'రైతులను రోడ్డుకు ఈడ్చుతున్నారు'
హైదరాబాద్: ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకటిస్తున్న విధానం వ్యవసాయాన్ని మానుకోండని పరోక్షంగా చెప్పినట్టుగా ఉందని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. 2016-17 సంవత్సరానికి గాను ధాన్యానికి కనీస ధరను రూ.60 పెంచటం రైతులను మనో వేదనకు గురిచేయడమేనన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు రైతులకు చేసిన వాగ్దానాలను గుర్తుచేసుకోవాలని సూచించారు.
50 శాతం లాభం లభించేలా స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ఊరూ వాడా ప్రచారం చేసిందన్నారు. కానీ ఇపుడు ముష్టి వేసినట్టుగా మద్దతు ధర పెంచి రైతును వ్యవసాయం నుంచి రోడ్డుకు ఈడ్చే కార్యక్రమం చేస్తున్నారన్నారు. మద్దతు ధర విషయంలో ఏపీ రాష్ట్ర రైతులే ఎక్కువగా నష్టపోతున్నారని, గత రెండేళ్లుగా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు.