Brokerage system
-
ధాన్యంలాగే కొబ్బరీనూ..
సాక్షి అమలాపురం/ అంబాజీపేట : కొబ్బరి కొనుగోలులో దళారుల వ్యవస్థను తొలగించడంతోపాటు రైతులకు రవాణా, కూలి ఖర్చుల భారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొబ్బరి ధరలు తగ్గిన నేపథ్యంలో నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ఆధ్వర్యంలో శనివారం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లుగానే ఈ కేంద్రాల్లో కూడా కొబ్బరి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. గతంలో మార్కెట్ యార్డుల కేంద్రంగా కొబ్బరి కొనుగోలు చేయగా, ఈసారి ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. గతంలో ఇలా.. గతంలో రైతులు మార్కెట్ యార్డులకు ఎండుకొబ్బరిని తీసుకువెళ్లాల్సి వచ్చేది. రోజుంతా అక్కడే కళ్లాలలో ఎండబెట్టేవారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే కొనేవారు. లేదంటే వెనక్కి తెచ్చుకోవాల్సిందే. ఇది రైతులకు నష్టాన్ని కలగజేసేది. ఒకవేళ కొనుగోలు చేసినా నాఫెడ్‌కు తీసుకువెళ్లడానికి రవాణా ఖర్చుతోపాటు ఎండబెట్టడం, మూటలు కట్టడానికి ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వచ్చేది. ప్రస్తుతం రోజుకు కూలి ఖర్చు రూ.600లు కాగా.. యార్డు వరకు తీసుకొస్తే రూ.వెయ్యి వరకు కూలి ఇవ్వాల్సి వచ్చేది. అధికారులే కళ్లాలు వద్దకు వచ్చి నాణ్యత నిర్ధారించి, అక్కడే కొనుగోలు చేయనున్నారు. ఇలా కొన్న కొబ్బరిని రైతులే సమీపంలోని నాఫెడ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. రైతులపై ఈ భారం మాత్రమే పడనుంది. కూలి ఖర్చులు కలిసిరావడం అంటే రైతులకు క్వింటాల్‌కు రూ.500ల నుంచి రూ.800లు వరకు మిగలనుంది. రైతులే సొంతంగా ఎగుమతి చేస్తే కూలి ఖర్చులు కూడా కలిసివస్తాయి. ఈ విధానంవల్ల దళారుల పాత్ర దాదాపు లేనట్లే. గతంలో ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన కొబ్బరి 90 శాతం దళారులదే. ఇప్పుడు రైతులు నేరుగా లబ్ధిపొందనున్నారు. ♦ నాఫెడ్ కేంద్రాలు సేకరించిన కొబ్బరిని ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ♦ రైతులు ముందుగా ఆర్బీకేల్లో పేరు, ఇతర వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆర్బీకేల ద్వారా కళ్లాల్లోనే కొనుగోలు.. ♦ ఎకరాకు నెలకు రెండు కొబ్బరి బస్తాల (క్వింటాల్) చొప్పున కొనుగోలుకు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు రైతులకు ధ్రువీకరణ పత్రాలిస్తారు. ♦ రైతుల వివరాలతో పాటు, కొబ్బరి విక్రయాలకు సంబంధించి కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైనిస్ అండ్ ప్రొక్యూర్మెంట్ (సీఎం యాప్)లో నమోదు చేస్తారు. ♦ దీని ఆధారంగా నాఫెడ్‌కు ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఉన్న ఆయిల్ ఫెడ్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి కొబ్బరి కొనుగోలు చేస్తారు. సర్కారు ప్రత్యేక చొరవతో కేంద్రం అనుమతి.. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇక్కడ సగటున 106.90 కోట్ల కాయలు దిగుబడిగా వస్తాయని అంచనా. తమిళనాడు, కేరళ, కర్ణాటకల నుంచి పోటీవల్ల ఉత్తరాదికి ఎగుమతులు క్షీణించడంతో కొబ్బరి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. వెయ్యి కాయల ధర రూ.7 వేలు ఉంది. ధరలు పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నాఫెడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకొచ్చింది. జిల్లాలో తొలుత అంబాజీపేటలోను, తరువాత కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ముమ్మిడివరం, తాటిపాక, రావులపాలెం, నగరం మార్కెట్ యార్డుల్లో వీటిని ప్రారంభించనున్నారు. మిల్లింగ్ కోప్రా (ఎండు కొబ్బరి)ని క్వింటాల్‌కు రూ.10,860లు, బాల్‌కోప్రా (కురిడీ కొబ్బరి గుడ్డు) క్వింటాల్ రూ.11,750 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఎండు కొబ్బరి ధర రూ.8 వేలు, కురిడీ కొబ్బరి గుడ్డు రూ.తొమ్మిది వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. ఈ కేంద్రాల ఏర్పాటువల్ల బహిరంగ మార్కెట్లో కొబ్బరికాయకు ధర వస్తోందని, స్థానికంగా నిల్వ ఉన్న కొబ్బరి మార్కెట్‌కు వెళ్తే వచ్చే దసరా, దీపావళికి డిమాండ్ వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. షెడ్యూలు ప్రకారం కొనుగోలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేస్తాం. రైతులు మార్కెట్ యార్డుల వద్దకు వచ్చి కొబ్బరి ఎండబెట్టి అమ్మకాలు చేయాల్సిన అవసరం ఉండదు. మేం కొనుగోలు చేసిన తరువాత సమీపంలో యార్డుకు తరలిస్తే సరిపోతోంది. సీఎం యాప్‌లో నమోదును బట్టి ఆయా ఆర్బీకేలకు ఒక షెడ్యూలు పెట్టుకుని కొబ్బరి కొనుగోలు చేస్తాం.– యు. సుధాకరరావు, మేనేజర్, ఆయిల్‌ఫెడ్ -
దళారీ వ్యవస్థను రూపుమాపుతాం
తిరుపతి ప్రాంతీయ రవాణాశాఖలో దళారీ వ్యవస్థను రూపుమాపుతామని తిరుపతి ఆర్టీవో గజ్జల వివేకానందరెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం ముందుగా శ్రీవారిని దర్శనం చేసుకుని అనంతరం తిరుపతి ఆర్టీవోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి(మంగళం): తిరుపతి ప్రాంతీయ రవాణాశాఖలో దళారీ వ్యవస్థను రూపుమాపుతామని తిరుపతి ఆర్టీవో గజ్జల వివేకానందరెడ్డి అన్నారు. ఈయన హిందూపురం నుంచి తిరుపతికి బదిలీపై వచ్చారు. మంగళవారం ఉదయం ముందుగా శ్రీవారిని దర్శనం చేసుకుని అనంతరం తిరుపతి ఆర్టీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీఏలో వాహనదారులు నేరుగా వచ్చి పనులు చేసుకోవచ్చన్నారు. ద ళారీల చేతులో పడి అధికంగా డబ్బు చెల్లించి మోసపోవద్దని సూచించారు. వాహనదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల ను సకాలంలో వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలి పారు. వాహనదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి విశిష్ట సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోకున్నా, లెసైన్స్ లేకుండా నడుపుతున్నా వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు బాధ్యతలు చేపట్టిన ఆర్టీవోకు కార్యాలయంలోని ఏవోలు మల్లికార్జునరెడ్డి, గంటా సుబ్రమణ్యం, ఎంవీఐలు నాగరాజనాయక్, శివశంకర్, చంద్రశేఖర్, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. -
‘ఇందిరమ్మ’ అవినీతిని నిర్భయంగా చెప్పాలి
ఖానాపూర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలతోపాటు దళారీ వ్యవస్థను ఉపేక్షించేది లేదని సీబీసీఐడీ వరంగల్ జోన్ డీఎస్పీ బి.రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ఇంటింటి సర్వే అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, హౌసింగ్ అధికారుల సిబ్బందితో ఐదు టీంలుగా పర్యటించి 500 వరకు ఇళ్లపై విచారణ చేశామన్నారు. ఇళ్లు నిర్మించకుండా బిల్లులు కాజేయడంతోపాటు పాత ఇళ్లపై బిల్లులు తీసుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. రాజేశ్వర్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండానే బిల్లు కాజేయడంతోపాటు అదే ఇల్లును కొనుగోలు చేసిన వ్యక్తిపై కూడా పాత యజమానే బిల్లు కాజేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. ఓ మహిళా వర్క్ఇన్స్పెక్టర్ తాను విధులు నిర్వర్తించిన సమయంలో బొప్పారపు రాజేశ్వర్ అనే వ్యక్తి ఇల్లుపై శాంత అనే మహిళ పేరుపై బినామీ బ్యాంకు ఖాతా తెరిచి ఖాతాదారురాలికి రూ.2 వేలు చెల్లించి.. రూ.38 వేలు స్వాహా చేసినట్లు గుర్తించామన్నారు. వీవో గ్రూపుల ద్వారా చెల్లించిన ఇందిరమ్మ ఇళ్లలో రూ.50 లక్షలకుపైగా భారీ అవినీతి చోటుచేసుకుందన్నారు. ఇందులో రూ.25 లక్షలకుపైగా చెల్లింపులు జరిగినట్లు నిర్దారణకు వచ్చామని తెలిపారు. వీవో చెల్లింపుల పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంటి దొంగల వివరాలను 9440700920 నంబర్‌కు ఫోన్ చేసి ప్రజలు నిర్భయంగా తెలియజేయవచ్చని సూచించారు. -
భగ్గుమన్న రైతులు
దళారీ వ్యవస్థతో వేరుశనగ రైతుల అవస్థలు హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రాస్తారోకో పెట్రోల్ పోసి వేరుశనగకు నిప్పంటించిన వైనం కల్వకుర్తి, న్యూస్‌లైన్ : తాము పండించిన వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కడుపుమండిన రైతులు వేరుశెనగ పంటను పోగుగా పోసి నిప్పంటించారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మార్కెట్ యార్డు సమీపంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తెస్తున్నా దళారులు తమకు ధర రాకుండా చేస్తున్నారని ఆందోళనకు దిగారు. కల్వకుర్తి, వెల్దెండ్ల, వంగునూరు, చింతపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతులు 150 బస్తాల పంటను తెచ్చారు. ఇది 74 క్వింటాళ్లు ఉండగా దీని విలువ సుమారు రూ. రెండులక్షలకు పైబడి ఉంటుందని అంచనా. తమకు ఇతర మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ దళారులు క్వింటాలు ధరను రూ.2,800 నుంచి 3,700కు మించి పెంచనివ్వడం లేదని వేరే ప్రాంతాల్లో రూ.4,200 వరకూ చెల్లిస్తున్నారని మండి పడ్డారు. ఆగ్రహంతో హైదరాబాద్ చౌరస్తాలోని శ్రీశైలం - హైదరాబాద్ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. నిరసనగా పంటకు నిప్పు పెట్టారు. ఈ లోగా వర్షం రావడంతో దాన్ని రక్షించుకునేందుకు ఆందోళన విరమించి మార్కెట్‌కు తరలి వెళ్లారు. అక్కడా పంటపై కప్పేందుకు కవర్లు లేక అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మార్కెట్ కార్యాలయంపై దాడికి కూడా యత్నించారు. అయితే ఈ అంశంపై అధికారులు ఎవరూ స్పందించక పోవడం విశేషం. పోలీసులకు విషయం తెల్సి వచ్చేసరికి ఆందోళన సద్దుమణిగింది. -
రైతు బజార్లతో ఒరిగిందేదీ..
