comment