భగ్గుమన్న రైతులు
దళారీ వ్యవస్థతో వేరుశనగ రైతుల అవస్థలు
హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రాస్తారోకో
పెట్రోల్ పోసి వేరుశనగకు నిప్పంటించిన వైనం
కల్వకుర్తి, న్యూస్‌లైన్ : తాము పండించిన వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కడుపుమండిన రైతులు వేరుశెనగ పంటను పోగుగా పోసి నిప్పంటించారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మార్కెట్ యార్డు సమీపంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తెస్తున్నా దళారులు తమకు ధర రాకుండా చేస్తున్నారని ఆందోళనకు దిగారు.
కల్వకుర్తి, వెల్దెండ్ల, వంగునూరు, చింతపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతులు 150 బస్తాల పంటను తెచ్చారు. ఇది 74 క్వింటాళ్లు ఉండగా దీని విలువ సుమారు రూ. రెండులక్షలకు పైబడి ఉంటుందని అంచనా. తమకు ఇతర మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ దళారులు క్వింటాలు ధరను రూ.2,800 నుంచి 3,700కు మించి పెంచనివ్వడం లేదని వేరే ప్రాంతాల్లో రూ.4,200 వరకూ చెల్లిస్తున్నారని మండి పడ్డారు.
ఆగ్రహంతో హైదరాబాద్ చౌరస్తాలోని శ్రీశైలం - హైదరాబాద్ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. నిరసనగా పంటకు నిప్పు పెట్టారు. ఈ లోగా వర్షం రావడంతో దాన్ని రక్షించుకునేందుకు ఆందోళన విరమించి మార్కెట్‌కు తరలి వెళ్లారు. అక్కడా పంటపై కప్పేందుకు కవర్లు లేక అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మార్కెట్ కార్యాలయంపై దాడికి కూడా యత్నించారు. అయితే ఈ అంశంపై అధికారులు ఎవరూ స్పందించక పోవడం విశేషం. పోలీసులకు విషయం తెల్సి వచ్చేసరికి ఆందోళన సద్దుమణిగింది.