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసిన రైతు బజార్లు అధికారుల అలసత్వంతో లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు రైతు బజార్లను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. రైతులు తాము పండించిన పంటకు సరైన ధర లభించకపోవడంతో పాటు..వినియోగదారులకు తాజా కూరగాయలు అందించాలన్న సంకల్పం కూడా నెరవేరడం లేదు. రైతు బజార్లలో బినామీలే రాజ్యమేలుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా ఆహార సలహా సంఘ సమావేశంలో కూడా రైతు బజార్లలో చోటు చేసుకున్న అక్రమాలు, ధరలు ఎక్కువగా ఉన్న విషయాలను సభ్యులు ప్రస్తావించారు.మొదట్లో ఏర్పాటు చేసిన రైతు బజార్లు మినహా కొత్తవాటి ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.ఉన్న వాటి లో చీరాలలో ఏర్పాటు చేసిన రైతు బజారును కొద్ది కాలానికే ఎత్తేశారు. కేవలం ఒంగోలులో మూడు, కందుకూరులో ఒక రైతు బజారు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. వాటి విషయంలోనూ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం వల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. బయటి మార్కెట్‌కు ఇక్కడకు తేడా లేదు.. రైతు బజార్లలో అమ్ముతున్న కూరగాయల ధరలకు, బయట మార్కెట్లో ఉన్న ధరలకు పెద్ద తేడా ఉండటం లేదు. బయట మార్కెట్లో ఎంత ధర ఉందో కనుక్కుని అక్కడి కంటే ఇక్కడ ఒకటి లేదా రెండు రూపాయలు మాత్రమే తగ్గించి అమ్మడం ఆనవాయితీగా మారింది. అధికారులు బినామీలను ఏమీ అనలేని పరిస్థితి. వారు కూడా లేకపోతే ఇక్కడ రైతు బజార్లలో కూరగాయలు విక్రయించే వారు ఉండరన్న భావనతోనే గుడ్డిలో మెల్ల మాదిరిగా నెట్టుకొస్తున్నారు. కందుకూరులో నిర్వాహకునిదే ఇష్టారాజ్యం.. కందుకూరులో వ్యవసాయ మార్కెట్ ఉద్యోగిగా ఉంటూ రైతు బజార్లు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిది ఇక్కడ ఇష్టారాజ్యంగా మారింది. అదేమంటే మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి అనుచరుడిన ని చెప్పుకుంటున్నారు. రైతు బజార్లో బినామీలు ఎక్కువగా కొనసాగుతున్నా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వారిని ఒక్కమాట కూడా అనలేని పరిస్థితి. తూకాల్లో కూడా మోసం జోరుగా సాగుతోంది. టమోటా ఉత్పత్తుల్లో గిద్దలూరు రాష్ట్రంలోనే రెండో స్థానం.. గిద్దలూరు ప్రాంతం టమోటా పండించడంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. దాదాపు ఇక్కడ 5 వేల ఎకరాల్లో టమోటా సాగు చేస్తారు. అయితే ఇక్కడ రైతాంగానికి దళారుల బెడద ఎక్కువైంది. కనీసం ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తే మంచి ధరతోపాటు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తి అందించవచ్చు. దళారులు, వ్యాపారులు చేతిలో పడి రైతులు నలిగిపోతున్నా అధికారులు ఆ దిశగా మార్కెట్ సౌకర్యం కల్పించడంలో విఫలమయ్యారు. జిల్లా నలుమూలలా కూరగాయల సాగు.. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతోపాటు కనిగిరి, కందుకూరు, చీరాల, మార్టూరు, అద్దంకి, దర్శి ల్లో సైతం కూరగాయల సాగు చేస్తున్నారు. బోర్ల కింద విస్తారంగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. అయితే మార్కెట్ సౌకర్యం లేక దళారుల చేతుల్లో పడి నష్టపోతున్నారు. సౌకర్యాలు కల్పించడంలో మొగ్గు చూపని అధికారులు.. రైతు బజార్లు ఏర్పాటు చేయాలంటే పట్టణాల్లో, నగర పంచాయతీల్లో స్థల సమస్య తీవ్రంగా మారింది. ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులకు అప్పనంగా కట్టబెడతారు కానీ ప్రజలు అవసరాలు అనేసరికి అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. రైతు బజార్లను వినియోగదారులకు అందుబాటులో ఉండేలా స్థలం కేటాయిస్తే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అందులో మౌలిక వసతులు కల్పిస్తుంది. రైతు లు తమ ఉత్పత్తులను నేరుగా రైతు బజారుకు తీసుకొచ్చి విక్రయించే వీలు కలుగుతుంది. ఒంగోలులో మరో రెండు ఏర్పాటుకు వినతి.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన ఒంగోలులో మరో రెండు రైతు బజార్లను ఏర్పాటు చేసి కూరగాయల కష్టాల నుంచి ఒడ్డున పడేయాలని పుర ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం కొత్తపట్నం బస్టాండ్, లాయర్‌పేట, దిబ్బలరోడ్లో మాత్రమే రైతు బజార్లున్నాయి. అయితే సంతపేట, రామ్‌నగర్, అన్నవరప్పాడు, భాగ్యనగర్, హౌసింగ్‌బోర్డు ప్రాంతాల ప్రజలు కూరగాయల కొనుగోలు భారంగా మారింది. భాగ్యనగర్, సంతపేట ప్రాంతాల్లో ఎక్కడైనా రెండు రైతు బజార్లు ఏర్పాటు చేయాలని వినియోగదారులు అధికారులను కోరుతున్నారు.