వారికి పదవులు ఇవ్వండని చెప్పాలా?
⇒ బాబు వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
⇒ ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని ధ్వజం
సాక్షి, అమరావతి: భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి విషయంలో సీఎం చంద్రబాబు వైఎస్సార్ సీపీపై నిందలు వేయడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. భూమాకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ వైఎస్సార్‌సీపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిందని సీఎం చంద్రబాబు మంగళవారం వ్యాఖ్యానించారు. విజయవాడ లోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరిగిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ తీవ్రంగా స్పందించారు.
‘‘ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? మన పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని చెప్పకుండా ఇంకేం చెబుతాం? తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు యాగీ చేసిన విషయం మరిచారా? శాసనసభలో భూమా సంతాప తీర్మానంపై మాట్లాడేటపుడు చంద్రబాబు గానీ, మరొకరు గానీ నాగిరెడ్డి ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనో ఎందుకు చెప్పలేక పోయారు? నాగిరెడ్డి ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనే విషయమే ప్రస్తావించలేక పోయారంటే వారి నైతికత ఏపాటిదో అర్థమవుతోంది. చంద్రబాబు తాను తప్పు చేసిందే కాకుండా ఎదుటి వారిని తప్పుపట్టడం ‘దొంగే... దొంగా దొంగా’ అని అరచినట్లుగా ఉంది’’ అని జగన్ పేర్కొన్నారు.