శనగలకు గిట్టుబాటు ధర కల్పించాలి
నంద్యాల: శనగకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, క్వింటాల్ రూ.5 వేల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనగలకు గిట్టుబాటు ధర లేక కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో రైతులు మూడు సంవత్సరాల నుంచి ధాన్యాన్ని నిల్వ ఉంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బ్యాంకుల్లో కుదువకు పెట్టుకున్న సొత్తులు సమయానికి విడిపించుకోలేకపోవడంతో బ్యాంకులు వేలం వేస్తున్నాయన్నారు.
ప్రభుత్వం మాత్రం క్వింటాల్ రూ.3100 చొప్పున కొనుగోలు చేయాలని భావిస్తుండటం దారుణమన్నారు. రాష్ట్ర విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన దాదాపు 50 వేల మంది రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ పరిధిలో ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలను తిరుపతికి కేటాయించడంతో హైదరాబాద్ నుంచి దరఖాస్తులు, డీడీలు తిరుపతికి చేరుకుంటే తప్ప ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు అత్యధికంగా నీటిని విడుదల చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల సీమ జిల్లాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని భూమా డిమాండ్ చేశారు. శాసన సభ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో ప్రజా సమస్యలు వెలుగులోకి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జరిగే శాసన సభ సమావేశాల్లోనైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.