గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం
గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం
Published Fri, Apr 28 2017 11:48 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– దయనీయస్థితిలో మిర్చి, పసుపు రైతులు
– కనిపించని ధరల స్థీరికరణ నిధి
- రైతు దీక్షకు రైతు సంఘాల మద్దతు
– వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల భరత్‌కుమార్‌రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల భరత్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు సమావేశమయ్యారు. మే ఒకటి, రెండు తేదీల్లో గుంటూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న రైతు దీక్షకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ రైతు సంఘం, న్యూ డెమోక్రసీ రైతు విభాగం సంఘీభావం ప్రకటించాయి.
ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..గిట్టుబాటు ధర లేకపోవడంతో పంట ఉత్పత్తులను కల్లాల్లోనే రైతులు తగలబెడుతున్నారని, అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. గతేడాది క్వింటా మిర్చి రూ. 12 వేల ధర పలికితే ఈ ఏడాది రూ. మూడు వేలు కూడా లేదన్నారు. పసుపు రైతుదీ ఇదే దుస్థితి అని వివరించారు. గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి, పసుపులను విక్రయించిన వారికే అదనపు ధర వర్తించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్లో మద్దతు ధరను వర్తింపజేయాలని కోరారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న ఎన్నికల ముందు టీడీపీ అధినేత హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక దానిని మరచిపోయారన్నారు. అప్పులపాలైన అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు దీక్షకు మద్దతు..
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న రైతు దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నట్లు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథం తెలిపారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ఉపశమన చర్యలను చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ... రైతులను మోసం చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అవినీతిలో సీఎం చంద్రబాబునాయుడు మొదటి స్థానంలో ఉన్నారని, ఆయనకు రైతుల గురించి పట్టించుకునే ఆలోచనే లేదని న్యూడెమోక్రసీ రైతు విభాగం జిల్లాప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement