నకిలీ.. విచ్చలవిడి!  | Fake Seeds Marketing Is Increasing In Mahabubnagar | Sakshi
Sakshi News home page

నకిలీ.. విచ్చలవిడి! 

Published Mon, Mar 26 2018 9:08 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Fake Seeds Marketing Is Increasing In Mahabubnagar - Sakshi

జడ్చర్ల శివారులో పారబోసిన నకిలీ విత్తన ప్యాకెట్లు (ఫైల్‌)

అధికారులు వద్దన్నా రైతులు ఈ ఏడాది కూడా పత్తివైపే మొగ్గు చూపారు. ఈ ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తిని సాగుచేయడం అనాదిగా వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు విత్తన వ్యాపారులుకాలం చెల్లిన, నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులను అంటగట్టి రూ.లక్షలు దండుకుంటున్నారు. 

జడ్చర్ల : కొన్నేళ్లుగా జడ్చర్ల కేంద్రంగా పత్తి విత్తనాల విక్రయాలు జోరుగా.. వివాదాస్పదంగా కొనసాగుతున్నాయి. వివిధ కంపెనీల పేరుతో బీటీ–2 పత్తి విత్తనాలను వ్యాపారులు లెక్కకు మించి విక్రయిస్తున్నారు. అనుమతి ఉన్న విత్తనాల చాటునే అనుమతి లేని, కాలం తీరిన విత్తనాలను సైతం రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా తయారు చేసిన పత్తి విత్తనాలను వివిధ కంపెనీల పేరుతో ముద్రించిన కవర్‌లలో ప్యాక్‌ చేసి విక్రయానికి పెడుతున్నారు. ప్రతీసారి అధికారులు దాడులు చేసిన సమయంలో లూజ్‌ విత్తనాలు, ఖాళీ కవర్‌ ప్యాకెట్లు లభిస్తుండడంతో రైతులనుంచి వచ్చే ఆరోపణలకు బలాన్ని  చేకూరుస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు 
విత్తన విక్రయాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు. ఎక్కడా పారదర్శకంగా విత్తన విక్రయాలు జరగడం లేదన్నది నగ్నసత్యం. విత్తనాల తయారీ సంస్థల పూర్తి వివరాలు, ఆయా కంపెనీల అనుభవం, రిమార్కులు కూడా ఆన్‌లైన్‌లో సంబంధిత అధికారుల వద్ద ఉంచాల్సి ఉన్నా కంపెనీలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విత్తన కంపెనీలు ఎంతమేరకు పారదర్శకంగా వ్యవహరిస్తున్నాయో తెలియని పరిస్థితి ఉంది. సమాచారాన్ని రైతు ముంగిట్లోకి తీసుకువచ్చినప్పుడే రైతులు తమకు కావలసిన విత్తనాలను ఎంపిక చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవేమి రైతు దరికి చేరకపోవడంతో వ్యాపారి చెప్పిన మాటలే రైతుకు శిరోదార్యమవుతున్నాయి. 

జాడలేని సమాచారం 
విత్తన కంపెనీల వివరాలు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు, స్టాక్‌ వివరాలు తదితర సమాచారం రైతులకు అందుబాటులో ఉంచాలన్న నిబంధనలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. కొనుగోలు సమయంలో రైతులకు సరైన బిల్లులు ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఒక వేల బిల్లులు ఇచ్చానా వాటిపై అందుకు సంబంధించిన బ్యాచ్, లాట్‌ నంబర్లు వంటి పూర్తి వివరాలు పొందుపరచడం లేదు. 

సరఫరా అయిన బీటీ–3 విత్తనాలు 
ప్రభుత్వం నిషేధించిన బీటీ–3 విత్తనాలను కొందరు వ్యాపారులు ఇప్పటికే రైతులకు రహస్యంగా అంటగట్టేశారు. గత ఏడాది కూడా ఈ తంతు గోప్యంగా సాగింది. ఈ ఏడాది కూడా బీటీ–3 విత్తనాలను తమకు అనుకూలంగా ఉ న్న రైతులకు  వ్యాపారులు విక్రయించే పనిలో నిమగ్నమయ్యారు. గత ఏడాది బీటీ–2 విత్తనాలకు గులాబీ రంగు పురుగు, ఇతర తెగుళ్లు ఆశించడాన్ని ఆసరగా చేసుకున్న వ్యాపారులు ఈసా రి బీటీ–3 విత్తనాలను పెద్ద మొత్తంలో రైతులకు అంటగట్టేందుకు కుట్రపన్నారు. బీటీ–3 విత్తనాలకు సంబం ధించి కలుపు నివారణ మందులు వినియోగించే పరిస్థితి ఉండడంతో పాటుగా తెగుళ్లు, ఇతర కీటకాలను తట్టుకునే పరిస్థితి ఉందని ప్రచారాన్ని చేస్తున్నారు. దీంతో రైతులు బీజీ–3 విత్తనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

 భూత్పూర్‌ అడ్డాగా విక్రయాలు 
భూత్పూర్‌ కేంద్రంగా అనుమతి లేని, నకిలీ పత్తి విత్తనాలను మార్కెట్‌లోకి భారీగా విక్రయిస్తుంటారు.  గత కొన్ని సంవత్సరాలుగా మిగిలిన విత్తనాలను ప్యాక్‌ మార్చి అంటగడుతున్నా రు. అంతేగాక జిన్నింగ్‌ చేసిన విత్తనాలకు రంగులేసి బీటీ విత్తనాలుగా ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు. తక్కువ ధరల ముసుగుతో పాటు వ్యాపారులకు పెద్ద ఎత్తున కమీషన్‌లు, బంపర్‌ ఆఫర్‌లు ప్రకటించడంతో వ్యాపారులు పనికి రాని విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. వ్యాపారులేమో సింగపూర్, బ్యాంకాక్‌ వంటి దేశాల్లో  చక్కర్లు కొడుతుండగా రైతులు నాసిరకం పంటలు సాగుచేసి దిగుబడులు రాక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

అధికారులు దృష్టి సారించాలి 
నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందే విధంగా అధికారులు ముం దస్తు చర్యలు చేపట్టాలి. మరో రెండు నెలల్లో సీజన్‌ ప్రారంభం అవుతుంది. ముందుగానే చర్యలు చేపట్టి అప్రమత్తం చేస్తే మార్పు కనిపిస్తుంది. అదేవిధంగా బీజీ–3 విత్తనాలను మార్కెట్‌లోకి రా కుండా అడ్డుకోవాల్సిన అవసరముంది. వ్యాపారులు పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. గ్రామాల్లో రైతులకు అవగాహన  కార్యక్రమాలు చేపట్టి సూచనలు చేయాల్సిన అవసరముంది. 

రైతులు అప్రమత్తంగా ఉండాలి 
రైతులు అధికారులు సూచించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి.  లైసెన్స్‌ ఉన్న వ్యాపారి దగ్గరే కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. బీటీ–3 పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయవద్దు. ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 
– నిర్మల, ఏడీఏ, జడ్చర్ల  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement