ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:
దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసిన రైతు బజార్లు అధికారుల అలసత్వంతో లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు రైతు బజార్లను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. రైతులు తాము పండించిన పంటకు సరైన ధర లభించకపోవడంతో పాటు..వినియోగదారులకు తాజా కూరగాయలు అందించాలన్న సంకల్పం కూడా నెరవేరడం లేదు.
రైతు బజార్లలో బినామీలే రాజ్యమేలుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా ఆహార సలహా సంఘ సమావేశంలో కూడా రైతు బజార్లలో చోటు చేసుకున్న అక్రమాలు, ధరలు ఎక్కువగా ఉన్న విషయాలను సభ్యులు ప్రస్తావించారు.మొదట్లో ఏర్పాటు చేసిన రైతు బజార్లు మినహా కొత్తవాటి ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.ఉన్న వాటి లో చీరాలలో ఏర్పాటు చేసిన రైతు బజారును కొద్ది కాలానికే ఎత్తేశారు. కేవలం ఒంగోలులో మూడు, కందుకూరులో ఒక రైతు బజారు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. వాటి విషయంలోనూ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం వల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.
బయటి మార్కెట్‌కు ఇక్కడకు తేడా లేదు..
రైతు బజార్లలో అమ్ముతున్న కూరగాయల ధరలకు, బయట మార్కెట్లో ఉన్న ధరలకు పెద్ద తేడా ఉండటం లేదు. బయట మార్కెట్లో ఎంత ధర ఉందో కనుక్కుని అక్కడి కంటే ఇక్కడ ఒకటి లేదా రెండు రూపాయలు మాత్రమే తగ్గించి అమ్మడం ఆనవాయితీగా మారింది. అధికారులు బినామీలను ఏమీ అనలేని పరిస్థితి. వారు కూడా లేకపోతే ఇక్కడ రైతు బజార్లలో కూరగాయలు విక్రయించే వారు ఉండరన్న భావనతోనే గుడ్డిలో మెల్ల మాదిరిగా నెట్టుకొస్తున్నారు.
కందుకూరులో నిర్వాహకునిదే ఇష్టారాజ్యం..
కందుకూరులో వ్యవసాయ మార్కెట్ ఉద్యోగిగా ఉంటూ రైతు బజార్లు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిది ఇక్కడ ఇష్టారాజ్యంగా మారింది. అదేమంటే మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి అనుచరుడిన ని చెప్పుకుంటున్నారు. రైతు బజార్లో బినామీలు ఎక్కువగా కొనసాగుతున్నా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వారిని ఒక్కమాట కూడా అనలేని పరిస్థితి. తూకాల్లో కూడా మోసం జోరుగా సాగుతోంది.
టమోటా ఉత్పత్తుల్లో
గిద్దలూరు రాష్ట్రంలోనే రెండో స్థానం..
గిద్దలూరు ప్రాంతం టమోటా పండించడంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. దాదాపు ఇక్కడ 5 వేల ఎకరాల్లో టమోటా సాగు చేస్తారు. అయితే ఇక్కడ రైతాంగానికి దళారుల బెడద ఎక్కువైంది. కనీసం ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తే మంచి ధరతోపాటు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తి అందించవచ్చు. దళారులు, వ్యాపారులు చేతిలో పడి రైతులు నలిగిపోతున్నా అధికారులు ఆ దిశగా మార్కెట్ సౌకర్యం కల్పించడంలో విఫలమయ్యారు.
జిల్లా నలుమూలలా కూరగాయల సాగు..
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతోపాటు కనిగిరి, కందుకూరు, చీరాల, మార్టూరు, అద్దంకి, దర్శి ల్లో సైతం కూరగాయల సాగు చేస్తున్నారు. బోర్ల కింద విస్తారంగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. అయితే మార్కెట్ సౌకర్యం లేక దళారుల చేతుల్లో పడి నష్టపోతున్నారు.
సౌకర్యాలు కల్పించడంలో
మొగ్గు చూపని అధికారులు..
రైతు బజార్లు ఏర్పాటు చేయాలంటే పట్టణాల్లో, నగర పంచాయతీల్లో స్థల సమస్య తీవ్రంగా మారింది. ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులకు అప్పనంగా కట్టబెడతారు కానీ ప్రజలు అవసరాలు అనేసరికి అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. రైతు బజార్లను వినియోగదారులకు అందుబాటులో ఉండేలా స్థలం కేటాయిస్తే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అందులో మౌలిక వసతులు కల్పిస్తుంది. రైతు లు తమ ఉత్పత్తులను నేరుగా రైతు బజారుకు తీసుకొచ్చి విక్రయించే వీలు కలుగుతుంది.
ఒంగోలులో మరో రెండు ఏర్పాటుకు వినతి..
మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన ఒంగోలులో మరో రెండు రైతు బజార్లను ఏర్పాటు చేసి కూరగాయల కష్టాల నుంచి ఒడ్డున పడేయాలని పుర ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం కొత్తపట్నం బస్టాండ్, లాయర్‌పేట, దిబ్బలరోడ్‌లో మాత్రమే రైతు బజార్లున్నాయి. అయితే సంతపేట, రామ్‌నగర్, అన్నవరప్పాడు, భాగ్యనగర్, హౌసింగ్‌బోర్డు ప్రాంతాల ప్రజలు కూరగాయల కొనుగోలు భారంగా మారింది. భాగ్యనగర్, సంతపేట ప్రాంతాల్లో ఎక్కడైనా రెండు రైతు బజార్లు ఏర్పాటు చేయాలని వినియోగదారులు అధికారులను కోరుతున్నారు.
రైతు బజార్లతో ఒరిగిందేదీ..
Published Wed, Dec 25 2013 7:37 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement