రైతులకు అండగా వైఎస్సార్‌ సీపీ | ysrcp support to Farmers | Sakshi
Sakshi News home page

రైతులకు అండగా వైఎస్సార్‌ సీపీ

Published Sun, Jun 24 2018 12:33 PM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

ysrcp support to Farmers - Sakshi

సీతానగరం: వైఎస్సార్‌ సీపీ రైతులకు అండగా నిలుస్తుందని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సీతానగరం మండలం అంటిపేటలో నియోజకవర్గ సమన్వయకర్త అలజింగి జోగారావు అధ్యక్షతన వేలాదిమంది కార్యకర్తలతో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధాలను తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ ప్రాంత రైతులు వాణిజ్యపరంగా ఎంపిక చేసుకున్న చెరకు పంటకు గిట్టుబాటు ధర లేక, సకాలంలో బిల్లులు చెల్లించక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. రైతులు, బడుగుబలహీన వర్గాలకు, వ్యవసాయ కూలీలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

దశాబ్దకాలంగా చెరకు రైతులకు బిల్లులు అందక, ఇళ్ల బిల్లులు చెల్లించక  అవస్థలు పడుతున్నా పాలకులకు పట్టడంలేదని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తమవంతు కృషిచేస్తామన్నారు. ఆశలతో చంద్రబాబు, ఆశయం కోసం జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ రాజకీయ వ్యవహారాల జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాట్లాడుతూ చెరకు రైతులకు బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌కు విన్నవించామన్నారు.

 జూలై 9 లోగా ప్రభుత్వం స్పందించి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే పార్వతీపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేస్తామన్నారు. చెరకు రైతుల బిల్లులు రూ.12 కోట్లు  చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్‌ ఆశయాలను పుణికిపుచ్చుకున్న జగన్‌హన్‌రెడ్డి పదవుల కోసం పాకులాడడం లేదని, ప్రజలకు సేవలందించేందుకు తాపత్రయపడుతున్నారన్నారు. 

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి... 
మండలంలోని అంటిపేటలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త అలజింగి జోగారావు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి సీతానగరం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంబటి క్రిష్ణంనాయుడు, సుమిత్రాపురం సర్పంచ్‌ అరసాడ అమ్మడమ్మ, పణుకుపేట మాజీ సర్పంచ్‌ బంకురులక్ష్మి, సుమిత్రాపురం, రంగంపేట పంచాయతీ ఉపసర్పంచ్‌లు ఎం.గణేష్, శనపతి తిరుపతిరావు, రంగంపేట టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు బొంగుభాస్కరరావులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారందరినీ భూమన, చిన్నశ్రీనులు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట కార్యదర్శి అవనాపు విజయ్, జెడ్పీ మాజీ చైర్మెన్‌ వాకాడ నాగేశ్వరరావు, సీనియర్‌ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, గర్బాపు ఉదయభాను, పార్టీ మండల కన్వీనర్‌ పోల ఈశ్వరనారాయణ, పార్వతీపురం, సీతానగరం మండలాల నాయకులు బలగ శ్రీనివాసరావు, తోడబండి సూర్యనారాయణ, బోను రామినాయుడు, కౌన్సిలర్లు మంత్రి రవికుమార్, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, కొండపల్లి బాలకృష్ణ, బి.తమ్మినాయుడు, ఆర్‌వీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.  

పార్టీ గెలుపేధ్యేయంగా పనిచేయాలి
బొబ్బిలి: పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతీనాయకుడూ, కార్యకర్త పనిచేయాలని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కమిటీ సభ్యులు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ స్థానిక కార్యాలయానికి శనివారం వచ్చిన ఆయనకు నాయకులు మజ్జి శ్రీనివాసరావు, శంబంగి వెంకటచినఅప్పలనాయుడు తదితరులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పట్టణ,  పార్టీ మండల నాయకులను ఆయనకు పరిచయం చేశారు. అనంతరం కరుణాకరరెడ్డి మాట్లాడుతూ జగన్‌ చాలా కష్టపడుతున్నారని, మనందరం ఆయనవెంట మరింత కష్టపడితే మంచి ఫలితం ఉంటుందన్నారు. అనంతరం నియోజకవర్గంలో పరిస్థితి, పార్టీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. తను కొద్దిరోజుల్లో మూడునెలల పాటు జిల్లాలో అందుబాటులో ఉంటానని, ప్రజాసంకల్పయాత్ర ఏర్పాట్లు పరిశీలిస్తామని చెప్పారు. సమావేశంలో వాసిరెడ్డి వరదరామారావు, వాకాడ నాగేశ్వరరావు, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, జమ్మాన ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement