రైతుబజారులో నిత్యావసరాల స్టాల్ ప్రారంభోత్సవం నిలిపివేత
ఎమ్మెల్యే మేడం వచ్చాకే ప్రారంభోత్సవమని కలెక్టర్‌కు మాధవీరెడ్డ భర్త హుకుం
సాక్షి టాస్క్‌పోర్స్: టీడీపీ కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి గారి భార్య మొన్న కారులో కూర్చొని పోలీసు అధికారులను హడలెత్తించిన దృశ్యం చూశాం. ఇప్పుడు అదే కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే గారి భర్త రైతు బజారులో ఓ స్టాల్ ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించారు. మేడం వస్తే కానీ రిబ్బన్ కటింగ్ జరగకూడదంటూ స్వయంగా కలెక్టర్‌కే హుకుం జారీ చేసి కూటమి నేతల విపరీత ధోరణిని మరోసారి బయట పెట్టారు. వైఎస్సార్ జిల్లా కడపలో జరిగిన ఈ ఘటన వివరాలివీ..తక్కువ ధరలతో కందిపప్పు, బియ్యాన్ని వినియోగదారులకు అందించేందుకు పౌర సరఫరాల శాఖ కడప రైతు బజార్‌లో ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. దీనిని గురువారం ఉదయం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ స్టాల్ ఓపెనింగ్‌కు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జేసీ గణేష్‌కుమార్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కడప ఆర్‌డీవో, డీఎస్వోలతో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులంతా ఉదయం 9.30 గంటలకే కడప రైతు బజార్‌కు చేరుకున్నారు. మరో 10 నిమిషాల్లో కలెక్టర్, జేసీ వచ్చి స్టాల్‌ను ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. ఇంతలోనే కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి రంగప్రవేశం చేశారు. ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతు బజార్‌లో స్టాల్‌ను ఓపెనింగ్ చేయవద్దని హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే మేడం హైదరాబాదులో ఉన్నారని, ఆవిడ శుక్రవారం వచ్చి ప్రారంభిస్తారని చెప్పారు. దీంతో కలెక్టర్ స్టాల్ ప్రారంభోత్సవాన్ని నిలిపివేశారు.
ఆ వెంటనే రైతు బజార్ సిబ్బంది ప్రారంభోత్సవం బ్యానర్లు, రిబ్బన్లు తొలగించారు. శుక్రవారంనాటి ప్రారంభోత్సవానికి మళ్లీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ స్టాల్ గురించి అధికారులు ముందుగానే ఎమ్మెల్యే మాధవీరెడ్డికి తెలిపి, ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే తనకు వీలు కాదని, కలెక్టర్‌తో ఓపెనింగ్ చేయించుకోండని ఆమె చెప్పారని తెలిసింది. తీరా అన్ని ఏర్పాట్లు చేశాక చివరి నిమిషంలో ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించడంతో ఇదేమి ధోరణి అని అధికారులు, వినియోగదారులు ముక్కున వేలేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment