రైతుల పోరుపై ఉక్కుపాదం | Tulluru zone in the control of police department | Sakshi
Sakshi News home page

రైతుల పోరుపై ఉక్కుపాదం

Published Tue, Sep 18 2018 4:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

Tulluru zone in the control of police department - Sakshi

ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి రైతులను వెళ్లనీయకుండా బస్సుల్లో పోలీసుల తనిఖీ

తుళ్లూరు రూరల్‌/సాక్షి, అమరావతి: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రాజధాని ప్రాంత రైతులు సోమవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పాయింట్లు ఏర్పాటుచేసి.. భారీఎత్తున మొహరించిన పోలీసులు  రైతులను, నాయకులను అదుపులోకి తీసుకుని ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. అంతకుముందు.. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రైతులు, లంక భూముల సొసైటీల అధ్యక్షులకు నోటీసులు ఇచ్చి నిర్బంధకాండ కొనసాగించారు. తుళ్లూరు మండలాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకు తరలివచ్చే అవకాశం ఉన్న రైతులందరినీ రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి రావద్దని.. అలాగే పెద్ద నాయకులందరూ ఇంటికే పరిమితం కావాలని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు.. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సచివాలయం చుట్టూ ఆరు చెక్‌ పాయింట్లు పెట్టారు. మల్కాపురం మలుపు వద్ద మందడం జెడ్పీ ఉన్నత పాఠశాల వెనుక నుంచి సచివాలయానికి చేరుకునే ప్రధాన రహదారిపై ఒకేచోట మూడు చెక్‌ పాయింట్లు ఏర్పాటుచేశారు.  

వేర్వేరుచోట్ల నేతలు అదుపులోకి.. 
ఇదిలా ఉంటే.. ‘చలో అసెంబ్లీ’కి రైతులందరూ తరలివస్తున్నారని భావించిన వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్‌ నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరందరినీ వేర్వేరు చోట్ల పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11గంటలకు సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సీఆర్డీయే ఏఐటీయూసీ కార్యదర్శి జీవీ రాజు, సీపీఎం సీఆర్డీయే కార్యదర్శి ఎం. రవి, జిల్లా రైతు విభాగం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌లను మందడంలో అదుపులోకి తీసుకున్నారు. ఐనవోలు వద్ద లింగాయపాలేనికి చెందిన రైతు నాయకుడు అనుమోలు గాంధీతోపాటు మరో న్యాయవాదిని 11.30గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో బాపట్ల వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్‌తోపాటు పార్టీ తుళ్లూరు మండల నేత చలివేంద్రం సురేష్‌ను మందడంలో అరెస్టుచేసి పెదకూరపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అలాగే, మండల ఎస్సీసెల్‌ అధ్యక్షుడు శృంగారపాటి సందీప్, లంక రైతు పులి ప్రకాష్‌లను తెల్లవారుజామున 6 గంటలకు అదుపులోకి తీసుకుని తుళ్లూరు స్టేషన్‌కు తరలించారు. తాడికొండ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి చిలకా విజయ్‌ను ఉ.6గంటలకు గృహనిర్బంధం చేశారు. వెంకటపాలెంలో జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరందరినీ సాయంత్రం అయిదు గంటలకు విడుదల చేశారు. తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు, రాజధాని రైతులను తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టీనా పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. 
 
రైతుల డిమాండ్లు ఇవీ.. 
తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో ఎక్కువ శాతం భూములు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ అసైన్డ్, లంక భూములను సాగుచేసుకుంటున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని రైతుల ప్రధాన ఆరోపణ. లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో లంక భూములు దాదాపు 1600 ఎకరాల వరకు ఉంటాయి. ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు చట్ట ప్రకారం ప్యాకేజ్‌ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా అధికారులకు, మంత్రులకు తమ సమస్యలను  విన్నవించినా ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా రైతులు సోమవారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. 

జరీబు ప్యాకేజీ ఇవ్వాలి : వైఎస్సార్‌సీపీ 
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేత నందిగం సురేశ్‌ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్యాకేజీ విషయంలో వివక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో 29 గ్రామాల్లో సాగు చేసుకునే ఐదు వేల ఎకరాల భూములను జీవో నంబర్‌ 259 ప్రకారం మాత్రమే తీసుకోవాలని, అందరికీ జరీబు ప్యాకేజ్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కోల్పోతున్న వారికి తగిన పరిహారాన్ని అందజేయాలన్నారు.  

అక్రమ అరెస్టులపై వామపక్షాల ఖండన 
రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా ఆందోళన చేయడానికి ప్రయత్నించిన వారిని అక్రమంగా అదుపులోకి.. అరెస్టులు చేయడాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి. మధు, కె. రామకృష్ణ సోమవారం ఖండించారు. అసైన్డ్‌ రైతులను, వారికి సంఘీభావంగా వెళ్లిన వివిధ పార్టీల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. అసైన్డ్, లంక భూముల రైతులకు ఇతర రైతులతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు సామాజిక పెన్షన్‌ రూ.9 వేలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement