వ్యవసాయోత్పత్తులకు గడ్డుకాలం | Guest Columns On Farmers Face Problems On Machinery | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 1:56 AM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

Guest Columns On Farmers Face Problems On Machinery - Sakshi

వ్యవసాయ రంగంలో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2016 ఫిబ్రవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనను సాఫల్యం చేయడానికి నీతి ఆయోగ్‌ను ఆదేశించారు. ప్రణాళికాబోర్డును రద్దుచేసి, దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పర్చిన తర్వాత ఈ సంస్థ ప్రతిపాదించిన సూచనలు, నివేదికలు కార్పొరేట్లకు అనుకూలంగా వున్నాయే తప్ప, సామాన్య ప్రజలకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని ఆచరణ రుజువు చేసింది.

రైతుల ఆదాయం రెట్టింపుచేసే బాధ్యతను తీసుకున్న నీతి ఆయోగ్‌ 4 సూచనలను ప్రకటించింది. 1. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించటం 2. వ్యవసాయ ఉత్పత్తులు పెంచటం 3. భూసంస్కరణలు అమలుచేసి పేదలకు భూములు పంచటం 4. రైతులకు సహాయం అందించటం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చని సూచించింది. 

అసలు పెరుగుదల అంటే ఏమిటి? ఏ ప్రాతిపదికగా పెరుగుదలను పరిశీలించాలి? 1. రైతుల ఆదాయం 2. ఉత్పత్తి పెరుగుదల 3. వ్యవసాయ రంగంలో అదనపు విలువ పెంపుదల 4. దేశీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల. పై నాలుగింటిలో ఏ రంగంలో పెరుగుదల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది? ఈ నాలుగు అంశాలను పరిశీలించిన నిపుణుల కమిటీ భారతదేశంలో ప్రస్తుత విధానాల ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం కానీ, రైతు ఆదాయం పెరగడం కానీ అసాధ్యమని ఈ మధ్య తేల్చారు. 

గిట్టుబాటు ధరలు రెండు విధాలుగా చూడాలి. 1. మార్కెట్‌ సంస్కరణలు 2. కనీస మద్దతు ధర నిర్ణయం. మార్కెట్‌ సంస్కరణల విషయంలో రాజ్యాంగం రీత్యా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్కెట్‌ చట్టాలను కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా మార్చి బిల్లులు తయారుచేసి తమ తమ శాసనసభలలో ఆమోదానికి పెట్టాల్సిందిగా ఆదేశిం చింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ఆ బిల్లులను ఆమోదించాయి.

ఈ చట్ట సభల ద్వారా కార్పొరేట్‌ సంస్థలకు మార్కెట్లలో కొనుగోలుచేసే అవకాశం కల్పిం చారు. ధరలను ఆ సంస్థలే నిర్ణయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల నుంచి వైదొలిగి రాష్ట్రాలపై నెట్టివేసింది. గిట్టుబాటు ధరలు నిర్ణయించటం, వాటిని అమలుచేసే బాధ్యతను కేంద్రం గానీ, రాష్ట్రంగానీ ఇంతవరకూ ప్రకటించలేదు. కేంద్రం ధరలు ప్రకటించి చేతులు దులుపుకోగా, రాష్ట్రం నేటికీ ధరల అమలుపై తన బాధ్యతను ప్రకటించలేదు. 

ఉత్పత్తిని పెంచడం:  గత సంస్కరణల నుండి (1997 నుండి) మన దేశీయ పరిశోధనల విభాగాలను దాదాపుగా మూసివేశారు. బహుళజాతి సంస్థలైన మోన్‌శాంటో, డూపాంట్, కార్గిల్, సింజెంటా సంస్థలు 80% ప్రయోగాలను చేస్తుండగా, వాటిని మన దేశంలో వినియోగిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో 27 కేంద్రాలలో 5 వేల ఎకరాల భూమి పరిశోధనల కొరకు కేటాయించబడినప్పటికీ, ఆ పరి శోధనా కేంద్రాలన్నింటినీ మూసివేయడం జరిగింది. ఇలాంటి స్థితిలో ఉత్పాదకత ఎలా పెరుగుతుంది? 

సహాయక చర్యలు: ప్రస్తుతం బడ్జెట్‌లో 2.5% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నారు. పేద దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ దేశాలు తమ బడ్జెట్‌లో 5 నుంచి 8 శాతం కేటాయించాయి. 8 రకాల సబ్సిడీలను రైతులకు అందచేస్తున్నారు. పంటల బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. నిర్ణయించిన ఆదాయం, నిర్ణయించిన ధరలు మార్కెట్లో తగ్గితే ఆ లోటును కూడా ప్రభుత్వాలు రైతుకు నగదుగా ఇస్తున్నాయి. కానీ ఇందులో ఏ ఒక్కటీ భారతదేశంలో అమలు జరగడం లేదు. 

రెట్టింపు కావడానికి చేపట్టాల్సిన చర్యలు: నాణ్యత గల వ్యవసాయ ఉపకరణాలు స్వదేశీ టెక్నాలజీలో పరిశోధన చేసి రైతులకు సకాలంలో అందించాలి. వ్యవసాయ భూమి తగ్గుదలను అరికట్టాలి. సకాలంలో పంటలకు సాగునీటి వసతి కల్పించాలి. సకాలంలో రుణాలు ఇవ్వాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వడంతోపాటు, సహకార వ్యవస్థను బలపర్చాలి. పంటలు వేసేటప్పుడే ధరలు నిర్ణయించి, ఆ ధరలను అమలు జరపాలి. ప్రభుత్వమే అన్ని పంటలకు ప్రీమియం చెల్లించాలి.

60 సం.లు దాటిన రైతులకు పెన్షన్లు ఇవ్వాలి. బడ్జెట్‌లో 6% వ్యవసాయ రంగానికి కేటాయించాలి. పరిశోధనా కేంద్రాలలో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తనోత్పత్తి చేసి, రైతులకు అందించాలి. కార్పొరేట్ల జోక్యం ఉన్నంతకాలం రైతుల ఆదా యం పెరగదని ప్రపంచబ్యాంకు అనుకూల నిపుణులే వ్యాఖ్యానిస్తున్న అంశాలను కేంద్రం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రకటించిన విధానాలను మార్చాలి. 

వ్యాసకర్త: సారంపల్లి మల్లారెడ్డి,  వ్యవసాయ నిపుణులు
మొబైల్‌ : 94900 98666

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement